కుషాణులు, శాతవాహన వంశాలు పతనమైన అనంతరం భారతదేశ చరిత్రలో ప్రముఖస్థానం ఆక్రమించిన రాజ వంశము గుప్త వంశము. గుప్త వంశీయులు క్రీ.శ.275 నుండి పాలించడం మొదలు పెట్టారు. కానీ వీరి అసలైన ప్రాభవం క్రీ.శ. 320 నుండి ప్రారంభమైనది. గుప్త వంశ రాజుల పరిపాలన స్వర్ణయుగ పాలనగ పరిగణించబడింది. భారతీయ సంస్కృతీ వికాసానికి గుర్తులు అనేక సేవలు చేశారు. గుప్త రాజులు కళాప్రియులును, కళాపోషకులు అవడం వలన భారతదేశంలో సమస్త కళలు వృద్ధి చెందడానికి ప్రోత్సాహం కలిగించారు. 13 మంది గుప్త రాజులు క్రీ.శ.275 నుండి క్రీ.శ. 600 వరకు భారత భూభాగాన్ని పాలించారు.

శ్రీగుప్తుడు (Sri Gupta)

గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. ఇతని పూర్వీకులు శాతవాహన రాజులకు, కుషాణ రాజులకు విధేయ సామంతులుగా ఉండి పాటలీపుత్ర ఉత్తర, పరిసర ప్రాంతాలను పాలించారు. శ్రీగుప్తుడు మహారాజ బిరుదాంకితుడు. ఇతడు పరమత సహనం కలవాడు. నలంద పట్టణమునకు 64 కి.మీ. దూరంలో ఒక దేవాలయంను నిర్మించి, ఆ దేవాలయ నిర్వహణమునకు, పూజాదికములకు 24 గ్రామాలను అగ్రహారాలుగా దానమిచ్చినట్లు చైనా యాత్రికుడు ఇత్సింగ్ రచనల వలన తెలుస్తున్నది. శ్రీగుప్తుడు పాటలీపుత్ర నగరాన్ని జయించి, దానిని తన రాజధానిగా చేసుకొన్నాడు. శ్రీగుప్తుడు జయించిన ఇతర రాజ్యాలలో వంగ రాజ్యం ముఖ్యమైనది. ఆ రాజ్యము గుప్త సామ్రాజ్యంలో విలీనం అవడంతో రాజ్య ఆర్థిక స్థితి మెరుగైనది. శ్రీ గుప్తుడు క్రీ.శ.275 నుండి క్రీ.శ.300 వరకు పాలించాడు.

ఘటోత్కచుడు (Ghatotkacha Gupta)

శ్రీ గుప్తుడి అనంతరం అతని పుత్రుడు ఘటోత్కచుడు రాజైనాడు. ఇతడు క్రీ.శ.300-320 వరకు పరిపాలించాడు ఘటోత్కచుడు బలవంతులైన రాజవంశీయులతో సంబంధ బాంధవ్యాలనేర్పరచుకున్నాడు. మంత్రి సామంత పురోహితుల సహాయ సహకారాలతో చక్కని పరిపాలనా సంస్కరణలను రూపొందించి అమలు చేశాడు. ఈ సంస్కరణల వలన ఇతనికి ప్రజాభిమానం దక్కింది. ఇతడు సుమారు 20 సంవత్సరాలు అత్యంత వైభవంగా తన పరిపాలన సాగించాడు. తన పరిపాలనా కాలంలో మగధ రాజధాని అయిన పాటలీపుత్ర నగరాన్ని సమస్త సదుపాయాలకు ఆలవాలమైనదిగా తీర్చిదిద్దాడు. పాటలీపుత్ర నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత ఘటోత్కచునికే దక్కుతుంది. 

మొదటి చంద్రగుప్తుడు (Chandragupta-I)

ఘటోత్కచుని తరువాత అతని కుమారుడు మొదటి చంద్రగుప్తుడు క్రీ.శ. 320లో సింహాసనమధిష్టించాడు. ఇతని పాలనా కాలం క్రీ.శ. 320 నుండి క్రీ.శ. 326. ఈ మహారాజు గొప్ప విజేతగా, అరివీర భయంకరమైన వాడుగా కీర్తించబడినాడు. లిచ్ఛవీ రాజవంశములతో మొదటి చంద్రగుప్తుడు సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొని తన రాజ్యమును పటిష్ట పరచుకొన్నాడు. చంద్రగుప్తుడు రాజైన తరువాత లిచ్ఛవీలు మగధ రాజ్యంపై దండెత్తడానికి సమాయత్తమైనారు. చంద్రగుప్తుడు లిచ్ఛవీల దురాక్రమణను అరికట్టే ఉద్దేశ్యంతో అన్ని రకాల కట్టుదిట్టములతో యుద్ధానికి సన్నద్ధమైనాడు. కానీ లిచ్ఛవీలు చంద్రగుప్తుడి సామంతుల నోటితో అతనితో యుద్ధం జరిగితే తాము తప్పక పరాజయం పాలవుతామని దానికన్నా సంధి చేసుకోవడం ఉత్తమైనదిగా భావించారు. లిచ్ఛవీ రాజులకు చంద్రగుప్తుడికి మధ్య సంధి రాయబారాలు జరిగినవి. దానిలో భాగంగా లిచ్ఛవీ రాజ్యములు అన్నీ కూడా చంద్రగుప్తుని సామంత రాజ్యాలుగా ఉండేట్లు, లిచ్ఛవీ రాజకన్య కుమారదేవిని చంద్రగుపునికి ఇచ్చి వివాహం చేసేలాగా, అవసర సమయాల్లో మగధ రాజ్యానికి అన్ని విధాల సైన్య సహాయ సహకారాలు అందించేలాగ ఒప్పందం ఏర్పడింది. అనంతర కాలంలో చంద్రగుప్తుడు లిచ్ఛవీలతో సంబంధ బాంధవాలు దృఢపడిన తరువాత వారి సహకారంతో అయోధ్య, అలహాబాద్, వాయవ్య రాష్ట్రము తదితర రాజ్యాలను జయించి, మహా రాజాధిరాజ బిరుదును పొందాడు. చంద్రగుప్తుడు రాజ్యమునకు వచ్చిన సంవత్సరమైన క్రీ.శ.320 నుండి గుప్త శకం ప్రారంభమైనది. లిచ్ఛవీ రాజుకు కుమారదేవి ఏకైక కుమార్తె కావడం వలన తండ్రి రాజ్యమునకు నిజమైన వారసరురాలే ఆమెనే కాబట్టి లిచ్ఛవీ రాజ్యము చంద్రగుప్తుని వశమైనది. చంద్రగుప్తుడు తాను ముద్రించిన నాణెములపై తన పేరుతో పాటు కుమారదేవి పేరును, తన ప్రతిమతో పాటు ఆమె ప్రతిమను సైతం ముద్రించాడు. చంద్రగుప్తుని చివరి పాలనా సంవత్సరమున మేవాడ్ పాలకుడు చంద్రవర్మ చంద్రగుప్తుని ఎదిరించి స్వతండ్రుడైనాడు. చంద్రగుప్తుడు ఈ తిరుగుబాటును అణచలేకపోయాడు. చంద్రగుప్తుడు తన అవసాన దశ యందు కుమారదేవి వలన తనకు జన్మించిన సముద్రగుప్తునికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు.


 RELATED TOPICS 

గుప్తవంశము -2

గుప్తవంశము -3

గుప్తవంశము -4

గుప్తుల సాంఘిక చరిత్ర - 1

గుప్తుల సాంఘిక చరిత్ర - 2

గుప్తుల కాలంలో శిల్పము - చిత్రకళ 

గుప్తుల కాలంలో విశ్వవిద్యాలయాలు