తెలంగాణను పాలించిన ప్రప్రథమ రాజ వంశంగా శాతవాహనులను చెప్పుకోవచ్చును. దక్కన్ ప్రాంతంలో శాతవాహనుల పరిపాలన ప్రారంభమవడంతో తెలంగాణ చరిత్రలో ఒక నూతన శకం ప్రారంభమైనట్లు చెప్పవచ్చును. 30 మంది శాతవాహన రాజులు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. మౌర్యుల సామంతులుగా తమ రాజకీయ జీవితం ప్రారంభించిన శాతవాహనులు అనతి కాలంలోనే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారని తెలిపే ఆధారాలు ఎన్నో కలవు.

శాతవాహనుల చరిత్రను పునర్నిర్మించడానికి లభ్యమగు ఆధారాలలో ప్రధానమైనవి శాసనాలు, నాణాలు, వాస్తు నిర్మాణాలు, స్వదేశీ రచనలు, విదేశీ రచనలు. 

శాసనాలు

శాతవాహనుల చరిత్ర పునర్నిర్మాణానికి శాసనాలు చాలా అమూల్యమైనవి. శాతవాహనుల నాటి శిలా శాసనాలు మహారాష్ట్రములో ఎక్కువగా, ఆంధ్ర దేశంలో తక్కువగా లభ్యమయ్యాయి. వీరి శాసనాలు బ్రహ్మీ లిపిలో ప్రాకృత భాషలో వ్రాయబడినవి. కనేరి, కార్లే, నాసిక్ గుహలలోని శాసనాలు, నాగనిక నానేఘాట్ శాసనం, గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనం, ఖారవేలుని హతి గుంఫా, గుంటుపల్లి శాసనాలు, రుగ్రదాముని జునాఘడ్ శాసనం, అమరావతి, చినగంజాం, నాగార్జున కొండ మొదలగు చోట్ల లభ్యమైన శాసనాలు శాతవాహనుల కాలం నాటి చరిత్రకు ఉపయోగపడుతున్నాయి. 

నాణేలు:

శాసనాల తరువాత కొంత వరకు నాణేలు శాతవాహనుల చరిత్ర నిర్మాణానికి ఉపయోగంగా ఉన్నాయి. శాతవాహనుల నాణేలు దక్కన్ పీఠభూమి అంతటా లభించాయి. శాతవాహనుల నాణేల వల్ల ఆ నాణాలు వేయించిన రాజుల పేర్లు, రాజ ముద్రికలు తెలుస్తాయి. ఈ నాణాలు సీసము, రాగి, పోటిన్ (రాగి + సీసం) అనే మిశ్రమ లోహం తోనూ, వెండితోనూ చేయబడినవి. ఈ నాణేల మీద రాజుల పేర్లతో పాటు ఉజ్జయినీ చిహ్నము (. +.), సింహ, గజ, అశ్వ, చైత్య, పర్వత, నౌకా ప్రతిమలలో ఏదో ఒకటి ముద్రింపబడి ఉంటుంది. జోగల్ తంబి వద్ద లభ్యమైన గౌతమీపుత్ర శాతకర్ణి ప్రతి ముద్రిత నాణాల వల్ల అతడు నహపాణుని నిర్మూలించిన విషయం స్పష్టమవుతుంది. నౌకా చిహ్నమున్న యజ్ఞశ్రీ నాణేలు సముద్రాధిపత్యాన్ని, నౌకా వ్యాపారాన్ని సూచిస్తున్నాయి. ఆంధ్రలో అనేక ప్రాంతాలలో దొరికిన రోమన్ బంగారు నాణాలు శాతవాహనుల నాటి అంతర్జాతీయ వాణిజ్య వైభవాన్ని చాటుతున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి కాలం నుంచి శాతవాహనుల వెండి నాణాల పై ప్రాకృతం, దేశీ భాషలు అనే రెండు భాషలో రాజుల పేర్లు కన్పిస్తాయి. 

వాస్తు నిర్మాణాలు:

శాతవాహనుల కాలం నాటి వాస్తు నిర్మాణాలలో దుర్గాలు, గుహాలయాలు, స్తూపాలు, తోరణాలు వున్నాయి. ధరణికోట, హిందూపురం మొదలగు చోట్ల శాతవాహనుల నాటి కోటలు బయల్పిడినాయి. వర్తకులు, ధనికులైన స్త్రీలు విశేషంగా బౌద్ధాన్ని ఆదరించి పోషించినందువల్ల ఈ కాలంలో స్తూపాలు, చౌత్యాలయాలు, విహారాల నిర్మాణం విరివిగా సాగింది. భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, నాగార్జున కొండ, గోలి, చందవరం మొదలగు చోట్ల స్తూప విహారాలు వెలిశాయి. ఇవన్ని నాటి వాణిజ్య కేంద్రాలైన పట్టణాలకు దగ్గరగా, రహదారుల మీద నిర్మించబడ్డాయి. నాటి స్తూపాలలో ప్రపంచ ఖ్యాతి గడించినది అమరావతి స్తూపం. సాంచి స్తూపం యొక్క నాలుగు తోరణ ద్వారాలు ఈ కాలం నాటివే. మహారాష్ట్రలో కార్లే, కన్వేరీ, నాసిక్ మొదలగు చోట్ల గల గుహాలయాలు ఈ కాలం నాటివే. స్తూపాలు, విహారాలు బౌద్ధ శిల్పాలతో అలంకరించబడింది. ఈనాటి వర్ణ చిత్రాలు అజంతాలోని 9, 10 సంఖ్య గల గుహలలో కలవు. చిత్తూరు జిల్లా గుడిమల్లంలో గల పరశురామేశ్వరాలయంలోని లింగం ఈ కాలం నాటిదే. 

స్వదేశీ రచనలు:

శాతవాహనుల చరిత్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడే దేశీయ వాజ్ఞ్మయంలో మొదట పేర్కొనదగినవి పురాణాలు. వాయు, మత్స్య, భవిష్య, విష్ణు పురాణాలలో శాతవాహన రాజుల ప్రసక్తి కలదు. మత్స్య, వాయు పురాణాలలో రాజుల పేర్లతో బాటు, ఒక్కో రాజు ఎంత కాలం పాలించినది చెప్పబడింది. కాని అంతర్గతంగా, పరస్పర వైరుధ్యాలతో ఉన్న పురాణాలలోని విషయాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.

శాతవాహనుల కాలం నాటి వాజ్మయం ప్రధానంగా ప్రాకృత, సంస్కృత భాషలలో ఉన్నది. కుతూహలుని లీలావతి కావ్యం, గుణాఢ్యుని బృహత్కథ, హాలుడు సంకలనం చేసిన గాథా సప్తశతి, శర్వవర్మ రచించిన కాతంత్ర వ్యాకరణం, వాత్స్యాయనుని కామసూత్రాలు శాతవాహన కాలం నాటి గ్రంథాలలో పేర్కొనదగినవి. శాతవాహన రాజుల గూర్చి ప్రజలలో వ్యాప్తిలో ఉన్న కథలూ, గాథలూ కూడా చరిత్ర రచనకు తోడ్పడుతున్నాయి. 

విదేశీ రచనలు: 

శాతవాహనుల కాలంలో ఆంధ్రులు గ్రీక్, రోమ్ వంటి దేశాలతో వాణిజ్యం చేస్తూ ఉండేవారు. విదేశాలకు చెందిన రచయితలు భారతదేశాన్ని గురించి విన్నవాటిని, చూసిన వాటిని గ్రంథస్థం చేసేవారు. అటువంటి రచనలలో మెగస్తనీస్ వ్రాసిన 'ఇండిక', ప్లినీ వ్రాసిన నేచురల్ హిస్టరీ, పేరు తెలియని నావికుని 'పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ' అనే గ్రంథం, టాలెమీ 'భూగోళ శాస్త్రం' ప్రధానమైనవి. క్రీ||శ|| తొలి శతాబ్దాల నాటి ప్లినీ, టాలెమీ, అజ్ఞాత గ్రీకు నావికుడు తమ రచనలలో పేర్కొన్నారు. కొండాపూర్, కోటిలింగాలలో లభించిన నాణేల పై గల ఆఖ్యలను బట్టి అవి క్రీ||పూ|| 3వ శతాబ్దానికి చెందినవిగా నిర్ణయించడం జరిగింది.


 RELATED TOPICS 

శాతవాహన పాలకులు - 1

శాతవాహన పాలకులు - 2

శాతవాహన పాలకులు -  గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహన పాలకులు - 3

శాతవాహనుల పరిపాలనా విధానం

శాతవాహనుల కాలంలో  భాషా సారస్వతాలు

శాతవాహనుల కాలంలో  విద్యా విధానం, వాస్తు - శిల్ప కళలు