కాకతీయ యుగంలో సాహితీ రంగంలో కూడా నూతన ఉత్తేజం కనిపించింది. రాజులు, సామంతులు, తదితరులు సారస్వత కార్యకలాపాలను ప్రోత్సహించారు. 

సంస్కృతం 

కాకతీయుల రాజ భాష సంస్కృతం. వారి శాసనాలలో చాలా భాగం సంస్కృతంలోనే వున్నాయి. కాకతీయ సామంతుల శాసనాలు కూడా చాలా వరకు సంస్కృతంలోనే ఉన్నాయి. హనుమకొండ, పాకాల, పాలం పేట, వర్ధమాన పురం మొదలగు చోట్ల గల శాసనాలు చిన్న చిన్న సంస్కృత ఖండ కావ్యాలు. వీటి రచయితలు సంస్కృతంలో సిద్ధ హస్తులు. కాకతీయ శాసనాలను పరిశీలిస్తే ఆనాడు సంస్కృతం విద్యా భాషగా, బోధనా భాషగా వుండేదని తెలుస్తుంది. దాన గ్రహీతల విద్యార్హతలను పరిశీలించినపుడు నాటి విద్యాధికులు వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలలో మంచి ప్రవేశం వున్న వారని తెలుస్తుంది. కాకతీయ రాజులు, వారి సామంతులు పోషించిన కవి పండితులు, శాస్త్రకారులు రచించిన సంస్కృత గ్రంథాలు నేటికి తలమానికంగా ఉన్నాయి. కాకతి రుద్రదేవుని హనుమ కొండ శాసనాన్ని రచించిన అచినేంద్రుడు, గణపవరం శాసన లేఖకుడైన నంది, పాకాల శాసన కర్త కవి చక్రవర్తి, బూదపుర శాసన లేఖకుడు మమూర, కుంద వరం శాసన రచయిత బాల భారతి పేర్కొనదగిన ప్రశస్థి కవులు. ఆనాటి సంస్కృత కవులలో మొదట పేర్కొనదగినవాడు విద్యానాధుడు. ఇతడు ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. ప్రతాపరుద్ర యశో భూషణం అనే గ్రంథాన్ని రచించాడు. ఇతని అసలు పేరు అగస్త్యుడు. అగస్త్యుడు 75 గ్రంథాలు రచించాడు. కాని నేడు మనకు మూడు మాత్రమే లభిస్తున్నవి. అవి -బాల భారతం, నలకీర్తి కౌముది, కృష్ణ చరితం. ప్రతాపరుద్రుని ఆస్థాన కవి శాకల్య మల్లు భట్టు, ఉదాత్త రాఘవ కావ్యం, నిరోష్ట్య రామాయణం అను గ్రంథాలను రచించాడు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో మరో కవియైన ఔన అప్పయార్యుడు జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించాడు. విద్దనాచార్యుడు ప్రమేయచర్చాయ్నతం అనే ఒక శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. రుద్రాంబ సేనాధిపతియైన కొలని రుద్రుడు శ్లోక వార్తికం అనే వ్యాకరణానికి తన పేరుతో రాజ రుద్రీయం అనే వ్యాఖ్యానం రచించినాడు. కాకతి గణపతి దేవుని బావ మరిది గజసాహిణి అయిన జాయపసేనాని గీత రత్నావళి, వాద్య రత్నావళి, నృత్య రత్నావళి అనే మూడు శాస్త్ర గ్రంథాలు రచించాడు. రావిపాటి త్రిపురాంతక కవి ప్రేమాభిరామం అనే వీధి నాటకం వ్రాశాడు. ఈ గ్రంథం కాకతీయుల నాటి సాంఘిక జీవితాన్ని కన్నులకు కట్టినట్లు తెలుపుతుంది. ఈ గాధనే వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం అనే పేరుతో తెలుగులో వ్రాశాడు. 

తెలుగు 

కాకతీయ యుగంలో తెలుగు భాష చాలా అభివృద్ధి చెందింది. చేబ్రోలు శాసనం రచించిన భీమయపండ మార్గదేశి రీతులలో చెప్పగలిగిన దిట్ట. ఈశ్వరభట్ట చటోపాధ్యాయుడు తెలుగు గద్యంను వ్రాయటంలో నేర్పరి. కాకతీయుల నాటి ఉత్తమ సాహిత్యం గల తెలుగు శాసనాలు బేతరాజు గూడూరు శాసనం, గంగాధరుని కరీంనగర్ శాసనం, కాటని ఉప్పరిపల్లె శాసనం, ఓఓలి సిద్ది కొణిదెన శాసనం, జగతాపి గంగదేవుని శాసనం, తాళ్ళ ప్రొద్దుటూరు శాసనం మొదలగునవి. శైవ, వైష్ణవ మత ఉద్యమాలు తెలుగు భాషా వికాసానికి గొప్పగా సేవ చేశాయి. కాకతీయుల నాటి కావ్యాలలో తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణం తొలి గ్రంథం. ఇది నెల్లూరు తెలుగు చోడరాజు మనుమసిద్ధికి అంకితం చేయబడింది. తిక్కన వ్రాసిన ఆంధ్ర మహాభారతం సాహిత్య గ్రంథం. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్ర అనే బిరుదులున్నాయి. సాధారణంగా ఆంధ్ర మహాభారతం వ్యాస భారతానికి అనువాదమనీ నమ్మిన తిక్కన స్వతంత్ర శైలిని అనుసరించి సులభమైన పదాలతో దేశీయ భాషలో రచన సాగించాడు.


 RELATED TOPICS 

కాకతీయులు

తొలి కాకతీయ రాజులు 

స్వతంత్ర కాకతీయులు

ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు 

కాకతీయుల పరిపాలనా విధానం

కాకతీయుల కాలం నాటి  సాంఘిక పరిస్థితులు

 కాకతీయుల కాలంలో ఆర్ధిక పరిస్థితులు

కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు 


Tags :   Kakatiya Dynasty  

 Literature in Kakatiya Period    Sanskrit   Telugu  

 Vidtyanatha   Pratapa Rudra   

  Tikkana    Eshwara Bhatta Chattopadhyaya