ఏదైనా ఒక ప్రాంతంలో సాధారణ పరిస్థితిలకు భిన్నంగా కొంతకాలం వరకు పూర్తిగా వర్షపాతం లేకపోవడం లేదా లోటు వర్షపాతం కారణంగా సమాజం మొత్తం బాధలకు గురయ్యే పరిస్థితులకు దారితీసే స్థితిని కరువు(Drought) అంటారు.

వర్షపాతం తక్కువగా ఉండడం వలన నీరు, ఆహారం, పశుగ్రాసం, ఉపాధులకు సంబంధించి తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా సరైన పంటలు పండక ఆహారం కొరత ఏర్పడి వేలకోట్ల జీవరాసులు నశిస్తాయి. మొక్కలు వృక్షాలు ఎండిపోయి ఆ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుంది.

కరువు లక్షణాలు

కరువు నిదానంగా సంభవించే విపత్తు. అది ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు పూర్తయిందో చెప్పడం చాలా కష్టం. ప్రమాదకర నీటి కొరతకు దారితీసే సాధారణ నిర్జల లేదా శుష్కకాలం.

ఒక భౌగోళిక ప్రాంతంలో అవపాతానికి నీటి వినియోగానికి మధ్య ఉండే ప్రతికూల సంతులనం. కరువు ప్రభావాలు ఒకదాని వెంట ఒకటి నిదానంగా ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో బహిర్గతమవుతాయి. 

కరువు కారణాలు

వాతావరణానికి ఉండే సాధారణ లక్షణమైన లోటు వర్షపాతం కారణంగా కరువు సంభవించడం ప్రాథమికమైన కారణమైనప్పటికీ దానితో కూడిన పలు దుర్భర కారకాల కారణంగా విభిన్న రంగాలపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటిలో కొన్ని కారకాలు మానవ ప్రేరేపితమై ఉంటాయి. కరువు సహజ విపత్తు అయినప్పటికీ జనాభా పెరుగుదల, అధికంగా పశువులను మేపడం, అడవుల నిర్మూలించడం, మృత్తికా క్రమక్షయం, పంటల సాగు పరిధిలో భూగర్భ జలాలను సాధారణం కంటే అధికంగా వినియోగించడం, జీవవైద్యంలో సమతుల్యత లోపించండం మొదలైన మానవ కార్యకలాపాల వలన కూడా కరువు సంభవించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరువు సంబంధిత ప్రభావాలు అధికంగా కనిపిస్తాయి. పర్యావరణం క్షీణించడం, పచ్చదనం కోల్పోవడం వంటి కారణాల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కారణాల వల్ల అటువంటి ప్రాంతాల్లో వర్షపాతం ప్రభావితమై నీటి కొరత ఏర్పడుతుంది. ఏళ్ల తరబడి పచ్చని చెట్లు తగ్గుతున్న ప్రాంతాల్లో వర్షపునీరు నేలలో ఇంకిపోకుండా తేలికగా నదుల్లోకి సముద్రాలలోకి ప్రవహిస్తుంది.

కరువు- రకాలు

వాతావరణ కరువు : సాధారణం కంటే తక్కువ వర్షపాత పరిస్థితులు ఉన్నప్పుడు సంభవించేది వాతావరణ కరువు. కరువులన్నిట్లో ఇది తక్కువ తీవ్రతతో ఉంటుంది. వేడి వాతావరణం, ఎప్పుడూ వేసవి కాలం లాగా ఉండే రోజుల ద్వారా ఈ రకం కరువును గుర్తించవచ్చు.

జల సంబంధ కరువు : సహజసిద్ధమైన నీటి ప్రవాహాలు లేదా భూగర్భ జలమట్టాలు, నిల్వ ఉన్న నీటి సరఫరాలు కుచించుకుపోవడానికి దారితీస్తుంది. ఈ రకమైన కరువు ప్రధానంగా జలవనరుల సంబంధిత వ్యవస్థల పై ప్రభావం చూపుతుంది.

వ్యవసాయ కరువు : నేలలోని తేమస్థాయి సగటు పంట దిగుబడులు సాధించడానికి సరిపోనప్పుడు వ్యవసాయ కరువు పరిస్థితులు ఏర్పడతాయి. అసాధారణమైన వ్యవసాయ కరువు క్షామానికి దారితీస్తుంది.ఒక నిర్దిష్ట ప్రాంతంలో చాలా రోజుల పాటు ఆహార కొరత కారణంగా వ్యాధులు, ఆకలి చావులు సంభవిస్తాయి. 

కరువు-కొలమానం

సాధారణంగా నీటితో ముడిపడిన అంశాలన్నీ కరువు ప్రభావానికి తీవ్రంగా లోనయ్యే అవకాశం కలదు. కరువు సంభవించినపుడు మొదట వర్షాధార పంటలు ప్రభావితమవుతాయి. ఆ తరువాత నిదానంగా సాగునీటి వస్తువులు, పంటలకు విస్తరిస్తుంది. వ్యవసాయం జీవనాధారంగా కలిగిన ప్రజలుండే చోట, ఇతర జీవనోపాధి మార్గాలు అతి తక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు తీవ్రంగా కరువు గురవుతాయి. పశువుల కాపరులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, పూర్తిగా వ్యవసాయం మీదనే జీవనం కొనసాగించే రైతులు, మహిళలు, పిల్లలు, సాగుకుపయోగించే జంతువులు తీవ్రంగా కరువు బారిన పడే అవకాశం ఉంటుంది.