కాకతీయుల చరిత్రకు ఆధారాలు

కాకతీయ ప్రభువుల జీవిత విశేషాలను తెలుసుకొనుటకు సమకాలీన చారిత్రకాంశాలను అవగాహన చేసుకొనుటకు సమకాలీన చారిత్రకాంశాలను అవగాహన చేసుకొనుటకు వివిధ ఆధారాలు లభించినవి. కాకతీయుల కాలం నాటి తామ్ర శాసనాలు స్వల్ప సంఖ్యలో లభించినను అవి అమూల్యమైన చారిత్రక సమాచారాన్ని అందిస్తున్నాయి. తూర్పు చాళుక్య ప్రభువు దానార్ణవుని మాగల్లు తామ్రశాసనంలో అత్యంత విలువైన చారిత్రక సమాచారం ఉన్నది. దీని ద్వారా కాకతీయుల పుట్టు పూర్వోత్తరాలు తెలుస్తున్నాయి. భూ సంబంధమైన వివాద పరిష్కారాన్ని గురించిన వివరాలు గణపతి దేవుని కరీంనగర్ తామ్ర శాసనంలో ఉన్నాయి. ఇతరత్రా తెలియని సమాచారం రుద్రమదేవి కాలం నాటి ఆలపాడు తామ్ర శాసనం ద్వారా లభిస్తుంది. కాకతీయ ప్రభువులకు సంబంధించిన వివిధ ఆకృతులలోను, పరిమాణములలోను వున్న బంగారు, వెండి లోహములతో తయారు చేయబడిన నాణెములు లభించినాయి. వీటి వలన నాటి ఆర్థిక స్థితిగతులు తెలియుచున్నవి. 

సారస్వత ఆధారాలు

ప్రతాపరుద్రుని ఆస్థాన కవియైన విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్రయశోభషణం అను అలంకార శాస్త్ర గ్రంథమును వ్రాసినాడు. సమకాలీన రచన అయినందున దీని లోని చారిత్రకాంశములను విశ్వసించవచ్చును. కాకతీయుల లాంఛనము, రుద్రమదేవికి గణపతి దేవుడు, ప్రతాపరుద్రులతో గల బాంధవ్యం, పట్టాభిషేకానంతరం ఆమె పురుషనామంతో వ్యవహరింపబడుట మున్నగు వివరాలు ఇందులో వివరించబడినవి. ఇవి ఇతర ఆధారాలతో సరిపోల్చి చూసినప్పుడు వాస్తవాలని తెలియుచున్నది. 

కాకతీయుల పుట్టు పూర్వోత్తరాలు

కాకతీయుల వంశ నామం కాకతి, కాకెత, కకత్య, కకర్య, కాకత్తియ, కాకతీయ మొదలగు రూపాల్లో కన్పిస్తుంది. కాకతి అనే పదం నుండి కాకతీయ వంశ నామం వచ్చినట్లు తెలుస్తుంది. కాకతీయుల పుట్టు పూర్వోత్తరాలను గూర్చి రెండు అభిప్రాయాలున్నాయి. అవి కాకతీయ అను వారి కుల దేవతను బట్టి ఆ పేరు కలిగినదని కొందరి వాదన, కాకతీయనునది వారి తొలి నివాస స్థానమని మరి కొందరు అభిప్రాయపడినారు.

కాకతీయ వంశ మూల పురుషుడు వెన్నరాజు. అతని రాజధాని కాకతిపురము. కర్ణాటక రాష్ట్రమందున్న కాకతి నగరము కాకతి వంశజుల తొలి ఆవాసము. కాకతి నగరమే కందరపురము. నేటి నాందేడ్ జిల్లాలోని కందారపురము తొలి కాకతీయుల రాజధాని. అది వారి జన్మస్థలము. దానిని ఆ రోజులలో కాకతిపురమని పిలిచేవారు. ఈ కాకతీయ గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం ప్రకారం వెన్నరాజు కాకతి నగరం నుండి పాలించుట వలన ఆ వంశీయులు కాకతీయులని ప్రఖ్యాతి గాంచినారని తెలుస్తున్నది. 


 RELATED TOPICS 

తొలి కాకతీయ రాజులు 

స్వతంత్ర కాకతీయులు

ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు 

కాకతీయుల పరిపాలనా విధానం

కాకతీయుల కాలం నాటి  సాంఘిక పరిస్థితులు

 కాకతీయుల కాలంలో ఆర్ధిక పరిస్థితులు

కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు 

కాకతీయల సాహిత్య సేవ