మీర్ షాబుద్దీన్ దంపతులకు క్రీ.శ. 1671లో మీర్ ఖమ్రుద్దీన్ జన్మించాడు.  ఇతడు బాల్యములోనే చదువులో అమితమైన ఆసక్తి చూపించేవాడు. ఉపాధ్యాయుల యందు భయభక్తులు కలిగి చక్కగా విద్యాభ్యాసాన్ని అభ్యసించాడు. ఇతని తెలివితేటలను, సమయస్ఫూర్తినీ, గమనించిన మొగల్ పాదుషా ఔరంగజేబు ఖమ్రుద్దీన్ విద్యాభ్యాసానికి అన్ని సదుపాయాలు చేకూర్చాడు.

ఖమ్రుద్దీన్ 20 సంవత్సరాల వయస్సులోనే సకల విద్యలలో పాండిత్యాన్ని సంపాదించాడు. యుద్ధ విద్యలయందు కూడా ఆరితేరాడు. ఇతని వినయ విధేయతలు, పట్టుదల, రాచకార్య నిర్వహణలో ఆసక్తి, అప్రమత్తత ఔరంగజేబు ఆకర్షించాయి. ఖమ్రుద్దీన్ క్రీ.శ.1690లో నాలుగు వేల సేనలకు అధిపతిగా నియమించబడ్డాడు. ఆ తరువాత ఔరంగజేబు ఖమ్రుద్దీన్ ను ఐదు వేల సైన్యాలకు అధిపతిగా నియమించి “చిన్ ఖిలిచ్ ఖాన్" బిరుదును ప్రదానం చేసి, దక్షిణాన దక్కను రాజ్య వ్యవహారములను చక్కదిద్ది కర్ణాటక ప్రాంత పాలాకునిగా నియమించాడు.

ఖమ్రుద్దీన్ కర్ణాటక ప్రాంత పాలకునిగా నియమించబడ్డ తర్వాత ఆ ప్రాంత పాలనా స్థితిగతులపై అవగాహనను ఏర్పరచుకొని ప్రభుత్వ ఆదాయాన్ని వృద్ధి చేశాడు. ప్రజాసౌకర్యాలు కలిగించాడు. రైతుల వ్యవసాయము అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాడు. ఔరంగజేబు మరణానంతరము ఢిల్లీ సింహాసనమును షా ఆలం చక్రవర్తి అధిష్టించాడు. అతని కాలములో ఖమ్రుద్దీన్ అయోధ్య ప్రాంత సూబేదారుగా, లక్నో నగర ఫౌజుదారుగా విధులు నిర్వహించాడు. 

షా ఆలం చక్రవర్తి అనంతరం ఢిల్లీ సుల్తానుగా ఫరుకుషియర్‌ పీఠాన్ని అలంకరించే నాటికి  దక్కన్ పరిస్థితులు అవకతవకలుగా ఉండేవి. ఫౌజుదారులు, ఖిలేదారులు, సుబేదారులు స్వతంత్ర రాజ్యములను ఏర్పరచుకోవడానికి సమాయత్తులై ఉండేవారు. ఫరకుషియర్ ఖమ్రుద్దీన్  శక్తి సామర్థ్యములను, పరిపాలనా దక్షతను గమనించి అతనికి "ఫతేజంగ్ నిజామ్-ఉల్-ముల్క్' బిరుదును ఇచ్చి దక్కన్ సూబేదారుగా నియమించాడు. అంతేకాకుండా 7 వేల ఆశ్వికదళాలపై ఆధిపత్యమును కూడా ఇచ్చాడు. చక్రవర్తి ఆజ్ఞానుసారము ఖమ్రుద్దీన్ దక్కన్ సూబేదారుగా పదవీ బాధ్యతలను అతి సమర్ధవంతంగా నిర్వహించాడు.

ఢిల్లీ రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించి అధికారాన్ని చేజిక్కించుకొని సుల్తానులను సింహాసనమును ఎక్కించడానికి సయ్యదు సోదరులు శక్తి సమన్వితులై ఉన్నారు. ఢిల్లీ సుల్తానులను తమ చేతి కీలు బొమ్మలుగా చేసి సర్వాధికారాలు తమ గుప్పిట్లో పెట్టుకొని సూబేదారులను మార్చుచు, భారత రాజకీయాలలో అల్లకల్లోలాన్ని సృష్టించారు. వీరి కుట్రల వల్ల ఫరకుషియర్, అతని తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టిన మరో ఇద్దరు సుల్తానులు నిహతులయ్యారు. చివరకు మహ్మద్ షా ఢిల్లీ చక్రవర్తిగా పదవిని చేపట్టారు. అతడు సయ్యదు సోదరుల ప్రవర్తనపై అనుమానించి వారి పథకము పారకుండా ఎదురు నిలిచాడు. సయ్యదు సోదరుల ప్రాబల్యము తగ్గింది. వారు క్రీ.శ. 1720-1722 సంవత్సరాల మధ్య వధించబడ్డారు. అప్పటి ఢిల్లీ చక్రవర్తి మహ్మద్ షా,  ఖమ్రుద్దీన్ ను దక్కన్ సూబేదారు పదవిని త్యజించి ఢిల్లీలో ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని కోరాడు. కానీ దక్కన్ రాజకీయ పరిస్థితులను చక్కబెట్టనట్లయితే అనర్థము కలుగుతుందని ప్రధానమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించి దక్కన్ సూబేదారుగానే ఉండాలని ఖమ్రుద్దీని నిశ్చయించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వము బలహీనంగా ఉండడం వల్ల దేశంలో అరాచకాలు ఏర్పడ్డాయి. సూబేదారులో స్వార్థము పెరిగింది. బెంగాలు, అయోధ్య పాలకులు ఢిల్లీ సుల్తానును ధిక్కరించి స్వతంత్రులై తమ సైనిక బలమును పెంపొందించుకునేందుకు ప్రయత్నించారు. రోహిలాలు, సిక్కులు, జాట్లు, మహారాష్ట్రులు స్వతంత్ర రాజ్యములను ఏర్పరచుకొని శక్తి సంపదలను పెంచుకొన్నారు. మహారాష్ట్రులు అత్యంత శక్తివంతులుగా ఎదిగారు. దక్కన్ పశ్చిమ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని మొగలు సామ్రాజ్య భాగాలపై దండెత్తి చౌతు, సర్దశ ముఖి వంటి పన్నులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో దక్కన్ సుబేదారుగా ఉన్న ఖమ్రుద్దీన్ నామమాత్రంగా ఢిల్లీ చక్రవర్తి సామంతునిగాను, సుబేదారుగా ఉండి క్రీ.శ. 1724 నుండి స్వతంత్ర పాలనను ఏర్పరచుకొని గొప్ప సైన్యమును సమకూర్చుకొని శక్తివంతులైన సైనికులతో అజేయుడై ఉన్నాడు.

ఖమ్రుద్దీన్ దక్కన్ సుబేదారుగా ఔరంగజేబు రాజధానిగా పాలిస్తూ శక్తి సమన్వితుడై ఉండడం మహారాష్ట్ర పీష్వాలకు కంటగింపైనది. వారు బిల సమన్వితులు, యుద్ధ వ్యూహ రచనా నిపుణులు. ఛత్రపతి శివాజీ స్థాపించిన మహారాష్ట్ర రాజ్య విస్తృతికి నిరంతరము పోరాడు వీరులు.
మహారాష్ట్రులు మొగలు రాజ్య భాగములలో కొన్నింటిని జయించి తమ రాజ్యమున చేర్చుకొన్నారు. దక్కనులోని ఇతర రాజ్య భాగాలపై, ఖమ్రుద్దీన్ సూబేదారు పరిధిలో ఉన్న భూభాగాలపై దండయాత్రలు నిర్వహించి చౌతు, సర్దేశముఖి పన్నులను వసూలు చేయడం ప్రారంభించారు. వారు ఖిలేదారులను ఓడించి ఫౌజుదారులను అణచివేసి, ప్రభుత్వోద్యోగులను బంధించి, చౌతు వంటి పన్నులు వసూలు చేశారు. మహారాష్ట్రుల దాడుల వల్ల, పన్నుల వసూళ్ళ వల్ల దక్కన్ సుబేదారి ప్రభుత్వ ఆదాయము తగ్గిపోయింది. నిరంతరం మహారాష్ట్రుల దాడులు జరుగుతుండడం వల్ల ఖమ్రుద్దీన్ ఆవేదనకు గురయ్యాడు. ఢిల్లీ చక్రవర్తి మహారాష్ట్రుల విజృంభణను ఆపమని దక్కన్ సుబేదారును ఆదేశించాడు. ఢిల్లీ చక్రవర్తి ఆదేశము ఎలా ఉన్నా తన సుబేదారి పరిధి ప్రాంతములో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మహారాష్ట్రులు తమ యేలుబడిలోని ఏ భాగమందులోనైనా పన్నులు వసూలు చేయరాదని ఖమ్రుద్దీన్ శాసించాడు. చివరికి నిజామ్ ఉల్ ముల్క్ మహారాష్ట్రులపై దండయాత్రకు సన్నద్ధుడయ్యాడు. దక్కను సూబేదారు చర్యను పసిగట్టిన మహారాష్ట్ర నాయకులు తగు సైన్యముతో ముస్లిం సైన్యముతో తలపడి భీకర యుద్ధము చేసారు. ఆ యుద్ధములో నిజామ్ ఉల్ ముల్క్ పరాజయము పొంది దక్కను సూబాలోని విశాల భూభాగమును, యుద్ధ అపరాధమును మహారాష్ట్రులకు చెల్లించే లాగా వారితో సంధి చేసుకున్నాడు.
మహారాష్ట్రులను ఎదురించి విజయము సాధించుటకు నిజామ్ ముల్క్ దక్కనులోని యువకులను సైన్యములో చేర్చుకొని వారికి శిక్షణను ఇప్పించి పటిష్టమైన సైనిక వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. ఢిల్లీ సుల్తానుల అసమర్థత, దేశములో పబ్రాలీన అరాచక శక్తులు, సామంతరాజుల తిరుగుబాటుతనము, విదేశీ దండయాత్రల సూచన మొదలైన పరిస్థితులను గమనించి నిజామ్ ఉల్ ముల్క్ దక్కనులోని విశాల భూభాగానికి రాజు కావాలని పూర్తి తెలంగాణ ప్రాంతమును జయించదానికి సిద్ధమయ్యాడు.
ఉత్తర హిందూ దేశముపై నాదిర్‌షా క్రీ.శ.1788లో దండయాత్ర నిర్వహించి ఢిల్లీ పట్టణమును వశపరచుకొని దోపిడీలు సాగించి సామాన్య పౌరులను కనికరం లేకుండా చంపించాడు. నాదిర్‌షా దండయాత్ర ప్రారంభం కాగానే ఢిల్లీ చక్రవర్తి నిజామ్ ఉల్ ముల్క్ ను ఢిల్లీకి రమ్మని కోరాడు. నిజామ్ ఉల్ ముల్క్ మొగలు చక్రవర్తి ఆదేశం ప్రకారం ఢిల్లీని స్వాధీనపరచుకొని దోపిడీలు సాగిస్తున్న నాదిర్‌షాను సందర్శించి యుద్ధమును ఆపి దోపిడీలను అరికట్టి స్వదేశానికి వెళ్ళిపొమ్మని కోరాడు. విజ్ఞానవంతుడు, వయోవృద్ధుడు, రాజకీయ పరిజ్ఞాని అయిన నిజామ్ ఉల్ ముల్క్ మాట మంచితనము, వినయ వాక్కులను మన్నించి నాదిర్‌షా తన దేశము వెళ్ళిపోయాడు..
నిజామ్ ఉల్ ముల్క్ క్రీ.శ 1740లో ఢిల్లీ నుండి దక్కన్ తిరిగి వచ్చే నాటికి అతని కుమారుడు నాసర్‌జంగ్ తిరుగుబాటు చేసి అధికారులను కూడగట్టుకొని తానే దక్కను సూబేదారునని ప్రకటించి పాలనా వ్యవహారములను చేజిక్కించుకున్నాడు. నిజామ్ ముల్క్ తనకు అత్యంత సన్నిహితులైన సేనానుల సహాయ సహకారంతో కుమారుడిని ఎదుర్కొని బంధించి, తిరుగుబాటుకు శిక్షగా కారాగారవాస శిక్ష విధించాడు. దక్కను సూబేదారుగా అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టి ప్రజోపయోగ నిర్మాణములను చేపట్టి రాజ్యములో శాంతి భద్రతలు నెలకొల్పాడు.
నిజామ్ ఉల్ ముల్క్ విశాల దక్షిణాపథమును పాలిస్తూ తన రాజ్యభాగమును ఇతరులు ఆక్రమించకుండా ఫ్రెంచి, డచ్చి, బ్రిటీషు వర్తక సంఘాల వారితో స్నేహ పూర్వకంగా ఉండేవాడు. పాశ్చాత్య వర్తక సంఘాల వారు క్రమక్రమంగా తమ కార్యకలాపాలను విస్తృత పరచసాగారు.
క్రీ.శ. 1747లో ఆప్షన్ రాజ్య సింహాసనమధిష్టించిన అహ్మద్ షా అబ్దాలీ శక్తి సమన్వితుడై ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించే ప్రయత్నము చేశారు. ఢిల్లీ చక్రవర్తికి ఈ విషయం తెలిసింది. అతడు అహ్మద్ షా అబ్దాలీని యుద్ధములో ఎదుర్కొనుటకు రావలసిందిగా నిజామ్ ఉల్ ముల్క్ ను కోరెను. నిజామ్ ఉల్ ముల్క్ చక్రవర్తికి సహాయపడాలని సైన్యముతో ఢిల్లీకి బయలుదేరాడు. మార్గమధ్యలో నిజామ్ ఉల్ ముల్క్ అనారోగ్యంతో క్రీ.శ. 1748వ సంవత్సరంలో తన 79వ యేట బురహాపూర్ లో మరణించాడు. మరణించడానికి ముందు తన కుమారుడైన నాసర్‌జంగ్ కు రాజనీతిని బోధించాడు.
నిజామ్ ఉల్ ముల్క్ సమరుడైన పాలకుడు, విజ్ఞానఖని. రాజకీయ పరిజ్ఞాని. వ్యూహకర్త, యుద్ధవీరుడు.. సర్వసమర్థుడు. దక్కను సూబేదారుగా నియమించబడిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఎన్నో పనులు చేశాడు. వ్యవసాయాభివృద్ధికి తోడ్పడెను. అనేక రాజమార్గములను నిర్మించాడు. క్షమ, దాన, దయా గుణములు కలిగి, ప్రశాంత వాతావరణాన్ని కల్పించాడు. దక్కనును స్వతంత్రంగా సుమారు 24 సంవత్సరాలు పాలించాడు.

నిజామ్ ఉల్ ముల్క్ నిరాడంబర జీవి. జీవితములో సుఖమన్నది తెలియని వ్యక్తి. యుద్దమందే తన జీవితాన్ని గడిపాడు. కవులను, పండితులను ఆదరించి పోషించాడు. విద్యావంతుడైనందువల్ల ఫారసీ, అరబీ, ఉర్దూ భాషలను పోషించాడు. అస్ఫజా వంశ కర్తయైన ఖమ్రుద్దీన్ నిజామ్ ఉల్ ముల్క్ బిరుదు సంపాదించి తన పరిపాలనలో దక్కను చరిత్రలో విశిష్ట స్థానమును సంపాదించుకున్నాడు.

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్