ఉత్తర భారతదేశంలో ఢిల్లీ కేంద్రంగా తురుష్క ముస్లిం రాజ్యం క్రీ||శ|| 1206 లో నెలకొల్పబడింది. ఢిల్లీ నేలిన తొలి వంశం బానిస వంశం. వీరి కాలమంతా ఉత్తర దేశ రాజ్య వ్యవహారాలతోనే గడిచిపోయింది. రెండవది ఖల్జీ వంశం. ఈ వంశంలో ప్రసిద్ధుడు అల్లాఉద్దీన్. దక్షిణ హిందూదేశం పై జరిగిన మొట్టమొదటి తురుష్క ముస్లిం దండయాత్ర ఇతని నాయకత్వంలో క్రీ||శ|| 1294 లో జరిగింది. ఈ సంఘటన సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో జరిగింది. ఈ సందర్భంగానే అల్లాఉద్దీన్ దక్షిణ దేశంలో అపార సంపదను గూర్చి రాజుల అనైక్యతను గూర్చి తెలుసుకున్నాడు. తాను సుల్తానైన పిమ్మట ఉత్తరాపథంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పి పెరిగిన తన సైనికావసరాలకు తగిన నిధులను సమకూర్చుకొనుటకు దక్షిణ దేశ సంపదను తరలించుకు పోవాలని సంకల్పించి సేనాని మాలిక్ కపూర్‌ను దండుతో పంపినాడు. కనుక అల్లాఉద్దీన్ దక్షిణ దేశ దండయాత్రలలోని ప్రధానోద్దేశము ధన సంపాదనే గాని రాజ్య విస్తరణ కాదు. పరాజితులైన దక్షిణ రాజుల నుండి కప్పము వసూలు చేయుటయే అతని ఆశయం. ఇట్టి విపత్కర పరిస్థితుల్లో సైతం దాక్షిణాత్య ప్రభువుల్లో పరస్పర సహకార భావం కొరవడటం శోచనీయం.

ఓరుగల్లు పై జరిగిన తురుష్క దండయాత్రను గూర్చి విభిన్న కథనాలున్నాయి. ప్రతాప చరిత్ర నుండి స్థానిక చరిత్రలు విలస కలువచేరు తామ్ర శాసనాల ప్రకారం తురుష్కులు ఓరుగల్లు పై ఎనిమిది లేక తొమ్మిది సార్లు దండయాత్రలు జరిపినారు. కాని ముస్లిం చరిత్రకారుల రచనలు ఈ దాడులు ఐదు మాత్రమేనని తెల్పుతున్నాయి. మొదటి దండయాత్ర క్రీ||శ|| 1303 లో జరిగింది. అల్లాఉద్దీన్ మాలిక్ ఫక్రుద్దీన్ జునా నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని బెంగాలు మీదుగా ఓరుగల్లు పైకి పంపినాడు. ఈ సైన్యాన్ని రేచర్ల వెన్నసేనాని పోలుగంటి మైలి అను కాకతీయ సేనానులు కరీంనగర్ జిల్లాలోని ఉప్పరపల్లి వద్ద ఓడించి తరిమి వేశారు. ఈ పరాజయంతో అల్లాఉద్దీన్ కు ఓరుగల్లు పై కసి పెరిగింది. ఉత్తర హిందూ స్థానంలో పరిస్థితులను చక్కబరుచుకొని క్రీ||శ|| 1309 లో మాలిక్ కపూర్ సేనాని నాయకత్వంలో రెండవ దండయాత్రను పంపినాడు. ఈ దండయాత్ర వివరాలను అమీర్‌ఖుస్రూ, జియాఉద్దీన్ బరానీలు అందించారు. కపూర్ దేవగిరి చేరి అచట నుండి బసీర్ ఘర్, సిర్పూర్, కూనర్బాల గుండా హనుమకొండకు చేరి అచట నుండి ఓరుగల్లు ముట్టడి జరిపినాడు. నెలరోజుల పాటు ముట్టడి కొనసాగింది. పరిసర గ్రామాలు దహించి వేయబడినాయి. పౌరజనం నానా కష్టాలకు గురియైనారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుకు ఏటేటా కప్పం చెల్లించడానికి అంగీకరించినాడు. కాని అల్లా ఉద్దీన్ మరణానంతరం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులనాసరాగా తీసుకొని ప్రతాపరుద్రుని కప్పము చెల్లింపు నిలిపివేయుట వలన ముబారక్ షా ఖిల్జీ నియమించిన ఖుస్రూఖాన్ ఓరుగల్లు పై దాడి జరిపి ప్రతాపరుద్రుని నుండి పెద్ద మొత్తంలో ధనము వసూలు చేసినట్లు అమీర్‌ఖుస్రూ ఇసామీలు వ్రాశారు.

నాలుగు, ఐదు దండయాత్రలు తుగ్లక్ వంశ స్థాపకుడైన ఘియాజుద్దీన్ తుగ్లక్ (క్రీ||శ|| 1320-25) కాలంలో జరిగాయి. ఈ దండయాత్రల ప్రధానాశయం రాజ్య సంపాదన, ధన సంపాదన కాదు. నాల్గవ దండయాత్రను నిర్వహించినవాడు ఉత్థాఖాన్ బిరుదాంకితుడైన యువరాజు జునాఖాన్ (తరువాతి మహమ్మద్ బీన్ తుగ్లక్) ఇతడు దేవగిరి, కోటగిరుల మీదుగా ఓరుగల్లు చేరి ముట్టడి ప్రారంభించినాడు. ముట్టడి ఆరుమాసాల పాటు కొనసాగింది. ఈ లోపున ఘియాజుద్దీన్ తుగ్లక్ మరణించినాడనే పుకార్లు వ్యాపించి సైన్యంలో కలతలు, అవిధేయత పెరిగాయి. మార్గాంతరం లేని యువరాజు ముట్టడి విరమించి తిరోగమించినాడు. తిరోగమిస్తున్న ఢిల్లీ సైన్యం పైబడి కాకతీయ సైన్యం అపార నష్టం కలిగించింది.

జునాఖాన్ దేవగిరి చేరినాడు. ఢిల్లీ నుండి అచటకు వచ్చిన సైన్యముతో బయలుదేరి బీదర్ బోధన్ నగరాలను ఆక్రమించి మరల క్రీ||శ|| 1323లో ఓరుగల్లు ముట్టడి ప్రారంభించినాడు. పదేపదే మహమ్మదీయ దండయాత్రలకు గురియైన కాకతీయ రాజ్య సైనిక పాటవం సన్నగిల్లింది. ఆర్థిక పరిస్థితి నీరసించింది. ప్రజల్లోను సైన్యంలోను నైతిక బలం దెబ్బతిన్నది. పలు పరాజయములు ఎదురైనను సైన్య నిర్వహణలోను, ఆయుధ సంపత్తిలోను కాలానుగుణ్యమైన మార్పులు రాలేదు. వర్ణవ్యత్యాసాల వల్ల సైన్యంలో ఐకమత్యం కొరవడింది. రెడ్డి, వెలమ వివాదాల వలన రెడ్లు ప్రతాపరుద్రునికి దూరమయ్యారు. ఇందుకు బొబ్బారెడ్డి అనే సేనాని క్లిష్ట సమయంలో కాకతీయ సైన్యం నుండి వైదొలగుటయే నిదర్శనం. పరిస్థితులివిధంగా ప్రతికూలించినా ప్రతాపరుద్రుడు శక్తి కొలది వీరోచితంగా పోరాడి పరాజితుడై బందీగా చిక్కినాడు. షమ్స్. ఇ. సిరాజ్ ఆఫీఫ్ రచనల వల్ల ప్రతాపరుద్రుడు ఢిల్లీకి తీసుకొని పోబడుతూ నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రదేశం 23 వ రాష్ట్రంగా ఢిల్లీ సామ్రాజ్యంలో చేర్చబడింది. ఆంధ్ర నగరి ఓరుగల్లు సుల్తాన్ పూర్ గా మారింది. తుగ్లక్ వంశ ప్రతినిధులు ఆంధ్రదేశ పాలకులైనారు.

 RELATED TOPICS 

కాకతీయులు

తొలి కాకతీయ రాజులు 

స్వతంత్ర కాకతీయులు

కాకతీయుల పరిపాలనా విధానం

కాకతీయుల కాలం నాటి  సాంఘిక పరిస్థితులు

 కాకతీయుల కాలంలో ఆర్ధిక పరిస్థితులు

కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు 

కాకతీయల సాహిత్య సేవ