అణచివేత ఉద్యమానికి పుట్టినిల్లు. సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నట్లు అసాంఘిక వ్యవస్థ. అణచివేత, నిరాదరణ స్థాయిని బట్టి సాంఘీక ఉద్యమాల పరిణామం ఉంటుంది. శతాబ్దాలుగా దురాచారాల నీడలో ఉన్న తెలంగాణ సమాజం సాయుధ పోరాటానికి సిద్ధపడింది. ఈ సందర్భంలోనే చరిత్రలో ముఖ్యంగా 19వ శతాబ్ద చివర భాగంలో 20వ శతాబ్ది తొలిభాగంలో వచ్చిన ఉద్యమాలను ప్రస్తావించాలి.

ఆంధ్ర జనసంఘం దళితుల అభ్యున్నతి, వారి దేవాలయ ప్రవేశానికి, వెట్టిచాకిరి వ్యతిరేకంగా పోరాడింది. సాంస్కృతిక సభలపై, గోష్టులపై ప్రభుత్వ నిషేధం ఉండరాదని డిమాండ్ చేసింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఇదే సందర్భంలో ఏర్పడింది. ఈ సంస్త నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా, భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా సత్యాగ్రహాలు, పికిటింగ్లు నిర్వహించేది. ఆ తరువాత కాలంలో ఆంధ్ర జనసంఘం పేరు ఆంధ్ర మహాసభగా మార్చి వార్షిక సమావేశాలు నిర్వహించింది. తెలంగాణలో అవ్యక్తమైన సాంఘీక అసంతృప్తిని వ్యవస్థీకృతం చేసి ఉద్యమ రూపాన్ని కల్పించింది. ఈసభ 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో ప్రధమ సమావేశాన్ని నిర్వహించింది. ఆ తరువాత కాలంలో కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభను తమ సిద్ధాంతాలకు అనుగుణంగా మార్చుకున్నారు. 1944-45 నాటికి ఆంధ్ర మహాసభ సాయుధ విప్లవ సంస్థగా రూపం మార్చుకుంది. సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామంచంద్రా రెడ్డి, ముగ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి లాంటి పెద్దలు ఈ ఉద్యమాన్ని నడిపారు. సాయుధ పోరాటం సాంఘీక సమస్యల్ని ప్రస్తావిస్తూ ఆర్థిక ఫలితాల కోసం రాజకీయ అవసరాన్ని ప్రజలకు నొక్కి చెప్పింది.

సంబంధిత అంశాలు :  దళిత ఉద్యమం

ఉద్యమ ప్రక్రియలు - ఫలితాలు

సాయుధపోరాటం మొదట్లో పన్నుల వ్యతిరేక పద్ధతి అవలంభించింది. నల్గొండ జిల్లాలోని ఆకునూరు, మాచిరెడ్డి పల్లి గ్రామాలలో ప్రజలు నిర్భంధ లేవీ వసూలును ఎదిరించారు. జనగామ తాలూకాలో భూస్వాములు దురాక్రమణ చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోడానికి రైతులు పోరాటం ప్రారంభించారు. ఈలోపునే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో నిజాం మరింత పట్టు బిగించాడు. తెలంగాణ వ్యాపితంగా పెచ్చు మీరిన పోలీసు దౌర్జన్యాలు, భూస్వాముల స్వైరవిహారాలు, కాశింరజ్వీ అనుయాయుల ఆగడాలు ప్రజాతంత్ర శక్తులకు సవాలుగా మారాయి. నల్గొండ జిల్లాలో కడివెండి, దేవరుప్పల, పాత సూర్యాపేటలో ఉద్యమానికి భూస్వాములకు హోరాహోరీ పోరాటం జరిగింది. ఈలోగా 1948 సెప్టెంబర్ 13న పోలీసు చర్యపేరుతో భారత దళాలు నైజాం సంస్థానాన్ని ముట్టడించాయి. ఉద్యమం అప్పటివరకు నైజాం సైన్యంతో పోరాడి అలసి ఉంది. కేంద్ర సైనిక దళాలు కమ్యూనిస్టు కార్యకర్తలను ఉద్యమాన్ని తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నాయి. దీనితో పోరాటం కొనసాగింది. ప్రజలు నైజాం నుంచి విముక్తి-విమోచన పేరుతో ఉద్యమంలో పాల్గొన్నవారు పోలీసు చర్యతో తమ లక్ష్యం నెరవేరినట్లు భావించారు. అయితే విశాల అసాంఘిక వ్యవస్థ-దురాచారాలు వాటికి విప్లవ పూర్వక పరిష్కారాలు వారి తాత్కాలిక లక్ష్యాలు కావు. దానితో ఉద్యమం ప్రజలను జాగృతం చేయలేకపోయింది. ఒకవైపు విప్లవ ప్రతీఘాత శక్తులైన భూస్వాములు ఇతర రాజకీయ పార్టీలకు సన్నిహితం కావడం - మరోవైపు సాయుధ సైనిక దళాలు ఉద్యమకారులను ఏరివేయడంతో ఉద్యమం ఆత్మరక్షణలో పడింది. కొండలకు కోనలకు, మారు మూల పల్లెలకు పరిమితం అయింది. ఈ ఉద్యమనాయకత్వంలో విభేదాలు పొడచూపి కొందరు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆ ప్రాంత సరిహద్దు ఆంధ్ర ప్రాంతాల నుంచి వనరుల పరమైన, సిద్ధాంతపరమైన, వ్యవస్థాపరమైన మద్దతు అందుతూ ఉండేది. ప్రభుత్వం దీన్ని గమనించి ఈ సహాయం అందకుండా నిలిపివేసింది.

సంబంధిత అంశాలు : తెలంగాణ సాంఘీక వ్యవస్థ దురాచారాలు

తెలంగాణ సాయుధ పోరాటం - వివిధ దశలు

తెలంగాణ సాయుధ పోరాటం మూడుదశల్లో నడిచింది. ఉద్యమ తొలినాళ్ళలో జనసామాన్య తిరుగుబాటుగా మొదలై తరువాత రెండో దశలో రైతాంగ పోరాటంగా చివరకు మూడో దశలో సాయుధ పోరాటంగా రూపాంతరం చెందింది. అణచివేతకు-నిరాదరణకు గురై ప్రజాబాహుళ్యానికి తిరుగుబాటు నినాదం ఎంతో స్ఫూర్తినిచ్చింది. గ్రామీణ కులాలు వర్గాలు సాంఘీక అవ్యవస్థకు లోనై అనుభవించిన దురాగతాల నేపధ్యంలో తిరుగుబాటు పిలుపు సాంఘిక చైతన్యానికి తద్వారా మార్పుకు నాంది పలుకుతుందని వారు భావించారు. ఇది జనసామాన్య తిరుగుబాటుదశ.

రెండోదశలో ఉద్యమంలోని కొన్ని నినాదాలు దున్నేవానిదే భూమి, న్యాయమైన కౌలుదారీ రేట్లు, జాగీర్దారీ -ఇనాందారీల రద్దు, న్యాయమైన సక్రమమైన కూలీరేట్లు మొదలైనవి చిన్నకారు, సన్నకారు రైతుకూలీలను సమీకృతం చేశాయి. ఈ దశ రైతాంగ పోరాటదశగా పేర్కొనవచ్చు.

చివరి దశ అయిన సాయుధ పోరాటంలో వివిధ వర్గాల సాంఘిక ఐక్యత ప్రస్ఫుటమౌతుంది. అలాగే ఉద్యమం ఆర్థిక సమస్యలతో పాటు సాంస్కృతిక-సాంఘీక సమస్యల ప్రస్తావన ఉద్యమాన్ని విస్తృత పరచింది. అయితే పోలీసు చర్య తరువాత ఉద్యమం లక్ష్యాలు అసంగతంగా అనిపించసాగాయి. దానితో బలహీనపడింది. చివరకు 1952లో సాధారణ ఎన్నికలకు ముందు ఉద్యమం ఆగిపోయింది.


సంబంధిత అంశాలు :  గిరిజన ఉద్యమాలు

ఉద్యమం రాజకీయంగా వైఫల్యం చెందినప్పటికీ, అదిలేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ఆ తరువాత ప్రభుత్వాలు ప్రయత్నించాయి. వెట్టిచాకిరి రద్దు, భూస్వాములు ఆక్రమించిన భూములను రైతులకు తిరిగి అప్పగించడం, రైతుల ఋణాల రద్దు, జాగీర్దారీ వ్యవస్థ రద్దు. 1950 సం॥లో వచ్చిన భూసంస్కరణల చట్టం దీనిలో పేర్కొనదగినవి. ఈ ఉద్యమం విఫలం కావడానికి కూడా ఎన్నోకారణాలు చెబుతారు. సిద్ధాంత పరంగా విప్లవనినాదం భారత సార్వభౌమాధికార జాతిరాజ్య వ్యవస్థను, దాని మనుగడను ప్రశ్నించేదిగా ఉంది. దానితో పోలీసుచర్య తరువాత ఉద్యమం మందగించింది. రెండోది కమ్యూనిస్టులలో సరైన పంథా కొరవడి నాయకత్వంలో విభేదాలు రావడం. మూడోది, ప్రధానమైనది వినోబాభావే చొరవ. వినోబాభావే తెలంగాణ ప్రాంతాలలో పర్యటించి భూదానోద్యమం పేరుతో కొన్ని వేల ఎకరాల భూమిని ధనవంతులనుంచి స్వీకరించి పేదలకు పంపిణీ చేసిన శాంతియుత ప్రక్రియ విప్లవం నుంచి ప్రజలను బయటపడవేసింది. హింస ప్రమేయం లేకుండా అహింసా పద్ధతిలో భూమి పంపిణీ జరగడమే దీనికి కారణం. ఉద్యమం విఫలమైనా అది లేవనెత్తిన సమస్యలపై ప్రజలకు చైతన్యం వచ్చింది. భూస్వాముల పునాదులు కదిలాయి. వెట్టిచాకిరి, జోగిని పద్దతులకు కాలం చెల్లింది. వివిధ వర్గాల ప్రజల్లో ఒకరి పట్ల ఒకరికి సానుభూతి పెరిగి సాంఘీక ఐక్యత నెలకొంది. ప్రజలు తమ భాష, మతం, సంప్రదాయం, సంస్కృతి- విలువల పట్ల జాగృతమయ్యారు.

సంబంధిత అంశాలు :  నక్సల్బరీ ఉద్యమం