నూతన గ్రామాల నిర్మాణం 

కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరి సంపదలతో తులత్రూగుతున్నట్లు అమీర్ ఖుస్రూ, అబ్దుల్లా వాసఫ్, మార్కొపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తుంది. కాకతీయులు చాలా కాలం వరకు తెలంగాణా ప్రాంతాన్ని పరిపాలించినందున దాని అభివృద్ధికి వారు చాలా కృషి చేశారు. వారు అనేక క్రొత్త గ్రామాలను ఏర్పరచి, తటాకాలను త్రవ్వించారు. కాకతీయ సామంతులు కూడా తమ ప్రభువుల విధానమే అనుసరించారు. మంథెన, కాళేశ్వరం, చెన్నూరు, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మం, కొత్త గూడెం మొదలగు అటవీ ప్రాంతాలలోని గ్రామములు చాలా వరకు కాకతీయుల నాటివేనని శాసనాల వలన తెలుస్తుంది. 

వ్యవసాయం - నీటిపారుదల సౌకర్యాలు 

ఆనాటి వృత్తులలో ప్రధానమైనది వ్యవసాయం. ఇది చాలా వరకు వర్షాల పైనే ఆధారపడినది. కాకతీయ ప్రభువులు, వారి సామంతులు ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించారు. భూమి పై సర్వాధిపత్యం రాజుకు వుండేది. ఆ తరువాత భూమిని సొంతం చేసుకున్న వారికి యాజమాన్యం హక్కు ఉండేది. రాజుకు చెందిన భూమిని రాచ పొలం అని అంటారు. పోడు భూములను సాగుబడి చేసే వారికి కొన్ని సదుపాయాలు కల్పించబడేవి. ఆనాటి సాగుబడి భూములను నది యాత్రకలని, దేవ యాత్రకలని పిలిచేవారు. అడవులు పచ్చిక భూములను బీడులని అంటారు. కాకతీయులు, వారి సామంతులు అనేక చెరువులు, సరస్సులు, కాలువలను, బావులు, పుణ్యం సంపాదించుకోవడానికి ఆనాటి వ్యక్తులు త్రవ్వించేవారు. కీర్తిని చిరస్థాయిగా నిలిపే సప్త సంతానాలలో చెరువు, బావి నిర్మాణం ఒకటి. ఈ కారణం వలన వ్యవసాయానికి నీటి వనరులు ఏర్పడ్డాయి. మొదట ప్రోలరాజు కేసరి సముద్రమనే తటాకం తన బిరుదు పేర నిర్మించినాడు. ఈ తటాకం నేటికీ ఉంది. రెండవ బేతరాజు సెట్టికెరియ, కేసరి సముద్రం అనే రెండు చెరువులను త్రవ్వించి వరుణ దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించాడని శాసనాల వలన తెలుస్తుంది. రెండవ ప్రోలరాజు, రుద్రదేవుడు తటాకాలను నిర్మించారు. రుద్రుని మంత్రి గంగాధరుడు హనుమకొండలో ఒక పెద్ద చెరువు నిర్మించాడు. గణపతి దేవుడు అనేక తటాక నిర్మాణాలు చేసాడని ప్రతాప చరిత్ర తెలుపుతుంది. గణపతి దేవుని కాలంలో వరంగల్ కు సమీపంలో పాకాల సరస్సును జగడాలు ముమ్మడి నాయకుడు నిర్మించాడు. ఇది సుమారు 17 వేల ఎకరాలను సాగుబడిలోనికి తెస్తున్నది. రామప్ప చెరువును గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు క్రీ||శ|| 1213లో నిర్మించాడు. గణపురం చెరువు వీరి కాలానికి చెందినదే. కాకతీయుల నాటి మరో పెద్ద చెరువు లక్నవరం తటాకం. రెండవది బయ్యారం చెరువు. దీనిని గణపతి దేవుని సోదరి మైలాంబ నిర్మించింది. గణపతి దేవుని మరొక సోదరి కుందమాంబ కుంద సముద్రం అనే పేరుతో ఒక చెరువు నిర్మించింది. కాకతీయుల కాలంలో తెలంగాణా ప్రాంతంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలలో చెరువులేని గ్రామం లేదు. నీటి పారుదల సౌకర్యానికై నీటిని సరియైన స్థలాలలో నిల్వచేసి, వాగులకు కొన్ని స్థలాలలో ఆనకట్టలు కట్టి వ్యవసాయాభివృద్ధికై కాకతీయులు గొప్ప కృషి చేశారు.

పరిశ్రమలు 

ప్రాచీన కాలం నుండి ఆంధ్ర దేశం అనేక పరిశ్రమలకు ముఖ్యముగా సన్నని వస్త్రాలకు, కలంకారి చీరలకు పేరు గాంచింది. 20 కి పైగా రకరకాల వస్త్రాలను గురించి పాల్కురికి సోమనాధుడు పేర్కొన్నాడు. ఓరుగల్లులో రత్నకంబళులు, సన్నని వస్త్రాల పరిశ్రమలు వుండేవి. పంచలోహాలతో పలు రకాల వస్తువులు తయారు చేసేవారు. నిర్మల్ లో తయారయిన కత్తులకు డమాస్కలో కూడా మంచి పేరు ఉండేది. గోల్కొండ ప్రాంతంలో వజ్రపు గనులు వున్నాయని మార్కోపోలో వ్రాశాడు. 

వర్తక - వాణిజ్యాలు 

దేశీయ, విదేశీయ వాణిజ్య సాంప్రదాయాలను కాకతీయులు పునరుద్ధరించారు. దీనికి కారణం నాటి రాజకీయ సమైక్యత, ఆర్థిక పురోభివృద్ధి కాకతీయులు ఉదారమైన, పటిష్టమైన వాణిజ్య విధానాన్ని అనుసరించారు. మోసం చేస్తున్న వర్తకులను ప్రభుత్వం కఠినంగా శిక్షించేది. ఆనాడు దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రం. 

విదేశీ వాణిజ్యం 

కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి మోటుపల్లి ప్రధాన కేంద్రం. కాకతి గణపతి దేవుడు మోటుపల్లిలో విదేశీ వర్తకులకు అభయమిస్తు ఒక శాసనం వేయించాడు. రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని దర్శించిన మార్కోపోలో మోటుపల్లి నుండి ఎగుమతి అయ్యే వజ్రాలను, వస్త్రాలను గురించి చాలా కొనియాడారు.

శ్రేణులు 

కాకతీయుల కాలంలో వర్తకుని బెహరీ అని, అతను చేసే పనిని వ్యవహారం అని పిలిచేవారు. వర్తక సంఘాలలో అన్ని వర్గాల ప్రజలకు స్థానముండేది. వర్తకులు వర్తకము స్వదేశీ, పరదేశి, ఉభయదేశి, నానాదేశి, పెక్కుండ్రు అనే శ్రేణులలో ఏర్పడేవారు. ఈ శ్రేణులు ఆయా ప్రాంతాలలో వాణిజ్యం జరుపుకోవడానికి రాజు నుండి అనుమతి పత్రాలను పొందవలెను. ప్రతి శ్రేణికి రాజధాని నగరంతో సంబంధముండేది. 


 RELATED TOPICS 

కాకతీయులు

తొలి కాకతీయ రాజులు 

స్వతంత్ర కాకతీయులు

ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు 

కాకతీయుల పరిపాలనా విధానం

కాకతీయుల కాలం నాటి  సాంఘిక పరిస్థితులు

కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు 

కాకతీయల సాహిత్య సేవ


Tags :   Kakatiya Dynasty   Foreign Commerce  

 Economic Conditions   Industries  

 Ganapati Deva   Pratapa Rudra   

  Srenis    Ramappa Cheruvu