కాకతీయుల కాలం నాటికి ఆంధ్రదేశంలో బౌద్ధమతం నామమాత్ర విశిష్టమైనది. కానీ జైనం మాత్రం ప్రబలంగానే వుండేది. ఈ కాలంలో కర్ణాటకలోనే గాక ఆంధ్రలో జైన మతాన్ని వీర శైవులు ధ్వంసం చేశారు. శైవులు జైన మతంలోని వర్ణ రాహిత్యాన్ని తమ ముఖ్య సిద్ధాంతంగా గ్రహించారు. శాస్త్ర, చర్చల ద్వారా జైనులు లోబడునపుడు వారిపై హింసను వీర శైవులు ప్రయోగించేవారు. రాజులను వశపరుచుకొని, వారికి దీక్ష ఇచ్చి, వారి గురువులై పాలనా అధికారాన్ని అధీనంలో వుంచుకొని ఇతర మతాల నిర్మూలనలో వీర వైష్ణవము కూడా విజృంభించినది. ఈ కాలంలో జైన, శైవ, వైష్ణవ మతాలన్ని పరస్పరం ప్రాబల్యం కోసం సంఘర్షించుకొనసాగాయి. 

జైనం 

ఈ కాలంలో శైవంతో పాటు జైన, వైష్ణవ మతాలు ప్రచారంలో వున్నాయి. బౌద్ధం నాటికే క్షీణించిన జైనం మాత్రం తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగింది. ఈ కాలంలో జైనులను హింసకు గురి చేశారని, వారి ఆలయాలను ధ్వంసం చేశారని కొందరి అభిప్రాయం. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర వంటి గ్రంథాల ఆధారంగా వీరు వాదించారు. కాకతీయుల కాలంలో జైన విగ్రహాల ప్రతిష్ట జరిగినట్లు శాసన సాక్ష్యం వుంది. పాశుపత శైవానికి కేంద్రమైన ఓరుగల్లులో జైనులున్నారు. తొలి కాకతీయులకు జైన మతంతో సంబంధమున్నట్లు సిద్ధేశ్వర చరిత్ర చెబుతుంది. బేతరాజు మంత్రి నారణయ్య శనిగరం (కరీంనగర్ జిల్లా) లోని ముద్దమల్ల శాసనం వేయించాడు. రెండో ప్రోలరాజు మంత్రియైన పోతనామాత్యుడు జైన మాతాభిమాని. బేతన భార్య మైలమ కడలాలమడసది నిర్మించింది. దీనిని బట్టి తొలి కాకతీయులు జైన మతం స్వీకరించారని మనకు తెలుస్తున్నది. తరువాత కాకతీయులు కూడా జైన మతాన్ని పోషించినట్లు శాసనాధారాలు కలవు. కాకతి రుద్రుని మంత్రియైన గంగాధరుడు పద్మాక్షి కొండ పై వున్న కడలాలయమసదని బాగు చేయించాడు. సుప్రసిద్ధ జైన కవి అప్పయార్యుడు 'జినెంద్ర కళ్యాణాభ్యుదయం' అను గ్రంథాన్ని ప్రతాపరుద్రుని కాలంలో పూర్తి చేసినట్లు చెప్పుకున్నాడు. దీనిని బట్టి కాకతీయుల చివరి పాలనా కాలం వరకు జైన మతం ప్రచారంలో వుందని చెప్పవచ్చును. నాటి ప్రజలు అన్ని మతాలను ఆదరించినట్లు తెలుస్తుంది. రుద్రుని నాటి బెక్కల్లు శాసనాన్ని బట్టి జైనుడైన మల్లి రెడ్డి భగవంతుడు ఒక్కడే అని నమ్మి 21 శివాలయాలు నిర్మించాడు. 

బౌద్ధం 

కాకతీయ మంత్రి గంగాధరుడు విష్ణు భక్తుడైనప్పటికి వట్టశాల వద్ద బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించాడని క్రీ||శ|| 1117 నాటి కరీంనగర్ శాసనం చెపుతుంది. శ్రీమహా విష్ణువు బుద్ధుని అవతారమెత్తాడని ఈ శాసనం తెలుపుతుంది. దీనిని బట్టి బౌద్ధమతం హిందూ మతంలో కలసి పోయిందని భావించవచ్చును. పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రలో మల్లిఖార్జున పండితారాధ్యునికి ఒక బౌద్ధ భిక్షువుకు మధ్య చందవోలులో వెలనాటి రాజైన రెండవ రాజేంద్ర చోళుని కాలంలో తీవ్రమైన వాగ్వివాదం జరిగిందని, ఫలితంగా పండితారాధ్యుని శిష్యులు బౌద్ధ ఆచార్యులను వధించినట్లు ప్రస్తావన వుంది. దీనిని బట్టి నాటికే బౌద్ధం ప్రాముఖ్యాన్ని కోల్పోయిందని స్పష్టమవుతుంది. 

శైవం 

కాకతీయుల కాలంలో శైవ మతానికి రాజాదరణ, ప్రజాదరణ ఎక్కువగా లభించింది. వేదాలలో రుద్రశివుడు తరువాత కాలంలో పశుపతిగా, శివునిగా ఆరాధింపబడినాడు. శైవులకు శివుడే ప్రత్యక్ష దైవం. శివుడు తన శిష్యులకు పాశుపత మతమును బోధించాడని శైవుల విశ్వాసం. ఈ శిష్యులు 112 మంది కలి యుగంలో ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు.

కాలాముఖి శాఖ

కాకతీయుల కాలంలో కాలముఖి, పాశుపత, ఆరాధ్య శైవ శాఖలు వుండేవి. తొలి కాకతీయ రాజులు కాలాముఖిశాఖను పోషించారు. రెండవ బేతరాజు రామేశ్వర పండితుని శిష్యుడు. ఈ పండితుడు శ్రీశైల మఠాధిపతి, కాలాముఖి శాఖకు చెందినవాడు. రామేశ్వర పండితునికి బేతరాజు వైనజపల్లి అనే గ్రామాన్ని బహుకరించి శివపురం అని పేరు పెట్టారు. 

పాశుపత శైవం 

కాకతీయుల కాలపు శైవ మత చరిత్రలో గణపతి దేవుని పరిపాలనాకాలం ఒక మైలురాయి వంటిది. గోళకి మఠ శైవమతాచార్యులు ఈ కాలంలో ఆంధ్రదేశంలో ప్రవేశించి అతి త్వరలో ప్రజల ఆదరణ పొందగలిగారు. కాలముఖి శైవ మత శాఖకు ప్రజల ఆదరణ తగ్గడం ఆరంభించింది. ఈ రెండు శాఖల వారికి సిద్ధాంతాలలో తేడా లేదు గానీ, పూజా విధానంలో, ఆచార వ్యవహారాలలో వ్యత్యాసం కలదు.గణపతి దేవునికి శివ దీక్ష ఇప్పించిన రాజ గురువు విశ్వేశ్వర శివుడు. ఇతడు గోళకి మఠానికి చెందిన పాశుపత శైవాచార్యుడు. గోళకి మఠ శైవ ఆచార్యులను గురించి కాకతి రుద్రాంబ మల్కాపురం శాసనం తెలుపుతుంది. తండ్రి కోరిక మేరకు కాకతి రుద్రాంబ విశ్వేశ్వర శివునకు క్రీ||శ|| 1261 లో మందారమ్ గ్రామాన్ని కృష్ణ లంకలో కలిపి దానం చేసినట్లు మల్కాపురం శాసనం పేర్కొంటుంది. దానాన్ని స్వీకరించిన విశ్వేశ్వర శివుడు మందడం గ్రామంలో ఒక శివాలయం, శుద్ధ శైవ మఠం కట్టించాడు. దీనికి అనుబంధంగా ఒక సత్రం నిర్మించాడు. ఈ గ్రామానికి విశ్వేశ్వర గోళకి అని పేరు పెట్టినాడు. శాసనంలో విశ్వేశ్వర శివుడు చేసిన దానాలు, ఇతర మంచి కార్యాలు వివరించబడి ఉంది. 

ఆరాధ్య శైవం 

ఈ మత ప్రాచీన కాలం నుండి ప్రచారంలో వుంది. మత గురువులు 12 మంది, రేవన, మరుల, ఏ కోరామ అను ముగ్గురు శైవాచార్యులను సిద్ధ త్రయం అని, ఉద్భటారాధ్య, వేమనారాధ్య, విశ్వారాధ్య అను ముగ్గురు ఆచార్యులకు ఆరాధ్య త్రయమని పేరు. శ్రీ కంఠాచార్య, హరదత్తా చార్య, భాస్కరాచార్య అనే ముగ్గురు ఆచార్యులకు ఆచార్య త్రయమని పేరు. శ్రీపతి పండిత, మల్లిఖార్జున పండిత, మంచన పండిత అనే ముగ్గురు ఆచార్యులకు పండిత త్రయమని పేరు. ఈ 12 మంది గృహస్థులే. వీరు వైదిక సాంప్రదాయాలను, ఆచారాలను పాటించారు. ఈ ఆచార్యుల బోధనలను అనుసరించి బ్రాహ్మణులకు ఆరాధ్యులకు లేక లింగదారులు అని పేరు. పండిత త్రయంలో ఒకడైన మల్లిఖార్జున పండితుడు చందవోలు రాజు అయిన వెలనాటి రెండో రాజేంద్రచోళుని సమకాలికుడు. మల్లిఖార్జున పండితుని జీవిత గాథను పాల్కురికి సోమనాధుడు పండితారాధ్య చరిత్ర అనే ద్విపద కావ్యంగా రచించినాడు. కన్నడ దేశంలో విజృంభించిన వీర శైవ మతానికి ఆంధ్ర దేశంలో ప్రోత్సాహం లభించ లేదు. ఆంధ్ర దేశంలో వీర శైవుల సంఖ్య చాలా తక్కువ. వీర శైవులనే లింగాయుతులు అంటారు. కాకతీయుల కాలం నాటి శైవ మఠాలు మత కేంద్రాలే కాకుండా గొప్ప విద్యా కేంద్రాలుగా ప్రజలకు ఉపయోగపడినాయి. ఈ మఠాలకు అనుబంధంగా విద్యా మండపాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో వేదాలు, వ్యాకరణం, తర్కం, సాహిత్యం , శైవాగమము, వైద్యం తదితర విద్యలు బోధించెడి వారు. ఆధ్యాపకులకు భృత్యముగా భూమిని ఇచ్చేవారు. ఆనాడు శ్రీశైలం ఒక గొప్ప విద్యా మండపంగా ప్రసిద్ధి చెందినది. 

వైష్ణవ మతం 

కాకతీయుల కాలంలో ప్రజల ఆదరణను పొందిన మరో మతం వైష్ణవ మతం. కాకతీయులు శైవ మతాన్ని పోషించినప్పటికి వైష్ణవ మతానికి వ్యతిరేకులు కారు. వారి ముద్రల పైన వరాహలాంఛనం. త్రికూటాలయంలో విష్ణువును ప్రతిష్టించటం బట్టి కాకతీయులు వైష్ణవాన్ని కూడా ఆదరించారని తెలుస్తుంది. హనుమకొండలో కాకతి రుద్రుడు నిర్మించిన వేయి స్తంభాల గుడిలో శివ, వాసుదేవ, సూర్య విగ్రహాలను ప్రతిష్టించాడు. అతని మంత్రియైన గంగాధరుడు విష్ణు భక్తుడైన స్మార్తుడు. ఇతడు హనుమకొండలో ఒక ఆలయం నిర్మించి ప్రసన్న కేశవుని ప్రతిష్టించాడు. గణపతి దేవుని చెల్లెలు మైలాంబ ఇను గుర్తిలో గోపాలకృష్ణునికి ఒక ఆలయాన్ని నిర్మించింది. ప్రతాపరుద్రుని సేనాని దేవరి నాయకుడు రాజాజ్ఞతో కావేరి నది తీరాన గల రంగనాధ స్వామికి పలకలవీడు అను గ్రామాన్ని దానం చేసాడు. ప్రతాపరుద్రుని భార్య లక్ష్మీదేవి ఎలిగేడు గ్రామంలో గల దాయనాధ దేవునికి దానం చేసింది.


 RELATED TOPICS 

కాకతీయులు

తొలి కాకతీయ రాజులు 

స్వతంత్ర కాకతీయులు

ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు 

కాకతీయుల పరిపాలనా విధానం

కాకతీయుల కాలం నాటి  సాంఘిక పరిస్థితులు

 కాకతీయుల కాలంలో ఆర్ధిక పరిస్థితులు

కాకతీయల సాహిత్య సేవ