ప్రకృతి కారకాల వలన లేదా గురుత్వాకర్షణ శక్తి కారణంగా శిలలు, మృత్తికలు, కృత్రిమంగా నింపబడిన ప్రదేశాలు లేదా ఇవన్నీ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వేగంగా లేదా నెమ్మదిగా జారిపోయే ప్రక్రియను భూపాతం అంటారు. ఈ ప్రక్రియను కొండచరియలు విరిగి పడడం లేదా పదర్థనాశనం అనికూడా అంటారు.

సాధారణంగా భూపాతాలు పర్వత ప్రాంతాల్లో సంభవించినప్పటికీ, భారీ వర్షపాతం కారణంగా నేల సంతృప్తత, వాలుల స్థిరత్వంలో మార్పులు, భూమిలో నీటి మట్టంలో మార్పులు, మట్టి లేదా రాతి నిర్మాణంలో మార్పులు లేదా భవన నిర్మాణాల కోసం తవ్వకం వంటి మానవ కార్యకలాపాల వల్ల కూడా భూపాతాలు సంభవించడానికి ఆస్కారం కలదు. అటవీ నిర్మూలన, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో కలిసి కూడా ఇవి సంభవిస్తాయి. భూపాతాలు ఒక్కొక్కసారి విస్తృతమైన ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని కూడా కలిగిస్తాయి.

భారతదేశంలో 15% దుర్భలత్వం భూపాతాల వల్లనే సంభవిస్తుంది. ప్రపంచంలో సంభవించే భూపాతాల్లో సుమారు 30% భూపాతాలు హిమాలయాల వద్ద సంభవిస్తున్నాయి. భూపాతాలు సంభవించే ప్రదేశాల్లో నివాసయోగ్యమైన కట్టణాలను 'పిరమిడ్' ఆకారంలో నిర్మించడం ద్వారా భూపాతాల వలన రక్షణ లభిస్తుంది.

భూపాతాలకు కారణాలు

భూగర్భ శాస్త్రం: శిలలు మరియు నేల నిర్మాణం దాని స్థిరత్వం కారణంగా భూపాతాలు సంభవిస్తాయి. ఉదాహరణకు, పేలవంగా కుదించబడిన నేల, బలహీనమైన రాతి లేదా మునుపటి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలతో కూడిన వాలులు అస్థిరతకు ఎక్కువగా గురవుతాయి కాబట్టి భూపాతాలు సంభవిస్తాయి.

నిరంతర వర్షపాతాలు: తుఫానుల వలన సంభవించే వర్షాల కారణంగా అధిక వర్షపాతం కారణంగా కూడా భూపాతాలు సంభవిస్తాయి. పశ్చిమ కనుమల్లో ఈ తరహా భూపాతాలను గమనించవచ్చు. కొండ ప్రదేశాల్లో మంచు కరగడం కారణంగా భూపాతాలు సంభవిస్తాయి.

భూకంపం: బలమైన భూకంపాలు భూమిని కదిలించి అస్థిరతను కలిగిస్తాయి. దాని కారణంగా భూపాతాలు సంభవిస్తాయి. ఇటువంటి భూపాతాలు ఎక్కువగా హిమాలయాలు, ఈశాన్య పర్వత ప్రాంతాలు, పశ్చిమ కనుమల్లో సంభవిస్తాయి. మానవ కార్యకలాపాలు: అటవీ నిర్మూలన, తవ్వకం, నిర్మాణం వంటి మానవ కార్యకలాపాలు వాలులను బలహీనపరుస్తాయి. ఈ చర్యలు భూపాతాల ప్రమాదాన్ని పెంచుతాయి.

వాతావరణ మార్పు: ఉష్ణోగ్రత మరియు అవపాతం నమూనాలలో మార్పులు వాలుల స్థిరత్వాన్ని మార్చగలవు తద్వారా భూపాతాలకు ప్రేరణ కలుగుతుంది.