సంభవించే కారణాల ఆధారంగా విపత్తులను రెండు వర్గాలుగా విభజించడం జరిగింది. 

1. ప్రకృతి సంబంధమైనవి

2. మానవ కారకమైనవి 

1. ప్రకృతి సంబంధమైనవి

ఇవి ప్రకృతి సంబంధమైనవిగా కనిపించినా సాధారణంగా మానవ దైనందిన జీవనంతో ముడిపడి ఉంటాయి. మానవ నిత్య జీవితానికి తీవ్ర అంతరాయాన్ని కలుగజేస్తాయి.

ఉదాహరణకు: 

భూకంపాలు (Earth quakes)

వరదలు 

సునామీలు (Tsunami)

తుఫానులు /చక్రవాతాలు/ సైక్లోనులు 

కరువు (Drought)

భూపాతాలు (కొండచరియలు, మంచు తలాలు విరిగి పడటం) 

అగ్నిపర్వత ఉద్భేదనాలు (Volcano)

వడగాలులు, అతి శీతల గాలులు (Heat Waves, Cold Waves)

సముద్రకోత 

ఉరుములు, మెరుపులు 

టోర్నడోలు, హరికేన్లు 

వడగళ్ళ వర్షం

కుండపోతగా పడే వర్షం

2. మానవ కారకమైనవి

ఇవి సాధారణంగా మానవ ప్రేరేపితమైనవిగా ఉంటాయి. వీటి కారణంగా మానవ, ఆర్థిక, పర్యావరణ నష్టాలు కలుగుతాయి. వీటి వలన మానవ జీవితానికి తీవ్ర అంతరాయాలు కలుగుతాయి.

ఉదాహరణకు : 

రోడ్డు లేదా రైలు ప్రమాదాలు 

అంటువ్యాధులు (Epidemic Diseases)

అగ్ని ప్రమాదాలు (Fire Accidents)

జల ప్రమాదాలు 

రసాయన లేదా పారిశ్రామిక ప్రమాదాలు (Chemical or Industrial Accidents)

యుద్ధాలు (Wars)

ఉగ్రవాదం (Terrorism)

పౌర సంఘర్షణ 

రాజకీయ అశాంతి

ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన డిస్ ఇన్వెంటర్ విపత్తు సమాచార నిర్వహణ వ్యవస్థ ఆధారంగా జరిపిన విపత్తుల వర్గీకరణ భౌగోళిక సంబంధ విపత్తులు : -

ఇవి సాధారణంగా భూనిర్మితిలో కలిగే మార్పుల కారణంగా సంభవిస్తాయి. భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వత ఉద్భేదనాలు, కొండచరియలు విరిగిపడటం, ఆనకట్టులు తెగిపోవడం, భూపాతాలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. 

జల లేదా వాతావరణ లేదా శీతోష్ణస్థితి సంబంధ  విపత్తులు :

వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా ఈ రకమైన విపత్తులు కలుగుతాయి. తుఫానులు, వరదలు, టోర్నడోలు, వేడిగాలులు, హిమపాతాలు, కుండపోత వర్షాలు, శీతల గాలులు, దుర్భిక్షం మొదలైనవి. 

పర్యావరణ సంబంధమైనవి :

పర్యావరణంలో సంభవించే మార్పుల వల్ల ఇవి కలుగుతాయి. పర్యావరణ క్షీణత, ఎడారీకరణ, చీడపీడల సంక్రమణ మొదలైనవి. 

జీవ సంబంధ విపత్తులు:

పర్యావరణంలో మార్పుల కారణంగా, మానవ తప్పిదాలు మరియు నిర్లక్ష్యాల వల్ల ఇవి సంభవిస్తాయి. అంటువ్యాధులు వ్యాపించడం, ఆహారం కలుషితం కావడం, జంతువుల నుంచి వ్యాపించే వ్యాధులు, పంటలకు పట్టే చీడవ్యాప్తి మొదలైనవి. 

మానవ ప్రేరేపిత విపత్తులు : -

ఇవి కేవలం మానవ స్వార్థపూరిత చర్యలు, తప్పిదాలు, నిర్లక్ష్యాల వల్ల మాత్రమే సంభవిస్తాయి. పరిశ్రమలలో రసాయనాలు వెలువడటం, చమురు ఎక్కువగా ఒలికిపోవడం, అణు దుర్ఘటనలు, పారిశ్రామిక విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడులు, రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలడం, అడవుల్లో మంటలు, మొదలైనవి.