ముజఫర్ జంగ్ హత్యానంతరము సలాబత్ జంగ్ ఫ్రెంచివారిచే దక్కను సుబేదారుగా నియమించబడ్డారు. ఇతడు నిజాముల్ ముల్క్ కుమారుడు. ఫ్రెంచివారు తన అధికారాన్ని నిలిపినందుకు సంతోషించి వారికి విలువైన కానుకలు సమర్పించాడు. కృష్ణానదికి దక్షిణాన గల విశాల భూభాగాన్ని వారికి అప్పగించాడు. ఫ్రెంచివారు సూచించిన రామదాస పండితుడికి బిరుదులతో సత్కరించి తన దివానుగా నియమించుకొని డూప్లే అనుమతితో బుస్సీతో కలిసి ఔరంగాబాదు చేరెను. లష్కర్ ఖాన్ నిజామ్ ఉల్ ముల్క్ సన్నిహిత వర్గంలోనివాడు. ముజఫర్ జంగ్ వ్యతిరేకి. ముజఫర్ జంగ్ ఫ్రెంచివారి అండదండలతో సూబేదారుగా నియమితుడైనందుకు ఆగ్రహంతో మహారాష్ట్రులను ఔరంగాబాద్ పై దండయాత్ర నిర్వహించి ఆక్రమించుకోవాలని సూచించాడు. సలాబత్ జంగ్ సుబేదారుగా నియమించడం వల్ల సరైన వారసుల నియామకం జరిగింది కావున మహారాష్ట్రులను దండయాత్రను ఆపమని కోరాడు. కానీ పీష్వా బాలాజీరావు సైన్య సమేతుడై కృష్ణా తీరానికి చేరుకున్నాడు. ఢిల్లీ సుల్తానుచే దక్కను సుబేదారుగా నియమితుడైన ఘాజియుద్దీన్ సైన్యముతో సహా ఔరంగాబాద్ బయలుదేరాడు. ఈ లోపుగా సలాబత్ జంగ్ ఫ్రెంచి సైన్యంతో ఔరంగాబాద్ చేరాడు.

సలాబత్ జంగ్ ఫ్రెంచి సర్దారు బుస్సీ మాటకు విలువనిచ్చేవాడు. ఇతడు బుస్సీ సూచించిన సైన్యమును సమకూర్చుకొని పూణా నగరాన్ని ముట్టడించారు. మహారాష్ట్ర సైనికులు వీరోచితముగా పోరాడి సలాబత్ జంగ్ సైన్యాన్ని ఓడించారు. పీష్వాతో సంధి ఏర్పరచుకొని ఔరంగాబాద్ తిరిగి వచ్చిన సలాబత్ జంగ్, రామదాస పండితుని అనంతరం లష్కర్ ఖాన్ ను దివానుగా నియమించుకొని బుస్సీ సలహాల మేరకు పరిపాలన సాగించాడు. ఫ్రెంచి గవర్నర్ డూప్లే ఆదేశాన్ని పాటించక బుస్సీ ఔరంగాబాద్ లోనే ఉండిపోయాడు. డూప్లే బుస్సీని కర్నాటకకు రమ్మని చాలాసార్లు కోరాడు. కానీ, ఘాజియుద్దీన్ మహారాష్ట్రుల సైన్య సహాయంతో ఔరంగాబాదు ముట్టడించడానికి వస్తున్నాడని, తానక్కడ లేకపోతే ఎదురయ్యే పరిస్థితుల గురించి బుస్సీ డూప్లేకు వివరించాడు. సలాబత్ జంగ్, లష్కరాఖానను ఘాజియుద్దీన్లో సంప్రదింపులు జరపాలని సూచించాడు. కానీ ఘాజియుద్దీన్ క్రీ.శ.1752లో దివంగతుడయ్యాడు. ఘాజియుద్దీన్ మరణవార్త విన్న మహారాష్ట్ర పీష్వా సలాబత్ జంగ్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు.

బాల్కీ ప్రాంతంలో సంభవించిన ఈ యుద్ధంలో మహారాష్ట్రులు విజయం సాధించారు. క్రీ.శ. 1752లో సలాబత్ జంగ్, బీరారు ప్రాంత భూములను అప్పగించి పీష్వాతో సంధి ఏర్పరచుకున్నాడు. సలాబత్ జంగ్, బుస్సీ కోరికను మన్నించి ఫ్రెంచివారికి మచిలీపట్టణాన్ని అప్పగించాడు. బుస్సీ ఆకాంక్ష నెరవేరింది. తక్కిన ఐరోపా వర్తకులతో పోటీపడి నిలబడేందుకు ఫ్రెంచివారికి మచిలీపట్టణము సాధించుట ఎంతో అవసరం. బుస్సీ క్రీ.శ.1753లో ఔరంగాబాదను వదిలి వెళ్లాడు. ఫ్రెంచి సైన్యం ఔరంగాబాద్ లోనే ఉండిపోయింది. ఫ్రెంచి సైనికులకు జీతభత్యములకు ఏర్పాట్లు చేసి వెళ్ళని బుస్సీ సలాబత్ జంగ్ పై పెద్ద భారాన్నే మోపాడు. తమకు జీతభత్యాలు చెల్లించాలని వారు సలాబత్ జంగ్ పై ఒత్తిడి చేయసాగారు. అతడు ఔరంగాబాద్ ఖజానాలో ద్రవ్యము లేనందున అప్పు చేసి ఫ్రెంచి సైనికులకు జీతాలు చెల్లించాడు. ఈ పరిస్థితులను గమనించిన ఆసఫ్తా సైనికులు తమకు కూడా జీతాలు చెల్లించాలని నిరసన ప్రారంభించారు. అసఫ్ జహి దివాను లష్కర్ ఖాను ఫ్రెంచివారి ఆధిపత్యమును, సైనిక వ్యయాన్ని భరించలేక రహస్యంగా ఆంగ్లేయులతో సమాలోచనలు జరపసాగారు.

బుస్సీ కర్నాటక రాజకీయ పరిస్థితులను చక్కదిద్ది ఔరంగాబాద్ కు తిరిగివచ్చాడు. ఫ్రెంచి సైనికుల పరిస్థితి దీనముగా ఉంది. వారు జీతాలు లేక, తిండి లేక నానా రకాల ఇబ్బందులు పడసాగారు. బుస్సీ నిస్సహాయుడై వారికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. బుస్సీ ఫ్రెంచివారి ఆర్థిక స్థితి బాగాలేదని సలాబత్ జంగ్ కు తెలిపి అతని నుండి సైనిక వ్యయం కింద ఉత్తర సర్కారు జిల్లాలను పొందాడు. ఈ చర్య వల్ల ఆసఫ్తా ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. లష్కరాఖానకు బుస్సీ చర్యలు కంటగింపయ్యాయి. ఇంకొన్ని రోజుల్లో ఫ్రెంచివారు సలాబత్ జంగ్ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆసఫ్తా రాజ్యాన్ని కబళించాలని భావించారు. అతడు ఫ్రెంచివారి ప్రాబల్యాన్ని అణచివేయడానికి రాజ్యంలో ముఖ్యంగా ఫ్రెంచివారు ఆక్రమించిన ఉత్తర సర్కారులందు పన్నులు వసూలు చేయు అధికారులను రహస్యంగా ఫ్రెంచివారికి పన్నులు చెల్లింపరాదని ఆదేశించాడు. పన్నులు వసూలు కావడంలో ఆటంకాలు ఏర్పడడంతో బుస్సీ సలాబత్ జంగ్ అనుమతిని పొంది గుత్తేదారీ పద్ధతిన పన్నులు వసూలు చేయాలని యోచించాడు.

పన్నుల వసూళ్ళ పని గుత్తేదారుల పరమైంది. వారు ఫ్రెంచి వారికి ద్రవ్యము చెల్లించి, ప్రజల నుండి అత్యధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం ప్రారంభించారు. ప్రజలు పన్నుల భారము మోయలేక భూములను విక్రయించే స్థితికి వచ్చారు. ఉత్తర సర్కారుల నుండి అధిక ఆదాయము రావడంతో ఆ ప్రాంతం ఫ్రెంచివారి అధికారంలో ఉండడం నిజామలీఖానకు నచ్చేది కాదు. అతడు ఆ ప్రాంతాన్ని నిజాం రాజ్యంలో విలీనపరచాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. షానవాజ్ ఖాన్ ఫ్రెంచి వారిని ఆసఫ్తా రాజ్యం నుండి తరిమివేసేందుకు పథకాలు పన్నారు.

ఫ్రెంచి గవర్నర్ డూప్లే ఆర్ధిక పరిస్థితి అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఆర్ధిక పరిస్థితి చక్కబరిచేందుకు బుస్సీ, ఇబ్రహీంఖాన్ ను నియమించుకున్నాడు. స్వయంగా పన్నుల వసూళ్ళకు బయలుదేరాడు. అయినా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడలేదు. సైనికుల జీతాలకు, వ్యాపార నిర్వహణకు డూప్లే అప్పులు చేయాల్సి వచ్చింది. 'సలాబత్ జంగ్ శ్రీరంగపట్టణాన్ని ముట్టడించడానికి వెళ్ళే సమయంలో ఫ్రెంచి సేనాని బుస్సీని తన వెంట రమ్మని కోరాడు. అతడు సలాబత్ జంగ్ కోరికను అంగీకరించి వెళ్ళాడు. క్రీ.శ.1756లో బుస్సీ సావనూరు నవాబుతో యుద్ధం చేశాడు. ఆసఫ్తా దర్బారులోని సర్దారులు, సేనానులు, ఆమాత్యులు సలాబత్ జంగ్ పై ఒత్తిడి తెచ్చి అతని సోదరులైన నిజామలీఖాన్, బసాలత్ జంగ్ లను చెర నుండి విడిపించారు. సలాబత్ జంగ్ సోదరుల పట్ల ప్రేమ భావముతో వారిని రాష్ట్ర పాలకులుగా నియమించాడు. నిజామలీఖాన్ కు నిజాముద్దేలా బిరుదుతో పాటు బీరారు ప్రాంతాన్ని కూడా అప్పచెప్పాడు. బసాలత్ జంగ్ ను బీజాపూర్, ఆదోని ప్రదేశాలకు పాలకునిగా నియమించాడు.

బుస్సీని పదవి నుండి తొలగించడానికి అతడు హైదరాబాద్ కు వచ్చి పాండిచేరి నుండి ఫ్రెంచి సైన్యమును పిలిపించుకొని బలపడసాగాడు. మహారాష్ట్రులతో బుస్సీ మంతనాలు చేస్తున్నాడని సలాబత్ జంగ్ కు తెలిసింది. దీంతో బుస్సీని తిరిగి తన రాజ్యములో పూర్వపు పదవిలో నియమించాడు. బుస్సీ అసహాయ శూరుడు. ఫ్రెంచి సేనాని. గవర్నర్లకన్నా ఫ్రెంచి వర్తక సంఘమునకు ఎక్కువగా కృషి చేశాడు. అతడు క్రీ.శ.1758లో సంభవించిన బొబ్బిలి యుద్ధంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ యుద్ధంలో షానవాజ్ ఖాన్ దౌలతాబాద్ కోటను ముట్టడించి ఆక్రమించాడు.

అసఫ్ జాహీ సైన్యానికి జీతాలిచ్చుటకు రాజ కోశాగారమున ద్రవ్యము లేకుండాపోయింది. సైనికులు షా నవాజ్ ఖాన్ ఇంటిని ముట్టడించడానికి సమాయత్తమయ్యారు. ఈ క్లిష్ట సమయంలో నిజామలీఖాన్ బీరారు నుండి ఔరంగాబాద్ వచ్చి సైనికుల జీతాలు చెల్లించాడు. సలాబత్ జంగ్ నుండి అధికార ముద్రబడసి బసాలత్ జంగ్ కు ఇచ్చాడు. బసాలత్ జంగ్ నుండి రాజముద్రిక, లేక అధికార ముద్రను పొందడానికి బుస్సీ ప్రయత్నించాడు. కానీ నిజామలీఖాన్ భయం వల్ల బసాలత్ జంగ్ బుస్సీకి అధికార ముద్రనివ్వడానికి తిరస్కరించాడు. నిజామలీఖాన్ ఔరంగాబాద్ లో నివసించుట బుస్సీకి నచ్చలేదు. సమర్థుడైన నిజామలీఖాన్ బీరారుకు వెళ్ళిన సలాబత్ జంగ్ ను ఒత్తిడి చేసి మరిన్ని రాజ్యభాగాలను పొందవచ్చునని బుస్సీ భావించాడు.

ఫ్రెంచి గవర్నర్ లాలీ బుస్సీని ఔరంగాబాద్ నుండి రావలసిందిగా కబురంపెను. నిజామలీఖాన్ బుస్సీ అనుచరుడైన హైదర్‌జంగ్ ను సంహరించెను. మరికొన్ని రోజులు ఔరంగాబాద్ లో నివసించిన ఫ్రెంచి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది గమనించి లాలీ ఆజ్ఞానుసారము బుస్సీ అసహ్లి రాజ్యాన్ని వీడి కర్నాటక చేరాడు. ఈ సమయంలో సలాబత్ జంగ్ బ్రిటీష్ వారితో సంధి కురుర్చుకున్నాడు. క్రీ.శ.1760లో సలాబత్ జంగ్ సోదరుడైన నిజామలీఖాన్ వెంట రాగా సైన్యముతో మహారాష్ట్రులపై దండెత్తెను. ఉగ్గిర్ వద్ద యుద్ధము జరిగెను. మహారాష్ట్ర వీరుల ధాటికి ఆగలేక ఆసబ్జె సైన్యము ఓడిపోయింది. సలాబత్ జంగ్ మహారాష్ట్రులతో సంధి ఏర్పరచుకొని వారికి జాపూరు, దౌలతాబాద్ ప్రాంతాలను అప్పగించారు. ఔరంగాబాద్ తిరిగి రాగానే నిజామలీఖాన్ సలాబత్ జంగ్ ను బంధించి, తాను రాజ్యభారము వహించాడు. సలాబత్ జంగ్ బీదరు కోటలో బంధించబడి క్రీ.శ.1763లో మరణించాడు.

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్