క్రీ.శ. 1760లో సలాబత్ జంగ్ మహారాష్ట్రులచే ఓడింపబడి వారికి దౌలతాబాదు, బీజాపూరు వంటి దుర్గములను అప్పగించడాన్ని చూసి సహించలేని అతని సోదరుడు నిజామలీఖాన్ స్వయంగా రాజ్యపాలన చేయాలని భావించాడు. క్రీ.శ. 1761లో సలాబత్ జంగ్ ను చెరలో వేసి ఆసఫ్లా రాజ్యపీఠాన్ని అలంకరించాడు. ఆసఫ్తా వంశీయులలో రెండవ నిజాంగా ఇతడు కీర్తి గడించాడు. నిజామ్ ఉల్ ముల్క్ ఉమ్లా బేగం దంపతులకు నిజామలీఖాన్ క్రీ.శ. 1734లో జన్మించాడు. ఇతడు ఉర్దూ, టర్కీ, అరబ్బీ, ఫారసీ భాషలను షేక్ మహ్మద్ జమాల్ సాబ్ దగ్గర నభ్యసించాడు. పిన్న వయసులోనే సకల శాస్త్రములందు ప్రావీణ్యము సంపాదించి నిజామ్ ఉల్ ముల్క్ అభిమానాన్ని చూరగొన్నాడు. యుద్ధ విద్యలను అభ్యసించి రాజకీయ అనుభవాన్ని గడించి అనేక యుద్ధాలలో పాల్గొని విజయాలు సాధించాడు. దక్కన్ రాజకీయాలను అవగాహన చేసుకొని ఫ్రెంచివారి ఆధిపత్యమును అంగీకరించక నేర్పుతో ఆసప్టా రాజ్యమును కాపాడగలిగాడు. ఇతని కాలం నుండే నిజాంలు అసఫాహీలుగా పిలువబడినారు.

మహారాష్ట్ర నాయకులు తమలో తాము కలహించు స్థితికి వచ్చిన సమయంలో వారిలో అభిప్రాయ బేధాలను తొలగించి నిజామలీఖాన్ మాధవరావు, రఘునాథరావులకు సఖ్యత చేకూర్చాడు. క్రీ.శ. 1763లో బీదరు చెరసాలలో ఉన్న సలాబత్ జంగ్ దివంగతుడయ్యాడు. నిజామలీఖాన్ పూణా ముట్టడిని విరమించి బీదరు వచ్చి అన్నగారి అంత్యక్రియలను నిర్వహించాడు. అసఫ్ జాహీ రాజ్యమంతా పర్యటించి పరిపాలనను చక్కబరచి తన ఆధిపత్యాన్ని అంగీకరించని కర్నాటక నవాబును క్రీ.శ.1765లో దండించాడు. అతడు ఆంగ్లేయుల సహాయ సహకారాలను కోరి వారితో సఖ్యత నేర్పరచుకున్నాడు. నిజామలీఖాన్ షేంగను మద్రాసు పంపించి ఆంగ్లేయులను ఒప్పించి, కర్నాటక నవాబు సకాలంలో పన్ను చెల్లించేవిధంగా ఏర్పాట్లు చేశాడు. ఉత్తర సర్కారులందు ఆంగ్లేయుల ఆధిపత్యము కొనసాగుతుండేది. వారు విశాల భూభాగముపై ఆధిపత్యము వహించడాన్ని నిజామలీఖాన్ వ్యతిరేకించాడు. వారికి అనేక ఆటంకాలు కలిగించాడు. క్రీ.శ. 1766లో ఆంగ్లేయులు నిజామలీఖాతో సంధి ఏర్పరచుకున్నారు. ఈ సంధి ప్రకారం ఉత్తర సర్కారు ప్రాంతాలైన రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్ ప్రాంతాలపై ఆధిపత్యము వహించడాన్ని బ్రిటీష్ వారు నిజామలీఖానకు ఐదు లక్షల ద్రవ్యము చెల్లించారు.

నిజామలీఖాన్ సమర్థుడు, పరిపాలనా దక్షుడు. ఇతడు క్రీ.శ.1769లో గురగుంట జమీందారు తన ఆధిపత్యాన్ని అంగీకరించేవిధంగా చేశాడు. గొప్ప శూరుడు, యుద్ధ తంత్ర నిపుణుడైన ఇబ్రహీం బేగుదంసా అనే అతనికి జఫరుద్దేలా బిరుదును ప్రసాదించి నిర్మల్ ప్రాంతంలో ఆధిపత్యాన్ని సంపాదించాడు. ఉత్తర తెలంగాణ ప్రాంత పాలనా వ్యవహారాలను పటిష్టపరిచాడు. రుక్నుద్దేలా క్రీ.శ. 1773లో హత్యకు గురయ్యాడు. నిజామలీఖాన్ అతని స్థానంలో అరుస్తుజాను దివానుగా నియమించబడ్డాడు. ఆంగ్లేయులు గుంటూరు పాలకునిగా ఉన్న బసాలత్ జంగ్ ఆధిపత్యంలో ఉన్న ఫ్రెంచి సేనలను తొలగించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. నిజామలీఖాన్ ఆంగ్లేయుల చర్యను భరించలేకపోయాడు. అతడు ఫ్రెంచి సైన్యమును చేరదీసి ఆంగ్లేయుల పథకాన్ని నీరుగార్చాడు. బసాలత్ జంగ్ మరణానంతరం ఆంగ్లేయులు గత్యంతరం లేక నిజామలీఖా తో సంధి చేసుకుని ప్రభుత్వానికి ఇవ్వవలసిన పేష్ కను చెల్లించి సఖ్యముగా ఉండేవారు.

ఆంగ్లేయులు నిజాము సైన్య సహాయంతో క్రీ.శ. 1792లో మైసూరు రాజ్యంలో ఉన్న శ్రీరంగ పట్టణాన్ని ముట్టడించారు. నిజాం సైన్యానికి మీఠాలం అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఈ యుద్ధములో టిప్పుసుల్తాను పరాజితుడై సంధి ఏర్పరచుకున్నాడు. నిజాము తమకు సహకరించినందుకు అతనికి ఆంగ్లేయులు మైసూరు రాష్ట్రమందున్న కడప, బళ్ళారి ప్రాంతాలను వశపరిచారు. నిజామలీఖాన్ తనయుడు సికిందర్ జా ఆంగ్లేయులు కానుకగా ఇచ్చిన బహమతులను, ఆభరణాలను తండ్రికి అప్పగించాడు. మహారాష్ట్రుల పాలన ఆసఫ్తా రాజ్య భాగాల నుండి చౌతు సర్దశముఖి వంటి పన్నులను బలవంతంగా వసూలు చేయడం జరిగింది. ఆసఫ్లా రాష్ట్రాదాయము మహారాష్ట్రుల చర్యల వల్ల దినదినము క్షీణించసాగింది. మహారాష్ట్రుల పన్నుల వసూళ్ళను ఆపాలని కోరుతూ మీర్ఆలంను నిజామలీఖాన్ పూణాకు పంపించాడు. నానా ఫర్నవీసు మహారాష్ట్ర పీష్వా. అతడు నిజాం కోరికను తిరస్కరించి లక్ష కాల్బలముతో దండెత్తి వచ్చాడు. నిజామలీఖాన్ ఆంగ్లేయుల సహాయాన్ని అర్ధించాడు. కానీ ఆంగ్లాధికారి సర్ జాన్ షోర్ సహాయం చేసేందుకు అంగీకరించలేదు. మహారాష్ట్రులతో తగవు కొరవితో తల గోకినట్లవుతుందని నిజాంకు సహాయపడడాన్ని ఆంగ్లేయులకు నచ్చలేదు.

నిజాం సైన్యము మహారాష్ట్ర సైన్యమును క్రీ.శ.1795లో ఖండాలా వద్ద ఎదుర్కొని ఘోరంగా పోరాడి ఓడిపోయింది. నానా ఫర్నవీసుతో నిజామలీఖాన్ సంధి ఏర్పరచుకొని తపతీ నది పరీవాహక ప్రాంతాలను, దౌలతాబాదు దుర్గమును, యుద్ధాపరాధము క్రింద మూడు కోట్ల ధనాన్ని చెల్లించాడు. ఈ యుద్ధానంతరము నిజామలీఖాన్, సమయానికి తనకు సహాయమందించని ఆంగ్లేయుల పట్ల వైరి భావంతో ఫ్రెంచి సైనికులకు తన రాజధానికి ఆహ్వానించి వారికి సమస్త సదుపాయాలు ఏర్పరచి, సైన్య నిర్వహణకు అయ్యే ఖర్చుల నిమిత్తం వారికి మెదక్ మండలాన్ని ఇచ్చాడు. ఆంగ్లేయుల కార్యకలాపాలకు అవరోధాలు కలిగాయి. ఆంగ్లేయులు తాము చేసిన తప్పిదాలను గుర్తించి నిజామలీఖానను ప్రసన్నుడిని చేసుకునేందకు అనేక ప్రయత్నాలు చేశారు.

నిజామలీఖాన్ జ్యేష్ట పుత్రుడు అక్బరలీ. అతడు రాజ్యములో తనకు తగిన ప్రాధాన్యము లభించలేదని భావించి తండ్రిపై తిరుగుబాటు చేశాడు. గాలిజంగ్, సదాశివారెడ్డి తమ వర్గంతో అక్బరలీకి అండగా నిలిచారు. నిజాం అనుమతి తీసుకొని మీరాలం సదాశివారెడ్డిపై దాడి చేశాడు. కానీ బలవంతుడు, యుద్ధ విద్యావిశారదుడైన సదాశివారెడ్డి మీరాలంను చిత్తుగా ఓడించాడు. ఈ వార్త నిజాంకు తెలిసి ఫ్రెంచి సైన్యాన్ని మీరాలం సహాయార్ధము పంపించాడు. ఫ్రెంచి సైన్యంతో కూడిన నిజాం సైన్యం సదాశివారెడ్డిని ఓడించింది. అక్బరలీ 'సదాశివారెడ్డికి మెదక్ మండలాన్ని అప్పగించి రాజ్యపాలనా వ్యవహారంలో తనకు తగిన ప్రాధాన్యమిచ్చిన విప్లవమునాపుదు' అని వర్తమానం పంపించాడు. ఈ సమయంలో ఫ్రెంచి సైనికులు, సదాశివారెడ్డి సైన్యమును తరముతూ అక్బరలీ సైన్యంలోని అనేక మందిని సంహరించారు. సదాశివారెడ్డి బందీ అయ్యాడు. అక్బరలీ మీరాంలకు లొంగిపోయాడు. కానీ ఆత్మాభిమానంతో అక్బరలీ విషం తాగి మరణించాడు. విజయం పొందిన మీరాలం రాజధానికి చేరాడు.

క్రీ.శ.1796లో నిజాం అలీఖాన్ ఆరోగ్యం క్షీణించి పక్షవాత రోగానికి గురయ్యాడు. ఆంగ్లేయులు నిజాంతో సంధి చేసుకోదలచి రెసిడెంటు జేమ్సు పేట్రిక్ ను రాయబారిగా పంపించారు. సంధి ఏర్పాటు చేసుకునేందుకు వచ్చిన జేమ్సు పేట్రిక్ ను నిజామలీఖాన్ అత్యంత గౌరవంతో ఆహ్వానించాడు. సంప్రదింపులు సవ్యమైన పద్ధతిలో సాగాయి. క్రీ.శ.1798లో సంధి కుదిరింది. సంధి షరతులను అనుసరించి నిజాం రాజ్యము నుండి ఫ్రెంచి సైనికులు తొలగించబడ్డారు. నిజాం అలీ ఖాన్ కుడి చేయి పక్షపాతం వల్ల స్వాధీనంలో లేకుండాపోయింది. నిజాం ప్రభువు ప్రకటించు ఫర్మానాలపై, పరిపాలనా వ్యవహార సంబంధ పత్రములపై, సంధి రాయబారాలకు సంబంధించి కాగితాలపై నిజామలీఖాన్ కు బదులు అతని తనయుడు సికిందర్ జా సంతకము చేసేందుకు అంగీకరించారు. బ్రిటీష్ వారితో సంభవించిన సంధి పత్రాలపై సికిందర్ జా సంతకం చేశాడు. ఆంగ్లేయులతో ఏర్పడిన భేదాభిప్రాయాలు తొలగిపోయాయి. బ్రిటీష్ వారి సంపూర్ణ సహకారము నిజాంకు లభించింది.

మైసూరు పాలకుడు టిప్పుసుల్తాను బలపడి ఆంగ్లేయులపై పగ సాధించాలని ఉన్నాడు. ఇతడు దేశభక్తుడు, శక్తి సమన్వితుడు. పరిపాలనను సహించనివాడు. మాతృదేశమును ఆంగ్లేయులు కబళించడాన్ని చూసి వారి ఆగడాలను ఎదుర్కొనడానికి అనేక విధాలుగా ప్రయత్నించినవాడు. టిప్పుసుల్తాన్ చర్యలను గమనించిన ఆంగ్లేయులు అతనిపై దండెత్తడానికి నిజాం సుల్తాను సహాయాన్ని కోరారు. సంధి సూత్రములను మన్నించి బ్రిటీష్ వారికి సైన్య సహాయమందించి నిజామలీఖాన్ వారి ప్రేమకు పాత్రుడయ్యాడు. శ్రీరంగ పట్టణముపై దండెత్తిన ఆంగ్లేయులకు విజయం లభించింది. ఈ యుద్ధంలో వీరవరుడైన టిప్పుసుల్తాను ధైర్యంతో పోరాడి చివరకు తన ప్రాణాలను కోల్పోయాడు. నిజామలీఖాన్ తనయుడు సికిందర్ జా నిజాం సేనలకు ఆధిపత్యము వహించి శ్రీరంగ పట్టణంలో జరిగిన యుద్ధంలో విజయం సాధించడానికి బ్రిటీష్ వారికి తోడ్పడ్డాడు. టిప్పుసుల్తాను మరణానంతరం అతని రాజ్యమును నిజాం నవాబు, ఆంగ్లేయులు పంచుకున్నారు. నిజాం సువిశాల రాజ్యమునకు ఆధిపత్యము వహించి ఉండడం ఆంగ్లేయులకు నచ్చలేదు. వారు సైనిక వ్యయం క్రింద నిజాం వాటాకు వచ్చిన టిప్పుసుల్తాను రాజ్యభాగాన్ని స్వాధీన పరచుకున్నారు. నిజామలీఖాన్ అందుకు తన సమ్మతిని తెలిపాడు.

సికిందర్ జా గొప్ప యోధుడు. అతడు నాయకత్వము వహించిన నిజాం సైన్యం ఉండడానికి హైదరాబాద్ నగరంలో ఉన్న హుసేన్ సాగర్ ప్రాంతములో వసతులు ఏర్పరచుకున్నారు. సికిందర్ జా పేరుతో ఆ ప్రదేశము సికింద్రాబాద్ గా పిలువబడుతుంది. దానినే లష్కరు అని కూడా అంటారు. లష్కరు అనగా సైనిక స్థావరము. క్రీ.శ. 1803లో వ్యాధిగ్రస్తుడైన నిజాం అలీ ఖాన్ మరణించాడు. అతడు దైవభక్తి గలవాడు. మహామహుల సమాధులను దర్శించి, వారి ఆశీర్వచనాలను పొంది ప్రార్థనలు జరిపించేవాడు. జ్యోతిష్యమనగా నిజాం అలీ ఖాన్ కు అభిమానము. మూఢాచారాలను, మూఢ నమ్మకాలను నమ్మే నిజామలీఖాన్ శుభ ముహూర్తాలలోనే యుద్ధాలకు బయలుదేరేవాడు. యుద్ధ విజయానంతరము నగర ప్రవేశానికి మంచి సమయానికై వేచి ఉండేవాడు. నిజాం అలీ ఖాన్ లలిత కళలను ప్రోత్సహించేవాడు. వినోదాలపై మక్కువ కలిగిన ఈ సుల్తాను గజ, మేష, మహిష, కుక్కుట, లావక యుద్ధములను నిర్వహించి వినోదించేవాడు. మోతీమహల్ నిర్మాణం ఇతని కళాప్రియత్వానికి నిదర్శనం.

క్రీ.శ. 1761 నుండి క్రీ.శ.1803 వరకు 42 సంవత్సరాల వరకు ఇతడు సుదీర్ఘ కాలము పాలించాడు. రాజధాని నగరమైన హైదరాబాదు సుందరంగా తీర్చిదిద్దాడు. రాజభవనాలు, రాజోద్యోగుల వసతి గృహాలు, ఆరామములు, విహార స్థలాలు, ఆట స్థలాలు, తోటలు హైదరాబాదు నగరంలో నిర్మించబడ్డాయి. ఇతని సేనాని మీరాలం తన పేర మీరాలం చెరువును నిర్మించాడు. దీని నిర్మాణపు తీరు ప్రత్యేకమైంది. అధికారులు, ధనికులు విశాల ప్రాంగణములతో సుందరమైన భవనాలను నిర్మించుకున్నారు. నిజామలీఖాన్ నిర్మించిన భవనాలలో మోతీ మహల్, రోషన్ బంగ్లా, గుల్డన్ మహల్, చార్ బంగ్లాలు ముఖ్యమైనవి. క్రీ.శ.1777లో నిజాం రాష్ట్రం అనావృష్టికి గురైంది. ప్రజలు కరవు కాటకాలను అనుభవించారు. నిజామలీ ధాన్యమును,

ధనమును విరివిగా ప్రజలకు అందించి ఆపద సమయంలో ఆదుకున్నాడు. ఆ సంవత్సరం మూసీనది ఉప్పొంగి పొర్లి ప్రవహించి హైదరాబాద్ నగరవాసులకు నష్టాన్ని కలిగించింది. పురానాపూల్ ప్రాంతమంతా జలమయమైంది. నిజామలీఖాన్ వరదలలో నష్టపోయినవారిని ఆదుకున్నాడు. మూసీ ప్రవాహంలో వందల, వేల ఇళ్ళు, బండ్లు, పశువులు కొట్టుకొనిపోయాయి. ప్రభుత్వాధికారులు ముందుగా చర్యలు తీసుకొని వేలాది ప్రజల ప్రాణాలను కాపాడగలిగారు. ఇళ్ళు కూలిపోయిన ప్రదేశాలలో కొత్తగా ఇళ్ళు నిర్మించి ఇచ్చే బాధ్యతను నిజామలీఖాన్ ప్రభుత్వం చేపట్టింది. నిర్మల్ దుర్గము ఉత్తర తెలంగాణలో అత్యంత కీలక స్థానంలో ఉన్నది. నిజామలీఖాన్ ఇబ్రహీం బేగ్ ధంసా అనే అతనికి జఫరుద్దేలా బిరుదును ఇచ్చి ఆ ప్రాంత పాలనాధికారాలను అప్పగించాడు. ధంసా క్రూరుడు. నిర్దయుడు, నిరంకుశుడు. అతని పాలనలో నిర్మల్ ప్రాంత ప్రజలు అనేక కష్టనష్టాలకు గురి కావలసి వచ్చింది.

నిజామలీఖాన్ కాలంలో రాజమార్గమంలో బాటసారుల సౌకర్యార్థము సత్రములు, బావులు నిర్మించబడ్డాయి. బ్రిటీష్ రెసిడెంటు జేమ్సు మీరాలం బంధు వర్గంలోని ఖైరున్నీసా బేగంను వివాహమాడాడు. ఆమె నివాసానికి రంగమహల్ నిర్మించబడింది. సుల్తాన్ బజారు సమీపంలో క్రీ.శ. 1779లో రెసిడెంటు నివాస భవనము నిర్మించబడింది. రెసిడెంటు జేమ్సు పేట్రిక్ హష్మత్ జంగ్ బిరుదాంకితుడు. అతని పేర హష్మత్ గంజ్ నిర్మించబడింది. నిజామలీ కాలంలో హైదరాబాద్ నగరంలో నివసించిన ఫ్రెంచి సైన్యాధికారి రేమండ్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ప్రజలు ఇతనిని మూసారామ్ గా కీర్తించారు. ఇతని పేర మూసారాంబాగ్ వెలసింది. ఆస్మాన్ గడ్ సమీపంలో క్రీ.శ 1798లో ఇతని సమాధి నిర్మించబడింది. నేటికి కూడా శిథిలం కాకుండా నిలిచిఉంది.

ఫ్రెంచి సైనికులు నిజాము కొలువులో ఉన్న కాలంలో యుద్ధాలకు అవసరమయ్యే ఫిరంగులను నిర్మించిన స్థలము గన్‌ఫౌండ్రిగా వ్యవహరించబడింది. నిజామలీఖాన్ పాలించు కాలం దక్కనులో ఆసఫ్తా వంశము బలపడడానికి తోడ్పడింది. మొదటి ఆసఫ్తా నిజామ్ ఉల్ ముల్క్ జీవితకాలమంతా పోరాడి, విశాలమైన నిజాం రాజ్యమును స్థాపించినాడు. పాశ్చాత్యుల ఎత్తుజిత్తులను ఎదుర్కొని నిజామలీ రాజ్యమును స్థిరపరిచాడు. ఫ్రెంచి, డచ్చివారి ప్రాబల్యం అడుగంటింది. బ్రిటీషువారు నిలదొక్కుకోగలిగారు. బ్రిటీష్ వారితో మైత్రి కొనసాగించి, వారి అండదండలతో సుస్థిరంగా తమ రాజ్యభాగాలను పరిపాలించు స్థితికి ఆసఫ్తా వంశీయులు ఎదిగారు. నిజామలీఖాన్ రాణులలో జేబున్నీసా, బక్షి బేగం, తెహనతున్నీసా బేగంలు ముఖ్యులు. ఇతని పాలనా కాలము క్రీ.శ.1761 నుండి 1803. ఇతని అనంతరం తెహనతున్నిసా వల్ల ఇతనికి జన్మించిన సికిందర్ జా నిజాం రాజ్యపీఠాన్ని అధిష్ఠించాడు.

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్