1947 ఆగస్టు 15వ తేదీన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా నిజాం మాత్రం తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయబోనని స్పష్టమైన ప్రకటన ఇవ్వడంతో భారత ప్రభుత్వానికి తప్పని సరి పరిస్థితులలో నిజాం రాజ్యంపై పోలీసు చర్య జరపవలసిన ఆవశ్యకత ఏర్పడింది. హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్యను 'ఆపరేషన్ పోలో'గా కూడా పిలుస్తారు. నిజాం రాజ్య వ్యవహారంలో కాలయాపన చేయడం అనర్థాలకు మూలమని భావించిన భారత ప్రభుత్వం రాష్ట్రంలో దుష్ట సంహారం చేసి శాంతిభద్రతలను నెలకొల్పడానికి 1948 సెప్టెంబరు 13వ తేదీన హైదరాబాదు రాష్ట్రంపై పోలీసు చర్యను ప్రారంభించింది. ఉత్తరాన ఔరంగాబాదు, పడమర షోలాపూర్, దక్షిణాన కర్నూలు, వాయవ్యమున ఆదిలాబాదు, ఆగ్నేయంలో బెజవాడ, నైఋతి రాయచూరు ప్రాంతాల నుండి ఒకేసారి సైనిక చర్యను ప్రారంభించింది. బొంబాయి నుండి బయలుదేరిన సైన్యానికి మేజర్ జనరల్ డి.ఎస్.బ్రార్, మద్రాసు నుండి వెళ్ళిన సైన్యానికి ఎ.వి.రుద్ర, బెరారు నుండి బయలుదేరిన సైన్యానికి బ్రిగేడియర్ శివదత్తుసింగ్, షోలాపూర్ నుండి బయలుదేరిన సైన్యానికి మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వం వహించారు. వైమానిక శాఖాధికారి ఏయిర్‌వేస్ మార్షల్ ముఖర్జీ సహాయం భారత సైన్యానికి లభించింది. 

నిజాం రాష్ట్రం పై భారత యూనియన్ పోలీసు చర్య 13వ తేదీ ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైంది. దక్షిణ కమాండర్ లెఫ్టినెంటు జనరల్ మహారాజాసింగ్ జిఓసి గారి పర్యవేక్షణలో భారత సైనిక దళాలు నలువైపుల నుండి నిజాం రాష్ట్రాన్ని ముట్టడించాయి. బెజవాడ, షోలాపూర్ మార్గాల నుండి ముఖ్యమైన దాడులు మొదలయ్యాయి. షోలాపూర్ నుండి మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి గారు, బెజవాడ నుండి మేజర్ జనరల్ ఎవి రుద్రగారు శ’ శకటాల సైనిక దళాలతో త్రివర్ణ పతాకమును రెపరెపలాడిస్తూ ముట్టడి సాగించారు. యూనియన్ సైనిక దళములు సెప్టెంబరు 13న వల్దుర్గ్ పట్టణ శాయిరీ నాకా దగ్గర ఉన్న ఎత్తయిన ప్రదేశమును ఆక్రమించి, నల్దుర్గ్ కోటలోని ఉలిపి బురుజును ముట్టడించాయి. ముట్టడి ప్రారంభమైన రెండు గంటలలో ఆదిలాబాదు, జాల్కోలలో ఉన్న 25 ఫౌండర్ల ఫిరంగులు యూనియన్ సైనికుల హస్తగతమైంది. భారత వైమానిక దళాలవారి మెషన్ ఫిరంగుల కాల్పులకు నిజాం సైన్యము తోకముడిచింది. మేజర్ జనరల్ ఎ.వి. రుద్ర విజయవాడ నుండి సైన్యముతో బయలుదేరి పాలేరు నదిని దాటి నల్లబండ గూడెం వైపు సాగి ముందుకు చొచ్చుకొని వచ్చాడు. హైదరాబాదు - విజయవాడ ట్రంకు టెలిఫోన్ సౌకర్యాలు తప్ప తక్కిన సంబంధాలు తెగిపోయాయి. నల్లబండగూడెం వద్ద నిజాం పోలీసులు, సైనికులు రజాకార్లు యూనియన్ సైన్యాన్ని ఎదురించలేక పారిపోయారు. దీంతో భారత సైన్యము నిరాటంకంగా ముందుకు సాగింది. సూర్యాపేట వద్ద గల దురాజ్ పల్లి క్యాంపు చాలా పెద్దది, పటిష్టమైంది. నిజాం సైన్యము రజాకార్ల బృందము, పోలీసులు అసంఖ్యాకంగా ఉండ్రుకొండ కోట ఆవాసంగా భారత సైన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. సూర్యాపేట రంగంలో భారత సైన్యాన్ని ఎదురించి వెనక్కి పంపాలన్న యోచనలో నిజాం సైనిక పటాలములు, రజాకార్ల బృందము, పోలీసు దళాలు ఉన్నాయి. ఫస్ట్ హైదరాబాదు లాన్సర్స్, ఫోర్ట్ హైదరాబాదు లాన్సర్స్, టెస్త్ హైదరాబాదు రైఫిల్స్ పటాలాలు, రజాకార్లు, పోలీసు బలగాలు ఈ ప్రాంతంలో మోహరించబడ్డాయి. ఇది శక్తివంతమైన సైనిక శిబిరం. యూనియన్ సైన్యానికి కోదడు వశమైన తరువాత 13-9-1948న మునగాల సరిహద్దు ప్రాంతంలో 5 హెచ్ఐ నిజాం సైన్యం కొన్ని నిమిషాలు మాత్రమే యూనియన్ సైన్యాన్ని ఎదురించి ఆ తరువాత మూసీనది పడమటి వైపునకు పరుగులు తీసింది. 

నిజాం సైన్యము యూనియన్ సైన్యాన్ని ఎదురించిన ముఖ్య ప్రదేశము సూర్యాపేట. పోలీసులు, రజాకార్లు, సైనికులు కక్షతో, పట్టుదలతో యూనియన్ సైన్యాన్ని ఎదురించి పోరాడినా ఫలితం లేకుండాపోయింది. భారత యుద్ధ విమానాలు, ఉండ్రుగొండ కోటలో స్థావరం ఏర్పరచుకున్న నిజాం మిలిటరీ, రజాకారు, పోలీసు శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. వందలకొద్ది రజాకార్లు, నిజాం పోలీసులు, మిలిటరీ దళములోని సైనికులు నిహతులయ్యారు. ట్యాంకులు ముందుగా వెళుతుండగా సైనిక శకటాలు వాటిని వెన్నంటి తరలిపోతుంటే ప్రజలు జయజయ ధ్వానాలు చేయసాగారు. యూనియన్ సైన్యానికి స్వాగత సత్కారాల మధ్య జనరల్ ఎ.ఎన్.రుద్ర విజయ సాఫల్యం కోసం ముందుకు సాగాడు. నిజాం సైనికులు, రజాకార్లు యూనియన్ సైన్యాన్ని నిరోధించడానికి టేకుమట్ల వద్ద గల మూసీ వంతెనను పేల్చడంతో మేజర్ జనరల్ ఎ.ఎన్.రుద్ర నాయకత్వం గల భారత సైన్యము ఒక రోజు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది. సూర్యాపేట తరువాత ట్రంకు రోడ్డుపై ఒకటి రెండు చోట్ల మాత్రమే స్వల్ప సంఘటనలు యూనియన్ సైన్యానికి ఎదురయ్యాయి. ప్రజల సహకారంతో భారత సైన్యము ముందుకు సాగి, హైదరాబాద్ నగరానికి చేరుకుంది. 

సెప్టెంబరు 13వ తేదీన ఉస్మానాబాదు జిల్లాలోని తుల్జాపురము, పరిణి జిల్లాలోని ప్రసిద్ధమైన మానిక్ గఢ్, కనేర్గాంలు యూనియన్ సైన్యము వశపరచుకుంది. ఔరంగాబాద్ జిల్లాలోని జాల్నా పట్టణం ఆక్రమించబడింది. భారత విమానాలు బీదరు, వరంగల్ విమానాశ్రయాలపై బాంబులు వేసింది. సెప్టెంబరు 14వ తేదీన దౌల్తాబాద్ జాల్నా పట్టణాలను అధిగమించి యూనియన్ సైన్యం ఔరంగాబాద్ పట్టణాన్ని వశపరచుకుంది. షోలాపూర్ సికింద్రాబాద్ మధ్యలో ఉన్న రాజేశ్వర్ పట్టణాన్ని మేజర్ జనరల్ జెఎన్ చౌదరి నాయకత్వంలో బయలుదేరిన సైన్యం ఆక్రమించింది. ఉస్మానాబాదు, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధమైన నిర్మల్ దుర్గము భారత సేన వశమైంది. 15వ తేదీన కూడ, బీదరు, వరంగల్ విమానాశ్రయాలపై బాంబుల వర్షం కురిపించింది. 15 సెప్టెంబర్ న మరూప్ లో ఉన్న సెకండ్ హైదరాబాద్ ఇన్ ఫెక్స్ట్ 25 పౌండర్ల బ్యాటరీ బుధవారం లాతూరు వైపు పరిగెత్తిపోయింది. ఈ నిజాం సైన్యం లాతూరు నుండి జహీరాబాదు వెళ్ళేందుకు రైలులో బయలుదేరేందుకు సిద్ధపడుతుండగా భారత విమానం బాంబులు విసరడం వల్ల నిజాం సైనికులు రైలు దిగి ట్రక్కులలోకి పరుగెత్తారు. కొందరు ప్రయాణిస్తున్న ట్రక్కులు రోడ్డు పక్క గుంతలలో పడిపోయాయి. హుమ్నాబాద్, జాల్నా రోడ్డుపై ఉన్న వంతెన యూనియన్ సైన్య వశమైంది. ఖమ్మం పట్టణం కూడా ఆనాడే హస్తగతమైంది. 

సెప్టెంబర్ 16న భారత సైన్యం ముందుకు చొచ్చుకు వస్తుండడాన్ని చూసి థర్డ్ హైదరాబాద్ ఇన్ ఫెక్ట్స్ ఎఖేలీ వంతెనను కూల్చి వారు రావడానికి ఆటంకాన్ని సృష్టించారు. యూనియన్ సైన్యం వంతెనను తాత్కాలికంగా నిర్మించుకొని ముందుకు సాగి జహీరాబాద్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. పర్భిణి జిల్లాలోని హింగోలి పై దాడి చేసి దాన్ని వశపరచుకున్న యూనియన్ సైన్యానికి మునీరాబాదు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న రజాకార్లను నిజాం మిలిటరీ దళమును, పోలీసులను ఎదుర్కోవలసి వచ్చింది. రజాకార్లు మిలిటరీ దళములోని సైనికులు, పోలీసులు అనేకులు కాల్పులలో మరణించగా, మిగిలినవారు పారిపోయారు. వారు వదిలి వెళ్ళిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి యూనియన్ సైనికుల వశమయ్యాయి. 

17వ తేదీన యూనియన్ సైన్యము పటాన్ చెరువు ప్రాంతానికి వచ్చింది. నిజాం సైనికులు అక్కడి వంతెనను కూల్చి రోడ్డుపై బాంబులను, పేలుడు పదార్థాలను ఉంచి లింగంపల్లి దగ్గర గచ్చిబౌలి ప్రాంతంలో నిలిచి భారత సైన్య వినాశనాన్ని చూడసాగారు. కానీ భారత సైనికులు పక్క మార్గంలో ప్రయాణం చేసి హైదరాబాద్ నగరానికి దగ్గరగా వచ్చారు. సాయంత్రం 5 గంటలకు భారత సైన్య పురోగమనాన్ని తెలుసుకొని నిజాం ప్రభువు తనకు అపజయము తప్పదని భావించి సీజ్ ఫైర్ ఆజ్ఞలను జారీ చేసి, యూనియన్ సైన్యం నిరాఘాటంగా రావచ్చునని ప్రకటించాడు. సెప్టెంబర్ 18 సాయంత్రము 4 గంటలకు భారత సైన్యము సికింద్రాబాదుకు చేరింది. ప్రజలు జయ జయ ధ్వానాలతో యూనియన్ సైన్యానికి స్వాగతం పలికారు. నిజాం సర్వ సైన్యాధ్యక్షుడు ఎల్.ఎద్రూస్ అస్త్ర శస్త్రములు త్యజించి భారత సైన్యాధిపతి మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరికి లొంగిపోయాడు. ఈ విధంగా కానీ వినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో విలీనం అయినది.