గుప్త చక్రవర్తుల కాలంలో అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించబడినవి. అంతకు పూర్వం స్థాపింబచబడిన విశ్వ విద్యాలయాలు అభివృద్ధి చెందబడినవి. నైమిశారణ్య విద్యాలయంలో 10 వేల మంది విద్యార్థులుండేవారు. వీరు శౌనకమహర్షి శిశ్యులుగా ప్రసిద్ధి చెందారు. శౌనక మహర్షి కులపతి అనే బిరుదు కలిగి ఉండేవాడు. బదరికారణ్యము నేటి తెలంగాణమందలి నల్లగొండ మండలమందుండెను. కృష్ణా-మూసీ నదుల సంగమ ప్రదేశమైన వాడపల్లి బదరికాశ్రమమున్న ప్రాంతము. బదరికాశ్రమము వాడపల్లి ప్రాంతమేనని వాడపల్ల శాసనంలో తెలుపబడింది. 

వివిధ విశ్వవిద్యాలయాలు - వాటి శాస్త్ర ప్రత్యేకత 
నలంద, కాశీ - వ్యాకరణ శాస్త్రమునకు 
కాశ్మీరము - అలంకార శాస్త్రమునకు 
తక్షశిల - ఆయుర్వేద విద్య 
ఉజ్జయిని - ఖగోళ, జ్యోతిశ్శాస్త్రములకు 
నవద్వీపము - న్యాయ శాస్త్రమునకు 

విక్రమశిల - సమస్త శాస్త్రములకు

తక్షశిల

భారతదేశంలో స్థాపించబడిన ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ఒకటి. నేడు పాకిస్తాన్ దేశంలో ఇది శిథిల రూపంలో కనిపిస్తుంది. బింబిసారుడు, అజాతశత్రువుల ఆస్థాన వైద్యుడు జీవకుడు తక్షశిల మహా విద్యాలయ విద్యార్థి. చాణక్యుడు సైతం ఈ విద్యాలయంలోనే విద్యనభ్యసించాడు. మౌర్యచంద్రగుప్తుడు కూడా ఈ విద్యాలయ విద్యార్డే. అష్టాధ్యాయి రచించిన పాణిని కూడా ఈ విద్యాలయంలోనే సమస్త విద్యలు అభ్యసించాడు. కోసల దేశాధీశుడగు ప్రసేనజిత్తు తక్షశిల విద్యాలయంలోనే విద్యాభ్యాసమొనర్చాడు. ఇతడు పాళీ భాషలో నిష్ణాతుడు. హిరియోడరస్, అలొలోనియస్ అనే యవన తత్త్వవేత్తలు కూడా తక్షశిలలోనే విద్యాభ్యాంస చేశారు.

హిరియోడరస్ భారతదేశంలో నివసించి వైష్ణవ మతాన్ని స్వీకరించి ఒక గరుడధ్వజమును నెలకొల్పాడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో మొదట వేదవిద్యలు బోధించేవారు. క్రమంగా బౌద్ధ విద్యలు వేద విద్యల స్థానం ఆక్రమించినవి. అలెగ్జాండర్ భారతదేశ దిగ్విజయ యాత్ర సందర్భంలో తక్షశిల విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. స్వదేశం తిరిగి వెళ్తునప్పుడు మత హైందవ సంబంధ గ్రంథములను, పండితులను తన వెంట తీసుకొని వెళ్ళాడు.

నలంద 

క్రీ.శ.413-455 వరకు గుప్తరాజ్యమునేలిన మొదటి కుమారగుప్తుని ప్రోత్సాహం వలన నలందా మహా విద్యాలయము ప్రారంభించబడింది. నలంద అనగా విద్యను, సంపదను, ధనమును, సమస్త సుఖములను లేదనక ఇచ్చేది అని అర్థం. నలంద అనే పదానికి సత్యమైనది లేక నిజమైనది అనే అర్థం కూడా ఉన్నది. మగధ సామ్రాజ్యంలోని నలంద విశ్వవిద్యాలయం ప్రపంచ ఖ్యాతి గాంచినది. ఇది అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా కొనియాడబడినది. రాజగృహానికి 1 కి.మీ. దూరంలో నలందా విశ్వవిద్యాలయం ఉన్నది. ఆ రోజుల్లో ప్రపంచంలోనే నలంద వంటి విశ్వవిద్యాలయం ఎక్కడా లేకుండెను. ఈ విశ్వవిద్యాలయంలో భారతదేశ విద్యార్థులే కాకుండా విదేశీ విద్యార్థులు సైతం విద్యనార్జించారు. గౌతమ బుద్ధుడు జీవించి ఉన్నకాలంలో నలంద గ్రామం ఉండేది. మహాపరినిర్వాణ సూత్రము వలన పాటలీపుత్రము కన్నా నలంద ప్రాచీనమైనదిన తెలుస్తుననది. జైనమత స్థాపకుడగు వర్ధమాన మహావీరుడు నలందలో కొంతకాలం నివసించాడని జైనకల్ప సూత్రం ద్వారా తెలుస్తున్నది. నలందలో అమ్రవాటిక అను విశ్రాంతి భవనములో ఒక రోజు గౌతమ బుద్ధుడు గడిపినాడు. శౌరిపుత్రుని జన్మస్థలము నలందలో 80వేల మంది అర్హతులు మోక్షమును పొందినారు. అశోక చక్రవర్తి శారిపుత్రుని చైత్యము నారాధించి, నలందలో ఒక బౌద్ధ దేవాలయము నిర్మించాడు. సువిష్ణువను ఒక బ్రహ్మాణుడు నలందలో 108 దేవాలయములను నిర్మించాడు. ఫాహియాన్ కాలానికి నలంద అంతగా ప్రసిద్ధి చెందలేదు. కానీ అతని తరువాత 200 సంవత్సరాలకి భారతదేశ సందర్శనికి వచ్చిన హ్యుయాన్‌త్సాంగ్ నలందా విశ్వవిద్యాలయమును చూసి, ఆనందపరవశుడై ఆ నగరంను, విశ్వవిద్యాలయంన తన రచనలలో మనోజ్ఞముగ వర్ణించాడు. 

నలంద విశ్వవిద్యాలయ భవన సముదాయం ఇటుకలతోనే నిర్మింపబడినది. గౌతమబుద్ధుడి నిర్యాణానంతరము శక్రాదిత్యుడు(మిహిరకులుడు), బుద్ధగుప్తుడు, తథాగతుడు(పూరుగుప్తుడు), బాలాదిత్యుడు, వజ్రుడు అనే రాజులు నలందలో ఐదు సంఘారామాలు నిర్మించారు. హ్యుయాత్సాంగ్ నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన కాలంలో అక్కడ చంద్రపాలుడు, ధర్మపాలుడు, గుణమతి, స్థిరమతి, ప్రభామిశ్రుడు, జనమిశ్రుడు, జ్ఞానచంద్రుడు అను మహామహులైన ఆచార్యులు విద్యార్థులకు బోధిస్తూ ఉండేవారు. ఆ కాలంలో నలందా విశ్వవిద్యాలయ ప్రధానాచార్య పీఠమును అధిష్టించిన వాడు శీలభద్రుడు. ఇతడి జన్మస్థలము వంగదేశము. బ్రాహ్మణుడైన ఇతడు భీక్షా జీవితాన్ని ప్రారంభించి బౌద్ధ భిక్షువుగా మారాడు. మూలసర్వాస్తివాద నికాయ గ్రంథ రచయిత - జనమిశ్రుడు.

హ్యుయాత్సాంగ్ అనంతరం భారతదేశ పర్యటనకు వచ్చిన ఇత్సింగ్ నలంద విశ్వవిద్యాలయంను దర్శించి కొన్ని రోజులు అక్కడ నివసించి 5 లక్షల శ్లోకములతో కూడుకుని ఉన్న 400 సంస్కృత గ్రంథములను సేకరించి తన వెంట చైనా దేశమునకు తీసుకొని పోయెను. నలందా విశ్వవిద్యాలయంలో ప్రవేశార్హత పొందడానికి విద్యార్థులు వ్యాకరణ శాస్త్ర పరిజ్ఞానమును కలిగి ఉండవలెనను నియమముండెను. వ్యాకరణ శాస్త్రంలో సిద్ధ, సూత్ర, ధాతు, ఖిల, వృత్తి సూత్రములలో విద్యార్థులు నిష్ణాతులై ఉండవలెనని నియమం ఉంటుంది. పాణిని అష్టాధ్యాయిపై గల వ్యాఖ్యాన లేక భాష్య గ్రంథమునకు చెందిన వృత్తి సూత్రములను విద్యార్థులు అభ్యసించేవారు. హేతువాద విద్య, అభిదమ్మ కోశము, బౌద్ధ జాతక కథలను సైతము విద్యార్థులభ్యసింపవలసి యుండెడిది. జాతక కథలనభ్యసించిన తరువాత విద్యార్థులకు విశ్వవిద్యాలయమున ప్రవేశము లభించేది. నలందా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు పతంజలి యోగ శాస్త్రమునభ్యసించేవారు. భర్తృహరి వాక్యపదీయము, వేదములు, వేదాంగములు, పురాణములు, ఇతిహాస కావ్యములు పఠించిన విద్యార్థులు పండితులుగాను, విద్వాంసులుగాను పరిగణింపబడి సామ్రాజ్యంలో గౌరవాదరములు పొందేవారు. నలంద పట్టణంలో ఉన్న గొప్ప గ్రంథాలయము మూడు భవనాలలో ఉన్నది. ఈ భవనముల పేర్లు రత్నసాగరం, రత్నదధి, రత్నారంభక. రత్నదధి తొమ్మిది అంతస్థులు గల భవనము. ఈ భవనమున ప్రజ్ఞాపారమిత సంబంధిత గ్రంథములుండెను. ముదితభద్రుడు అనే బౌద్ధ సన్యాసి పతనమైన నలందా విశ్వవిద్యాలయమును పునరుద్ధరించుటకు ప్రయత్నించెను. కుక్కుట సిద్ధుడు అనే పేరుగల మగధ రాజ్య అమాత్యుడు నలంద పట్టణంలో ఒక విహారమును నిర్మించెను.

విక్రమశిల

వంగరాష్ట్ర పాలకుడు ధర్మపాలుడు. అతనికి విక్రమశీలుడు అని బిరుదుండేది. విక్రమశీలుడు తన రాజ్యమందున్న బౌద్ధ విహారమును విశ్వవిద్యాలయంగా మార్చి, తన పేరు పెట్టాడు. కావున ధర్మపాలుడు స్థాపించిన విశ్వవిద్యాలయము విక్రమశీల విశ్వవిద్యాలయముగా ప్రసిద్ధి పొందింది. విక్రమశీల విశ్వవిద్యాలయము టిబెట్టు సంప్రదాయ అనుసారము నిర్మింపబడింది. కాంపిల్యుడు బౌద్ధతంత్ర శాస్త్రవేత్త. అతడు మహాముద్రను కలిగి తద్వారా సిద్ధిని పొందాడు. ధర్మశీల మహారాజుకు పరమసౌగత, పరమేశ్వర, పరమ భట్టారక, మహారాజ, రాజాధిరాజ బిరుదులున్నవి. ఈ విశ్వవిద్యాలయంలో 108 మంది ఆచార్యులు విద్యాబోధన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయాచార్యులకు పండిత బిరుదమున్నది. రత్నవజుడు అనే కాశ్మీరదేశ పండితుడు విక్రమశీల విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని అధిష్టించాడు. ఆచార్య జటారి, అతని శిష్యుడు ద్వీపంకరుడు విక్రమశీల విశ్వవిద్యాలయంలో ఉండి సాహిత్య సేవ చేశారు. రత్నకీర్తి, జ్ఞానశ్రీ మిశ్రాదులీ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉండి వివిధ శాస్త్ర విషయములను విద్యార్థులకు బోధించేవారు. జ్ఞానశ్రీ మిశ్రుడు తరువాత ఈ విశ్వవిద్యాలయమున ద్వారా పండిత పదవిని నిర్వహించెను. ఒక్కొక్క కళాశాలలో 108 మంది ఆచార్యులు, 8000 మంది విద్యార్థులుండిరి. విద్యాలయావరణమున ఒక ద్వార పండితుడుండెడివాడు. ద్వార పండితుని అంగీకారమును పొందిన విద్యార్థులే కళాశాల యందు ప్రవేశించి విద్యార్జన చేయడానికి అర్హులై ఉండేవారు.


 RELATED TOPICS 

గుప్తవంశము -1

గుప్తవంశము -2

గుప్తవంశము -3

గుప్తవంశము -4

గుప్తుల సాంఘిక చరిత్ర - 1

గుప్తుల సాంఘిక చరిత్ర - 2

గుప్తుల కాలంలో శిల్పము - చిత్రకళ