అఫ్జల్ఉద్దౌలా  మరణానంతరం అతని కుమారుడు, మూడు సంవత్సరాల వయస్సున్న మహబూబ్ అలీఖాన్ సింహాసనమధిష్ఠించాడు. సుల్తాను బాలుడగుట వల్ల రాష్ట్ర పాలన బాధ్యత నిర్వహించుటకు సాలార్‌జంగ్, షమ్సులుమ్రాలు బ్రిటీష్ గవర్నర్ జనరల్ చే నియమించబడ్డారు. ఈ కాలంలో సాలార్‌జంగ్ నిజాం రాష్ట్రంలో అటవీ, తపాలా, రెవెన్యూ, విద్య, వ్యైద్య, ఆరోగ్యాది శాఖలను సంస్కరించి చక్కని పాలన విధానాన్ని అమలు పరిచాడు. బీరారు ఆంగ్లేయుల ఆధీనంలో ఉండేది. దాని పరిష్కారానికి సాలార్‌జంగ్ ప్రయత్నించి విఫలుడయ్యాడు. మహబూబ్ అలీఖాన్ యుక్త వయస్కుడైన తరువాత అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ అతనికి సర్వాధికారాలు అప్పగించాడు.

సాలార్‌జంగ్ తరువాత రెండవ సాలార్‌జంగ్ దివాను పదవిని నిర్వహించాడు. తరువాత ఆస్మాన్-, వికారాలుమ్రా ఒకరి తరువాత ఒకరు పదవిని చేపట్టారు. ఆ తరువాత మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహద్దూర్ దివాన్ పదవిని చేపట్టాడు. మహబూబ్ అలీఖాన్ కాలంలో ఇంపీరియల్ సర్వీస్ అనే సైనిక వ్యవస్థ కొత్తగా ఏర్పడింది. కేబినెట్ కౌన్సిల్ స్థాపించబడింది. ఈ కౌన్సిల్ లో ఆమాత్యులు, అధికారులు, జాగీర్దారులు, వ్యాపారులు ప్రతినిధులుగా నియమించబడ్డారు. పరిపాలనా సంస్కరణలను ఖానూన్చా ముబారిక్ అని అంటారు. మహారాజా కిషన్ ప్రసాద్ బహద్దర్ గా రెన్నియో పరిపాలనా సంస్కరణలను రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజా సౌకర్యములు ఏర్పరచి కీర్తి గడించారు. 

నిజాం రాష్ట్రంలో సంభవించిన కరవు కటాకాల వల్ల రాష్ట్ర ఆర్ధిక స్థితి క్రుంగిపోయెను. ప్రభుత్వం 25 లక్షల రుణము విడుదల చేసింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిజాం ప్రభువుకు ఆర్ధిక చిక్కులను అధిగమించుటలో రెండు కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జను ప్రభువు, నిజాం రాష్ట్ర ఆర్ధిక స్థితిని మెరుగుపరచు పథకాలను రూపొందించి అమలు పరచడానికి ఆర్ధిక కార్యదర్శిగా జి.సి. దివాకర్‌ను నియమించారు. అతడు నిజాం రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను పరిశీలించి పొదుపు పాటించడానికి ముందుగా, లింగుసూగూరు జిల్లాను విడదీసి గుల్బర్గా, రాయచూరు జిల్లాలలో చేర్చాడు.

మహబూబ్ అలీఖాన్ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటుచేశాడు. ఈ కాలంలో విద్యాలయాలు, వైద్యాలయాలు, రహదారులు, నీటి పారుదలకు అనువైన బృహత్తటాకములు, చెరువులు, కుంటలు, కాలువు నిర్మించబడ్డాయి. బీరారు సమస్య పరిష్కార ప్రయత్నంలో మహబూబ్ అలీఖానకు ఎలాంటి లాభం కలుగలేదు. కానీ క్రీ.శ. 1902లో ఆంగ్లేయులకు బీరారుపై శాశ్వతాధికారము లభించునట్లు ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఇంగ్లీషువారు నిజాముకు 25 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము చెల్లించవలసి వచ్చింది. అమరావతిలో బ్రిటీషు పతాకముతో పాటు ఆసఫ్తా పతాకమును ఎగురవేయుటకు, నిజాం 21 తోపుల గౌరవ వందనము పొందడానికి అంగీకారం కుదిరింది. నామమాత్రపు గౌరవ మర్యాదలను పొందుతూ నిజాం నవాబు సారవంతమైన బీరారు ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అప్పగించాల్సివచ్చింది.

క్రీ.శ.1906-1907లో మూసీనది పొంగి పొరలి ప్రవహించి, హైదరాబాద్ నగరంలోని అఫ్టల్ గంజ్, దివా దేవుడి, చాదర్‌ఘాట్ ప్రాంతాలను ముంచివేసింది. ముస్లింజంగ్ పూల్, పురానాపూల్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలకొలది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందలకొద్ది గృహాలు నేలమట్టమయ్యాయి. చెట్లు కూలి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వందల కొద్ది మనుషులు మరణించారు. మహబూబ్ అలీఖాన్ ఈ దారుణ సంఘటనకు విలపించాడు. వరదల వల్ల సర్వము కోల్పోయినవారికి, నష్టపోయినవారికి ప్రభుత్వం తక్షణ సహాయమందించింది. నిరాశ్రయులైన వారికి వసతి గృహాలు నిర్మించి వారికి ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి మహబూబ్ అలీఖాన్ ఆజ్ఞలు జారీ చేశాడు. ఈ ప్రకృతి విలయ తాండవం వల్ల భాగ్యనగరం అనేక విధాలుగా నష్టపడింది.

మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో ప్రభుత్వ వ్యవహారాలు ఉర్దూ, ఫారసీ భాషలలో నిర్వహించబడుతుండేవి. గ్రామసీమలలో ఉర్దూ భాషతో పాటు స్థానిక భాషలగు మరాఠీ, కన్నడము, తెలుగు భాషలు బోధించబడుతుండేవి. మహబూబ్ అలీఖాన్ వేటయందు ఆసక్తి గలవాడు. కుటుంబ సమేతంగా వేట కార్యక్రమంలో పాల్గొనేవాడు. మెదక్ జిల్లాలోని కుక్కునూరు రామాయిపల్లి అటవీ ప్రాంతం మహబూబ్ అలీఖాన్ వేటాడుటకు ప్రత్యేకించబడింది.

రామాయపల్లి అడవులలో పెద్ద పులులు, చిరుత పులులు, లేళ్లు, జింకలు, కుందేళ్లు, అడవి దున్నలు ఉండేవి. నిజాం సుల్తాన్ కు ఈ ప్రాంతంలో వేటాడడం ఎంతో ఆనందకరంగా ఉండేది. ఉన్నత వ్యక్తిత్వం గల మహబూబ్ అలీఖాన్ అందరి మన్ననలకు పాత్రుడయ్యెను. అతని వ్యక్తిగత జీవితము, ప్రవర్తన అందరినీ ఆకట్టుకునేది. క్రీ.శ. 1911వ సంవత్సరంలో మహబూబ్ అలీఖాన్ తీవ్రమైన అస్వస్థతకు లోనై మరణించాడు. అతని మరణమునకు దు:ఖించని పౌరుడు లేడు. ప్రజా హృదయాలలో స్థానమేర్పరచుకొన్న మహబూబ్ అలీఖాన్ చిరస్మరణీయుడు.

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్