సికిందర్ జా కుమారుడు నాసిరుద్దౌలా క్రీ.శ. 1829లో నిజాం రాష్ట్ర పాలనా బాధ్యత చేపట్టి 29 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఇతని ఆధిపత్యమును ఢిల్లీ సుల్తాన్ అక్బరుషా ధృవీకరించి, ముజఫర్ ఉల్ ముల్క్ ఫతేజంగ్, రుస్తుమే దౌరా, అరస్తూయెజమా, నిజాములా అనే బిరుదులను ప్రసాదించి సత్కరించాడు. నాసిరులా ఉత్తర భారతంలో తమకు ఉన్నటువంటి జాగీరులను ఢిల్లీ సుల్తానులకు గౌరవపూర్వకంగా సమర్పించాడు. నాసిరుద్దౌలా ప్రజా పరిపాలనా అనుభవమున్నవాడు. నిజాం రాష్ట్రంలో ఉన్న ఆంగ్లేయ అధికారుల జోక్యం ప్రభుత్వ వ్యవహారాలలో అధికమవడాన్ని చూసి గవర్నర్ జనరల్ లో సంప్రదించి వారిని తొలగించాడు. నిజాం రాష్ట్రంలో ఉన్న జాగీర్దారులు,

జమీందారులు రైతులను పీడించి పన్నులు వసూలు చేసి భోగలాలసులై ఉండేవారు. వారి అధికారాలను తొలగించడానికి నాసిరుద్దేలా వశం కాలేదు. చందులాల్ పేష్కారు పదవి రాష్ట్ర ఆర్ధిక స్థితిని అధ్వాన్న స్థితికి తీసుకువచ్చింది. అతని అవకతవక పనుల వల్ల ఆర్ధికస్థితి చెడిపోయింది. చందూలాల్ ఉద్యోగ విరమణ గావించడం వల్ల నాసిరులా రాంభక్షను పేష్కారుగా, సిరాజుల్ మును వకీలుగాను నియమించుకున్నాడు.

సమర్థులైన అధికారులను నియమించుకొని రాజ్య ఆర్ధిక స్థితిని చక్కబరచుకొని ఆంగ్లేయులు నాసిరుద్దాలాకు సలహాను ఇచ్చారు. వారి సలహా మేరకు నిజాం నవాబు రెవెన్యూ శాఖ ఉద్యోగులపై ఆజమాయిషీ చేయడానికి ఆమీన్లను నియమించాడు. అయినా రాష్ట్ర ఆర్ధిక స్థితిలో ఎలాంటి మార్పు కలగలేదు.

క్రీ.శ. 1830లో స్టూవర్టు అనే ఆంగ్లేయుడు నిజాం రాష్ట్రంలో రెసిడెంటు పదవిని చేపట్టాడు. అతడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బాగు చేయాలని నిర్ణయించాడు. నిజాం రాష్ట్రమంతటా పర్యటించి ఒక నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాడు. ఈ నివేదికను అనుసరించి సంస్కరణలు ప్రవేశపెట్టబడలేదు. రాష్ట్ర ఆదాయము పెరగలేదు. సైనిక, సైనికేతరుల జీతభత్యాలకు ఇబ్బంది పడవలసి వచ్చింది. క్రీ.శ. 1838లో ఫ్రేజరు అనునతడిని రెసిడెంటుగా నియమించారు. అతని కాలంలో రాష్ట్ర ఆర్ధిక స్థితి క్షీణదశలో ఉండెను. బ్రిటీషువారు సిరాజిల్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించమని నాసిరులాను ఒత్తిడి చేశారు. నాసిరుద్దేలా సిరాజిల్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించినా అతడు ఏమీ చేయలేక పదవి నుండి తొలగిపోయాడు.

నిజాం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అధిక సంఖ్యలో ఉన్న అరబ్బులు, రోహిలాలు అప్పులు ఇచ్చి బలవంతంగా వసూలు చేయడం ప్రారంభించారు. ప్రజలే కాకుండా ప్రభుత్వ వర్గాలు సైతం వీరి నుండి రుణాలు సేకరించారు. నాసిరుద్దేలా నాలుగు కోట్ల రుణము చేసి ప్రభుత్వమును అతికష్టంగా నడుపుతుండేవాడు. నిజాం నవాబుగానీ, ఆంగ్లేయ అధికారులు కానీ ఏమీ చేయలేకపోయారు. క్రీ.శ. 1853లో మేజర్ డేవిడ్సన్ నిజాం రాష్ట్రంలో రెసిడెంటుగా నియమించబడ్డాడు. ఇతడు సమర్థుడు. పరిపాలనాదక్షుడు. ఆర్ధిక సమస్యలను అవగాహన చేసుకోవడంలో నిపుణుడు. నిజాం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను పరిశీలించి, ముందుగా బేరారు, ఉస్మానాబాదు, రాయచూరు జిల్లాలను ఆంగ్లేయులకు అప్పగించేవిధంగా ఒప్పందం చేసుకున్నాడు. కొంత రుణాన్ని తీర్చడంలో సఫలీకృతుడయ్యాడు. ఇందువల్ల నిజాం సర్కారుకు ఆర్ధిక భారం తగ్గింది. ఆంగ్లేయులకు సారవంతమైన భూభాగాలు లభించాయి. సిరాజిల్ ఉల్ ముల్క్ తిరిగి దివానుగా నియమితుడై కొంత కాలంలోనే మరణించాడు. నాసిరుద్దేలా సమర్థుడని పేరుగాంచిన సారాల్ జంగ్ ను దివానుగా నియమించుకున్నాడు.

సాలార్‌జంగ్ చక్కని పరిపాలనాదక్షత గలవాడు. సమయస్ఫూర్తితో రాచకార్యాలను అతి సమర్థవంతంగా నిర్వహించడంలో నేర్పరి. నిజాం రాష్ట్ర ఆర్ధిక స్థితిని మెరుగుపరచడానికి ఆయన అనేక చర్యలు చేపట్టెను. సాలార్‌జంగ్ ముందు చూపు కలవాడు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి వారిని ప్రోత్సహించి వారికి అనేక సదుపాయాలు కల్పించాడు. క్రీ.శ. 1856లో ఒక పారిశ్రామిక ప్రదర్శనను ఏర్పాటు చేయించాడు. పన్నుల వసూళ్ళకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాడు. అనేక విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పథకాలను తయారుచేశాడు. క్రీ.శ. 1857లో కర్నల్ డేవిడ్సన్ రెసిడెంట్ పదవిని చేపట్టాడు. అదే సంవత్సరము నాసిరుద్ధాలా అనారోగ్యం క్షీణించి మరణించాడు. నాసిరుద్దాలా శక్తి సమన్వితుడైన రాజు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విషమించినా దృఢ చిత్తంతో ఎదుర్కొని రాజ్యపాలన చేశాడు. పరిపాలనా సంస్కరణలు అమలులో పెట్టి ప్రజల ఆర్ధిక స్థితి మెరగుపరచడానికి తోడ్పడ్డాడు. 

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్

 అసఫ్ జాహీ పాలకులు -  ఉస్మాన్ అలీ ఖాన్