రామగుప్తుడు (RamaGupta)

సముద్రగుప్తుని అనంతరం అతని జ్యేష్ఠ పుత్రుడు రామగుప్తుడు క్రీ.శ.375లో మగధ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు పిరికివాడు. రాజ్యపాలనా విషయంలో కూడా సమర్దుడు కాడు. ఒక యుద్ధంలో శకరాజుచే బంధించబడి, తన బంధువులైన రాజవంశీయుల కన్యయగు ధృవాదేవిని శకరాజునకు అప్పగించిన అసమర్ధుడు. 

రెండవ చంద్రగుప్తుడు (ChandraGupta-II)

రామగుప్తుని అనంతరం సముద్రగుప్తుని రెండవ కుమారుడు రెండవ చంద్రగుప్తుడు క్రీ.శ.375లోనే మగధ రాజ్య సింహసనం అధిష్టించాడు. ఇతడు వెలువరించిన క్రీ.శ.380కి చెందిన నాణెం ఒకటి లభించింది. భారతదేశ చరిత్రలో రెండవ చంద్రగుప్తుని కాలంలో స్వర్ణయుగం ఆరంభమైనదని చరిత్రకారులు భావించారు. సముద్రగుప్తుని కన్న చంద్రగుప్తుడు గొప్ప చక్రవర్తిగా కీర్తిగాంచాడు. చంద్రగుప్తుడు విక్రమాదిత్య బిరుదాంకితుడు. విశాఖదత్తుని దేవీ చంద్రగుప్త నాటకం ప్రకారం శకరాజుచే జరిగిన యుద్ధంలో ఓటమి పాలైన రామగుప్తుడు సంధి ప్రకారం అతని భార్య అయిన ధృవాదేవిని శకరాజుకు అప్పగించాల్సి వచ్చింది. ఇంతటి అవమానకరమైన పనిని చేసిన రామగుప్తుడిని, శకరాజును రెండవ చంద్రగుప్తుడు సంహరించాడని గాథ ప్రచారంలో కలదు. శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో కృష్ణానదికి ఉత్తర వైపున చంద్రగుప్తుని కోట కలదు. చంద్రగుప్తుడు కాశ్మీర దేశమును జయించి, తన సమీప బంధువగు ప్రతాపాదిత్యుడిని అక్కడి రాజ్యపాలనా వ్యవహారాలు చూడడానికి నియమించాడు. 

కుతుబ్ మీనార్‌కు సమీపంలోని మెహోలీ లోహ స్తంభ శాసనంలో చంద్రగుప్త విక్రమాదిత్యుడి విజయములు, యద్దు నైపుణ్యము, యుద్ధరంగంలో అతని వీర విహారము వర్ణింపబడినది. ఉదయగిరి శాసనం, చంద్రగుప్తుని సేనాని ఆమరకార్ధవుని సాం శాసనము, మాళవ శక నాయకుని శాసనాల ప్రకారం రుద్రసింహునితో పశ్చిమ శక క్షాత్రప వంశం అంతరించింది. చంద్రగుప్తుడు కీర్తి కాముకుడు. సాహసాంక బిరుదు ఉన్నవాడు. సమస్త కళలలో ఆరతితేరినవాడు. ఇతడు ముద్రించిన నాణెములపై దుర్గాదేవి, మృగేంద్ర వాహన, యుద్ధవీరుల ప్రతిమలు ఉన్నవి. ఇతని పట్టపురాణి కుబేర నాగదేవి, నాగవంశ సంజాత. చంద్రగుప్తుడు తనకు కుబేరనాగదేవి వలన జన్మించిన ప్రభావతీ గుప్త అను వాకాటక రెండవ రుద్రసేనునికిచ్చి వివాహం జరిపించాడు. చంద్రగుప్తుని రెండవ భార్య అయిన ధృవాదేవి వలన కుమారగుప్తుడు జన్మించాడు. చంద్రగుప్తుడు పట్టపురాణి వలన కలిగిన తనయుణ్ణి కాదని ధృవాదేవి వలన జన్మించిన కుమారగుప్తుని యువరాజుగా నియమించాడు. కొన్ని నాణెములు చంద్రగుప్తుడు పుష్పములు ధరించి కూర్చున్నట్లు ముద్రింపబడినవి. మరి కొన్ని నాణెములపై చంద్రగుప్తు విక్రమాదిత్యుని సార్వభౌమత్వమును సూచించు చిహ్నములున్నవి. ఇందులో చక్రవర్తి, పరివారము, పరిచారకుడు ఒకడు ఛత్రము పట్టినట్లు ముద్రింపబడి ఉన్నది. చంద్రగుప్తుడు వైదిక మతానుయాయి అయినను వైష్ణవ మతాన్ని ఆదరించాడు. జైన తీర్థంకరులను, బౌద్ధ సన్యాసులను కూడా ఆదరించాడు. గుప్తరాజుల రాజధాని పాటలీపుత్ర మహా నగరము. అయోధ్య నగరం ఈ వంశీయులకు రెండవ కేంద్ర స్థానముగా ఉండేది. 

మొదటి కుమారగుప్తుడు (KumaraGupta-I)

ఇతడు క్రీ.శ.413లో గుప్త సామ్రాజ్యాధినేత అయ్యాడు. సతారా ప్రాంతంలో ఇతడు ముద్రించిన నాణెలు లభ్యమైనవి. సముద్రగుప్తుని వలె కుమారగుప్తుడు అశ్వమేధయాగము జరిపాడు. కుమారగుప్తుని అవసాన దశలో పుష్యమిత్ర జాతుల వారు మగధపై దండెత్తినారు. కుమారగుప్తుడు ముద్రించిన నాణెములపై కుమారగుప్తుడు ఖడ్గం చేతిలో ధరించి, గుఱ్ఱంపై స్వారీ చేస్తున్నట్లు, ఛత్రధారిగా, మయూర వాహనునిగా, ఇద్దరు రాణులతో కలిసి ఉన్నట్లు ముద్రింపబడింది. 


 RELATED TOPICS 

గుప్తవంశము -1

గుప్తవంశము -2

గుప్తవంశము -4

గుప్తుల సాంఘిక చరిత్ర - 1

గుప్తుల సాంఘిక చరిత్ర - 2

గుప్తుల కాలంలో శిల్పము - చిత్రకళ 

గుప్తుల కాలంలో విశ్వవిద్యాలయాలు