మహబూబ్ అలీఖాన్ తరువాత అతని తనయుడు ఉస్మానలీఖాన్ బహద్దర్  అసఫ్ జా సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడే చివరి అసఫ్ జా వంశజుల రాజు. క్రీ.శ. 1886లో జన్మించిన ఉస్మాన్ అలీఖాన్ బాల్యము నుండే రాజకీయ వ్యవహారాలలోని మెళకువలను తెలుసుకున్నాడు. ఆంగ్లము, ఉర్దూ, ఫారసీ, అరబ్బీ, తెలుగు భాషలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించాడు. ఉర్దూ భాషలో కవిత్వము చెప్పే నేర్పు కలవాడు. క్రీ.శ. 1911లో సింహాసనాన్ని అధిష్ఠించినప్పటి నుండి రాష్ట్రాభివృద్ధికి పాటుపడ్డాడు. సోమరితనానికి అలవాటుపడిన ఉద్యోగులను శిక్షించాడు. ప్రభుత్వ కార్యాలయాలలో జాగు లేక పనులు నిర్వహించడానికి అనేక పటిష్టమైన చర్యలు తీసుకున్నాడు. ఆసఫ్రా రాజ వంశీయుల పాలనలో రాజ్యము ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది.

కానీ ఏడవ నిజాం ఉస్మానలీఖాన్ రాజ్య భాండాగారాన్ని ధన సంపదతో నింపాడు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి మహోన్నత వ్యక్తిత్వము కలిగి రాష్ట్రాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాడు. క్రీ.శ. 1912లో సర్ కిషన్ ప్రసాద్ బహద్దూర్ పదవీ విరమణ చేశాడు. సాలార్‌జంగ్ దివానుగా నియమితుడై క్రీ.శ. 1914లో పదవిని వదులుకున్నాడు. నిజాం ప్రభువు కొంతకాలం వరకు స్వయంగా పరిపాలనా బాధ్యతలు నిర్వహించాడు. జాగీర్లను వశపరచుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వాటి పరిపాలన నిర్వహించాడు.

జాగీర్ల పరిస్థితి మెరుగుపడ్డ తరువాత జాగీర్దార్లకు వాటి పాలనా బాధ్యతను అప్పగించాడు. ఉస్మానలీఖాన్ అన్ని ప్రభుత్వ శాఖలపై పర్యవేక్షణ జరిపి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడ్డాడు. అభివృద్ధి ప్రణాళికలను ఏర్పాటుచేశాడు. నీటి పారుదల సౌకర్యములను ఏర్పాటు చేసి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. మూసీనది వరదల నివారణకై ఉస్మాన్ సాగర్ నిర్మాణము చేపట్టి హైదరాబాదు నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాడు. కొంతకాలం గడిచిన తరువాత పరిపాలనా వ్యవహారాల నిర్వహణకు ఒక సలహామండలని ఏర్పాటుచేశాడు. అందులో హైదరీ, అమీజంగ్, ఇమామాముల్క్ తదితరులు సభ్యులుగా ఉండేవారు. ఈ సలహామండలి సభ్యులు రాష్ట్ర ఆర్ధిక, పరిపాలన, ప్రజాసంక్షేమ విధులలో ఆసక్తి చూపి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేవారు.

క్రీ.శ. 1914లో ప్రథమ ప్రపంచయుద్ధం ఆరంభమైంది. ఈ యుద్ధ కాలంలో నిజాం బ్రిటీషు ప్రభుత్వానికి కోట్ల కొద్ది ధనాన్నిచ్చి, సైనిక సహాయము చేశాడు. యుద్ధం అనంతరం బ్రిటీషువారు నిజాం నవాబుకు మహా ఘనత వహించిన బిరుదును ఇచ్చారు. బ్రిటీషు చక్రవర్తి ఐదవ జార్జి ప్రభువు నిజాము 'అత్యంత విశ్వాసపాత్రు'డని ప్రశంసించాడు. నిజాం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య, థమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలు ప్రోత్సహించబడ్డాయి. నిజాం ప్రభువు బాలబాలికలకు, క్రీడాసంస్థలకు, స్కౌటుకు సంబంధించిన శాఖను ఏర్పాటుచేసి విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడ్డాడు. అతడు వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటుచేసి నిజాంసాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించి పంట కాలువలు తవ్వించాడు. నిజాంసాగర్ నిర్మాణానికి రూపకల్పన చేసిన ఘనత సర్ విశ్వేశ్వరయ్యకు దక్కింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అప్పటి చీఫ్ ఇంజనీర్ ఆలీ నవాజ్ జంగ్ చేపట్టి నిర్వహించాడు. అతని పేరున బోధన్ తాలూకాలో అలీసాగర్ నిర్మించబడింది. ఉస్మానలీఖాన్ పాలనా కాలంలో పరిశ్రమలు వృద్ధి చెందాయి. గద్వాల, సిద్ధిపేట, ఆదిలాబాదు, ఔరంగాబాదు, వరంగల్ లో పట్టు, చేనేత పరిశ్రమలు వెలిశాయి. వరంగల్ నవారు, తివాచీలు జంపఖానాలు, దుప్పట్లు తయారుచేయడంలో, బోధన్ చక్కెర పరిశ్రమకు, సిర్పూర్, బలార్షా సిల్క్, కాగితపు పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచాయి. ఓరుగల్లులో ఆజంజాహి బట్టల మిల్లు స్థాపించబడింది. చార్మినార్, గోలకొండ సిగరేటు కార్యాలయాలు, ఆల్విన్ సంస్థ, హిందూస్థాన్ మిషిన్ స్టూలు కార్మాగారము హైదరాబాదులో నెలకొల్పబడిన పరిశ్రమలు. నిజాం ప్రభుత్వము పారిశ్రామిక ప్రదర్శన శాలలను ఏర్పాటుచేసి పరిశ్రమలకు ప్రోత్సాహం కలిగించింది.

ఏడవ నిజాం కాలంలో హైదరాబాదులో అనేక ఉన్నతమైన రాజసౌధములు, కార్యాలయాలు నిర్మించబడ్డాయి. అందులో హైకోర్టు, ఉస్మానియా వైద్యశాల, యునాని దవఖానా, ఉస్మానియా విశ్వవిద్యాలయము, ఆసఫ్తా లైబ్రరీ ముఖ్యమైనవి. జిల్లా కేంద్రాలలో, తాలూకా కేంద్రాలలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించబడ్డాయి. ధనికులు, జాగీర్దారులు, ప్రభుత్వాధికారులు, అమాత్యులు, సైనికాధికారులు, పాయగా వారు విశాలమైన ప్రాంగణాలతో కూడిన నివాస భవనాలను నిర్మించి హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దారు. ప్రాచీన కళాసంపద పరిరక్షణకు పురావస్తు శాఖను రూపొందించిన ఘనత ఏడవ నిజాముకు దక్కింది. ప్రాచీన కట్టడాలను రక్షించడం, శాసన సేకరణ, ప్రచురణ, ప్రాచీన మానవ ఆవాసముల పరిశోధన, ఖననము వంటి పనులను ఈ శాఖ నిర్వహిస్తు వచ్చింది. చారిత్రక కట్టడాలను రక్షించడంలో నిజాం ప్రభువుకు ఆసక్తి మెండు. అందువల్లే అజంతా, ఎల్లోరా గుహలు, బౌద్ధ రామ విహారాలు, చైత్యాలయాలు, దుర్గములు, భద్రాద్రి, రామప్ప, పానగల్లు, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, కొలనుపాక, ఏలేశ్వరము, పిల్లల మట్టి, నాగులపాడు, అన్నవరము, మక్కామసీదు, చార్మినార్, గోల్కొండ కుతుబ్ షాహీల సమాధులు, భువనగిరి, బీదరు, రాచకొండ, దేవరకొండ, ఉర్లుకొండ, ఉండ్రుకొండ, జఫర్ గడ్, ఘన్‌పూర్, కోయల్ కొండ వంటి దుర్గములు, నాణెములు, విగ్రహాలు నశించకుండా రక్షించబడి నేటికి కూడా నిలిచిఉండేవిధంగా చేయడంలో నిజాం ప్రభువు దీక్ష, పట్టుదల, కార్య నిర్వహణ పటిమ కారణమని చెప్పవచ్చు.

నిజాం రాష్ట్రమును రైల్వే, తపాలా, రవాణా శాఖలు పునర్ నిర్మించబడ్డాయి. నిజాం స్టేటు రైల్వే నిర్వహణతో పాటు రోడ్డు ట్రాన్స్పర్టు డిపార్ట్ మెంటు నెలకొల్పబడింది. ప్రజా సౌకర్యాలకు ఆటిడి బస్సులు ప్రవేశపెట్టబడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి క్రీ.శ. 1917లో ప్రభుత్వ అనుమతి లభించింది. 1400 ఎకరాల విస్తీర్ణము గల భూభాగము విశ్వవిద్యాలయానికి కేటాయించబడింది. అపురూపంగా ఉండేవిధంగా విశ్వవిద్యాలయ భవన సముదాయము నిర్మించబడింది. విద్యార్థులకు వసతి గృహాలు, భోజన సదుపాయాలు ఏర్పరచబడ్డాయి. ప్రాంతీయ భాషలలో విద్యా బోధన అవకాశాలు కలిగించబడ్డాయి. రాజభాష అయిన ఉర్దూలో వందల కొద్ది శాస్త్ర, సాంకేతిక గ్రంథములు రచించబడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వైద్య, విద్య, సాంకేతిక, న్యాయ, ఇంజనీరింగు, వ్యవసాయ కళాశాలలు నెలకొల్పబడ్డాయి. క్రీ.శ. 1923లో జాగీర్దారు కళాశాల స్థాపించబడింది.

ఉస్మానలీఖాన్ తన మంత్రి మండలిని ఏడుగురు సభ్యులతో నిర్మించాడు. హైదరాబాదు రాష్ట్రంలో ప్రధానామాత్యులుగా పనిచేసిన వారిలో ముగ్గురు సాలార్జంగులు, సర్ హైదరు, కిషన్ ప్రసాద్ బహద్దర్, సర్ మీర్జా ఇస్మాయిల్ మొదలైనవారు ప్రసిద్ధులు. వీరు హైదరాబాదు రాష్ట్రంలో పరిపాలనాపరమైన అనేక సంస్కరణములను అమలుపరచి విశిష్టమైన సేవలు అందించారు. హైదరాబాదు నగర కొత్వాలుగా పనిచేసిన శ్రీ రాజా బహద్దూరు వేంకట రామారెడ్డిగా అనేక ప్రజాహిత కార్యాలను రూపొందించి, విద్యాసంస్థలు నెలకొల్పుటలో సహకరించారు. వారి ప్రోత్సాహము, సహకారాల వల్ల హైదరాబాదు నగరంలో రెడ్డి హాస్టల్, ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాల వంటి విద్యాసంస్థలు స్థాపించబడ్డాయి. అవి దినదినాభివృద్ధి చెందుతున్నాయి.

ఉత్తర హిందుస్థానము నుండి వచ్చి నిజాము ప్రభుత్వంలో ఉన్నత చదువులు పొందినవారు స్థానిక ప్రజలను, అధికారులను చిన్న చూపు చూస్తూ అవహేళన చేస్తూ, తమకు సన్నిహితులైన వారిని, బంధువులను ఉన్నత పదవులలో నియమించేవారు. తమకు అన్ని రంగాలలో అన్యాయము జరుగుతున్నదని భావించిన స్థానిక ప్రముఖులు నిజాం ప్రభువుకు విన్నవించి స్థానికులకే ఉన్నత పదవులు ఇవ్వవలెనని ఒత్తిడి చేశారు. రాష్ట్రతర నాయకుల ప్రవర్తన, అన్య ప్రాంతీయుల ఆధిక్యత స్థానికులకు వెగటు కలిగించింది. నిజాం ప్రభువు పరిస్థితులను గమనించి ఫర్మానా జారీ చేసి, ముల్కీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ ఫర్మానా ప్రకారం స్థానికులైన దేశీయులకే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆచారాలు అమలు చేయబడ్డాయి.

బీరారు శాశ్వతంగా ఆంగ్లేయుల వశమైన తరువాత నిజాము ఆ రాష్ట్రమును తిరిగి రాబట్టే ప్రయత్నాలు చేశాడు. క్రీ.శ. 1926 నుండి 1936 వరకు ఈ ప్రయత్నాలు జరిగాయి. 1936లో ఒక పనికి రాని పరిష్కారము కుదిరింది. అది పేరుకు మాత్రమే పరిష్కారము. నిజాముకు ఆ రాష్ట్రం వల్ల లాభమేమీ కలుగలేదు. బీరారు యువరాజుగా ఉస్మానలీఖాన్ జ్యేష్ఠ కుమారుడు ఆజంజా పరిగణించబడ్డాడు. బీరారులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఇండియా ప్రభుత్వ పతాకాలతో పాటు ఆసబ్జె జెండా ఎగురవేయడం, మసీదులో ఖురాన్ చదవడం, నిజాంకు గౌరవ వందనం సమర్పించడం వంటి నియమాలు ఆంగ్లేయులకు అంగీకరించినా నిజాము ప్రభువుకు లాభం మాత్రం చేకూరలేదు.

పరిపాలనా దక్షుడైన నిజాము ప్రభువు క్రీ.శ. 1911 నుండి 1936 వకు అత్యంత సమర్థవంతంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి కృషి చేశాడు. క్రీ.శ. 1936లో నిజాం పాతికేళ్ళ పాలనను పురస్కరించుకుని రాష్ట్రమంతటా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. హైదరాబాదు నగరమును సిల్వర్ జూబ్లీహాలు, జిల్లా కేంద్రములోనూ, తాలూకా కేంద్రములోనూ జూబ్లీ భవనాలు నిర్మించారు.

 RELATED TOPICS 

అసఫ్జాహీలు - పూర్వ చరిత్ర

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-1

అసఫ్ జాహీ పాలకులు -నిజాం -ఉల్-ముల్క్-2

అసఫ్ జాహీ పాలకులు - నాసర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు -  ముజఫర్‌జంగ్

అసఫ్ జాహీ పాలకులు - సలాబత్ జంగ్

అసఫ్ జాహీ పాలకులు - నిజాం అలీఖాన్

అసఫ్ జాహీ పాలకులు - సికిందర్ జా

అసఫ్ జాహీ పాలకులు - నాసిరుద్దౌలా

అసఫ్ జాహీ పాలకులు -  అఫ్జల్ఉద్దౌలా 

 అసఫ్ జాహీ పాలకులు -  మహబూబ్ అలీఖాన్