సికిందర్ జా తన తండ్రి మరణానంతరం క్రీ.శ. 1803లో ఆసఫ్తా సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ సంవత్సరములో ఆంగ్లేయులకు మహారాష్ట్రులతో యుద్ధము జరిగింది. ఆంగ్లేయులు సికిందర్ జాను సైన్య సహాయం చేయ మహారాష్ట్ర సైన్యమును ఓడించారు. మహారాష్ట్రుల నుండి గ్రహించిన పశ్చిమ మండలాలను, గోదావరి పరీవాహక ప్రాంతాలను సికిందర్ జాకు ఆంగ్లేయులు అప్పచెప్పారు. మహారాష్ట్రులు నిజాం రాజ్యభాగాల నుండి చౌతు, సర్దేశముఖి వసూలు చేయకుండా బ్రిటీష్ వారు వారిని అంగీకరించే విధంగా చేశారు. ఆంగ్లేయులకు సైన్య సహాయమందించిన నిజాంకు విశాల భూభాగంపై ఆధిపత్యము లభించింది. యుద్ధంలో క్షతగాత్రులైన వారిని దేవగిరి దుర్గం వద్ద ఆంగ్లేయులు ఉంచాలని నిర్ణయించారు. కానీ దుర్గాధిపతి వారి కోరికను నిరాకరించాడు. ఆంగ్ల సైన్యాధికారి వెస్లీ నిజాంకు నిరసన తెలిపి, భవిష్యత్తులో యుద్ధంలో గాయపడిన వారిని నిజాం రాష్ట్రంలో ఉన్న ఏ దుర్గములోనైనా ఉంచవచ్చునని ఒప్పందం కుదుర్చుకున్నారు.

నిజాం దివానుగా ఉన్న మీరాలం క్రీ.శ. 1808లో మరణించాడు. సికిందర్ జా 1809లో మునీర్ ఉల్ ముల్కను దివానుగా నియమించాడు. అప్పుడు నిజాం రాష్ట్ర పేష్కారుగా చందూలాల్ వ్యవహరించేవాడు. చందూలాల్ చందూలాల్ ఉదార స్వభావి. విచ్చలవిడిగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చుచేస్తుండేవాడు. ఇతని కాలంలో రాజ కోశాగారము చాలా వరకు తగ్గిపోయినది. ఆర్ధిక పరిస్థితి తట్టుకోలేనంతగా దిగజారిపోయింది. చందూలాల్ ప్రభుత్వ వ్యయానికి అప్పులు కూడా తోడయ్యాయి. ఉత్తర సర్కారుల నుండి వచ్చు ఆదాయం సైనికుల జీతభత్యాలకు, మందుగుండు సామగ్రి కొనుగోలుకు సరిపోయేది. నిజాం సైన్య నిర్వహణకు సికిందర్జా, ఆంగ్లేయులకు సంబంధించిన పామర్ సంస్థ నుండి 60 లక్షల ద్రవ్యాన్ని అప్పుగా స్వీకరించాడు. ఈ అవకాశాన్ని బ్రిటీష్ వారు వినియోగించుకున్నారు. నిజాం ప్రభుత్వ ఆంతరంగిక వ్యవహారాలలో, పరిపాలనలలో ఆంగ్లేయులు జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. దినదినము బ్రిటీష్ వారి పెత్తనము అధికమయ్యెను. సికిందర్ జా ఆంగ్లేయులనేమి అనేవాడు కాదు. రాజపుత్రులగు ముబారిజుద్దేలా, షముద్రోలాలకు ఆంగ్లేయులు తమ రాజ్య పాలనలో, ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం నచ్చలేదు. వారు ఆంగ్లేయులకు చెందిన ఉద్యోగులను అవహేళన చేసేవారు. ఈ అవహేళననను భరించలేక రెసిడెంటు రస్సెలు, నిజాము నవాబుకు రాజకుమారుల ప్రవర్తనను తెలియచేశారు. రెసిడెంటు రస్సెలు ఒత్తిడి వల్ల సికిందర్ తన కుమారులను గోల్కొండ కోటలో బంధించాడు. ఆ తరువాత ఏడేళ్ళకు రాజకుమారులను చెర నుండి విడిపించాడు.

నిజాం రాజ్య భాండాగారము తగ్గిపోయింది. చందూలాల్ ధనాన్ని నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసాడు. అతడు ధర్మ మహారాజు. రాజకోశాగారము ఖాళీ అవడం వల్ల ప్రజా హిత కార్యముల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడ్డాయి. రైతులు పంటలు పండక దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. సికిందర్ జా చేసిన అప్పులు మితిమీరాయి. వడ్డీ ద్రవ్యము చెల్లించడానికి కష్టంగా మారింది. రాజ్యంలో దోపిడీలు చెలరేగాయి. దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రభుత్వాధికారులు ప్రజలను పీడించసాగారు. క్రీ.శ. 1820లో మెట్కాఫ్ అను అంగ్లేయుడు నిజాం రాష్ట్రంలో రెసిడెంటుగా నియమితుడయ్యాడు. అతడు రాజ్య ఆర్ధిక పరిస్థితి కుదుటపడడానికి అనేక చర్యలు తీసుకున్నాడు.

ఆంగ్లేయుల నుండి సికిందర్ జా తీసుకొన్న రుణము 60 లక్షలు, బ్రిటీషు కంపెనీ వారు తీర్చివేశారు. నిజాము సుల్తానుకు ఇవ్వవలసిన పేష్కసు ధనమును తగ్గించే ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు సికిందర్ జాకు ఆమోద యోగ్యమైంది. ప్రజల నుండి, రైతుల నుండి వసూలు చేసే పన్నులు హర్రాజు పద్ధతిలో ఉండడం మంచిది కాదని భావించి ప్రతి మండలానికి ఒక ఆంగ్లేయాధికారి పన్నుల వసూళ్ళకు నియమించబడ్డాడు. ప్రజలు తమ బాధలను నిజాం ప్రభువుకు విన్నవించుకునే అవకాశం ఏర్పడింది. న్యాయస్థానములు రాజ్యమంతటా నెలకొల్పబడ్డాయి. పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలను నిర్వహించు వ్యవస్థలలో ప్రజానుకూలమైన మార్పులు చేశారు. రాజ్యంలో సువ్యవస్థితమైన పరిపాలన ఏర్పడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సంస్కరణల ఫలితంగా నిజాం రాష్ట్రంలో సత్ఫలితాలు కనిపించాయి. వ్యవసాయదారులు తమ భూములను అభివృద్ధిపరచుకున్నారు. రాజ్యంలో నెలకొన్న అనిశ్చితి తొలగింది. కానీ రాష్ట్ర వ్యవహారాలలో ఆంగ్లేయుల జోక్యం అధికమైంది. ఈ పరిస్థితులలో గవర్నర్ జనరల్ రాష్ట్ర పరిస్థితిని గమనించి ఆంగ్లేయుల జోక్యం తగ్గించడానికి రెసిడెంటుకు అనేక సూచనలు చేశాడు. మెట్కాఫ్ తరువాత మార్టెన్ రెసిడెంటు పదవీ బాధ్యతలు స్వీకరించాడు. చందూలాల్ రెసిడెంటును ప్రసన్నుడిని చేసుకొని అతని అభిమానాన్ని చూరగొన్నాడు. సికిందర్ జా మంచి వ్యక్తిత్వమున్నవాడు. ఇతని పాలనలో నిజాం రాజ్యం ఆర్ధిక సంక్షోభానికి గురైనా చివరి రోజులలో ఆంగ్లేయుల జోక్యంతో పరిపాలన, పన్నుల వసూలు వంటి సంస్కరణలు చక్కబడ్డాయి.

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్