తెలంగాణ సాయుధ పోరాటం 1946-51 కాలం మధ్య జరిగిన రైతాంగ పోరాటం. కమ్యూనిస్టుల అండతో తెలంగాణ రైతులు నిజాం రాజ్యంలోని జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా “భూమి కోసం భుక్తి కోసం-విముక్తి కోసం” చేసిన తెలంగాణ రైతాంగ పోరాటం కమ్యూనిస్టుల కలయికతో సాయుధ పోరాటంగా చరిత్రకెక్కింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కారణాలు సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు తెలంగాణ సమాజంలో వేళ్ళూనుకుని పోయిన కుల వ్యవస్థ నిర్మాణాలు దానితో అధికారానికి గల సంబంధం మరియు ఆధిపత్యం గురించి తెలుసుకొంటే ఆ కాలంలో గల సామాజిక పరిస్థితులు అవగతమౌతాయి.

1940 సంవత్సరానికి తెలంగాణలో గల భూస్వాములు, రైతులకు మధ్య అనేక వైరుధ్యాలు పతాకస్థాయికి చేరుకోవడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం ఆరంభమయ్యే నాటికి భూస్వాములను రైతులను దోపిడీ చేసే ఉద్దేశ్యంతో భూమిశిస్తు విధానాలు మూడు రకాలుగా అమలులో ఉండేవి. వీటిలో 60% వ్యవసాయ భూమిని దివానీ లేదా ఖాల్సా అని, 30% కిందిస్థాయి నవాబులకు గౌరవసూచకంగా ఇచ్చిన భూమిని జాగీరు అనీ, 10% నిజాం తన స్వంత ఖర్చులకుగాను ఉంచుకున్న భూమిని సర్ఫేఖాస్ భూమి అనేవారు. జాగీర్దారులు లేని ప్రాంతాల్లో గ్రామాలన్నీ స్థానిక భూస్వాముల చేతుల్లోనే ఉండేవి. వారిని 'దేశ్ ముఖ్'లు లేదా 'దేశ్ ఫాండే'లు అని వ్యవహరించేవారు. వీరంతా గ్రామంలో గల అధికశాతం భూమిని సొంతం చేసుకున్న అగ్రకులాల వారు.

నిజాం పాలనా కాలంలో హైదరాబాద్ సంస్థానంలో అధికార వ్యవస్థలో అనేక లోటు పాట్లుండేవి రాజుకు-రైతుకు మధ్యలో అనేక మంది దళారులు ఉండేవారు. నైజాం రాజు-పాయగాళ్ళు -జాగీర్దార్లు-జమీందార్లు- మత్తేదార్లు-దేశ్ ముట్లు-దేశ్ పాండేలు-పటేళ్ళు - పట్వారీలు-రైతులు. ఈ విధంగా రైతుకి రాజుకు మధ్య అనేక మంది దళారులు ఉండడం, ఆ దొరలలో కొంతమందికి సివిల్, క్రిమినల్ అధికారాలు, సొంత పోలీస్ వ్యవస్థలుకూడా ఉండేవి. రైతుకు భూమిపై ఎలాంటి హక్కులుండేవి కాదు. రైతు కేవలం శాశ్వత కౌలుదారుగా మాత్రమే ఉండేవాడు. భూములపై సర్వహక్కులు దొరలకు మాత్రమే ఉండేవి. వీరు నైజాం సర్కారుకు నిర్ణీత మొత్తాన్ని మాత్రమే చెల్లించి, రైతుల నుండి అక్రమంగా పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేసి తాము అనుభవించేవారు. పండిన పంట రైతు ఇంటికి వచ్చే సరికి ఏదో ఒక రూపంలో కొల్లగొట్టబడుతూ ఉండేది. వెట్టిచాకిరి ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో శ్రామికుల చేత బలవంతంగా, ఉచితంగా పనిచేయించుకునే విధానం ఉండేది. దీనినే వెట్టిచాకిరీ అంటారు. శ్రామికులు పనిచేయడానికి నిరాకరిస్తే వారితో దౌర్జన్యంగా కూడా పనులు చేయించేవారు.

భూస్వామ్య విధానం అమల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా చాకలి, మంగలి, కమ్మరి, వడ్రంగి, కుమ్మరి వంటి వివిధ రకాల కులువృత్తుల వారుండేవారు. వీరంతా సేవక వర్గానికి చెందిన వారు కావడంతో భూస్వాములు వీరిని బానిసల కంటే హీనంగా చూసేవారు. కొన్ని అంటరాని కులాలకు చెందిన వారిని పురుగుల కంటే హీనంగా చూసిన సందర్భాలున్నాయి. భూస్వాములు పైన చెప్పిన వర్గాల వారితో నిర్బంధంగా మరియు బలవంతంగా పనులు చేయించుకునేవారు. అక్రమ వసూళ్ళు, శ్రమదోపిడీ, స్త్రీలపై అరాచకాలు, బలవంతపు పన్నులు, లెవీ వసూళ్ళు వంటి వాటిని ఆ నాటి ప్రజలు భరించాల్సి వచ్చేది. అంతే కాకుండా నిజాం నిరంకుశ, భూస్వామ్య వ్యవస్థలో నిర్బంధ శ్రమదోపిడీ కూడా జరిగేది. ఆ నాటి కాలంలో తెలంగాణలోని ప్రతి పల్లెలో కూడా నిర్బంధ శ్రమదోపిడీ అనేది సర్వసాధారణ అంశంగా ఉండేది. భూస్వాములు, దేశ్ ములు, జమీందారులు, మక్తాదారులు చివరికి గ్రామాధికారులు చేసే ఇలాంటి నిరంకుశ విధానాలకు హద్దూ, అదుపు లేకుండా పోయేది. భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తొలి ప్రతిఘటన జనగామ తాలూకాలోని విసునూర్ దేశ్ ముఖ్ అధికారంలో గల కామారెడ్డి గూడెం గ్రామంలో నింసించే ఒక పేద ముస్లిం రైతు షేక్ బందగి సాహెబ్ భూస్వాములకు వ్యతిరేకంగా తొలి పోరాటం చేశాడు. ఈయన తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి విషయంలా అతని పాలివాళ్ళయిన అబ్బాస్ అలీ మరియు అతని సోదరులతో వివాదం జరగితే, ఆ విషయాన్ని ఆసరాగా తీసుకున్న విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి, బందగి సాహెబ్ కు వ్యతిరేకంగా అబ్బాస్ఆలీ సోదరులకు తన మద్దుతునిచ్చాడు. బందగీసాహెబ్ కోర్టును ఆశ్రయించగా కోర్టుకూడా బందగీ సాహెబ్ తరపున తీర్పునిచ్చింది. ఇది దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డికి మింగుడు పడలేదు. అబ్బాస్ అలీ సోదరులతో కలిసి జూలై 26, 1940 సంవత్సరంలో బందగి సాహెబ్ ను హత్య చేశారు. ఆ కాలంలో ఇది ఒక భయంకరమైన సంఘటనగా మిగిలిపోయింది. బందగి సాహెబ్ అమరత్వానికి చిహ్నంగా ఇప్పటికీ కామారెడ్డిగూడలో ఒక స్మారక స్థూపం, సమాధి కనిపిస్తాయి. 

బాలెం సంఘటన

1946 అక్టోబర్ 18వ తేదీన ప్రజలు నిద్రలో ఉండగానే తెల్లవారు ఝామున 4 గంటలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు లెవీగల్లా వసూలు కొరకు బాలెం గ్రామంపై విరుచుకు పడ్డారు. గ్రామంలో దొరికిన ధాన్యం, స్త్రీల ఒంటి పైనున్న నగలు దోచుకు వెళ్ళడానికి దౌర్జన్యకాండను నిర్వహించారు. ఈ దౌర్జన్యకాండను 'సంగం' నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులు లాఠీలతో, తుపాకి మడమలతో కొడుతూ ప్రజలను హింసించ సాగారు. ఆ గ్రామ యువకులైన గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి, సంకురంగయ్య, జమాల్ సాబ్, చాకలిభిక్షం, చాకలి చెన్నయ్య ఏకమై పోలీసులను ఎదురొడ్డి సుమారు అరగంట సేపు పోరాటం సాగించారు. పోలీసుల తుపాకులను లాక్కొని వారి వెంట పడడంతో పోలీసులు దిక్కుతోచని స్థితిలో పరుగుతీశారు. సాయుధులైన 25 మంది పోలీసులు ఎలాంటి ఆయుధాలు లేని కొంతమంది యువకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి వీరమరణం పొందారు. 


Tags :   Telangana Armed Struggle       Balem Incident   

 Communist Party     Operation Polo   

 Freedom Movement     Peoples Democratic Party   

 Guerrilla warfare    Telangana History