పాలనా విధానం

గుప్తుల కాలంలో ప్రజలు రాజును భగవంతుడి అంశగా భావించారు. “నావిష్ణుః పృథివీపతిః” అనే వాక్యం ద్వారా ప్రజలు తమ రాజు పట్ల ఎంత భక్తి భావంను కలిగి ఉండేవారని తెలుస్తున్నది. అలహాబాద్ శిలాశాసనంలో సముద్రగుప్తుడు దిక్పాలక, కుబేర, వరుణ, ఇంద్ర, యములకు సమానమైన వాడని వర్ణింపబడినాడు. సృష్టి, స్థితి, లయలకు కారణమైన విష్ణుమూర్తి వంటి వాడు రాజు అని ఈ శాసనంలో తెలుపబడినది. ఈ కాలంలో రాజసభలో పదిమంది మంత్రులు ఉండేవారు. వారిలో సంధి విగ్రహాధికారి లేదా సంధి విగ్రహి; మహా బలాధికృత లేక సర్వసైన్యాధ్యక్షుడు; మహాక్షపాతిలక అనే వారు ముఖ్యమైనవారు. రాజాస్థానంలో న్యాయ విచారం చేసేవారిని ప్రాడ్వివాకులు అనేవారు. వీరు ఉన్నా కూడా రాజే న్యాయాధికారిగా వ్యవహరించేవాడు. న్యాయమైన తీర్పులిచ్చుటలో ప్రాడ్వివాకులు రాజుకు తగిన సూచనలిచ్చేవారు. పాలనాపరంగా సామ్రాజ్యము దశ(10)గ్రామ, వింశతి(20)గ్రామ, శత (100) గ్రామ, సహస్ర(1000)గ్రామ అను స్థాయిలో విభజించ బడి ఉండేది. పాలనా సౌకర్యాల కొరకు భుక్తి, దేశము, రాష్ట్రము అను విభాగాలు ఏర్పాటు చేయబడినవి. ప్రభుత్వోద్యోగులను రాజే నియమించేవాడు. వీరి పనులను బట్టి జీతాల నిర్ణయం జరిగేది. 

ఉద్యోగ వృత్తులు నిర్వహించే వారికి ప్రతిఫలంగా భూములనిచ్చే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉండేది. వివిధ ఉద్యోగులకు ఇచ్చే భూముల వివరాలు: 

1) దశగ్రామ పాలకునికి - రెండెకరాల భూమి 
2) వింశతి గ్రామ పాలకునికి - 10 అరకల భూమి 
3) శత గ్రామాధికారికి - 1 గ్రామము 

4) సహస్ర గ్రామాధికారికి - ఒక పట్టణము 

పండిన పంటలో ప్రజలు 1/6 వంతు పన్ను రూపంలో చెల్లించేవారు. యుద్ధ కాలంలో, విదేశ దండయాత్రలను ఎదుర్కొనే సమయాల్లో పన్ను 1/4 వంతుగా ఉండేది. రాజ్యంలో ఉన్న పండితులు, కవులు, వేదాలు పురాణాలు ఇతిహాసాలలో నిష్ణాతులైన వారు, విద్వాంసులు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. వర్తకులు పంట ధాన్యంలో 12వ భాగము, వ్యాపారులు వ్యాపార లాభంలో 1/10వ భాగం పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉండేది. చిన్న చిన్న వ్యాపారులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పన్నులు చెల్లించేవారు. కష్టజీవులు, కూలిపనివారు, ఇతర వృత్తుల వారు నెలజీతంలో గాని, బత్తెములోగాని 1/30 వంతు పన్ను చెల్లించాల్సి ఉండేది. గుప్త సామ్రాజ్య కాలంలో పన్నుల భారం తక్కువగా ఉండేది. ప్రజలు ఎటువంటి నిర్బంధం లేకుండా, నియమాలు లేకుండా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారు. పారిశ్రామికులు చెల్లించే పన్నులు, విదేశ వ్యాపారులపై విధించే పన్నులు రాజ కోశాగారానికి అధిక ఆదాయం చేకూర్చేది. 

సాంఘిక వ్యవస్థ

గుప్త రాజుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉండేది. అయినప్పటికీ కొన్ని సార్లు బ్రాహ్మణులు ఆయుధాలు ధరించి యుద్ధం చేయడం, క్షత్రియులు వైశ్య వృత్తి నవలంభించడం జరిగేది. కొదరు వైశ్యులు, శూద్రులు రాజ్యాధికారం పొందేవారు. వర్ణాంతర వివాహాలు కూడా జరిగేవి. ప్రజలు మధువును, మాంసమును సేవించేవారు. కొందరు ఉల్లిపాయలు తినడం అపచారమని భావించేవారు.మధు మాంసాలను సేవించేవారిని చండాలులుగా వ్యవహరించేవారు. వీరు గ్రామానికి బయట నివసించేవారు. యజ్ఞ యాగాది క్రతువులలో జీవహింసను పాటించే ఆచారం ఉండేది. సంఘంలో స్త్రీలకు సమున్నత స్థానం ఉండేది. రాజ్యంలోని స్త్రీలు విద్యావంతులు. గుప్త రాణులు పరిపాలనా వ్యవహారాలలో కూడా ప్రధాన పాత్ర వహించేవారు. ఈ కాలంలో స్వయంవర వివాహాలు కూడా అమలులో ఉండేవి. రాజ్యంలో కొన్ని చోట్ల సతీసహగమనం అమలులో ఉండేది. వితంతువులకు పునర్వివాహం జరపడం అపచారంగా భావించేవారు.


 RELATED TOPICS 

గుప్తవంశము -1

గుప్తవంశము -2

గుప్తవంశము -3

గుప్తవంశము -4

గుప్తుల సాంఘిక చరిత్ర - 2

గుప్తుల కాలంలో శిల్పము - చిత్రకళ 

గుప్తుల కాలంలో విశ్వవిద్యాలయాలు