సముద్రగుప్తుడు (SamudraGupta)

మొదటి చంద్రగుప్తుడి కుమారుడు సముద్రగుప్తుడు క్రీ.శ. 326లో మగధ సామ్రాజ్యాధిపతి అయినాడు. అలహాబాద్ శిలాశాసనంలో, గయా తామ్ర శాసనంలో సముద్రగుప్తుడు లిచ్చావీ రాజ కుమార్తెకు తనయుడని వర్ణించబడినాడు. సముద్రగుప్తునికి బాలాదిత్య, పరాదిత్య శ్రీ చంద్ర ప్రకాశ అనే బిరుదులు కలవు. సముద్రగుప్తుని గురువు బౌద్ధ మతాచార్యుడైన వసబంధువు అని తెలుస్తున్నది. వసుబంధువు గూర్చి ఆర్యమంజుశ్రీ మూలకల్ప, తంత్రికామందక గ్రంథాలలో వివరించబడింది. సముద్రగుప్తుడు యుద్ధవిద్యా విశారదుడు. సంగీత సాహిత్యములను క్షుణ్ణంగా అభ్యసించాడు. గొప్ప విజేత. అసాధారణ రాజ్యకాంక్ష కలవాడు. ధర్మ సంస్థాపనార్ధము, దేశ సమగ్రతకు, సముద్రగుప్తుడు క్రీ.శ. 337-338, 345 సంవత్సరాలలో దండయాత్రలు నిర్వహించాడు. ఉత్తరాపథంలో 9 మంది రాజులను, దక్షిణా పథంలో 15 మంది రాజులను జయించాడు. సముద్రగుప్తుని దండయాత్రలను గూర్చి అతని ఆస్థానకవి హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ శాసనము అశోక చక్రవర్తి వేయించిన శాసన శిలపై చెక్కబడింది. అచ్యుతుడు, నాగసేనుడు, రుద్రదేవుడు, మతిలుడు, నాగదత్తుడు, చంద్రవర్మ, గణపతినాగ, నంది, బలవర్మ మొదలైన వారు సముద్రగుప్తుడు ఉత్తరాపథంలో జయించిన రాజులు. పుష్కరణ దేశ రాజైన చంద్రవర్మ రాజప్తుర స్థానమైన మార్వారు ప్రాంతాన్ని ఏలుతుండేవాడు. ఇతడు మొదటి చంద్రగుప్తుడిని ఎదిరించాడు. 

సముద్రగుప్తునిచే ఓడింపబడిన రాజులు : 

సమత, కామరూప, దావక, నేపాళ, కత్రిపుర, మాళవ, అర్జునాయన, యౌధేయ, మాదక, ఆభీర, ప్రార్జున, శనకానీక, శాక, బార్బరిక మొదలైన గణతంత్ర రాజ్యములను జయించాడు. 

దక్షిణాపథ దండయాత్రలో భాగంగా సముద్రగుప్తుడు మహానది లోయలోని దక్షిణ కోసం రాజ్యమును ముట్టడించి ఆ ప్రాంత రాజు మహేంద్రుని యుద్ధంలో ఓడించాడు. తరువాత మధ్యప్రదేశ్, కళింగ రాజ్యాలలో ఉన్న ఆటవిక నాయకులను, ఆ నాయకులలో మహా బలవంతుడగు కాంతార పాలకుడు వ్యాఘ్రరాజును ఓడించాడు. గంజాం మండలంలో గల మహేంద్రగిరి, కోత్తూరు రాజ్యములను జయించి, ముందుకు సాగి పిష్ఠ పురము (పిఠాపురము) పై దండెత్తి దాని పాలకుడగు స్వామిదత్తుని ఓడించాడు. కౌస్థలపుర రాజు ధనంజయుడు తాను సముద్రగుప్తుని సామంతునిగా అంగీకరించాడు. సముద్రగుప్తుడు మహారాష్ట్రను ముట్టడించే నాటికి మహారాష్ట్ర మందున్న దేవరాష్ట్రకు కుబేరుడు పాలకుడుగా ఉండేవాడు. 

హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనంలో సముద్రగుప్తుడు జయించిన రాజ్యములు వాటి రాజుల పేర్లు వర్ణించబడినవి : 1) కౌసలక - మహేంద్ర 2) మహాకాంతారక - వ్యా ఘ్రరాజ 3) కౌరాలక - మంత్రరాజ 4) విజ్ఞపురక - మహేంద్ర 5) గిరికొత్తూరక - స్వామిదత్త 6) అరండపల్లిక-దమనః 7) కాంచేయక-విష్ణుగోప 8) అవముక్తక-నీల రాజ 9) వైంగేయక-హస్తివర్మ 10) పాలక్కడ - ఉగ్రసేన 11) దైవ రాష్ట్రక - కుబేర 12) కౌశస్థలపురక - ధనంజయ ఉత్తర.

దక్షిణాపథ-దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలను జయించిన తరువాత సముద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేశాడు. శుంగవంశ పుష్యమిత్రుని అనంతరం ఈ యాగం చేసినవాడు సముద్రగుప్తుడు. అశ్వమేధయాగమును నిర్వహించిన సందర్భమును పురస్కరించుకొని అతడు బంగారు నాణెములపై ముద్రించెను. ఈ నాణెములపై యూపము, అశ్వము ముద్రింపబడినవి. సముద్రగుప్తుడు సంగీత సాహిత్యములందు పాండిత్యమున్నవాడు. సంగీత శాస్త్రజ్ఞులను, సాహితీ వేత్తలను ఆదరించి గౌరవించి పోషించాడు. ఇతను సంస్కృత భాషలో కావ్య రచనా నైపుణ్యం కలవాడు. సముద్రగుప్తునికి కవిరాజు అనే బిరుదు కలదు. ఇతడు ముద్రించిన కొన్ని బంగారు నాణెములపై వీణచేత బట్టిన సరస్వతీ దేవి ప్రతిమ ఉన్నది. సముద్రగుప్తుడు వీణను వాయిస్తున్నట్లు ఉన్న ఒక నాణెము కూడా లభించింది. సముద్రగుప్తుని గురువు అయిన వసుబంధుడు బోధిచిత్రోత్పాదన శాస్త్రము, వజ్రచ్చేదిక, ప్రజా పారమితము అనే గ్రంధాలు రచించాడు. 

సింహళ ప్రభువు మేఘవర్ణుడు సముద్రగుప్తునికి సమకాలికుడు. బౌద్ధమతానుయాయైన మేఘవర్ణుడు బుద్ధుని వజ్రాసనము పూజించుటకు, బుద్ధగయలోని బోధి వృక్షమునకు ప్రాగ్భాగమునందు అశోక చక్రవర్తి నిర్మించిన విహారమును దర్శించడానికి సింహళం నుండి బౌద్ధ సన్యాసినీ సన్యాసులను పంపించాడు. మేఘవర్ణుడికి సింహళ యాత్రికుల నివాసార్థం బుద్ధ గయలో ఒక మహా విహార నిర్మాణానికి సముద్రగుప్తుడు అనుమతినిచ్చాడు. మేఘవర్ణుడు బుద్ధగయలో సింహళ యాత్రికులకు నిర్మించిన విహారం అత్యంత సౌందర్య విరాజితమైనది. ఈ విహారంలో స్వర్ణ రజిత నిర్మిత బుద్ధ విగ్రహం నెలకొల్పబడింది. క్రీ.శ. 7వ శతాబ్దిలో భారతదేశంను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాత్సాంగ్ బుద్ధగయలో మేఘవర్ణుడు నిర్మించిన విహారాన్ని తిలకించాడు.


 RELATED TOPICS 

గుప్తవంశము -1

గుప్తవంశము -3

గుప్తవంశము -4

గుప్తుల సాంఘిక చరిత్ర - 1

గుప్తుల సాంఘిక చరిత్ర - 2

గుప్తుల కాలంలో శిల్పము - చిత్రకళ 

గుప్తుల కాలంలో విశ్వవిద్యాలయాలు