అనాదికాలం నుండి కులవ్యవస్థలో భాగస్వాములైనప్పటికీ హిందూ సమాజంలో అస్పృశ్యులుగా పరిగణిస్తూ వచ్చిన ఒక వర్గవారే దళితులు. డా||బి.ఆర్.అంబేద్కర్ అభిప్రాయంలో హిందూ క్రమశ్రేణి సామాజిక క్రమంలో తుదిమెట్టుపై జీవనం సాగిస్తున్న వారే దళితులు. మహాత్మాగాంధీ దళితులకు హరిజనులని నామకరణం చేశారు. స్వాతంత్ర్యానంతరం లిఖించబడిన భారత రాజ్యాంగం వీరిని షెడ్యూల్డు కులాలుగా గుర్తించింది. తరతరాలుగా వివిధ రకాల వివక్షలకు, దోపిడీలకు గురవుతూ, పేదరికం, అస్పృశ్యత, పరాభవం, గౌరవంతో కూడిన జీవితానికి అవసరమైన వనరులు అందుబాటులో లేకపోవడం వీరిని మరింత కృంగదీస్తున్నది.

సంబంధిత అంశాలు : తెలంగాణ సాంఘీక వ్యవస్థ
దురాచారాలు

కులవ్యవస్థకు వ్యతిరేకంగా క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే సమానత్వంతో కూడిన సమాజాన్ని ఏర్పరచడానికి గౌతమబుద్ధుడు చేసిన ప్రయత్నం మొదటిదిగా చెప్పవచ్చు. అందుకు నాందిగా అస్పృశ్యులను బౌద్ధసంఘంలో కూడా చేర్చుకున్నారు. ఆ తరువాత వచ్చిన జైనమత స్థాపకుడు మహావీరుడు కూడా ఇదే విధంగా కులవ్యవస్థను నిరసిస్తూ అస్పృశ్యులు జైనమతంలోకి ఆహ్వానించాడు.

వలస పాలకులైనప్పటికీ బ్రిటీష్ వారు సైతం భారతదేశంలోని రాజకీయ, పాలనాపర, ఆర్థిక, సామాజిక నిర్మితిని మార్చే ప్రయత్నాలు చేశారు. అందుకుగాను కుల పక్షపాతాన్ని ఖండించారు.

సంబంధిత అంశాలు : తెలంగాణలో సాంఘీక
ఉద్యమాల నేపథ్యం

19వ శతాబ్దపు చివరి భాగంలో మొదలైన ఉద్యమాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. వీటిలో మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిభా ఫూలే సత్యశోధక్ సమాజ్ ముఖ్యమైనది. 1873లో ప్రారంభించబడిన ఈ సమాజ్ దళితులపై జరుగుతున్న దోపిడీ, పేదరిక నిర్మూలనకు అనేక సంస్కరణలను ప్రచారం చేయడం జరిగింది. ఈ సంస్కరణలలో జ్యోతిభా ఫూలేతో పాటు ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలే దళితులలో చైతన్యం కోసం అహోరాత్రులు శ్రమించారు. అస్పృశ్యతను వ్యతిరేకించడంతో పాటు వారికి సమానత్వాన్ని సమాజ్ డిమాండ్ చేసింది. జ్యోతిబా ఫూలే స్త్రీవిద్యను, స్త్రీసాధికారిత, వితంతు పునర్వివాహాలు మొదలైన వాటిని ప్రోత్సహించడంతో పాటూ 1852లో ఒక వితంతు గృహాన్ని, 1864లో అనాధాశ్రమాన్ని స్థాపించారు.

శ్రీ ముకుంద్ బిహారీ, శ్రీహరిచంద్ ఠాకూర్లచే బెంగాల్లో ప్రారంభించబడిన నామశూద్ర సంక్షేమ సంఘం స్థాపించారు. ఈ సంఘం తరపున నిమ్నకులాల ప్రజలకు విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర శాసనసభలో 17% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసారు. అన్నిటి కంటే ముఖ్యమైనది 'చండాలులు' అనే పద వాడకాన్ని నిషేధించాలని కూడా కోరారు. వీరి కోరికను మన్నించిన ప్రభుత్వం 1911లో జరిగిన జనాభా గణాంక నివేదికలో చండాలురు అనే పదాన్ని తొలగించింది. భిల్లులు, సంఖీలు, ఛురాలు, ఛమార్ లు, భంగీలు స్థానికులు అని ప్రచారం చేయడానికి పంజాబ్లో శ్రీమంగూరామ్ ఆదిధర్మ ఉద్యమం ప్రారంభించారు.

సంబంధిత అంశాలు :  గిరిజన ఉద్యమాలు

దళితులను కులవ్యవస్థలో అంతర్భాగంగా చేయడం ద్వారా అస్పృశ్యత తొలగించడానికి భక్తి, నవ్యవేదాంతిక్ ఉద్యమాలు ప్రయత్నించాయి. ఈ ఉద్యమ అధినాయకుల అభిప్రాయాలలో హిందూ మతంలో అస్పృశ్యత అంతర్భాగం కాదు. కులవ్యవస్థ అనేది ఆనాటి పరిపాలకులు సృష్టించిన ఒకానొక సంస్థ అని, సమాజంలో అంటరానితనం సహజమైన, మతపరమైన విభేదం కాదని ఆర్యసమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి విశ్వాసం. ఆర్యసమాజ ఉద్యమం తాము నిర్వర్తించే అన్ని మతపర విధులు, సంస్కారాల్లో దళితులను చేర్చుకుని, వారి ఉద్ధరణకు ఎంతో కృషి చేసింది. అందేకాకుండా ప్రత్యేకంగా దళితుల కొరకు అనేక విద్యా సంస్థలు నెలకొల్పింది, వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభించింది.

దక్షిణ భారత దేశంలో నిమ్నకులాల వారు పలు ఉద్యమాలు చేపట్టారు. మద్రాస్లో 1890లో ఆది ద్రావిడ మహాజన్ సభ ఏర్పాటు చేయబడినది. దీని తరఫున ఎం.ఎస్.రాజా వెనుకబడిన కులాల వారు ద్రావిడులని ప్రతిపాదించారు. ఇదే పంథాలో 20వ శతాబ్దం ప్రారంభంలో ఇ.వి.రామస్వామి నాయకర్ (పెరియార్) ఆత్మగౌరవ ఉద్యమం లేవనెత్తి నిమ్నకులాల వారిని చైతన్యం వం చేయడానికి కృషి చేశారు.

సంబంధిత అంశాలు :  నక్సల్బరీ ఉద్యమం

1917లో విజయవాడ పట్టణంలో ఆది ఆంధ్ర మహాసభను నిర్వహించడం జరిగింది. దళితుల సముద్ధరణకు ఆంధ్ర మహాజనసభ, ద్రావిడ మహాజనసభ ఏర్పాటు చేయబడినవి. అదే విధంగా హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డివర్మ, అరిగె రామస్వామి, ఎం. ఆదయ్య ప్రభృతులు దళితుల చైతన్యానికి మాన్యసంఘాన్ని ఏర్పాటు చేశారు. తరువాత కాలంలో దీనిపేరు ఆదిహిందూ అసోసియేషన్ అని మార్చబడింది. ఆది ద్రావిడుల హక్కుల కొరకు ద్రావిడ అభివృద్ధి సంఘం, జనసంఘం అప్పటి మైసూరు రాష్ట్రం, బెంగుళూరులలో చేసిన కృషి శ్లాఘనీయమైనది. 1923లో జరిగిన రాజకీయ సమావేశంలో ఆది ద్రావిడ, ఆది కర్ణాటక అనే పదాలు అంగీకరించబడినవి. మహారాష్ట్రకు చెందిన ఫోగోజ్ బాన్సోడ్, విఠోబా, రావి, గణేశ్ అక్కాజీ మొదలైన సంఘసంస్కర్తలు కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు.