పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జీలింగ్ జిల్లాలోని నక్సల్బరీ గ్రామంలో ఉద్యమం ప్రారంభమవడం వలన ఈ గ్రామం పేరు మీదుగా ఈ ఉద్యమానికి నక్సల్బరీ ఉద్యమం అని పేరు వచ్చింది. ఇదే ఉద్యమం తరువాత కాలంలో నక్సలైట్ ఉద్యమంగా ప్రాచుర్యం పొందింది. కాలక్రమేణా దీనికి ఒక ప్రత్యేక రాజనీతి సిద్ధాంతం ఏర్పడింది. రైతులు, భూమిలేని శ్రామికులు భూస్వాముల దోపిడీకి, అణచివేతకు; ఉన్నత కులాల భూస్వాముల ద్వారా నిమ్నవర్గాలవారు అణచివేతకు గురవుతున్న సందర్భాలకు వ్యతిరేకంగా ఈ నక్సల్బరీ రైతు ఉద్యమం 1967 మార్చి-ఏప్రిల్ నెలల్లో ప్రారంభమైంది. చారు మజుందార్, కాను సన్యాల్ ఈ ఉద్యమానికి ముఖ్య భూమిక పోషించారు. వీరి నాయకత్వంలో తేయాకు తోటలలో పనిచేస్తున్న రైతులకు అండగా మొదటిసారి సాయుధ తిరుగుబాటు జరిగింది.

సంబంధిత అంశాలు :  దళిత ఉద్యమం

1946 నాటి తేభాగా రైతు ఉద్యమం నక్సల్బరీ ఉద్యమానికి మార్గదర్శకమైనట్లుగా చెప్పవచ్చు. తేభాగా ఉద్యమం చూపిన బాటలోనే, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే నక్సలైట్ ఉద్యమం కొనసాగింది. తేభాగా కూడా ఉద్యమం జమీందార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటం. రైతు కూలీల జీవన విధానాన్ని మార్చడమే కాక యావత్ సమాజాన్ని ప్రక్షాళనం చేయడమే నక్సల్బరీ ఉద్యమ ప్రధాన లక్ష్యం. నక్సల్బరీ ఉద్యమాన్ని హింసాయుత ఉద్యమంగా నడిపించాలనేది నక్సలైట్ల ప్రధాన ఆశయంగా ఏర్పడింది. కేవలం నినాదాల ద్వారా అధికారం లభించదు, దానిని సాధించడానికి సాయుధ పోరాటం, హింసాయుత మార్గాలే శరణ్యమని వీరి నమ్మకం. సాధ్యమవుతుందని వీరి ప్రగాఢ విశ్వాసం. సామాజిక నిర్మితిలో మౌలికమైన మార్పులు సాధ్యమవ్వాలంటే పెద్ద భూస్వాములను, జాగీర్దారులను హతమార్చడం తప్ప వేరే దారిలేదనేది వీరి వాదన.

సంబంధిత అంశాలు :  గిరిజన ఉద్యమాలు

పంటలో పాలు పంచుకొని సాగుచేసే రైతులే డార్జీలింగ్ జిల్లాలో అధిక సంఖ్యలో ఉండేవారు. ఈ కారణం వల్లే నక్సలైట్ ఉద్యమాన్ని తొలుత ప్రారంభించింది, నడిపింది ఇలాంటి రైతాంగమే. మొదట్లో ఈ ఉద్యమం ఫనిసిదేవా, నక్సల్బరీ, ఖోరిబారి అనే గ్రామాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకే పరిమితమైనా తరువాత కాలంలో చాలా చోట్లకు వ్యాపించింది.

నక్సల్బరీ ఉద్యమం ప్రధానంగా భూస్వాములైన జోతేదార్లకు వ్యతిరేకంగా చెలరేగిన ఉద్యమం. ఈ ఉద్యమం వల్ల తక్షణ ప్రయోజనం కలగక పోయినప్పటికీ తరువాత కాలంలో దేశంలో జరిగిన అనేక రైతు ఉద్యమాలకు ఈ ఉద్యమమే స్ఫూర్తిదాయకమైనట్లు చెప్పవచ్చు. దేశం ఇతర ప్రాంతాలలో జరిగిన రైతు ఉద్యమాల మాదిరిగా నక్సల్బరీ ఉద్యమం సామాజిక నిర్మితిలో మార్పులను గురించి కానీ, భూస్వామ్య వ్యవస్థలో మార్పులను గురించి కానీ ప్రస్తావించలేదు. ఈ ఉద్యమం పాక్షిక భూస్వామ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న దోపిడీని సమూలంగా నిర్మూలించడానికి సిద్ధాంతపరమైన, ఆచరణ పరమైన ప్రతిపాదనలు చేసింది.

ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలకు కూడా ఈ ఉద్యమం వ్యాపించింది. ఈ జిల్లాలోని గిరిజన యువత, స్త్రీలు కూడా ఉద్యమంలో పాలుపంచుకొన్నారు. వెట్టిచాకిరీ నిర్మూలన, అటవీ భూముల ఉపయోగం, వేతనాలలో పెరుగుదల ఈ ఉద్యమంలో ప్రధానాంశాలుగా ఉండేవి. దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా పెంకయ్య, నాగభూషణం పట్నాయక్, ఆదిభట్ల కైలాసం, పంచాద్రి కృష్ణమూర్తి, తరిమెల నాగిరెడ్డి తదితర నాయకులు ఈ ఉద్యమ సారథులుగా ఉండేవారు.

తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని యువత కూడా ఈ ఉద్యమానికి ఆకర్షితులైనారు. ఈ ఉద్యమం మావోయిస్టు ఉద్యమంగా కూడా పేర్గాంచింది. ఈ ఉద్యమాన్ని ఆణచివేయడానికి రాష్ట్రస్థాయి ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు కూడా చేశాయి. తరువాత కాలంలో ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి ఉద్యమంలో భాగంగా గెరిల్లా రీతి పద్ధతులు అవలంభించడంతో, ఇటువంటి విధానాలు ఉద్యమానికి హానికరమని, ఉద్యమం పక్కదారి పడుతున్నట్లు భావించిన రైతులు, ఉపాంత రైతులు ఉద్యమం నుంచి నిష్క్రమించారు.

సంబంధిత అంశాలు : తెలంగాణలో సాంఘీక
ఉద్యమాల నేపథ్యం

నక్సల్బరీ ఉద్యమం, మావోయిస్టు నక్సలైట్ ఉద్యమాల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ సంబంధ హక్కులు, చిన్న ఉపాంత రైతుల సౌకర్యాలను పరిరక్షించే ఉద్దేశ్యంతో పలు ప్రగతిశీల చట్టాలు వెలువరించాయి. అంతే కాకుండా గిరిజనులు ఎదుర్కొంటున్నా భూ అన్యాక్రాంత సమస్యను సైతం కొంతమేర నిర్మూలించడం జరిగింది. తరాలుగా పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల హక్కులను ప్రభుత్వాలు గుర్తించాయి.