రుద్ర దేవుడు

స్వతంత్ర కాకతీయ ప్రభువులలో రుద్రదేవుడు ప్రథముడు. ఇతడు ముప్పమ దేవి రెండవ ప్రోలరాజుల పెద్ద కుమారుడు. పట్టాభిషిక్తుడగు నాటికి యుక్త వయస్కుడు. తండ్రివలె మహాపరాక్రమ శాలి. తండ్రి కాలము నాటి యుద్ధాల్లో ఇతడు పాల్గొన్నట్లు తెలుస్తుంది. రుద్రదేవుని గూర్చి సవివరంగా తెలిపేది అతని హనుమకొండలో వేయి స్తంభాల గుడి శాసనం.

రుద్రదేవుని కాలంలో కాకతీయలకు యాదవులతో సంఘర్షణ ప్రారంభమయింది. ఇతని జైత్ర యాత్రలలో కాకతీయ రాజ్యాధికారం ఉత్తరాన గోదావరి వరకు విస్తరించింది. ఈ నదికి ఉత్తరాన దేవగిరి యాదవులు రాజ్యం విస్తరించి ఉండేది. కనుక కాకతీయ రాజ్య వ్యాప్తి యాదవులకు కంటగింపు కలిగించింది. వారి ప్రభువు జైత్రపాలుడు కాకతీయ రాజ్యంపై దండెత్తి వచ్చి క్రీ||శ|| 1195 లో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడిని హతమార్చి అతని దత్తపుత్రుడు తమ్ముడు మహాదేవుని కుమారుడు అయిన గణపతి దేవుని బందీగా తీసుకువెళ్ళడం జరిగింది. యాదవ రామచంద్రుని పైఠాన్ తామ్ర శాసనం వలన ఈ విషయం గోచరమవుతున్నది.

రుద్రదేవుడు గొప్ప యోధుడే కాక రాజనీతిజ్ఞుడు, విద్వాంసుడు, వాస్తు ప్రియుడు కూడా. రాజ్యారంభం నుండి విజయ పరంపరను కొనసాగిస్తూ సార్వభౌములైన పశ్చిమ చాళుక్యుల అధికార క్షీణతను అంతఃకలహాలను అవకాశంగా తీసుకొని బల పరాక్రమాలను, రాజనీతిని ప్రదర్శించి సామంతులను ఆర్జించి స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపన చేశాడు. విస్తరిస్తున్న అధికారమునకు అనువుగానుండునట్లు ఏకశిలా నగరమును (ఓరుగల్లు) శత్రు దుర్భేద్యముగా నిర్మించి రాజధానిని హనుమకొండ నుండి అచటకు మార్చినాడు. రుద్రుడు గొప్ప వాస్తు ప్రియుడు. ఇతని వాస్తు కళా ప్రీతికి మత నిరతికి నేటికీ నిలిచియున్న హనుమకొండలోని వేయి స్తంభాల గుడియే సాక్ష్యం. ఇది త్రికూటాలయం. దీనిలో శివ, విష్ణు, సూర్య దేవులు ప్రతిష్టింపబడినారు. ఈ దేవాలయం తళతళ మెరిసే ఉక్కు వంటి నల్లరాయితో నిర్మించబడింది. రుద్రుడు విద్వాంసుడు. విద్యాప్రియుడు. విద్యా భూషణ బిరుదాంకితుడు. ఇతడు రాజనీతి విషయకమైన 'నీతిసారము' అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించినట్లు బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి ద్వారా తెలుస్తుంది.

రుద్రదేవునికి విజయ సాధనలో తోడ్పడి అతని అభ్యున్నతికి కారకులైన విశ్వాసపాత్రులైన మంత్రి సేనానులు అనేకులు. పెక్కు ప్రజాహిత కార్యములను చేపట్టిన వాడు, హనుమకొండలో ప్రసన్న కేశవాలయమును నిర్మించిన వాడు, వ్యూహ రచనా చతురుడు అయిన వెల్లంక గంగాధరుడు, యుద్ధమంత్రి అయిన మల్లా నాయకుడు వీరిలో ప్రముఖులు. 

మహాదేవ రాజు

రుద్ర దేవుని మరణానంతరం అతని తమ్ముడు మహాదేవుడు క్రీ||శ|| 1195-96 లో సింహాసనమధిష్టించినాడు. ఇతని శాసనాలు రెండు మాత్రమే లభించినాయి. వాటిలో ఒకటి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకా సందెళ్ల గ్రామంలోనిది, రెండవది ఓరుగల్లు దుర్గములోనిది. కాని వీటిలో చారిత్రక ప్రాధాన్యం గల సమాచారం లేదు. ప్రతాపరుద్రుని ఖండనవల్లి తామ్ర శాసనం, కోట గణపాంబ ఎనమదల శాసనం, సోమదేవరాజీయం, సిద్ధేశ్వర చరిత్ర, ప్రతాప చరిత్రల ద్వారా ఇతని జీవితుడైన మహాదేవుని నియమించినాడని ఖండవల్లి శాసనం పేర్కొంటున్నది. మహాదేవుడు యువరాజు సంరక్షకుడిగా మాత్రమే వ్యవహరించినాడని సిద్ధేశ్వర చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇతని పాలనా కాలం రమారమి మూడు సంవత్సరాలు.

మహాదేవుని పాలనా కాలం నాటి ప్రధాన రాజకీయ సంఘటన దేవగిరి దండయాత్ర. తన అన్న యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకొనుటకు గణపతి దేవుడిని బంధ విముక్తిని చేయుటకు ఇతడు యాదవ రాజ్యం పై దండెత్తి వెళ్ళినాడు. మార్గ మధ్యలో ఉన్న కళ్యాణి కటకమును స్వాధీనపచ్చుకొని 'కటక చూరకార' అను బిరుదు ధరించినాడు. యాదవుల రాజధాని దేవగిరిని ముట్టడించి గజమును అధిరోహించి యుద్ధము చేస్తూ జైత్రపాలుడి చేతిలో మరణించాడు. శాసనాలు, ప్రతాప చరిత్ర, సోమదేవరాజీయము ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి.

మహాదేవుని భార్య బయ్యమాంబ. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు గణపతి దేవుడు. కుమార్తెలు మేలాంబ, కుందమాంబలు, వీరిరువురు నతవాడి బుద్ధరాజు కుమారుడు రుద్రుని పరిణయమాడినట్లు తెలియుచున్నది. శంభుని గుడి శాసనంలో మహా దేవుడు శివభక్తి పరాయణునిగా చెప్పబడినాడు. శైవ సిద్ధాంత ప్రవీణుడైన ధృవేశ్వర మునీంద్రుడు ఇతని దీక్షా గురువు. 

గణపతి దేవుడు

గణపతి దేవుని తల్లిదండ్రులు బయ్యమాంబ మహాదేవులు. వారసులు లేక రుద్రుడు తమ్ముని కుమారుడైన గణపతి దత్తపుత్రుని గా స్వీకరించాడు. యాదవులతో జరిగిన పోరులో రుద్రుడు హతుడు కాగా గణపతి బందీగా చిక్కినాడు. అందుకు ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నంలో మహాదేవుడు కూడా ప్రాణాలు కోల్పోయినాడు. అంతట దేవగిరి ప్రభువు జైత్రపాలుడు చెఱసాల నుండి గణపతి దేవుని విడుదల చేయగా అతడు ఓరుగల్లు సింహాసనమధిష్టించినాడు. గణపతి దేవుని విడుదలకు యాదవుల ఔదార్యమే కారణమని వారి శాసనాల కథనం. అది వాస్తవంగా కన్పించదు. నాటి రాజకీయ పరిస్థితులే అందుకు కారణం. కాకతీయులు, యాదవులు, హోయసాలులు ముగ్గురూ పశ్చిమ చాళుక్యుల సామంతులే. సార్వభౌములు బలహీన పడగానే వారు ముగ్గురు స్వాతంత్ర్యం ప్రకటించుకొని రాజ్య విస్తరణకు పూనుకున్నారు. యాదవ రాజ్యానికి దక్షిణ దిశ నుండి హోయసాల రెండవ బల్లాలుని వలన ప్రమాదం కలిగింది. అతడు కృష్ణా, తుంగభద్ర అంతర్వేదిని ఆక్రమించి ఉత్తర దిశగా వ్యాపించు ప్రయత్నంలో ఉన్నాడు. ఆంధ్రదేశంలోని అరాచక పరిస్థితి హోయసాలులకు అనుకూలించి యాదవులకు ప్రమాదం కలిగించేలా వుంది. ఇట్టి పరిస్థితులలో ఆంధ్రదేశంలో తమకు స్నేహపూర్వకంగా వుండే ప్రభుత్వం ప్రయోజనకరం. అందువలన యాదవ ప్రభువు జైత్రపాలుడు రాజకీయ చర్యగా యువకుడైన గణపతిని బంధ విముక్తుణ్ణి చేసి సగౌరవంగా అతని రాజ్యం అతని పరం చేసినాడు. దీని వలన ఉభయరాజ్యాలకు మేలు కలిగింది. ఒకరిపై ఒకరు కత్తిదూయక తమతమ బలాలను ఇతరత్రా వినియోగించుకునే అవకాశం వారికి లభించింది.

మహాదేవుని మరణం, గణపతిదేవుని నిర్బంధం వలన రాజ్యంలో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి. నాగతి వంటి సామంతుల తిరుగుబాట్లు ఒక వైపు, కులోత్తుంగ చోళుని వంటి రాజుల దాడులు మరో వైపు కాకతీయు రాజ్య ఉనికికే ముప్పుగా పరిణమించాయి. చోళ చక్రవర్తి మూడవ కులోత్తుంగుడు తాను తెలుగు వారిని జయించి ఓరుగల్లును పట్టుకున్నట్టు తన శాసనాలలో ప్రకటించుకున్నాడు. అపార సంపద, సైనిక శక్తి గల చోళ ప్రభువు ఓరుగల్లులో కాలు మోపాడే గాని రేచర్ల రుద్రుని వంటి శూరుల శౌర్య ప్రతాపాల ముందు నిలువలేక వెనుదిరిగాడు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గణపతి దేవుడు క్రీ||శ|| 1199 లో ఓరుగల్లు సింహాసనమధిష్టించి క్రీ||శ|| 1262 వరకు సుదీర్ఘ పాలన సాగించినాడు. గణపతి దేవుడికి శూరుడు, విశ్వాసపాత్రుడు, 'కాకతి రాజ్యస్థాపనాచార్యా' బిరుదాంకితుడు అయిన రేచర్ల రుద్ర సేనాని అండ లభించుట వలన పరిపాలన సమర్ధవంతంగా సాగిపోయింది.

కాకతీయులలో గణపతి దేవుడు అగ్రగణ్యుడు, మహావీరుడు, సామ్రాజ్య నిర్మాత. శాతవాహనుల తరువాత ఆంధ్ర ప్రాంతములన్ని ఏకపాలన క్రిందికి వచ్చినదీయన కాలంలోనే. సామ, దాన, భేద, దండోపాయములను అత్యంత నైపుణ్యంతో ప్రయోగించగల రాజనీతిజ్ఞుడు. ఇతడు రాజ్య నిర్మాణంతో పాటు రుద్రుడు ప్రారంభించిన ఓరుగల్లు దుర్గ నిర్మాణము పూర్తి చేసి శత్రు దుర్భేద్య మొనర్చినాడు. ఓరుగల్లును ఆంధ్ర నగరిగా తీర్చిదిద్దినాడు. రాజ్య నిర్మాణంతో పాటు సమర్థవంతమైన పాలనా విధానమును రూపొందించి, వ్యవసాయాన్ని, వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించి, సదుపాయాలను కల్పించి రాజ్య ఆర్థికాభ్యుదయానికి దోహదం చేశాడు. ఆంధ్ర సాహితీ సంస్కృతులను ఆదరించినాడు. గణపతి దేవుడు పరమమహేశ్వరుడు. గోళకీ మఠాధిపతియైన విశ్వేశ్వర దేవుడు ఇతని దీక్షా గురువు.

కాకతీయ చరిత్రలో గణపతి దేవుని పాలనా కాలం ఒక మహోజ్వల ఘట్టం. ఆంధ్రదేశం, ఆంధ్ర దేశాదీశ్వరుడు, ఆంధ్ర నగరి అనే పద ప్రయోగాలు విస్తృత ప్రచారం పొందినదీయన కాలంలోనే. ఆంతరంగిక, బాహ్య దాడుల నుండి తన రాజ్యమును కాపాడుటయే గాక అనేక సుదీర్ఘ దండయాత్రలు నిర్వహించి యావదాంధ్రమును సమైక్యపరచి విశాల సామ్రాజ్యమును నిర్మించినాడు. వైవాహిక సంబంధాల ద్వారా క్రొత్తగా జయించిన ప్రాంతాలను సమర్ధవంతముగా అదుపులోనుంచగలిగినాడు. విదేశీ వర్తకులకు సుంకాల రాయితీలు కల్పించి రాజ్య ఆర్థికాభ్యుదయానికి దోహదం చేశాడు.

గణపతి దేవునికి పుత్రులు లేరు. ఈయనకు సోమలదేవియను భార్య ద్వారా గణపాంబ, రుద్రాంబ అను ఇరువురు పుత్రికలు జన్మించారు. గణపతి దేవుని సేనానులలో 'కాకతి రాజ్య స్థాపనాచార్య' బిరుదు వహించిన రేచర్ల రుద్రుడు, విరియాల రుద్ర సేనాని, మల్యాల చౌండ సేనాపతి, గజసాహిణి జాయప, కాయస్థ గంగయ సాహిణి, ఇందులూరి సోమయ ముఖ్యులు. 

రుద్రమ దేవి

రుద్రమ దేవి గణపతి దేవి సోమిదేవుల రెండవ కుమార్తె. పురుష సంతతి లేని గణపతి దేవుడు రుద్రాంబకు సైనిక వ్యవహారాలలోను, రాజ్య పాలనలోను తగు శిక్షణ ఇప్పించి తన వారసురాలిగా ప్రకటించినాడు. రాజ్య పాలనలోను, రాజ్య రక్షణలోను ప్రధాన భూమికను నిర్వహించిన ప్రథమాంధ్ర మహిళ రుద్రమ దేవి. స్త్రీలు రాజ్యాధికారిణులగుట అరుదైన ఆ కాలంలో ఈమె తన తండ్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయం సరియైనదేనని నిరూపించింది.

రుద్రమ దేవి పరిపాలకురాలగుట వలన యాదవులలో ఆశలు చిగుర్చాయి. అందువలన యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యం పై దండెత్తి వచ్చి ఓరుగల్లును ముట్టడించినాడు. ప్రసిద్ధ కాకతీయ ప్రభువులలో రుద్రాంబ ఒకరు. పాలనా కాలమంతా నిరంతర యుద్ధాల్లో నిమగ్నురాలయినప్పటికి అత్యంత సమర్ధవంతంగా ఆమె పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించింది. విపత్కర పరిస్థితుల్లో మొక్కవోని ధైర్య, సాహసాలు ప్రదర్శించిన వీరనారి ఆమె. అవసరమైనపుడు ప్రాణాలొడ్డి పోరాడటానికి కూడా ఆమె వెనుదీయలేదు. రాజ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓరుగల్లు కోటకు మరమ్మత్తులు చేయించి రాతి కోటను లోవైపున మెట్లు కట్టించింది. మట్టికోట, అగడ్త, బురుజుల వంటి అదనపు నిర్మాణాలతో ఓరుగల్లు కోటను శత్రు దుర్భేద్యంగా రూపొందించింది. ఈమె కాలంలో దేశం సుభిక్షంగా వుంది. సుప్రసిద్ధ వెనిస్ యాత్రికుడైన మార్కొపోలో ఈమె పాలనాకాలం చివర్లో మోటుపల్లి రేవును సందర్శించి దేశంలో పరిపాలన కట్టుదిట్టంగా ఉందని పరిశ్రమలు, వాణిజ్యం ప్రగతి పథంలో ఉన్నాయని వర్ణించినాడు.

గణపతి దేవుని వలె రుద్రమ దేవికి కూడా పురుష సంతతి లేదు. ఈమెకు ముగ్గురు కుమార్తెలు, వారు ముమ్మడమ్మ, రుద్రమ, రుయ్యమలు. పెద్దకూతురు అయిన ముమ్మడమ్మకు కాకతి వంశ రాకుమారుడగు మహదేవునితో వివాహము జరిగింది. వారి కుమారుడే ప్రతాపరుద్రుడు. గణపతి దేవుడు జీవించి ఉన్నపుడే రుద్రాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని అతనిని యువరాజుగా చేసింది. ఇతనిని కుమార రుద్రుడని, వీర రుద్రుడని కూడా అంటారు. రెండవ కుమార్తె రుద్రమ వివాహం యాదవ రాకుమారుడు యల్లన దేవునితో జరిగింది. మూడవ కుమార్తె రుయ్యమ భర్త ఇందులూరి అన్నయ మంత్రి.

రుద్రమ దేవి సామంతులలో విరియాల, చెరుకు వంశాల వారు ప్రముఖులు. యాదవ వంశీయులు కూడా కొందరున్నారు. సేనానులలో రుద్రయ పెద్ది, ఇందులూరి అన్నయ రుద్రయలు, రేచర్ల ప్రసాదిత్యుడు ముఖ్యలు. వెలమ నాయకులు మొదటి సారిగా రుద్రమ దేవి కాలంలో ఉన్నత స్థానములలో ప్రవేశించినారు. ప్రతాపరుద్రుడు

ప్రతాపరుద్రుడు 

రుద్రమదేవి దత్త పుత్రుడు. ఆమె పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడు. మాతామహి రుద్రాంబ అంబయ దేవునితో జరిగిన యుద్ధంలో మరణించగా ప్రతాపరుద్రుడు క్రీ||శ|| 1289 లో ఓరుగల్లు ప్రభువుగా పట్టాభిషిక్తుడైనాడు. ఇతడు రుద్రమ దేవి కాలంలోనే కాకతి రుద్ర కుమార, కుమార రుద్రదేవ అను పేర్లతో రాజ్య వ్యవహారాలు నిర్వహించుటతో పాటు అనేక యుద్ధాలలో పాల్గొని అపారమైన అనుభవాన్ని గడించాడు. పట్టాభిషేకానంతరం కూడా కుమార రుద్రదేవ అనే పేరు శాసనాలలో కన్పిస్తుంది. కాకతీయ సామ్రాజ్యం అత్యున్నత దశను చేరుకోవడం అంతర్ధానం కావడం మూడు దశాబ్దాల ప్రతాపరుద్రుని కాలంలోనే జరిగింది. ఇతని పాలనా కాలమంతా ఆంతరింగిక తిరుగుబాట్లను అణచడంలోను, విదేశీ దండయాత్రలను అణచడంలోను గడిచిపోయింది. తుదకు ఈ సంఘర్షణల ఫలితంగానే కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది.

తన మాతామహి మరణానికి కారణమైన రాజ్య ప్రతిష్టను దిగజార్చిన అంబదేవుని తిరుగుబాటును అణచడం అందులకతనిని ప్రోత్సహించిన పాండ్య, యాదవులపై తగు చర్యలు తీసుకొని కాకతీయుల వంశ ప్రతిష్టను సామ్రాజ్య ఔన్నత్యాన్ని పునరుద్ధరించడం ప్రతాపరుద్రుని ప్రథమ కర్తవ్యమయింది. అందులకతడు సైనికావసరాలు తేర్చీ నాయంకర విధానాన్ని పునర్వ్యవస్థీకరించినాడు. రాజ్యాన్ని 75 నాయంకరాలుగా విభజించి వాటిని సమర్థవంతులు విశ్వాస పాత్రులు అయిన సేనానుల ఆధీనంలో ఉంచినాడు. దీని వలన సుశిక్షితమైన సైన్యం రూపొందింపబడింది. కాని ఈ విధానం వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి. అంతవరకు కాకతీయులకు అండగా వుంటూ వచ్చిన పూర్వ సామంత వంశాల వారికి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. అదియును గాక నాయంకరులలో అధిక సంఖ్యాకులు వెలమలగుటచే రాజ్యంలో వారి ప్రాబల్యం పెరిగి వర్ణ వైషమ్యాలకు దారితీసింది. వెలమల అధికార విస్తరణ వలన ప్రతాపరుద్రుని పట్ల రెడ్లకు ఆగ్రహం కలిగి తుదకు రాజ్య బలహీనతకు, పతనానికి దారితీసిందని స్థానిక చరిత్రల వలన తెలుస్తుంది.

కాకతీయ ప్రభువులలో ప్రతాపరుద్రుడు చివరివాడు. ఇతని కాలంలో కాకతీయ సామ్రాజ్యం అత్యున్నత దశకు చేరుకున్నది. దేశ రక్షణతో పాటు రాజ్య ఆర్థికాభ్యుదయానికి కృషి చేసినాడు. కడప, కర్నూలు, పల్నాడు ప్రాంతాల్లో అడవులను నరికించి పంట పొలాలుగా మార్చినాడు. చెరువులు, బావులు త్రవ్వించి పొలాలకు నీటి పారుదల వసతులు కల్పించినాడు. నిర్జన ప్రదేశాలలో గ్రామాలు, నగరాలు వెలిశాయి. రాజ్య ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ప్రతాపరుద్రుడు భాషాభిమాని. అతడు సంస్కృతాంధ్ర కవులను పోషించినాడు. ఇతని ఆస్థాన కవియైన విద్యానాధుడు సంస్కృతంలో ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని వ్రాసాడు. అగస్త్య విశ్వనాథులను వారు ఇతర సంస్కృత కవులు, ప్రతాపరుద్రుని మంత్రులు, సేనాపతులు కూడా భాషా పోషకులే. మారన తన మార్కండేయ పురాణాన్ని గోనగన్నా రెడ్డికి అంకిత మిచ్చినాడు. మారయ సాహిణి భాస్కర రామాయణ రచనను ప్రోత్సహించినాడు.


 RELATED TOPICS 

కాకతీయులు

తొలి కాకతీయ రాజులు 

ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు 

కాకతీయుల పరిపాలనా విధానం

కాకతీయుల కాలం నాటి  సాంఘిక పరిస్థితులు

 కాకతీయుల కాలంలో ఆర్ధిక పరిస్థితులు

కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు 

కాకతీయల సాహిత్య సేవ