భూకంపం(Earth Quakes)అనేది హెచ్చరిక లేకుండా సంభవించే ఒక దృగ్విషయం. భూమి మరియు దాని మీద ఉన్న ప్రతి వస్తువు భూకంపం కారణంగా చలనానికి లోనవుతుంది. భూఅంతర్భాగంలో కొన్ని ప్రదేశాల్లో జరిగే ఆకస్మికమైన కదలికలు లేదా అలజడుల కారణంగా భూకంపాలు(Earth Quakes)సంభవిస్తాయి. ఈ అలజడుల వలన పెద్దమొత్తంలో విడుదలైన శక్తి కంపన తరంగాల రూపంలో చుట్టూ ఉన్న రాతి, భూపొరల గుండా ప్రయాణించడం వల్ల కలిగే కంపనాలను 'భూకంపాలు'గా పిలుస్తారు.
అకస్మాత్తుగా భూమి కంపించడం వల్ల ఏర్పడే భూకంప తరంగాలు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల అధిక ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. భూకంప తరంగాలు ప్రయాణించే వేగాన్ని బట్టి భూమి కంపించడం భవనాలు కూలడం జరుగుతుంది. భూకంపాలు పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడైనా సంభవించడానికి అవకాశముంది.
భూ అంతర్భాగంలో చాలా లోతుగా కంపన తరంగాలు విడుదలయ్యే ప్రదేశాన్ని 'భూకంప నాభి' లేదా 'కేంద్రం' అంటారు. భూకంపనాభికి అభిముఖంగా పైన ఉండే ఉపరితల బిందువును 'అధికేంద్రం' అంటారు. ఈ బిందువు వద్ద భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది. అధికేంద్రం ఉపరితలంపై కొంత ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటుంది. భూకంప నాభి లోతుకు వెళ్ళిన కొద్దీ భూకంప సంభావిత ప్రదేశ వైశాల్యం ఎక్కువవుతూ ఉంటుంది.
సాధారణంగా భూకంపం కొంతసమయం మాత్రమే ఏర్పడుతుంది. అయితే అది సంభవించినపుడు జరిగే నష్టం మాత్రం కంపించే తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. 2001లో గుజరాత్లోని భుజ్ సమీపంలో సంభవించిన భూకంపం దాదాపు 14 వేల మందిని ప్రాణాలను బలితీసుకున్నది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2010లో హైతీ దేశంలో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 2 లక్షల మందికి పైగానే మృతులయ్యారు.
భూకంపాలు - జనావాసాలపై ప్రభావం
జనావాస ప్రాంతంలో భూకంపం సంభవించడం వలన అనేక మంది ప్రాణనష్టం, గాయాలు అలాగే భారీ ఆస్తినష్టం సంభవించవచ్చు. భూకంప ప్రభావాలు వైవిధ్యంగా ఉంటాయి. సాధారణంగా భూకంపం కారణంగా మరణించే వారిలో 95% మంది కట్టడాలు కూలడం వలననే మరణిస్తుంటారు. భూకంపాలు రాత్రి వేళ సంభవిస్తే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే తొలి కంపనాలు సంభవించినప్పుడు సాధారణంగా ప్రజలు నిద్రలో ఉంటారు. వారికి భూకంపం సంభవిస్తున్న విషయం ఏ మాత్రం తెలియదు. కొద్ది సేపటి తరువాత మేలుకువ వచ్చి, తేరుకుని బయటపడడానికి వారికి తగిన వ్యవధి ఉండదు. అంతేకాకుండా నిల్చున్న వారి మీద కంటే పడుకొని ఉన్న వారి మీద వస్తువులు ఎక్కువగా పడతాయి. భూకంప ప్రభావాలు దాని అధికేంద్రానికి చుట్టూ ఉండే ప్రాంతాలపై చాలా ఎక్కువ ప్రభావితమై ఉంటాయి. కొందరు ప్రజలు వారి నివసించే ప్రాంతాన్ని బట్టి ఎక్కువ ముప్పు కలిగి ఉంటారు మరి కొందరు వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు బట్టి ఎక్కువ ముప్పు కలిగి ఉండవచ్చు.
భూకంప ప్రకంపనలు వదులు నేలలు లేదా నదీ నిక్షేపాలు వంటి పటిష్టంగా లేని విపరీతలాలు ఉండే ప్రదేశాల్లో ఎక్కువ సమయం ఉండడమే కాకుండా తీవ్ర ప్రభావాన్ని కూడా కలుగజేస్తాయి. అయితే శిలాస్తరాల ప్రాంతాలపై మాత్రం తక్కువ ప్రభావం కలిగిస్తాయి. అందువల్ల మెత్తటి నేలపై కట్టిన దృఢమైన కట్టడాల కంటే శిలాస్తరాలపై కట్టిన సాధారణ కట్టడాలు కూడా భూకంప విద్వాంసాన్ని సమర్ధవంతంగా తట్టుకోగలవు.
భూకంపాల(Earth Quakes) వల్ల నేరుగా సంభవించే నష్టాలతో పాటు కొన్నిచోట్ల అవి సంభవించిన సమయంలో అగ్ని ప్రమాదాలు జరగడం, ఆనకట్టలు తెగిపోవడం, భూపాతాలు, ఉపరితల పగుళ్లు సంభవించడం, జలమార్గాలు స్తంభించడం, వరదలు రావడం వంటి పర్యవసాన ప్రభావాలు సైతం జరుగుతాయి. ప్రమాదకరమైన పదార్థాలు తయారు చేసే పరిశ్రమలలో రసాయన విస్పోటనాల కారణంగా విధ్వంసాలు సంభవించవడానికి ఆస్కారం కలదు. సమాచార వ్యవస్థలకు సంబంధించిన సౌకర్యాలకు అంతరాయం కలుగుతుంది. ప్రజారోగ్య వ్యవస్థకు, సమాచారం, నీటి సరఫరా వ్యవస్థలకు సైతం పెద్దమొత్తంలో ఇబ్బందులు తప్పవు. బలహీన కట్టడాల కారణంగా భారీ ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది.
సంబంధిత అంశాలు :
భారతదేశంలో భూకంప మండలాలు (Seismic Zones in India)
భూకంపం సంభవించినపుడు తీసుకోవాల్సిన చర్యలు
Pages