నిజాం-ఉల్-ముల్క్ సంతతిలో ఘజీయుద్దీన్ ఖాన్, నాసర్‌జంగ్, సలాబత్ జంగ్, నిజాం అలీఖాన్, బసాలత్ జంగ్లు ముఖ్యులు. అసఫ్ జా జ్యేష్ఠ కుమారుడు అమీర్ ఉల్ ఉమ్రాగా ఢిల్లీ చక్రవర్తి దర్బారులో నియమితుడయ్యాడు. నాసర్‌జంగ్ తండ్రి తర్వాత దక్కను సుబేదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. అతని సోదరులు అధికారం కోసం ప్రయత్నించలేదు. కానీ అతని మేనల్లుడు ముజఫర్ జంగ్ దక్కను సుబేదారు పదవిని ఆశించి కలహాలకు కారకుడయ్యాడు.

నాసర్ జంగ్ క్రీ.శ.1710లో నిజామ్ ఉల్ ముల్క్ సయ్యదున్నీసా బేగంలకు జన్మించాడు. ఇతడు బాల్యము నుండే చదువుపై ఆసక్తిని కనబరచి పరిపాలనా విషయాలను తెలుసుకున్నాడు. తండ్రి ఢిల్లీ పాలనా వ్యవహారాలను చక్కదిద్దుటకు వెళ్ళిన తరువాత తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తానే దక్కను సూబేదారునని ప్రకటించుకున్నాడు. తండ్రి ఔరంగాబాద్ కు వచ్చి కుమారుని బంధించి, చెరలో వేసి ఆ తరువాత వదిలివేశాడు. నాసర్ జంగ్ దక్కను సూబేదారుగా పదవిని స్వీకరించుటలో నిజామ్ ఉల్ ముల్క్ ఆంతరంగికులు, సేనానులు సహాయపడ్డారు. ఇతడు తన తండ్రి కాలములోనే యువరాజుగా నియమించబడ్డాడు. నాసర్‌జంగ్ తన 21వ యేట వజీఉన్నీసా బేగంను వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్యకు జరహత్ బేగం అనే పేరు గల కుమార్తె గలదు.

నాసర్‌జంగ్ మేనల్లుడు, నిజామ్ ఉల్ ముల్క్ కుమార్తె కుమారుడైన ముజఫక్జింగ్ రాజ్య కాంక్ష కలవాడు. తన తాత, దౌహిత్రుడనగు తననే వారసుడిగా నియమించాడని ప్రచారము చేసి తానే దక్కను సుబేదారు పదవికి అర్హుడని తిరుగుబాటు చేశాడు. 95 సర్కారులున్న విశాలమైన దక్కను సూబేదారి రాజ్యమును, నాసర్‌జంగ్ పరిపాలించుటను సహింపని కర్నాటక ప్రాంత పాలకులు, కర్నూలును పాలించు నవాబు స్వతంత్రులవడానికి ప్రయత్నాలు చేశారు. ముజఫర్ జంగ్ మేనమామకు వ్యతిరేకంగా కర్నాటక, కర్నూలు నవాబులను ప్రోత్సహించి వారు స్వతంత్రులై తనకు సహాయపడేవిధంగా ఒప్పించాడు. ముజఫర్ జంగ్ దక్కను సుబేదారుగా ఉండడానికి తానే నిజమైన వారసుడినని ప్రకటిస్తూ తనకు రాజ్యాధికారం లభించడానికి సహాయపడాలని ఫ్రెంచివారిని కోరాడు.

ఆంగ్లేయులు తమ ప్రాబల్యము నిరూపించుకోవడానికి నాసర్‌జంగ్ ను చంపాలని నిర్ణయించారు. అందుకోసం వారు ఒక పథకం ప్రకారం నాసర్‌జంగ్ ను తుదముట్టించాలని తలిచారు. నాసర్ జంగ్ కర్నూలు, కర్నాటక నవాబుల తిరుగుబాటును అణచివేసి ముజఫర్ జంగ్ ను ఎదుర్కొనడానికి బయలుదేరాడు. ఈ సైన్యానికి షా నవాజ్ ఖానను సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి బీదరు మార్గములో నాసర్‌జంగ్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ముజఫర్ జంగ్ నిజామ్ ఉల్ ముల్క్ ద్వారా ఆదోని, రాయచూరు ప్రాంతాలను పాలించుటకు నియమించబడి ఉన్నాడు. అదోని దుర్గము బలిష్టమైంది. ముజఫంగ్ సైన్యమును సమీకరించుకొని నాసర్‌జంగ్ ను ఎదుర్కొనడానికి కర్నూలు, కర్నాటక నవాబుల సహాయాన్ని కోరాడు.

నాసర్ జంగ్ మధ్యవర్తుల ద్వారా 'నీ స్వాతంత్ర్యమునకు, అధికారానికి ఎట్టి ఆటంకము కలిగించను. మనము దగ్గరి బంధువులం. మనలో మనకు వైరము తగదు. దీన్ని ఇతరులు ఆసరాగా తీసుకొని మనల్ని బలహీనపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కావున దక్కను సూబేదారి పదవిపై ఆశ పెట్టుకోవద్దు' అని ముజఫర్ జంగ్ కు రాయబారం పంపించాడు. కర్నూలు, కర్నాటక నవాబులు, ఫ్రెంచివారు తనకు అండగా ఉన్నారని భావించిన ముజఫర్ జంగ్ తన మేనమామ అయిన నాసర్ జంగ్ మాటలను పెడచెవిన పెట్టాడు. సంధి రాయబారం విఫలమవడం వల్ల నాసర్ జంగ్ యుద్ధం ప్రకటించి ముజఫర్ జంగ్ ను పాండిచ్చేరి వద్ద ఎదిరించి ఓడించాడు. ముజఫర్ జంగ్ దారాసుతులతో పాటు బందీ అయిన సమయంలో ఫ్రెంచివారు నాసర్‌జంగ్ సైన్యమును ముందడుగు వేయకుండా ఫిరంగులను పేల్చి ఆటంకము కలిగించారు. పఠానులు ముజఫర్ జంగ్ ను బంధించి నాసర్‌జంగ్ కు అప్పగించారు.

ఫ్రెంచి వారు నాసర్‌జంగ్ చెరనుండి ముజఫర్షింగ్ ను విడిపించడానికి ప్రయత్నాలు చేయసాగారు. నాసంగ్ సైన్యములో భేదభావములు కలిగించారు. సైనికులకు ఆశ చూపారు. ముజఫర్ జంగ్ కు అన్ని విధాలుగా సహాయపడి అతనిని దక్కను సుబేదారుగా ప్రతిష్ఠించి విశాల భూభాగముపై ఆధిపత్యము పొందుటకు ఫ్రెంచి వారు సర్వవిధాలుగా ప్రయత్నాలు చేశారు. టీష్ వారు ఈ సమయంలో నాసర్‌జంగ్ ను హెచ్చరించారు. ఫ్రెంచి వారి వల్ల అతనికి ఆపద ఉన్నదని సూచించారు. ముజఫర్ జంగ్ కుటిల రాజకీయాలను, ఫ్రెంచివారి నయవంచనను తలపోసి నాసర్‌జంగ్ ను రక్షించాలని ప్రయత్నించారు. కానీ నాసర్ జంగ్ వారి మాటలను తేలికగా తీసుకొని తనకు బందీగా ఉన్న ముజఫర్ జంగ్ తనను ఏమీ చేయలేడని, జింజి పాలకులపై దండెత్తడానికి తన సైన్యాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నములో నిమగ్నమయ్యాడు.

ఒక రోజు నాసర్‌జంగ్ సైనిక శిబిరము నుండి బయలుదేరి నమాజు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఫ్రెంచివారు, ముజఫర్ జంగ్ సైన్యము ముందుకు చొచ్చుకొని వచ్చి ఫిరంగులను పేల్చి నాసర్‌జంగ్ సైన్యాన్ని కలవరపెట్టింది. గుడారములను ముట్టడించి ఉన్న శత్రు సైనికులతో తలపడాలనే భావనలో నాసర్ జంగ్ ఉన్నాడు. అతని అనుచరులలో ఎక్కువమంది ఫ్రెంచివారు పన్నిన కుట్రలో చిక్కుకొని యుద్ధము చేయకుండా మిన్నకుండిపోయారు. పఠానులు సైతము కత్తి, డాలు పట్టలేకపోయారు. నాసర్‌జంగ్ యుద్ధానికి తలపడుతుండగా అతడు చంపబడ్డాడు. అతని తల మొండెము నుండి వేరయింది. ముజఫర్ జంగ్ చెర నుండి విడిపించబడ్డాడు. అతని సైనికులు నాసర్‌జంగ్ తలను ముజఫర్ జంగ్ కు కానుకగా సమర్పించారు. ఆ తరువాత ఆ తలను మొండెమునకు చేర్చారు.

విశ్వాసపాత్రులైన నాసర్‌జంగ్ అనుచరులు అతని శవమును, పరివారాన్ని సురక్షితంగా వేరే ప్రాంతానికి చేర్చారు. ఫ్రెంచి సేనానులు గుడారాలను గాలించి నాసర్ జంగ్ ధన, కనక, వస్తు, వాహనాలను స్వాధీనపరచుకున్నారు. నాసర్‌జంగ్ శవమును జాగ్రత్తగా ఔరంగాబాదు పట్టణానికి తీసుకువచ్చారు. ప్రజలు అతని శవాన్ని చూసి ఎంతగానో రోధించారు. ఫ్రెంచివారి కుతంత్రము వల్ల, ముజఫర్ జంగ్ రాజ్యకాంక్ష వల్ల నాసర్‌జంగ్ చంపబడ్డాడు. నాసర్ జంగ్ నియమ నిష్టలున్నవాడు. కరుణ, దయ, సత్యము, శౌచము, బంధు ప్రీతిగలవాడు. తాను పాలించింది రెండు సంవత్సరాలే అయినా చక్కని పాలనను ప్రజలకు అందించాడు. తండ్రి సంపాదించిన రాజ్యభాగాన్ని రక్షించడానికి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు. పండితుడు, కవి, ప్రజాభిమానము చూరగొన్నవాడు. మత సిద్ధాంతములను ఆచరణలో అవలంబించేవాడు.


 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్