వాతావరణంలోని ఉష్ణోగ్రత, పీడనాల్లో కలిగే తేడాల కారణంగా సంభవించే మార్పును 'తుఫాను' అంటారు. సముద్రంపై అల్పపీడన ప్రదేశాన్ని అధిక పీడన ప్రదేశం ఆవరించడంతో సుడిగాలులు ఏర్పడి వేగంగా వీస్తాయి. సాధారణంగా తుఫాను ఎక్కువగా వేడి సముద్రాల్లోనే సంభవించడం వల్ల సముద్రంలో కెరటాలు ఏర్పడి అధిక వర్షపాతం కురుస్తుంది. తుఫాను గాలులకు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వంతెనలు, భవన నిర్మాణాలు కూలిపోవడం, జనావాసాలు దెబ్బతినడం, పంటలు నాశనమవడం జరుగుతుంది. 

తుఫాను ఏర్పడే విధానం

సముద్రంపై ఉపరితలం వేడిగా ఉండటం, వాతావరణంలో అనిశ్చిత, అల్ప పీడనాన్ని అభివృద్ధి చేసే కొరియాలిస్ ప్రభావం మొదలైన కారణాల వలన తుఫాను ఏర్పడుతుంది. తుఫాను అభివృద్ధి చెందడానికి సుమారు 48 గంటల సమయం పడుతుంది. సముద్రం ఉపరితలంపై వేడెక్కిన గాలి క్రమంగా పైకి వెళ్ళి ఆ ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడుతుంది. చల్లని గాలి అన్ని వైపుల నుంచి మధ్యభాగంలోకి చొచ్చుకొని రావడంతో ఆ ప్రాంతంలో వాయుగుండం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన దానిని తుఫాను కేంద్రం అంటారు. కంటికి చుట్టుపక్కలా దాదాపు 200 కి.మీ. వరకు తుఫాను వ్యాపించిన ప్రాంతాన్ని 'తుఫాను క్షేత్రం' అంటారు.

గాలి యొక్క వేగం గంటకు 65 నుంచి 118 కి.మీ. ఉంటే సాధారణ తుఫాను అనీ, 120 నుంచి 164 ఉంటే తీవ్రమైన తుఫాను అని వర్గీకరిస్తారు. ఒక్కోసారి ఈ వేగం 300 కి.మీ. కూడా దాటే అవకాశం ఉంటుంది. 1999 లో ఒరిస్సా సూపర్ సైక్లోన్ ను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంగా తుఫాను 24 గంటల నుంచి 3 వారాల వరకు కొనసాగుతూ ఉంటుంది. 1994 ఈశాన్య, వాయువ్య పసిఫిక్ లో వచ్చిన టైఫూన్ జాన్ సుమారు 31 రోజులు (ఆగష్టు-సెప్టెంబర్) కొనసాగింది. ప్రపంచంలో ఇంతటి సుదీర్ఘకాలం కొనసాగిన తుఫాను ఇదే. 

తుఫాను తరంగాలు

తీవ్రమైన గాలుల వల్ల తీరం వైపు బలంగా నెట్టబడే నీటి అలలనే తుఫాను తరంగాలు అంటారు. ఇవి వేగంగా వీస్తున్న గాలి వల్ల సాధారణ అలలతో కలిసి పెద్ద పెద్ద తుఫాను అలలుగా రూపాంతరం చెందుతాయి. ఒకవేళ సముద్రం యొక్క ఒడ్డు లోతుగా ఉంటే అలల ఉధృతి పెరిగి వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. 

వివిధ ప్రాంతాల్లో తుఫానులకు గల పేర్లు : 

* వాయువ్య పసిఫిక్ మహా సముద్రంలో వచ్చే తుఫానులు (మలేషియా, చైనా, ఫిలిప్పైన్స్) - టైఫూన్స్ 

* ఉత్తర అట్లాంటిక్ సముద్రం (అరేబియన్ దీవులు, వెస్టీండీస్) - హరికేన్లు 

* ఆస్ట్రేలియా - విల్లీ విల్లీ 

* అమెరికా సంయుక్త రాష్ట్రాలు - టోర్నడో 

* హిందూ మహా సముద్రం - సైక్లోన్ నైరుతి 

* పసిఫిక్ మహా సముద్రం, ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో - ఉష్ణమండల తుఫానులు 

* ఉత్తర హిందూ మహా సముద్రం - తీవ్ర ఉష్ణమండల తుఫానులు