గిరిజన సమాజం అనేక మార్పులకు గురియైంది. వారు ఎదుర్కొంటున్న సమస్యల ఫలితంగానే ఉద్యమానికి పూనుకోవడం జరిగింది. గిరిజన ఉద్యమాలు మూడు దశలను అధిగమించినట్లు సామాజిక శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదటిదశ ఉద్యమాలు 1795-1860 మధ్యకాలంలో జరిగాయి. ఈ కాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో అడుగు పెట్టి, విస్తరించి, సుస్థాపితమైంది. అదే విధంగా 1860-1920 మధ్య కాలాన్ని రెండో దశగా గుర్తించడం జరిగింది. ఈ కాలంలోనే వలస పాలనలో పటిష్టత ఏర్పడి వ్యాపార మూలధనం గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించి వారి ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపించిన పర్యవసానంగా గిరిజనులకు భూమి, అడవులతో అనంతకాలంగా గల సంబంధాలకు విఘాతాలు కలిగాయి. ఇక చివరి దశ 1920లో మొదలై దేశానికి స్వాతంత్ర్యం లభించేంత వరకు కూడా సాగినట్లు చెప్పవచ్చును. ఈ కాలంలో గిరిజనులు వేర్పాటు ఉద్యమాలను సైతం లేవదీశారు. జాతీయ, రైతు ఉద్యమాలలో పాల్గొన్నారు. వలస పాలన తరువాత గిరిజన ఉద్యమాల స్వభావ స్వరూపాలను విశ్లేషిస్తూ మధ్య భారతంలో జరిగిన ఉద్యమాలను నాలుగు రకాలుగా వర్గీకరించింది. అవి (1) రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం సాగిన ఉద్యమాలు (2) వ్యవసాయం, అటవీ సంపద ప్రాతిపదికన సాగిన ఉద్యమాలు (3) సాంస్కృతీకరణ ప్రక్రియ (4) భాష, లిపి ఆధారంగా సాగిన సాంస్కృతిక ఉద్యమాలు.

సంబంధిత అంశాలు :  దళిత ఉద్యమం

బ్రిటీష్ పాలకులతో గిరిజనుల ఘర్షణలు

బ్రిటీష్ పాలకులు గిరిజన రాజ్యాలను కబళించి బ్రిటిష్ పాలన ప్రవేశ పెట్టడంతో దేశం వివిధ ప్రాంతాలలోని గిరిజనులకు, బ్రిటిష్ పాలకులకు మధ్యలో ఘర్షణల పర్వం మొదలైంది. నూతన పరిపాలనా వ్యవస్థలో గిరిజన నాయకులు తరతరాలుగా అనుభవిస్తున్న అధికారం, సంపద దెబ్బతినడంతో ఆందోళన చెంది, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్తితుల్లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. తిరుగుబాటుదారులు పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించి బయటివారిని తమగడ్డపై నుంచి తరిమేస్తామని తమతోటి గిరిజనులకు భరోసా ఇచ్చారు. ఈ గిరిజన నాయకుల ఉద్దేశం గిరిజన రాజ్యాన్ని పునఃస్థాపితం చేసి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టాలనేది. జాతి శత్రువులైన డికూలను, యూరోపియన్ మిషనరీలను, అధికారులను స్థానిక క్రిస్టియన్లను రూపుమాపడమే లక్ష్యంగా ఛోటానాగపూర్లో బిర్సా ముండా నేత్రుత్వంలో ఉద్యమ జరిగింది. ఈ ఉద్యమం విజయవంతమై వారు కోల్పోయిన సామ్రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగారు. ఉద్యమాలలో చాలా మటుకు బ్రిటిష్ పాలన తొలిరోజులలోనే ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాలు కేవలం బహు సంఖ్యాకులున్న గిరిజన సమూహాలకే పరిమితం కాలేదు. అల్ప సంఖ్యాక సమూహమైన సాలూరు కొండ దొరలు (అప్పటి విశాఖ జిల్లా), మధ్యప్రదేశ్, గుజరాత్ లోని నాయక్ తెగల ప్రజలు కూడా బ్రిటిష్ అధికారులు, సవర్ణ హిందువులకు వ్యతిరేకంగా ఉద్యమాలు లేవనెత్తారు.

సంబంధిత అంశాలు : తెలంగాణ సాంఘీక వ్యవస్థ
దురాచారాలు

స్వాతంత్య్రానంతరం గిరిజన ఉద్యమాల స్వభావం

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం కూడా గిరిజనులు తమ అస్తిత్వం రూపుమాసిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కొన్ని తెగల వారు ఆందోళన చెందారు. 1947 లో తమ సంస్కృతి, తరతరాల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలు, యుగాల తరబడి పదిల పరచుకొన్న వ్యవస్థ మొదలైన వాటిని హిందూ పాలకులు నాశనం చేస్తారనే భయాందోళనలను నాగా జాతి గిరిజనులు వ్యక్తం చేశారు. నాగా ప్రాంతాన్ని గురించి గానీ, నాగా ప్రజల గురించి గానీ అవగాహన లేనివారు రూపొందించిన భారత రాజ్యాంగం తమకు ఆమోదయోగ్యంకాదని నాగాలు బాహాటంగా వ్యక్తం చేశారు. విశిష్ట జీవన శైలి ఉన్న ఒక మిలియన్ నాగాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోతారనే భయానికి లోనై స్వతంత్ర నాగాలాండ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విధంగానే అస్సామీల ఆధిపత్యం కింద ఉన్న ఖాసీలు తమ జాతి లుప్తమవుతుందని, ఛిన్నాభిన్నం అవుతుందనే భయపడసాగారు. ఈ భయాందోళనలే ఖాసీల రాజకీయ ఉద్యమాలకు ప్రధాన కారణంగా మారాయి.

సంబంధిత అంశాలు : తెలంగాణలో సాంఘీక
ఉద్యమాల నేపథ్యం

గిరిజనులు-సామాజిక సంస్కరణోద్యమాలు

కొన్ని జాతి సమూహాలు హిందువులుగా తమ అంతస్థును నిలుపుకోవడానికి సంస్కృతీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఈ ఉద్యమాలనే భగత్ ఉద్యమాలు అని కూడా అంటారు. ఇలాంటి సామాజిక, మత ఉద్యమాలకు సంబంధించి సమాజ శాస్త్రవేత్తల, సామాజిక మానవశాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు చేశారు. దోపిడీ, అణిచివేత, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఈ తెగల వారు మతదురహంకారం, మతపరమైన నానుడులతో ఉద్యమించారు. మతాభిమానం ఈ తెగల వారికి వారనుభవిస్తున్న పీడన, దమన కాండలను వ్యతిరేకించడానికి అవసరమైన రాజకీయ నైతికతను బలాన్ని అందించింది. కడజాతి వారు తమను ఉన్నత వర్గ ప్రజలతో సమానంగా చూడటంతో వారిలో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఈ నూతన అనుభవం వారిని ఎంతో ఉత్తేజ పరిచింది. ఈ మధ్యకాలంలో కొన్ని తెగల వారి సంస్కృతిని, సంప్రదాయాలను పునరుజ్జీవింప చేయడానికి వారి భాషకు ప్రత్యేక లిపిని రూపొందించుకొన్నారు. ఈ ఉద్యమాలు తెగలు ఆకాంక్షలను, ఆశలను పెంచడమే కాక తమను దోచుకొంటున్న వారిపై తిరగబడటానికి ఒక సంఘటిత శక్తిగా రూపొందడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. గుజరాత్, మద్యప్రదేశ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఈ ఉద్యమాలు సామాజిక సంస్కరణోద్యమాలుగా రూపాంతరం చెంది బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న జాతీయోద్యమంలో వారు పాలుపంచుకొనేట్లు ప్రోత్సహించాయి. రాజస్థాన్లో తలెత్తిన భగత్ ఉద్యమం రాజకీయ లక్ష్యం భిల్లుల స్వతంత్ర రాజ్యస్థాపనే.

సంబంధిత అంశాలు :  నక్సల్బరీ ఉద్యమం