మత పరిస్థితులు 

గుప్తరాజుల కాలంలో వైదికమతం అత్యున్నత స్థితికి చేరింది. భారతీయ ఆచారాలు, సంస్కృతి, నాగరికత విదేశీ సంస్కృతి సంగమం పొందుతున్నట్లు గమనించిన గుప్త వంశ రాజులు వైదిక మతము ఆదరించి పోషించారు. గుప్త చక్రవర్తులు అశ్వమేధ యాగములను నిర్వహించిరి. బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు భూరిదానములిచ్చేవారు. సముద్రగుప్తుడు వైదికమతావలంబి అయినా కూడా అశ్వమేధ యాగం జరిపినా కూడా బౌద్ధమతాచార్యులను, బౌద్ధ మతానుయాయులను, సన్యాసినీ సన్యాసులను గౌరవించాడు. బౌద్ధాచార్యుడగు వసుబంధువు సముద్రగుప్తుని విద్యాగురువు, సచివుడు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు వసుబంధువు వద్ద విద్యాబుద్ధులు నేర్చి బౌద్ధధర్మ సూత్రాలను ఆకళింపు చేసుకొని గురువు పై గల అభిమానంతో అతనినే తన మంత్రిగా నియమించుకొన్నాడు. గుప్త రాజుల కాలంలో అనంగుడు, వసుబంధువు, కుమారజీవుడు, దిజ్నాగుడు మొదలైన తత్వజ్ఞులు ఉండేవారు. గుప్త రాజులు సంస్కృత భాషలో ఉపనిషత్తులను, రామాయణం, మహాభారతం, భాగవతం, ఇతిహాసాలు, పురాణాలను, శాస్త్ర గ్రంథాలను రచింపజేశారు.

స్కంద గుప్తుని అనంతరం రాజ్యానికి వచ్చిన గుప్త రాజులు వైష్ణవ మతాన్ని స్వీకరించి దానికి తోడ్పడినారు. చంద్రగుప్త విక్రమాదిత్యుని మంత్రి ఉదయగిరిలో ఒక గుహాలయమును పరమశివుని ప్రీత్యర్థము తొలిపించాడు. ఈ గుహాలయ శిల్పంలో విష్ణువు, కార్తికేయుడు, సూర్యుడు, బుద్ధుడు ప్రముఖస్థానాన్ని పొందినట్లు కనిపిస్తుంది. చివరి గుప్త రాజులు వైష్ణవ మతావలంబికులైనప్పటికీ శైవ, జైన, బౌద్ధ మత గురువులను కూడా ఆదరించారు. హిందువులు గౌతమ బుద్ధుడిని విష్ణువు దశావతారలలో ఒక అవతారంగా స్వీకరించారు. 

గుప్త రాజుల కాలంలో షడ్దర్శనములు సమగ్ర రూపాన్ని సంతరించుకొన్నవి. 

1) సాంఖ్య దర్శనము - కపిలమహర్షి 
2) యోగ దర్శనము - పతంజలి (అష్టాధ్యాయి రచించిన పతంజలికి భిన్నుడు) 
3) న్యాయదర్శనము - గౌతమ మహర్షి 
4) వైశేషిక దర్శనము - కణాదముని 
5) పూర్వ మీమాంస - జైమిని 

6) ఉత్తర మీమాంస - వ్యాస మహర్షి

విద్యా వైదుష్యములు

గుప్త వంశపు రాజులు సాహిత్య ప్రియులు. ఈ రాజులు సంస్కృత భాషను ఆదరించి పోషించారు. రెండవ చంద్రగుప్తుని అమాత్యుడు వీరసేనుడు కవి వతంసుడు. దీపవంశ, మహావంశాది గ్రంథములు సింహళంలో రచింపబడినవి. ఈ గ్రంథములు క్రీ.శ. 5-6 శతాబ్దులలో పాళీ భాషలో రచింపబడినవి. భర్తృహరి వాక్యపదీయ రచయిత. సుబంధుడు అనే మహాకవి క్రీ.శ. 6వ శతాబ్ది నాటి వాడు. ఇతడు వాసవ దత్త నాటకమును రచించాడు. గుప్తరాజుల కాలంలో నారద, బృహస్పతి స్మృతులు రచింపబడినవి. భారవి కిరాతార్జునీయ కావ్య రచయిత ఈ కాలంవాడే. అపర కాళిదాసుగా కీర్తించిన మాతృగుప్తుడు రతిమంజరి, నలోదయము, పుష్పవన విలాసాది గ్రంథాలను రచించాడు. ప్రవరసేనుడు ప్రాకృత భాషలో సేతుబంధ కావ్యమును రచించినాడు. వత్సభట్టి కావ్యకర్త. ఇతడు యశోధర్ముని మందసార లేక దశపుర శాసన రచయిత. ఇతడు భట్టికావ్యమును రచించాడు. పాణిని వ్యాకరణానికి లక్ష్యముగా భట్టి కావ్యము రచించబడింది. భట్టి కావ్యము రావణ వధ కావ్యముగా ప్రసిద్ది చెందింది. వామనుడు కావ్యాలంకార సూత్ర గ్రంథమును రచించాడు. దండి 6వ శతాబ్దానికి చెందిన వాడు. కావ్యాదర్శమను అలంకార గ్రంథం ఇతని రచన. ఈ మహాకవి దశకుమార చరిత్ర అనే గ్రంథంను రచించాడు.

ఆర్యభట్ట 

ఆర్యభట్ట జన్మస్థలము పాటలీపుత్ర నగరం. ఆర్యభట్టీయం అనే సిద్ధాంత గ్రంథాన్ని ఆర్యభట్టు రచించాడు. భూమి గుండ్రంగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతున్నదని, భూభ్రమణము వలన నక్షత్రాలు కదులుతున్నట్లు కనిపిస్తాయని, సూర్య చంద్ర గ్రహణములకు చంద్రుని యొక్క భూమి యొక్కయు ఛాయలు కారణమని ఆర్యభట్టు తెలిపాడు. ఇతను క్రీ.శ. 476 ప్రాంతానికి చెందినవాడు. 

వరాహమిహిరుడు

ఇతడు సూర్యసిద్ధాంత గ్రంథమును రచించాడు. పంచ సిద్ధాంతికము అనే జ్యోతిష్య గ్రంథాన్ని కూడా ఇతడే రచించాడు. సూర్య సిద్ధాంత గ్రంథము 146 వ్యాఖ్యానాలతో కూడిన ప్రఖ్యాత గ్రంథము. గ్రహసంచారము, గ్రహణములు, గ్రహనక్షత్ర సంయోగము, చంద్రకళలు, ఉదయాస్తమయములు, భూవర్ణము, ఖగోళ శాస్త్ర పరికర నిర్మాణము, కాల ప్రమాణాలు మొదలనవి ఇందులో వర్ణింపబడినవి. భారత దేశంలో సూర్యసిద్ధాంత గ్రంథానికి ప్రాచుర్యం లేదు కానీ విదేశాలలో ఈ సిద్ధాంతానికి విస్తృత ప్రచారం కలిగింది.

బ్రహ్మగుప్తుడు 

క్రీ.శ.6వ శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంత గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథము ఖగోళ శాస్త్రానికి సంబంధించినది. ఇందులో గ్రహములు, నక్షత్రములు, ఆకాశంలోని వింతలు విశేషములు వర్ణించబడినవి. రేఖాగణితము, బీజగణితము, దశాంశ పద్ధతి మొదట భారతదేశంలోని కనుగొనబడినది. గుప్తుల కాలంలో సంస్కృత భాషాభివృద్ధి పరాకాష్టకు చేరింది. నగరాలు గుప్త సామ్రాజ్యము అతి విశాలమైనది. గుప్తరాజులు తమ రాజధాని నగరములను, ఇతర ముఖ్య పట్టణాలను, తీర రేవు పట్టణాలను అభివృద్ధి పరచుటకు కృషి చేసినారు. కాశి, గయ, కన్యాకుబ్జము, పాటలీపుత్రము, తక్షశిల, నలంద, అయోధ్య, తామ్రలిప్తి, ఉజ్జయిని వంటి మహా నగరాలు ఆ కాలంలో ప్రసిద్ది చెందినవి. మధురా నగరంలో 20 సంఘారామాలు ఉండేవి. వారణాసి మహా నగరము గొప్ప శైవ క్షేత్రము. గంగా తీరంలోనిది ఈ పట్టణము. వేద విద్యాలయాలకు నిలయమైనది.దారుశిలా నిర్మిత శిల్ప సంపద గల దేవాలయములు, సమున్నత గోపురములు ఉన్న మందిరములు కాశీ నగరంలో ఉండేవి. ఉజ్జయిని నగరంలో ఒక విశ్వవిద్యాలయం ఉండేది. అనంతర గుప్తులకు ఈ నగరం రాజధానిగా మారింది. కన్యాకుబ్జ నగరం అతి సుందరమైనది.

వ్యవసాయము 

గుప్త రాజులు వ్యవసాయాభివృద్ధికి అనేక పథకములు రూపొందించి, అమలుపరిచారు. వ్యవసాయమునకు అవసరమైన నీటిపారుదల వనరులను ఏర్పరచి పంట పొలములను సస్యశ్యామలం చేశారు. పెద్ద పెద్ద నదుల నుండి కాలువలు త్రవ్వించి, నీటి వనరులను ఏర్పరచారు. రైతుల వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచేందుకు బావులు, కుంటలు, బృహత్తటాకముల నిర్మాణం ఈ కాలలో జరిగింది. స్కందగుప్తుని కాలంలో సుదర్శన తటాకము పునర్నిర్మించబడింది. వ్యవసాయ వృత్తి అవలంబించిన వారికి వ్యవసాయ కూలీలకు సమితిలుండేవి. ఇవి రైతులకు, రైతు కూలీలకు సంబంధించిన సమస్యలు తీర్చేవి. స్కంద గుప్తుడు వేయించిన ఇండోరు తామ్ర శాసనము వలన అతడు ఇంద్రపురంలో ఉన్న నూనె వర్తకుల సంఘమునకు దానమిచ్చినట్లు తెలుస్తున్నది. ఇంద్రపురి నివాసి అయిన జీవంతుడి ఆధిపత్యంలో ఉన్న నూనె సంఘానికి ఈ దానం ఈయబడినట్లు తెలుస్తున్నది.

వర్తక వ్యాపారాలు 

గుప్తుల కాలంలో భారత వర్తకులు పశ్చిమ దేశాలతో వర్తక వ్యాపారాలు జరిపేవారు. భారత రేవు పట్టణాల నుండి సన్న నూలు బట్టలు, సుగంధ ద్రవ్యములు, అలంకార వస్తువులు, ఆభరణాలు ఎగుమతి చేసేవారు. ఈ కాలంలో తూర్పు దేశాలకు, దీవులకు భారతీయులు వలస వెళ్ళారు. అందులో ముఖ్యమైనవి జావా, కాంబోడియా, సుమత్రా. తామ్రలిప్తి, భరుకచ్చము, సోపార వంటి గొప్ప ఓడరేవులానాడు విదేశా వ్యాపార కూడలులుగా ఉండేవి. భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ఫాహియాన్ స్వదేశ ప్రయాణానికి వెళ్తూ తామ్రలిప్తి నుండి బయలుదేరి సింహళ దేశాన్ని చేరాడు. సముద్ర ప్రయాణం ఆ రోజుల్లోని విప్రులకు నిషిద్ధం కాదు. తామ్రలిప్తి గొప్ప ఓడరేవుపట్టణమగుట వలన దేశ విదేశ వర్తకులు, స్వరాష్ట్రంవారు, పరాయి రాష్ట్రం వ్యాపారులు అక్కడ నివసించేవారు. సముద్ర యానం సులభతరం చేయుటకు, శ్రేష్టమైన కలపతో ఓడలను నిర్మిచడంలో గుప్తరాజులు వ్యాపారులకు సహాయపడుచుండిరి.


 RELATED TOPICS 

గుప్తవంశము -1

గుప్తవంశము -2

గుప్తవంశము -3

గుప్తవంశము -4

గుప్తుల సాంఘిక చరిత్ర - 1

గుప్తుల కాలంలో శిల్పము - చిత్రకళ 

గుప్తుల కాలంలో విశ్వవిద్యాలయాలు