నిజాం రాష్ట్రంలోని తెలుగు ప్రజల పట్ల ఆంధ్ర నాయకుల ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా తమకు కూడా ఒక ప్రత్యేక సంస్థ బాగుంటుందనే ఆలోచన తెలంగాణ నాయకులలో కలిగింది. 1930 మార్చిలో ఆంధ్రజన సంఘం మొదటి సమావేశం మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగింది. ఈ సమావేశంలోనే ఆంధ్ర జనసంఘంను ' ఆంధ్రమహాసభ'గా మార్చారు. తరువాత కాలంలో దీనిని 'నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభ'గా మార్చారు. శ్రీ మాడపాటి హనుమంతరావు గారు ఈ తెలంగాణ ఆంథోద్యమానికి మూల విరాట్టు. క్రీ.శ.1930 నుండి 1946 వరకు 13 మహాసభలు వివిధ ప్రదేశాలలో నిర్వహించబడ్డాయి. 

మొదటి నిజాం ఆంధ్ర మహాసభ

క్రీ.శ. 1930లో మెదకు మండలంలోని జోగిపేటలో తెలంగాణ ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. మార్చి నెల 3, 4, 5 తేదీలలో జరిగిన తెలంగాణ ప్రథమాంధ్ర మహాసభకు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు అధ్యక్షత వహించారు. 

2వ నిజాం ఆంధ్ర మహాసభ 

రెండవ తెలంగాణ ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగింది. శ్రీ పులిజాల వేంకట రంగారావు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా, శ్రీ బూర్గుల రామకృష్ణ రావు అధ్యక్షతన ఈ మహాసభ నిర్వహించబడింది. 

3వ నిజాం ఆంధ్ర మహాసభ

మూడవ తెలంగాణ ఆంధ్ర మహాసభ ఖమ్మం పట్టణంలో 1934 డిసెంబరు 3, 4, తేదీలలో శ్రీ పులిజాల వేంకట రంగారావు అధ్యక్షతన జరిగింది. 

4వ నిజాం ఆంధ్ర మహాసభ

నాలుగవ తెలంగాణ ఆంధ్ర మహాసభ క్రీ.శ. 1935 డిసెంబరు 26వ తేదీన కరీంనగర్ జిల్లాలోని సిరిసిళ్ళలో శ్రీ మాడపాటి హనుమంతరావుగారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఆ మహాసభ విభాగమైన మహిళల సభకు శ్రీ హనుమంతరావు గారి అర్ధాంగి శ్రీమతి మాణిక్యమ్మగారు అధ్యక్షురాలిగా ఉన్నారు. 

5వ నిజాం ఆంధ్ర మహాసభ

ఐదవ ఆంధ్ర మహాసభ తెలంగాణ నాయకులు, ప్రముఖ న్యాయవాది శ్రీ కొండా వేంకట రంగారెడ్డిగారి అధ్యక్షతన క్రీ.శ. 1936 డిసెంబరు నెలలో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగింది. 

6వ నిజాం ఆంధ్ర మహాసభ

క్రీ.శ.1937 డిసెంబరు నెలలో అరవ తెలంగాణ ఆంధ్ర మహాసభ నిజామాబాదు పట్టణంలో శ్రీ మందుముల నరసింగరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభ జరిగిన నాటి నుండి ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు, సాహిత్యము, సంస్కృతికి పరిమితము కాకుండా రాజకీయంగా రూపుదిద్దుకుంది. 

7వ నిజాం ఆంధ్ర మహాసభ

క్రీ.శ. 1940 ఏప్రిల్ నెలలో ఏడవ ఆంధ్ర మహాసభ మల్కాపురంలో శ్రీ మందుముల రామచంద్రరావు గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ మహాసభ అనేక తీర్మానాలు చేసి, రాజకీయంగా ముందుకు వచ్చింది. ఆనాటి యువకులు సంస్థ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా ప్రజోపయోగ కార్యాలను నిర్వహించగలిగారు. 

8వ నిజాం ఆంధ్ర -మహాసభ

ఎనిమిదవ నిజాం ఆంధ్ర మహాసభ క్రీ.శ. 1941 జూన్ నెలలో నల్లగొండ మండలంలోని హుజూర్ నగర్ తాలూకాలోని చిలుకూరు గ్రామంలో శ్రీ రావి నారాయణరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. 

9వ నిజాం ఆంధ్ర మహాసభ

తొమ్మిదవ నిజాం ఆంధ్ర మహాసభ 1942వ సంవత్సరము మే నెలలో వరంగల్ జిల్లాలోని ధర్మవరము గ్రామంలో శ్రీ మాదిరాజు కోటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది. 

10వ నిజాం ఆంధ్ర మహాసభ

పదవ ఆంధ్ర మహాసభ 1943లో హైదరాబాదు నగరంలో శ్రీ కొండా వేంకటరెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. అధ్యక్ష ఎన్నికలలో శ్రీ బద్దం ఎల్లారెడ్డి గారిని ఓడించి శ్రీ రంగారెడ్డిగారు ఎన్నికయ్యారు. తాత్కాలిక ప్రజా ప్రభుత్వమును ఏర్పాటు చేయాలని ఈ మహాసభ తీర్మానించింది. 

11వ నిజాం ఆంధ్ర మహాసభ

11వ ఆంధ్ర మహాసభ భువనగిరి పట్టణంలో 1944లో శ్రీ రావి నారాయణరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభ నుండి ఆంధ్ర మహాసభ రెండు శాఖలుగా విడిపోయింది. 

12వ నిజాం ఆంధ్ర మహాసభ

12వ ఆంధ్ర మహాసభ ఖమ్మం పట్టణంలో శ్రీ రావి నారాయణరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. మితవాదుల మహాసభ 1945లో శ్రీ మందుముల నరసింగరావు గారి అధ్యక్షతన వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జరిగింది. 

13వ నిజాం ఆంధ్ర మహాసభ

క్రీ.శ. 1946లో మెదక్ మండలంలోని కొంది గ్రామంలో 13వ ఆంధ్ర మహాసభ శ్రీ జమలాపురం కేశవరావుగారి అధ్యక్షతన జరిగింది. తొలి ఆంధ్ర మహాసభ మెదక్ జిల్లాలోని జోగిపేటలో, చివరిది 13వ ఆంధ్ర మహాసభ కంది గ్రామంలో నిర్వహించారు.

నిజాం ఆంధ్ర మహాసభ విస్తృత రాజకీయ సంస్థగా రూపొందడానికి శ్రీ రావి నారాయణరెడ్డి, శ్రీ బద్దం ఎల్లారెడ్డి మొదలైన వారి కృషి చెప్పుకోదగింది. వీరు ఈ మహాసభకు అధ్యక్ష కార్యదర్శులుగా ఉంటూ తెలంగాణ ప్రజలలో నవ చైతన్యాన్ని కలిగించారు.

Tags :   Andhra Maha Sabha   

 Andhra Jana Sangham    Madapati Hanumantha Rao   

 Nizam Rastra Andhra Maha Sabha    Freedom Movement   

  Telangana History