నాసిరుద్దౌలా అనంతరం అతని పెద్ద కొడుకు అఫ్జల్ఉద్దౌలా నిజాం రాజ్యసింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని సోదరుడు రోషనుద్దేలా. అఫ్జల్ఉద్దౌలా పటిష్టమైన శరీరం కలవాడు. రాజకీయ వ్యూహకర్త. క్రీ.శ. 1857లో సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత రాజ్య వ్యవహారాలను చక్కబరచాలని నిర్ణయించాడు. దానికి తగిన పథకాలను రూపొందించాడు.

అఫ్జల్ఉద్దౌలా సింహాసనాన్ని చేపట్టిన సంవత్సరం భారతదేశంలో బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేశారు. స్వదేశ సంస్థానాధీశులు, దేశభక్తులు, మంత్రులు, ప్రజలు తిరుగుబాటుదారులతో చేరి, ఆంగ్లేయులను భారతదేశము నుండి తరిమివేసేందుకు సమాయత్తమయ్యారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా సంగ్రామంగా ఈ విప్లవాన్ని భావించవచ్చును. చారిత్రకులు కొందరు దానిని ప్రప్రథమ స్వాతంత్ర్యోద్యమమని పేర్కొన్నారు. ఉత్తర భారతంలో మీరట్, ఢిల్లీ, లక్నో, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో తిరుగుబాటుదారులు ఆంగ్లేయులను ఊచమట్టుగా వధించడానికి పథకాన్ని రూపొందించారు. దక్షిణాపథములో, ముఖ్యంగా నిజాం రాష్ట్రంలో ఈ ఉద్యమం అతి స్వల్పంగా వ్యాపించింది. అనేక సంఘ సంస్కరణలు జరిగాయి. అయినా ఉద్యమకారుల చర్యలు అణచివేయబడ్డాయి. నిజాం రాష్ట్రంలో ప్రజలకు ఆంగ్లేయులపై మంచి అభిప్రాయం ఉండేది కాదు. దేశభక్తులు ఆంగ్ల ప్రభుత్వమునకు వ్యతిరేకంగా హైదరాబాద్, ఆదిలాబాదు, ఔరంగాబాదు వంటి ప్రాంతాలలో ఈ ఉద్యమాలను సాగించారు.

నిజాం నవాబు ఈ ఉద్యమానికి ప్రోత్సహమిచ్చునని భావించిన ఉద్యమకారులకు, ప్రజలకు నిరాశ ఎదురైంది. అఫ్జల్ఉద్దౌలా, అతని బంధువులు, జాగీర్దారులు, మంత్రులు, అధికారులు ఆంగ్లేయుల పట్ల వైరీభావము వహించి ఉండలేదు. పైగా రెసిడెంటుకు తోడ్పడి విప్లవకారుల, ఉద్యమ నాయకుల ప్రయత్నాలకు విఘాతములు ఏర్పరచారు. పోలీసు, సైనిక యంత్రాంగమును ఉపయోగించి ఉద్యమాన్ని అణచివేశారు. నిజాం రాష్ట్రంలో కంటింజెంటు, సహాయ సైనిక పటాలమున్న ప్రాంతాలలో, హైదరాబాద్ నగరంలో ఉద్యమం వ్యాపించింది. హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలు ఈ ఉద్యమాలకు కేంద్రములయ్యాయి. ఔరంగాబాద్ ప్రాంతంలో ఉన్న సైనికులు తమను ఉద్యమాన్ని అణచివేయడానికి ఉత్తర భారత ప్రాంతాలకు పంపిస్తారని భావించి తిరుగుబాట పట్టారు .

కెప్టెన్ అబ్బాట్ 'మిమ్మల్ని ఉత్తర భారతము పంపదలచుకోలేదు' అని సైనికులకు నచ్చచెప్పినా వారు అతని మాటలను నమ్మలేదు. సైనిక పటాలము నుండి బయటపడి ఆంగ్లేయులను హతమార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. కెప్టెన్ అబ్బాటు పరిస్థితి విషమించడాన్ని గమనించి ఆంగ్ల కుటుంబాల నుండి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. అదనంగా సైనిక పటాలమును రప్పించి విప్లవకారులలో కొందరిని హతమార్చి, కొందరిని బంధించి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశాడు. నిజాం రాజ్యంలో సాలార్‌జంగ్ చక్కని పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాలుగు సూబాలు, 17 జిల్లాలు, వివిధ తాలూకాలుగా రాష్ట్రమును పరిపాలనా సౌలభ్యం కోసం విభించాడు. తాలుగైరు, తహసిల్దారు, సిబ్బంది నియామకాలు జరిగాయి. న్యాయశాఖలో కొన్ని మౌలికమైన మార్పులు చేయబడ్డాయి. పోలీసు శాఖ సంస్కరించబడింది. రాష్ట్రమంతటా విద్యాలయాలు నెలకొల్పబడ్డాయి. ఫారసీ, ఉర్దూ, అరబ్బీ, తెలుగు, మరాఠీ, కన్నడ, ఆంగ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోబడ్డాయి. ఈ పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టి నిజాం వంశీయులకు, నిజాం రాష్ట్రమునకు సాలార్‌జంగ్ ఎంతో మేలు చేశాడు. అర్జలుద్దెలాకు గుర్రపు స్వారీలో ఎక్కువ ఆసక్తి గలదు. వేటాడడంలో కూడా ఆసక్తి గలవాడు. అఫ్జల్ఉద్దౌలా తన 45వ ఏట దివంగతుడయ్యాడు.

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్