కేంద్ర ప్రభుత్వం 

కాకతీయ రుద్రదేవుడు, బద్దెన, మడికి సింగన మొదలగు వారి రాజనీతి గ్రంథాలు నాటి శాసనాలు కాకతీయుల పాలనా వ్యవస్థను గురించి వివరిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగానికి రాజు సర్వాధికారి. సిద్ధాంతరీత్యా అధికారమంతా రాజుదే. అయితే ఆచరణలో ఆతని అధికారానికి కొన్ని పరిమితులు వుండేవి. వర్ణ ధర్మము. కుల ధర్మము, ఆచారం, సంప్రదాయం, శాస్త్ర నియమాలు ఎవరైనా పాటించవలసిందే. శాసనాలలో చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు తరచుగా కనపడుతుంది. ధర్మశాస్త్రాలు ముఖ్యంగా రాజనీతి శాస్త్రం, కళలు సాహిత్యాలలో మంచి ప్రవేశం వున్నవారు మాత్రమే రాజు కావాలని రాజనీతి సూత్రకారుల అభిప్రాయం. రాజు ప్రజలను కన్నబిడ్డలుగా భావించి వారి ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని శాస్త్రకారులు తెలిపారు. గణపతి దేవుడు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారుడు. కాబట్టి వారికి శాస్త్రకారులు నిర్ణయించిన అర్హతలు వున్నాయని గ్రహించవచ్చు. నిర్ణీత సమయంలో రాజు ప్రజలకు దర్శనం ఇవ్వవలెననీ అందువలన ప్రజలు తమ కష్టాలను తెలుపుకోవడానికి అవకాశం వుంటుందని నీతి సారం చెబుతుంది. కాకతీయ రాజు సార్వభౌమత్వ సూచకమైన బిరుదులేవి ధరించకపోవడం కొంత ఆసక్తికరమైన విషయం. సమధిగత సంచమహాశబ్ద, మహామండలేశ్వర మొదలైన సామంత రాజ బిరుదాలను వారు కొనసాగించారు. కాకతీయుల రాజ్యం శీఘ్రగతిని విస్తరించినందువలన రాజుల ఆడంబరం, దర్బారు వైభవం పెరిగాయి. పెరుగుతున్న అధికార హోదాలకు అనుగుణంగా బిరుదులు ధరించడం జరిగింది. అంగరక్షకులు, రాజ ప్రతినిధి, కార్యకర్త, రాయసం మొదలగు వారు రాజు యొక్క అంతరంగిక అనుచరులు. 

మంత్రి పరిషత్తు 

రాజ్య చక్రంలోని సప్తాంగాలలో మంత్రి ఒక ముఖ్య అంగము. మంత్రులను నియమించేటప్పుడు కాకతీయులు నీతిశాస్త్ర ముక్తావళి విషయాలను ఖచ్చితంగా పాటించారని వారి మంత్రుల సామర్థ్యాన్ని బట్టి గ్రహించవచ్చును. రాజనీతి సూత్రాలన్నింటిని కాకతీయులు పాటించినట్లు కనిపించదు. కాకతీయుల రాజుల మంత్రులలో బ్రాహ్మణులే కాక అన్ని కులాలకు చెందినవారు కలరు. వ్యక్తుల అర్హతను గుర్తించి మంత్రి పదవులు ఇచ్చినట్లు కనిపిస్తుంది. మంత్రి పదవిని ఇచ్చిన వ్యక్తికి పల్లకి, శ్వేత పత్రం, ప్రత్యేక దుస్తులు, జాగీరు, ఆభరణాలు, సుగంధ దినుసులు ఇవ్వడం ఆచారం. కాకతీయుల కాలంలో ఎంత మంది మంత్రులతో రాజ్య వ్యవహారాలను చర్చించడం రాజు దినచర్యలో ముఖ్య భాగం. 

ఉద్యోగ వర్గం 

కాకతీయుల శాసనాలలో మహా ప్రధాని, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి మొదలగు 72 నియోగాలు సైనిక పౌరశాఖల ఉద్యోగుల పేర్లు కన్పిస్తాయి. గణపతి దేవునికి మల్యాల హేమాద్రి రెడ్డి ప్రధాని. ప్రతాపరుద్రునికి ముప్పిడి నాయకుడు మహా ప్రధాని. అన్ని శాఖలను కలిపి బహత్తర నియోగాధిపతి. ఉద్యోగులలో పేర్కొనదగినవారు తంత్రపాలుడు, శాసనాధికారి, పడాలుడు, శ్రీకరణ, తత్పరులు, శ్రీభండారులు, శాసనాధికారి, సుంకాధికారి, అడపం, ఆతపట్టం, కొట్టరువు, అంగరక్షకుడు, నగరి శ్రీవాకిలి, నగరి అధికారి, తలారి, సావాసి మొదలగువారు.

నాయంకర విధానం 

కాకతీయుల సైనిక పరిపాలనను నాయంకర విధానం అని అంటారు. రాజుకు పరిపాలనలో సహాయం చేసే వర్గం వారినే నాయంకరులు అనేవారు. ఈ విధానాన్ని రుద్రమ దేవి ప్రవేశ పెట్టింది. ఆమె వారసుడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ విధానం సమర్థవంతంగా పని చేసిందని చెప్పవచ్చును. నాయంకర విధానం అనగా ఒక విధమైన జాగీర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనా అధికారులుగా, సైన్యాధ్యక్షులుగా నియమించేవారు. ఈ పాలకులనే నాయంకరులు అనేవారు. నాయంకరులు తమ మండలంలో వచ్చే ఆదాయంతో నిర్ణీతమైన సైన్యాన్ని పోషించి యుద్ధ సమయాలలో రాజుకు తోడ్పడే వారు. ప్రతాపరుద్రుని కాలంలో నాలుగో వంతు భూమి వీరి ఆధీనంలో వుండేది. కాకతీయుల కాలంలో 75 మంది నాయంకరులు వున్నట్లు తెలుస్తుంది. ఈ నాయంకర విధానంలోని ప్రధాన లోపం కేంద్రాధికారం బలహీనమైనప్పుడు నాయంకరులు తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం . 

స్థానిక పాలన 

కాకతీయ సామ్రాజ్యం స్థలం, సీమ, నాడు, పాడిచ, భూమి, కంపన అనే ప్రాంతీయ విభాగాలుగా పరిపాలన సౌలభ్యార్థం విభజింప బడింది. 60 గ్రామాల వరకు గల సముదాయాన్ని స్థలంగా వ్యవహరించేవారు. స్థలానికి స్థలకరణం తదితర ఉద్యోగులు, వారి కార్యాలయాలు వుండేవి. అనేక స్థలాల సముదాయమే నాడు. నాడు అధికారులను రాజు నియమించేవాడు. ప్రాంతీయ పాలనను నాయంకరులు చూసేవారు. పరిపాలనలో చివరిది గ్రామం. గ్రామాలలో నాడు రెండు రకాలు కలవు. అవి పన్నులు కట్టవలసిన బాధ్యత లేని గ్రామాలు, పన్నులు కట్టవలసిన గ్రామాలు. అన్ని గ్రామాలలోను గ్రామాధికారుల సముదాయానికి ఆయగార్లు అని పేరు. ఆయం అనగా పొలము యొక్క విస్తీర్ణము. గ్రామసేవ చేసినందుకు పన్ను లేకుండా భూమిని పొందిన వారిని ఆయగార్లు అంటారు. ఆయగార్ల సంఖ్య 12. వారు కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, చర్మకారుడు. మొదటి ముగ్గురు ప్రభుత్వ సేవకులు. కరణం విధులు గ్రామ విస్తీర్ణం సాగుభూమి, తోటభూమి, పోరంబోకు, గడ్డి భూములు వాటి విస్తీర్ణం, వ్యక్తుల ఆస్తులు లెక్కలు మొదలగునవి కరణం ఇచ్చే లెక్కల ప్రకారం రెడ్డి పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి అందచేసేవాడు. తలారి గ్రామ రక్షక భటుడు. ఆయగార్లకు పన్నులు లేని భూములేకాక పంటలో కూడా వాటా వుండేది. ఆయగార్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి వంటివారు

న్యాయ పాలన 

కాకతీయ న్యాయ నిర్ణయంలో, నిర్వహణలో సాంప్రదాయకమైన విధానాలను అనుసరించారు. సాధారణంగా సామాన్యమైన వివాదాలన్నీ గ్రామ సభలలో పరిష్కరింపబడేవి. గ్రామంలో దొంగతనాలు జరగకుండా చూసే బాధ్యత తలారిది. రాజ్యంలో ఉన్నత న్యాయస్థానం రాజాస్థానం. రాజాస్థానాలలో ప్రాడ్వివాకులు అనే ప్రత్యేక న్యాయాధికారులు వుండేవారు. వీరు న్యాయ శాస్త్రంలో, ధర్మ శాస్త్రాలలో చక్కని పాండిత్యం కలిగి ఉండేవారు. గ్రామాలలో తగాదాలు పరిష్కరించడానికై రాజాజ్ఞ పై ఒకరిద్దరు అధికారులు స్థానిక సభల ద్వారా మహా జనుల సహకారంతో న్యాయ నిర్ణయం చేసేవారు. ప్రత్యేక నేరాలను విచారించటానికి నిపుణులతో కూడిన ధర్మాసనాలు ఏర్పాటు చేయబడేవి. ఈ ధర్మాసనాలను ప్రాచీన స్మృతి గ్రంథాలలో చెప్పబడిన సూత్రాలననుసరించి ఏర్పాటు చేసేవారు. ఈ ధర్మాసనాలు చేసిన తీర్పులను జయపత్రాలు అనే పేరుతో రాజ ముద్రిక వేసి ఇచ్చేవారు. 

పన్నులు 

ప్రభుత్వానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయ మార్గము. వర్తకం, పరిశ్రమలు, వృత్తుల పై విధించే పన్నులు రెండో ఆదాయమార్గము. పశుగ్రాసానికి పనికి వచ్చే పచ్చిక బయళ్ళ పై వసూలు చేసే పన్ను, అప్పనము, ఉపకృతి మొదలైనవి సాంప్రదాయంగా వస్తున పన్నులు. రాజును దర్శించేటప్పుడు ఇచ్చే కానుక దర్శనము. మేలుకు ప్రతిఫలంగా ఇచ్చేది ఉపకృతి. అకారణంగా ఇచ్చేది అప్పనము. సాగుచేసిన భూమిని వెలిచేను, నీరు, నేల, తోటభూమి అనే మూడు తరగతులుగా విభజించేవారు. ప్రతి పొలాన్ని గడ లేక దండతో కొలిచేవారు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క గడను వాడేవారు. కేసరి పాటి గడ అనునది ఎక్కువగా వాడుకలో వున్న గడ. ఈ గడ మొదట గుంటూరు జిల్లా కేసరిపాడులో వాడబడింది. అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది. వెలిచేనును పుట్టితో కొలిచేవారు. ప్రతి గ్రామంలో రాజుకు వుండే సొంత పొలాన్ని రాచదొడ్డి అనేవారు. ఒకసారి పండే భూమి కూడా వుండేది. పంట పండినప్పుడే ఈ భూమి పై పన్ను వుండేది. బ్రాహ్మణులకు, దేవాలయాలకు దానమిచ్చిన భూముల పై కొద్దిపాటి పన్ను వుండేది. ఈ తరగతి భూములు కొన్నింటికి పన్ను మినహాయింపు పూర్తిగా ఉండేది. పన్ను రేటు పుట్టికి ఒక చిన్నం చొప్పున వుండేదని శాసనాల వలన తెలుస్తుంది. నీరు పొలం పై పన్నును కోరు అని, వెలి పొలం పై పన్నును పెట్టిహండి అని పిలిచేవారు. భూమి శిస్తును ధన రూపంలో గానీ, ధాన్య రూపంలో గాని వసూలు చేసేవారు. పన్నులు వసూలు చేయడానికి కొలకాండ్రు అనే అధికారులు వుండేవారు. భూమి శిస్తును అరి అనేవారు. పన్ను కట్టవలసిన రైతులను అరిగాపులు అనేవారు. ప్రజలు ప్రతి సంవత్సరము కార్తీక మాసం, వైశాఖ మాసాలలో పన్నులు చెల్లించేవారు. కాకతీయ శాసనాల ప్రకారం అమ్మిన వస్తువుల పై వేసే సుంకం అమ్మబడిన సుంకం, వస్తువుల గోతాలను మోసే ఎడ్లబండి పై వసూలు చేసే సుంకం పెరికెఎడ్ల సుంకం. గానుగ పెట్టుకొనేందుకు చెల్లించేది గానుగల ముద్ర సుంకం. గానుగ ఆడించినందుకు చెల్లించేది గానుగపు అరి సుంకం. బండ్లు, గుర్రాలు వున్నవారు కూడా సుంకాలు చెల్లించేవారు. ఉప్పు పరిశ్రమ ప్రభుత్వపు గుత్తగా వుండేది. చినగంజాం, పెదగంజాం, కడుకుదురు, కనుపర్తి దేవరం పల్లి మొదలగునవి నాటి ఉప్ప పరిశ్రమ కేంద్రాలు. గడ్డి మీద వేసే పన్నును పుల్లరి అనేవారు. గొర్రెల మంద పై వేసే పన్ను అడ్డ సుంకం. తలారి పన్ను, ఒంటు పన్ను మొదలైనవి గ్రామస్థులు ఆయా అధికారుల పోషణ నిమిత్తం ఇచ్చే పన్నులు. దీని వలన కాకతీయుల కాలంలో పన్నుల భారం అధికమని మనకు తెలుస్తున్నది. 

సైనిక వ్యవస్థ 

కాకతీయుల సైనిక వ్యవస్థను గురించి తెలుసుకోవడానికి రాజనీతి గ్రంథాలు కొంత వరకు ఉపయోగపడుతున్నాయి. బద్దెన రచించిన నీతి శాస్త్ర ముక్తావళి, మడికి సింగన రచించిన సకల నీతి సమ్మతం ఇచ్చే సమాచారం ఆయా గ్రంథకర్తలు రాజోద్యోగులైనందున వాస్తవమని భావించవచ్చును. కాకతీయులు పెద్ద సైన్యాన్ని పోషించి నారు. కాకతీయ సైన్యంలో చక్రవర్తి సైన్యం, నాయంకర సైన్యం అనే రెండు విభాగాలు వుండేవి. సర్వ సైన్యాధిపతి చక్రవర్తి. సైన్యాన్ని నడపడానికి దండ నాయకులు, మహాదండనాయకులు, సైన్యాధిపతులు, సైన్యాధ్యక్షులుండే వారు. కాకతీయ రాజులు సైన్యానికి స్వయముగా నాయకత్వం వహించేవారు. దేశీయ, విదేశీయ శత్రువుల బారి నుండి రాజ్యాన్ని రక్షించడం కోసం కాకతీయులు తమ శక్తిలో అధిక భాగము వెచ్చించే వారు. దేశ రక్షణలో కోటలు కీలక పాత్ర వహించేవి. కాకతీయులు సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజ్య పాలనా వ్యవస్థను తీర్చిదిద్దారు. తమ రాజ్యంలో కొంత భాగాన్ని నాయంకరులుగా విభజించి సైనిక అధికారులకు పంచి పెట్టారు. నాయంకరులు తమ ఆధీనంలోని నాయంకరుల పై వచ్చే ఆదాయంలో కొంత భాగం సొంత ఖర్చులకు వాడుకొని మిగిలిన భాగంలో కొంత రాజుకు కప్పంగా, మిగిలిన దానిని రాజు సేవ కొరకు, సైన్యాన్ని పోషించడానికి ఉపయోగించాలి. దీనినే నాయంకర విధానం అంటారు. కాకతీయ సైన్యంలో కాల్బలం, అశ్వక దళం, గజ దళం వుండేవి. అన్ని కులాల వారికి సైన్యంలో ప్రవేశం వుండేది. సైనిక వృత్తిని అవలంభించే వారికి యుద్ధ విద్యలలో మంచి శిక్షణ ఇచ్చేవారు. గుర్రాలకు, ఏనుగులకు శిక్షణ ఇవ్వడానికి అశ్వ సాహిణులు, గజ సాహిణులు వుండేవారు. రాజు రక్షణకు అంగరక్షకులు వుండేవారు. వారు రాజును తమ దైవంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడుతూ రాజుతో పాటు మరణించడానికి కూడా సిద్ధపడేవారు. కాకతీయుల కాలం నాటి ప్రధాన ఆయుధాలు కత్తి, బల్లెం, ధనుర్భాణాలు కూడా ఎక్కువగా వాడేవారు. 


 RELATED TOPICS 

కాకతీయులు

తొలి కాకతీయ రాజులు 

స్వతంత్ర కాకతీయులు

ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన తురుష్క దండయాత్రలు 

కాకతీయుల కాలం నాటి  సాంఘిక పరిస్థితులు

 కాకతీయుల కాలంలో ఆర్ధిక పరిస్థితులు

కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు 

కాకతీయల సాహిత్య సేవ


Tags :   Kakatiya Dynasty   Central Governement  

 Nayankara System   Military System  

 Ganapati Deva   Pratapa Rudra   

  Taxes    Local Government