స్కందగుప్తుడు (SkandaGupta)

ఇతడు మొదటి కుమారగుప్తుని తనయుడు. బిల్సాదు శాసనకర్త ఇతడే. ఇతని కాలంలోనే మంగోలియా జాతి వారు భారతదేశంపై దండెత్తారు. తన తండ్రి కుమారగుప్తుని స్మృత్యర్ధం ఒక శిలాస్తంభమును నాటించాడు. ఈ స్తంభ అగ్రభాగంలో విష్ణు విగ్రహం చెక్కించబడింది. శ్వేత హూణులను ఎదిరించి విజయం సాధించినట్లు ఈ శాసనంలో పేర్కొనబడింది. బంగరు నాణెములపై ధనుర్ధారియై ఉన్నట్లు, గరుడధ్వజము పై భాగాన కుడి వైపున గజలక్ష్మి, పద్మ పాశ ధారిణియై స్కందగుప్తుని వీక్షించుచున్నట్లు స్కందగుప్తుడు ముద్రించాడు. హూణులు గుప్త సామ్రాజ్య పశ్చిమ భాగములలో అలజడిని సృష్టించగా వారిని యుద్ధ రంగంలో ఓడించి తరిమి వేసి స్కందగుప్తుడు సౌరాష్ట్ర ద్వీపకల్పమును స్వాధీన పరచుకొన్నాడని క్రీ.శ.458 నాటి శాసనం వలన తెలియుచున్నది. వర్ణదత్తుడిని సౌరష్ట పాలకునిగా నియమించాడు. క్రీ.శ.150లో మౌర్యుల కాలంలో త్రవ్వించబడిన పశ్చిమ క్షాత్రపుడగు రుద్రదామునిచే బాగు చేయించబడిన గిర్నార్ పర్వత ప్రాంత సుదర్శన తటాకమును స్కందగుప్తుడు పునరుద్ధరించాడు. ఈ తటాక పునరుద్దాకమొక సంవత్సరంలో పూర్తియైనది. సుదర్శన తటాకానికి సమీపాన క్రీ.శ.360లో ఒక విష్ణువు యొక్క ఆలయం నిర్మాణం జరిగింది. గోరఖ్ పూర్ జిల్లాలో లభించిన శాసనము వలన ఆ ప్రాంతము స్కందగుప్తుని పాలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ శాసనం ప్రకారం క్రీ.శ.465లో స్కందగుప్తుని పాలనా కాలంలో ఒక బ్రాహ్మణుడు గంగా యమునా నదుల మధ్య ప్రదేశాన సూర్యదేవాలయమును నిర్మించినట్లు తెలుపుచున్నది. స్కందగుప్తునికి కుమారాదిత్యుడనే బిరుదు ఉన్నది. హూణులను ఓడించిన పిదపనితడు విక్రమాదిత్య బిరుదము వహించెను.

పూరు గుప్తుడు (PuruGupta)

మొదటి కుమార గుప్తుని పుత్రుడు పూరుగుప్తుడు స్కంద గుప్తుని తరువాత రాజైనాడు. క్రీ.శ. 478లో మగధ సిహాసనాన్ని అధిష్టించి, మూడు సంవత్సరాలు మాత్రమే పాలింపగలిగినాడు.

బుధగుప్తుడు (BudhaGupta)

పూరుగుప్తుని జ్యేష్ఠ కుమారుడు బుధగుప్తుడు తండ్రి తరువాత క్రీ.శ.476లో గుప్త రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు సుమారుగా 19 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఇతడు అంత సమర్ధుడైన రాజు కాడు. ఇతనికి రాజ్య కాంక్ష లేదు, ఉన్న రాజ్యమును క్రీ.శ. 476 నుండి క్రీ.శ. 495 వరకు ప్రశాంతంగా పాలించాడు.

వైశ్యగుప్తుడు (VaishyaGupta)

బుధగుప్తుని తరువాత అతని తనయులలో జ్యేష్ఠుడైన వైశ్యగుప్తుడు గుప్త సామ్రాజ్యమందున్న సమతత, నలంద ప్రాంతాలను పాలించాడు. ఇతడు కొన్ని బంగారు నాణెములను ముద్రించాడు.

భానుగుప్తుడు (BhanuGupta)

ఇతడు వైశ్యగుప్తునికి సోదరుడు. ఇతనికి సంబంధించిన శాసనములు మాళవలో లభించడం వలన ఇతడు హూణుల సామంతునిగా ఆ ప్రాంతాన్ని పాలించాడని చరిత్రకారుల భావన. తోరమానునితో సంభవించిన యుద్ధమున భానుగుప్తుడు విజయం సాధించాడు. మాళవ రాజ్యమును హూణుల నుండి రక్షించిన ఖ్యాతి భానుగుప్తుడికే చెందుతుంది. 

నరసింహగుప్త బాలాదిత్యుడు (NarasimhaGupta Baladitya)

బుధగుప్తుడి మరణానంతరం అతని సోదరుడు, నరసింహగుప్తుడు మగధ రాజ్యపీఠం అలంకరించాడు. ఇతడు మొదటి కుమారగుప్తుకు మనుమడు. నరసింహ గుప్తుడు నలందలో బౌద్ధ విహారమును నిర్మించెను. ఈ విహార నిర్మాణానంతరము ప్రకటించిన శాసనము వలన ఇతనికి బాలాదిత్యుడను బిరుదున్నట్లు తెలుస్తున్నది. నలంద నగరంలో బాలాదిత్యుడు 300 అడుగుల ఎత్తుగల ఆలయాన్ని ఒక దానిని నిర్మించాడు. ఇది ఇటుకలతో నిర్మించిన ఆలంయ. నేడు శిథిలావస్థలో ఉన్నది.

మూడవ కుమారగుప్తుడు (KumaraGupta-III)

నరసింహగుప్త బాలాదిత్యుని తరువాత అతని తనయుడు మూడవ కుమారగుప్తుడు రాజైనాడు. కాళీఘాట్ కలకత్తా ప్రాంతంలందు లభించిన నాణెములలో అధికమున నరసింహగుప్త, కుమారగుప్త, విష్ణుగుప్త నామములు కలవు. విష్ణుగుప్తుడు రెండవ కుమారగుప్తుని తనయుడు. ఇతడు విష్ణుగుప్త చంద్రాదిత్యుడు అనబడినాడు. మూడవ కుమారగుప్తుని కాలపు సుందరతర రజత ముద్రిత ఘాజీపూర్ జిల్లాలోని భైతరిలో లభించినది. రెండవ కుమారగుప్తుని తనయుడు విష్ణుగుప్తుడు వంగదేశ మధ్య భాగంను స్వతంత్రముగా పాలించుచూ తన పేర నాణెములను ముద్రించెను. మూడవ కుమారగుప్తుడు గుప్త సామ్రాజ్య చివరి రాజు.

యశోధర్మ విక్రమాదిత్యుడు (YashodharmaGupta)

సౌమ్యదర్శన, మహేంద్రాదిత్యుల కుమారుడు యశోధర్మ విక్రమాదిత్యుడు. ఇతనికి భీష్మ శీలుడు అనే బిరుదు కలదు. మగధ రాజుల విధేయ సామంతునిగా ఇతడు ఉండేవాడు. మందసార శాసనకర్త ఇతడే. ఈ శాసనంలో మిహిరకులుడు యశోధర్మునికి పాదపూజ చేసినట్లు తెలుపుచున్నది. యశోధర్ముడు బౌద్ధమతావలంబి. ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాలో ఉన్న మహేంద్రాచలముపై ఇతడు విజయ స్తంభము నాటించాడు. ఇక్కడే యశోధర్మునికి సంబంధించిన మూడు శాసనములు లభ్యమైనవి. ఈ ప్రాంతమున మందసార లేక దశపుర సంస్కృత శాసనమున్నది. ఉజ్జయినీ పాలకుడైన యశోధర్మునికి కూడా విక్రమాదిత్యుడనే బిరుదు ఉన్నది. 

మాతృగుప్తుడు (Matru Gupta)

కల్హణుడు అనే కవి కాశ్మీరును పాలించిన రాజుల చరిత్రను రాజతరంగిణి అను గ్రంథముగా రూపొందించాడు. మూడవ కుమారగుప్తుని తనయుడు దామోదర గుప్తుడు రాజ్యమునకు వచ్చిన కొలది కాలమునకే మౌఖరి ఈశానవర్మ సంతతివారితో సంభవించిన యుద్ధమున మరణించెను. ఇంతటితో గుప్త వంశము సమూలముగా నిర్మూలింపబడినది.


 RELATED TOPICS 

గుప్తవంశము -1

గుప్తవంశము -2

గుప్తవంశము -3

గుప్తుల సాంఘిక చరిత్ర - 1

గుప్తుల సాంఘిక చరిత్ర - 2

గుప్తుల కాలంలో శిల్పము - చిత్రకళ 

గుప్తుల కాలంలో విశ్వవిద్యాలయాలు