వెన్నరాజు

కాకతీయ వంశమునకు మూల పురుషుడు వెన్నరాజు. బయ్యారము చెరువు శాసనము ప్రకారం ఇతడు కాకతిపురమును రాజధానిగా పాలించినాడు. ఇతడు రాష్ట్రకూట సామంతుడు. రాష్ట్ర కూటులు బాదామీ చాళుక్య రాజ్య భాగములన్నింటిని తమ ఆధిపత్యము క్రిందికి తెచ్చుకొని పాలించారు. వెన్నరాజు నాందేడు మండల ప్రాంతమునకు సామంతునిగా పాలించాడు. ఇతని రాజ్యము ఆదిలాబాద్ పశ్చిమ ప్రాంతము, బాసర, ముధోల్, కుబీర్, భైంసా ప్రాంతాలతో కూడి ఉండెను. దంతిదుర్గుడు బాదామీ చాళుక్య వంశమును నిర్మూలించి రాష్ట్రకూట రాజ్యమును స్థాపించుటలో తోడ్పడి, కాకతీయ సామంత రాజ్యమును నెలకొల్పి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయము.

మొదటి గుండరాజు

వెన్నరాజు పుత్రుడు మొదటి గుండరాజు. ఇతడు తండ్రి తరువాత కాకతి పురానికి రాజయినాడు. ఇతడు రాష్ట్రకూట కృష్ణ వల్లభుని సామంతునిగా ఉండెను. మొదటి గుండరాజును గురించి బయ్యారం చెరువు శాసనంలో ప్రస్తావించబడినది. మొదటి గుండ రాజు రాష్ట్రకూట సేనానిగా అనేక దండయాత్రలందు పాల్గొని విజయ సాధనలలో తోడ్పాడు అందించాడు. ఇతడు చాలా కాలాము జీవించాడు. రాష్ట్రకూట మొదటి కృష్ణవల్లభుడు, ప్రభూత వర్ష గోవింద రాజు, ధృవరాజు, మూడవ గోవిందరాజు, అమోఘవర్షుల పాలనా కాలంలో సేనాపతిగా, దండనాధుడిగా కీర్తి గడించాడు. 

రెండవ గుండరాజు

ఇతడు మొదటి గుండరాజు పుత్రుడు. ఇతడు కూడా రాష్ట్రకూట సేనానిగా వ్యవహరించాడు. ఇతడు అమోఘవర్షునికి సామంతునిగా, దండనాధునిగా అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు. ఇతడి పేరు కూడా బయ్యారం చెరువు శాసనంలో ప్రస్తావించబడినది. వేంగీదేశ దండ యాత్రలలో ఇతను పాల్గొన్నాడు. తూర్పు చాళుక్య, రాష్ట్రకూట సేనానులతో పాటు యుద్ధములందు పాల్గొని అమోఘవర్షునికి విజయాలు చేకూర్చుటలో ఇతను సహాయపడినాడు. మూడవ 

గుండరాజు

రెండవ గుండరాజు పుత్రుడు మూడవ గుండరాజు. తండ్రి తరువాత రాష్ట్రకూట అమోఘవర్షుని సేనానిగా నియమితుడైనాడు. రాష్ట్రకూట సేనానులలో ప్రముఖుడు. క్రీ.శ. 880లో అమోఘ వర్షుడు మరణించిన తరువాత అతని కుమారుడు రెండవ కృష్ణునికి అండగా మూడవ గుండరాజు నిలిచాడు. మూడవ గుండరాజు కాకర్త్య గుండనగా కూడా ప్రసిద్ధి చెందినాడు. రెండవ కృష్ణుడు వేంగీ చాళుక్యులపై క్రీ.శ. 892లో జరిపిన దండయాత్రలో ఇతడు రాష్ట్రకూట సేనలకు ఆధిపత్యము వహించి, చాళుక్యసేనలను ఎదుర్కొన్నాడు.

ఎఱ్ఱయరాజు

ఇతడు మూడవ గుండరాజు కుమారుడు. ఇతడు రాష్ట్రకూట రెండవ కృష్ణవల్లభ, మూడవ ఇంద్రవల్లభ, రెండవ అమోఘవర్షుడు, నాల్గవ గోవిందుడు, మూడవ అమోఘవర్షుల పాలనా కాలములందు సేనానిగా పనిచేసినాడు. సేనా నాయకునిగా, దండనాధునిగా, కుఱవాడి సీమను పాలించు సామంతునిగా కూడా పనిచేసినాడు. నేటి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొరవి ప్రాంతము ముదిగొండ చాళుక్యుల ఆధీనంలో ఉండగా, రాష్ట్రకూట చక్రవర్తులు కొరవి ప్రాంతమునుండి వారిని పారద్రోలి, తమ దండనాయకుడు మరియు సేనాని అయిన ఎఱ్ఱన రాజును సామంతునిగా నియమించి కుఱవాడి సీమను పాలించు అధికారం ఇచ్చినారు. క్రీ.శ. 934లో కొరవి సీమపై ముదిగొండ చాళుక్య వంశజుడు నల్కి నిరవద్యుడు దండెత్తి దానిని ఆక్రమించు కొన్నాడు. అప్పుడు కాకతి ఎఱ్ఱయ రాజు కొఱవి సీమను వదలి రాష్ట్రకూట రాజ్యములో నివసించాడు. 

బేతియరాజు

ఎఱ్ఱయ తనయుడు బేతియ రాజు. ఇతని కాలానికి ఈ వంశీయుల ఆధీనంలోనున్న కొఱవి సామంత రాజ్యము ముదిగొండ చాళుక్యుల పరమై ఉండినది. ఈ కాలంలో రాష్ట్రకూట ప్రభువులలో సమర్థులైన రాజులెవరూ లేరు. ఇతడు మూడవ కృష్ణ వల్లభుని కాలంలో రాష్ట్రకూట సేనానిగా వ్యవహరించాడు. 

నాల్గవ గుండరాజు

బేతియ రాజు కుమారుడు నాల్గవ గుండరాజు క్రీ.శ. 950లో రాష్ట్రకూట సేనానిగా నియమితుడైనాడు. ఇతనికి గల మరొక పేరు పిండి గుండరజు. ఇతడు గొప్ప శూరుడు. ఇతడు వేంగీ సింహాసనాన్ని అధిష్టించిన దానార్ణవునికి అన్ని విధాలా సహకరించాడు. నాల్గవ గుండరాజు ముదిగొండ చాళుక్యులను తరిమి కొఱవిసీమను ఆక్రమించి పాలించాడు. అనంతర కాలంలో ముదిగొండ చాళుక్య వంశజుడైన బొట్టు బేతరాజు దండనాయకుడు విరియాల ఎజ్జ సేనానితో జరిగిన యుద్ధంలో ఓడిపోయి కొఱవిసీమను అతనికి అప్పగించాడు. 

మొదటి బేతరాజు

మొదటి బేతరాజును గరుడ బేతరాజని కూడా అంటారు. ఇతడు గుండ్యన కుమారుడు. పిన్నవయస్కుడు. రాష్ట్రకూట ప్రభువుల పతనానంతరం అధికారం కోల్పోయిన బేతరాజుకు అతని మేనత్త విరియాల కామసాని అండగా నిలిచింది. ఈమె కల్యాణి చాళుక్య సేనాని విరియాల ఎర్రని భార్య. ఈమె సహాయంతో హనుమకొండ విషయాధిపతియైన బేతన పశ్చిమ చాళుక్యుల సామంతుడైనాడు. ఈ విషయంలో గూడూరు శాసనం, సిద్ధేశ్వర చరిత్ర ప్రస్తావిస్తున్నాయి. కష్ట కాలంలో ఇతనికి సహాయపడిన ప్రముఖులలో విరియాల సూరీడు మరొకడు. హనుమకొండకు వచ్చిన కాకతీయ వంశీయులలో ఇతడే మొదటి వాడని బయ్యారం చెరువు శాసనం ద్వారా తెలుస్తుంది. చరిత్రలో మొదటి బేతరాజుగా ప్రసిద్ధుడైనవాడు ఇతడే.

బేతరాజు 'ఏబది' ఏండ్లకు పైగా చాళుక్య సామంతునిగా హనుమకొండ విషయమేలినాడు. ఈ విషయము ఇప్పటి వరంగల్లు జిల్లాలో కొంత భాగంతో పాటు కరీంనగర్ జిల్లాలో శనిగరం వరకు వ్యాపించి యున్నది. క్రీ||శ|| 1051 నాటి ఇతని ఒకే ఒక శాసనం శనిగరంలో లభించింది. దీనిని బట్టి వేములవాడ చాళుక్యుల రాజ్యంలోని ఆ ప్రదేశం ఇతని ఆధీనమయినట్లు విదితమగుచున్నది. ఇతడు క్రీ||శ|| 1051 వరకు జీవించి ఉన్నట్లు కూడా ఈ శాసనం స్పష్టపరుస్తుంది.

బేతరాజు తన సార్వభౌములకు చేదోడు వాదోడుగా వుంటూ తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. ఇతనికి రేచర్ల వంశీయులు సేనాధిసతులుగా ఉండేవారు. వారిలో రేచర్ల బ్రహ్మసేనాని ముఖ్యుడు. ఇతడు పశ్చమ చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్ల సోమేశ్వరునిఆజ్ఞానువర్తియై కాకతీయ సైన్యములకు నాయకత్వం వహించి చోళరాజధాని యగు కాంచీనగరం పై దాడి చేసినాడు.

బేతరాజు “చోళచమూవార్థి ప్రమథన” అని శాసనాలలో ప్రశంసింపబడినాడు. దీనిని బట్టి అతడు కూడా ఈ దండయాత్రలో పాల్గొని విజయం సాధించినట్లు తెలియుచున్నది. బేతరాజు హనుమకొండ విషయాన్ని క్రీ||శ|| 1052 వరకు సమర్థవంతంగా పాలించినట్టు శనిగరం శాసనం సూచిస్తుంది. ఇతని మంత్రి నారణయ్య శనిగరంలో యుద్ధమల్ల జైనాలయానికి మరమ్మత్తులు చేయించి కానుకలు సమర్పించినారు.

మొదటి ప్రోలరాజు

ప్రోలరాజు బేతరాజు కుమారుడు. ఇతనిని గురించి తెలుపు శాసనాలు రెండు. అవి క్రీ||శ|| 1053 నాటి అతని శనిగరం శాసనం, అతని మనుమడైన దుర్గరాజు ఖాజీపేట దర్గా శాసనం. ఇతడు చాళుక్య త్రైలోక్యమల్ల సోమేశ్వరుని కుమారుడు, యువరాజు ఆరవ విక్రమాదిత్యుని దండయాత్రలో పాల్గొని కంకణము చక్రకూటములను జయించి సమధిగత పంచమహాశబ్ద బిరుదాన్ని పొందినాడు. పొరుగున ఉన్న వేములవాడ కాడ్పర్తి గుణసాగరం మున్నగు ప్రాంతాలను జయించి ఇతడు తన హనుమకొండ విషయంలో చేర్చుకున్నాడు. స్థానిక నాయకులైన అన్నయ్య, గొన్నయ్యలను ఓడించి హనుమకొండ ప్రాంతాన్ని సురక్షితం చేశాడు. బద్దెగని పారద్రోలి సబ్బి మండలంలో అధిక భాగాన్ని ఆక్రమించినాడు. ఇతడు వేములవాడ చాళుక్యులలో చివరి వాడని చరిత్రకారుల అభిప్రాయం.

ప్రోలరాజు క్రొత్తగా తాను జయించిన ప్రదేశాలతో కూడిన హనుమకొండ విషయాన్ని శాశ్వత సామంతరాజ్యంగా త్రైలోక్యమల్ల సోమేశ్వర చక్రవర్తి నుండి పట్టా పొందినాడు. దీనితో తండ్రి పొందిన అస్థిరమైన రాజ్యాధికారానికి శాశ్వతత్వము చేకూరింది. అంతేకాక దానికొక నిర్దిష్ట రూపకల్పన చేసి కాకతి రాజ్య స్థాపకుడైనాడు. శాశ్వత సామంత హోదాతో పాటు ప్రోలరాజు చాళుక్య రాజ్య చిహ్నమైన వరాహముద్రను ఉపయోగించుకొని నాణెములను ముద్రించుకొనుటకు సార్వభౌముని అనుమతి పొందాడు. కాకతీయులు రాష్ట్రకూట సామంతులుగా గరుడ లాంఛనము వాడినారు. చాళుక్యుల రాజలాంఛనం వరాహం. చాళుక్య సామంతులుగా మారిన తరువాత కాకతీయులు వరాహ లాంఛనమును కూడా ఉపయోగింపసాగినారు.

ప్రోలరాజుకు 'అరిగజ కేసరి' అనే బిరుదు ఉంది. 'ఏనుగుల వంటి శత్రువులకు అతడు సింహము వంటి వాడని' దాని అర్థము. ఆ బిరుదు నామంతోనే అతడు కేసరి తటాకములను త్రవ్వించినాడు. వాటిలో కేశ సముద్రమునే గ్రామం దగ్గర ఉన్న పెద్ద చెరువు ఒకటి. ఆ చెరువును బట్టే ఆ ఊరికి ఆ పేరు కలిగింది. పశ్చిమ చాళుక్య రాజ్యంలో సింహాసనాధిపత్యానికై ఆరవ విక్రమాదిత్యునికి అతని అన్న రెండవ సోమేశ్వరునికి మధ్య వారసత్వ పోరు ఆరంభం కాగా ప్రోలరాజు అతని కుమారుడు బేతరాజు విక్రమాదిత్యుని పక్షమున చేరినారు. రెండవ 

బేతరాజు

రెండవ బేతరాజు మొదటి ప్రోలరాజు కొడుకు. ఇతడు తన తండ్రి మరణానంతరం క్రీ||శ|| 1076 లో హనుమకొండ రాజ్యా ధిపతి అయినాడు. పశ్చిమ చాళుక్య రాజ్యంలో కొనసాగుతున్న వారసత్వ యుద్ధంలో బేతరాజు సమర్థించిన విక్రమాదిత్యుడు విజయుడైనాడు. విజయ సాధనలో తనకు తోడ్పడిన బేతరాజును గౌరవిస్తూ తనకు వర్తించు 'విక్రమచక్రి', 'త్రిభువనమల్ల' అను రెండు బిరుదులను అతనికి ప్రధానం చేసినాడు. దీని వలన చాళుక్య సామ్రాజ్యంలో హనుమకొండ రాజ్యానికొక విశిష్ట స్థానమేర్పడినది. అంతేగాక హనుమకొండనానుకొనియున్న కొన్ని ఇతర భూభాగములను కూడా అతడు బేతని రాజ్యంలో చేర్చినాడు. అట్టి వాటిలో సబ్బి మండలమొకటి.

బేతరాజు మంత్రి వైజదండనాధుని వ్యూహంతోను, విక్రమాదిత్యుని ప్రోత్సాహంతోను తన పై కత్తి గట్టిన పరమార జగదేవుని పొలవాసమీడ రాజును ఓడించి సబ్బిసాయిర మండలంపై తన పట్టు బిగించినాడు. దీనితో కొరవి మండలం హనుమకొండ విషయం సబ్బిసహస్రాలతో కూడియున్న కాకతీయ రాజ్యం క్రమంగా విస్తరించసాగింది. త్రిభువనమల్ల బేతరాజు శివభక్తి తత్పరుడు. కాలాముఖ శైవా చార్యుడైన

రామేశ్వర పండితుడు ఇతని దీక్షా గురువు. అతనికి హనుమకొండలోని శివపురాన్ని, అచట తన పేరిట నిర్మింపబడిన బేతేశ్వరాలయాన్ని గురు దక్షిణగా సమర్పించుకున్నాడు. ఇతడు హనుమకొండ తన తండ్రి పేర ప్రోలేశ్వరాలయము నిర్మించి దానములిచ్చినాడు. నర్సంపేట సమీపముననున్న బాణాజి పేటలోని జైన దేవాలయానికి కూడా దానములిచ్చినట్లు అచ్చటి శాసనం సూచిస్తుంది. 

దుర్గరాజు

దుర్గరాజు రెండవ బేతరాజు పెద్ద కుమారుడు. ఇతడు క్రీ||శ|| 1108 లో సింహాసనము అధిష్టించినాడు. ఇతనికి 'త్రిభువనమల్ల', 'చలమర్తిగండ' అను బిరుదములున్నాయి. ఇతడు తండ్రి విధానానికి విరుద్ధంగా పరమార జగదేవునితోను పోలవాసమేడ రాజుతోను స్నేహ సంబంధములు ఏర్పరచుకొని వారి ప్రోత్సాహంతో స్వతంత్రంగా వ్యవహరిస్తూ చాళుక్యుల సార్వభౌమత్వమును ధిక్కరించినాడు. ఇతని కుతంత్రములనెరిగిన తమ్ముడు ప్రోలరాజు చాళుక్య చక్రవర్తి అయిన ఆరవ విక్రమాదిత్యుడి సహాయంతో క్రీ||శ|| 1116 లో దుర్గరాజును సింహాసనాభ్రష్టునిగా చేసి తాను రాజ్య పీఠమునలంకరించినాడు. దుర్గరాజు తండ్రి వలె రామేశ్వర పండితునకు దానములిచ్చి గౌరవించినట్లు

రెండవ ప్రోలరాజు

రెండవ ప్రోలరాజు రెండవ బేతరాజు రెండవ కుమారుడు. ఇతడు తన అగ్రజుని తొలగించి క్రీ||శ|| 1116 లో సింహాసనము అధిష్టించినాడు. ఇతడు గొప్ప పరాక్రమశాలి. రాజనీతి చతురుడు, సామంత కాకతీయులలో ప్రసిద్ధుడు. కాకతీయ రాజ్య స్థాపకుడు. ప్రోలరాజు సాధించిన విజయాలను రుద్రదేవుని హనుమకొండ శాసనం వర్ణిస్తుంది.

తన అన్న అయిన దుర్గరాజు పై అభిమానంతో హనుమకొండ పై దండెత్తి వచ్చిన పరమార జగదేవుని ఓడించి తరిమివేసినాడు. ఇది ప్రోలరాజు సాధించిన మొదటి విజయం. కందూరు మండలంలో రాజ ప్రతినిధిగా వున్న తైలపుని నాయకత్వంలో తెలంగాణా ప్రాంతంలోని సామంతులు సార్వభౌమాధికారమును ధిక్కరించినారు. వారినణచుటకు చాళుక్య చక్రవర్తి ప్రతాప చక్రవర్తి బిరుదాంకితుడైన రెండవ జగదేకమల్లుడు సైన్యాన్ని పంపినాడు. ప్రోలరాజు ఆ సైన్యానికి నాయకత్వం వహించి కందుకూరు నాడు పై దాడి చేసి తైలపుని ఓడించి బందీగా పట్టుకొని కళ్యాణి పంపినాడు. తైలపునికి సహాయపడిన భీమ చోడుని తరుము కుంటూ ప్రోలరాజు కృష్ణానదిని దాటి శ్రీశైలం వరకు వెళ్ళి అచ్చట విజయ స్తంభమును నాటి ఆలయానికి దానములిచ్చినాడు. ఆ తరువాత పొలవాస పై దండయాత్ర జరిపి మంత్ర కూటము (మంథెన) వద్ద గుండరాజును ఓడించి, పట్టుకొని తల గొరిగించి అతని రొమ్ము మీద చాళుక్య రాజ్య చిహ్న వరహముద్రను చిత్రించి ఊరేగించి వధించినాడు.

ఈ విధంగా ప్రోలరాజు తెలంగాణ ప్రాంతములోని తిరుగుబాటులను చక్రవర్తి అనుయాయుగా అణచివేసి తన శౌర్య ప్రతాపాలను, స్వామి భక్తిని ప్రకటించుకొనినాడు. దీనితో ఇతడు రాజాభిమానమును పొందగలుగుటయే గాక తన పరాక్రమాన్ని, ఆధిక్యతను తోటి సామంతులకు తెలియజేసినాడు. ఇది ప్రోలరాజు రాజనీతిజ్ఞతకు మచ్చుతునక. తాను భవిష్యత్తులో నెలకొల్పబోవు స్వతంత్ర రాజ్యస్థాపనకు అవసరమైన గట్టి పునాదులను నిర్మించు కున్నాడు. చివరికి ప్రోలరాజు జీవితం విషాదాంతమైనది. తీరాంధ్ర దేశంలో వెలనాటి చోళులు విజృంభించి రాజ్య విస్తరణకు పూనుకున్నారు. వారి నెదుర్కొనుటకు పిఠాపురం చాళుక్యులు ప్రోలుని సహాయమర్ధించినారు. వారికి సహాయపడుటకు తమ అధికారాన్ని అచటకు విస్తరింపజేయుటకు వెళ్లిన ప్రోలరాజు వెలనాటి యువరాజు రాజేంద్ర చోళునితోను, వెలనాటి సామంతులైన కోట హైహయాది మాండలికుల తోను పోరాడుతూ మరణించినట్లు తెలియుచున్నది. రాజేంద్ర చోళుడు, కోటరాజుల ధరించిన 'కాకతిప్రోల నిర్దహన' అనే బిరుదును బట్టి ఈ విషయము ధృవీకరింపబడుతుంది.

ప్రోలరాజు భార్య ముప్పమాంబ నతవాడి దుర్గ రాజు సోదరి. ఈ దంపతులకు రుద్రుడు, మహదేవుడు, హరిహరుడు, గణపతి, దుర్గరాజు అను కుమారులు జన్మించినారు. అతని అమాత్యుడు బేతన. ఇతడు వైజదండనాథుని పుత్రుడు. బేతన రాజనీతి చతురుడు. ప్రోలుని రాజ్య విస్తరణకు అతని మేధాశక్తి తోడ్పడింది. బేతన భార్య మైలమ హనుమకొండ పద్మాక్ష గుట్ట పై కడలాలయ జైన బసదిని నిర్మించినది. దీనికి ప్రోలరాజు కొంత భూమిని దానము చేసినాడు. ప్రోలరాజు మొదట జైనమతాభిమాని. తరువాత శైవ మతాభిమానిగా మారినాడు. ఇతడు ఓరుగల్లు కోటలోని స్వయం భూదేవాలయాన్ని నిర్మించినాడని ప్రతీతి. ఈ స్వయంభూ దేవుడు కాకతీయులకు ఆరాధ్య దైవము.


 RELATED TOPICS 

కాకతీయులు

స్వతంత్ర కాకతీయులు

ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు 

కాకతీయుల పరిపాలనా విధానం

కాకతీయుల కాలం నాటి  సాంఘిక పరిస్థితులు

 కాకతీయుల కాలంలో ఆర్ధిక పరిస్థితులు

కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు 

కాకతీయల సాహిత్య సేవ