గుప్తవంశం రాజులు లలిత కళలను ఉద్దరించినారు. వీరి పాలనా కాలంలో అపురూపమైన శిల్ప సంపదతో కూడిన అనేక దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, భవనాలు, స్తూపాలు, ద్వారములు, ద్వార తోరణములు గృహాలయాలు వెలసినవి. బౌద్ధమంత సంబంధిత విగ్రహాలు, హిందూ దేవతామూర్తులు ఈ కాలమున సంపూర్ణమైనవిగా కీర్తి వహించినవి. శిల్పకళ మూర్తీభవించిన ఈ విగ్రహములు అపురూపమైనవిగా పరిగణింపబడినవి. వారణాసికి సమీపంలో ఉన్న సారనాథ్ లో అసంఖ్యాకమైన వివిధ భంగిమలలో ఉన్న బుద్ధ విగ్రహములు లభించినవి. మధుర, అయోధ్యా మొదలైన పట్టణములలో రాతితో మలచిన బుద్ధ విగ్రహాలు, కంచుతో పోతపోసిన విగ్రహాలు కనుగొనబడినవి. గుప్తరాజుల నాటి హరిహర మూర్తులు దేవఘర్ దేవాలయమందున్నవి. గొప్ప బౌద్ధమత కేంద్రమైన సారనాథ్ వద్దగల స్తూపము ప్రఖ్యాతి చెందినది. సారనాథ్ లో గల సుందరమైన బుద్ధ విగ్రహం ఐదు అడుగుల మూడు అంగాళలది. ఈ విగ్రహంలో బుద్ధుడు యోగాసీనుడై ఉన్నాడు. అష్టాంగ మార్గ ప్రవక్తగా బుద్ధుడున్నట్లు చెక్కబడిన ఈ విగ్రహము పాదాల వద్ద ఉపాసకులు, ధర్మచక్రారాధన చేస్తున్నట్లున్నది. విగ్రహము చక్కని దుస్తులతో అలంకరింపబడినట్లున్నది. అజంతా గుహలలోని 9వ గుహ బయట బుద్ధ విగ్రహం ఒక పీఠముపై ఆసీనుడై ఉన్నట్లు చెక్కబడి ఉన్నది. ఈ విగ్రహమును మైత్రేయ బోధిసత్వుని విగ్రహంగా గుర్తించారు. ఇందులో గ్రీకు, భారత శిల్ప సమ్మిశ్రణంలో ఏర్పడిన గాంధార శిల్ప లక్షణాలు కలవు. పరిచారకులు, కిరీటధారులగు దేవతలు ఈ విగ్రహంలో చెక్కబడిన శిల్ప దృశ్యం అపురూపమైనది. 

గుప్తుల కాలంలో భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఏర్పాటు చేయబడిన బుద్ధ విగ్రహాలలో జావా ద్వీపంలోని ప్రజ్ఞాపారమితమూర్తి అత్యంత సుందరమైన విగ్రహం. ఈ విగ్రహంలో శిల్పకళ సారనాథ్ లోని బుద్ధ విగ్రహ శిల్పకళవలె ఉండును. ఈ విగ్రహమునకు వెనుకభాగంలో మనోహరంగా ఉండునట్లు ప్రభావలయము రూపొందించబడినది. ఇది శిల్పకళకు మకుటం వంటిది. ఝాన్సీ జిల్లాలోని దేవఘర్ దేవాలయంలోని రామాయణ దృశ్యములు శిల్ప సౌందర్య విరాజితములు. ఇంద్రియావేశ సౌందర్యము మూర్తీభవించిన శిల్పము గుప్త రాజుల కాలంలో చెక్కింపబడినంది. జావా ద్వీపంలోని బుద్ధమూర్తిలో జ్ఞాన సంబంధమైన అంశములు అంతర్లీనమై ఉన్నవి. గుప్త రాజులు లోహ విగ్రహముల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించినారు. తామ్ర, లోహ నిర్మిత బుద్ధ విగ్రహము నలందలో ఉన్నది. ఇది 8 అడుగుల ఎత్తైన విగ్రహం. అభయముద్ర, అంగసౌష్టవము, మహా పురుష లక్షణములతో కూడినది. ఈ విగ్రహాన్ని హ్యుయాన్‌త్సాంగ్ దర్శించి ఆనందపరవశుడైనట్లు అతని రాతల వలన తెలుస్తున్నది. 

బెంగాల్ రాష్ట్రంలోని సుల్తాన్ గంజ్ ప్రాంతంలో నిర్వహించిన త్రవ్వకములందు 7 అడుగుల ఎత్తున్న కంచు విగ్రహము లభించినది. ఇది అభయముద్ర కలిగి, జ్ఞానోపదేశము చేయుచున్నట్లున్నది. సింహళ దేశంలోని అనురాధ పురం దగ్గర ఉన్న బుద్ధ విగ్రహం వలె ఈ విగ్రహం ఉన్నది. ఈ విగ్రహాన్ని బ్రిటీషువారు తమ దేశానికి తరలించుకొని పోయి ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాం వస్తు ప్రదర్శన శాలలో భద్రపరిచారు. కుతుబ్ మినార్ సమీపంలో గల అపురూపమైన ఇనుప పోత స్తంభము గుప్తరాజుల కాలం నాటిది. చంద్రగుప్త విక్రమాదిత్యుడి విజయాలకు సంకేతంగా అతని కుమారుడు మొదటి కుమారగుప్తుడు ఈ స్తంభంను నెలకొల్పాడు. ఇది 24 అడుగులు ఎత్తు గలది. ఉజ్జయినీ మహాకాళనాథుడు హిందువులకు, ముఖ్యంగా శైవులకు ఆరాధ్యదైవము. గుప్తుల కాలంలో ఉజ్జయినీ నగరమునకు ప్రత్యేక స్థానం కలదు. సామంత రాజులకు, అనంతర గుప్తులకు, స్వతంత్ర రాజులకు ఉజ్జయినీ నగరము రాజధానిగా వర్ధిల్లినది. ఉజ్జయిని జ్యోతిష్య శాస్త్రమునకు కేంద్రము. ఇక్కడ గుర్తు రాజుల కాలంలో ఒక నక్షత్ర శాల ఉండేది. ఖగోళశాస్త్ర కేంద్రం ఇక్కడ ఉండేది. అది ఒక మహా విద్యాలయము. ఔదంతపురము బౌద్ధమత కేంద్రంగా గుప్తుల కాలంలో ప్రఖ్యాతి గాంచినది. ఔదంతపుర విద్యాపీఠమును ఆదర్శంగా తీసుకొని టిబెట్ దేశంలోని శాక్య విహారము నిర్మించండం జరిగింది. గుప్తరాజుల కాలంలో వారణాసీ కాశీనగరముగా ప్రసద్దిగాంచింది. వేద విద్యలకు, సర్వశాస్త్రములకు నిలయమైన ఈ ప్రదేశంలోనే గౌతమబుద్ధుడు తన మొదటి ధర్మ ప్రవచనమును చేశాడు. ధాన్య కటకం లోని విశ్వవిద్యాలయమును ఆదర్శంగా తీసుకొని టిబెట్ లోని డాపుంగ్ విశ్వవిద్యాలయ నిర్మాణం జరిగింది. గుప్తరాజుల కాలంలో నవద్వీపము సంస్కృత విద్యాపీఠములతో కళకళలాడుచుండెను. ఇక్కడ రఘునాథ శిరోమణి న్యాయశాస్త్రాచార్యుడు అసాధారణ మేధా సంపన్నుడు. గౌడీయ కావ్యరీతి నవద్వీపమునందే ఆవర్భివించినది. కావ్యశైలిలో దానికొక ప్రత్యేక స్థానమున్నది.


 RELATED TOPICS 

గుప్తవంశము -1

గుప్తవంశము -2

గుప్తవంశము -3

గుప్తవంశము -4

గుప్తుల సాంఘిక చరిత్ర - 1

గుప్తుల సాంఘిక చరిత్ర - 2

గుప్తుల కాలంలో విశ్వవిద్యాలయాలు