మొదటి పులోమావి

స్వాతికర్ణి తరువాత మొదటి పులోమావి శాతవాహన సింహాసనం అధిష్టించాడు. ఇతడు శాతవాహన రాజుల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసి మగధ సామ్రాజ్య రాజధాని అయిన పాటలీపుత్రం పై ఆంధ్రుల అధికారాన్ని ప్రతిష్టించాడు. ఇతను రాజ్యానికి వచ్చే నాటికి పశ్చిమ భారతదేశంలో గ్రీకుల ఆధిపత్యం అంతరించి శక క్షాత్రపులు అధికారాన్ని స్థాపించారు.

మొదటి పులోమావి పాటలీపుత్రం పై దండెత్తి సుశర్మను ఓడించి, వధించి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ దండయాత్రలోనే పులోమావి అవంతి, ఆకర రాజ్యాలను కూడా ఆక్రమించాడు. శాతవాహన రాజ్యం అఖిల భారత సామ్రాజ్యంగా రూపొందింది. శాతవాహనులు మగధను జయించి పది సంవత్సరాలు రాజ్యం చేసినట్లు యుగ పురాణం తెలియజేస్తున్నది. ప్రాచీన పాటలీ పుత్రం, అలహాబాద్ సమీపంలోని భీతా వద్ద లభించిన శాతవాహన నాణేలు ఈ విజయాలను ధృవపరుస్తున్నాయి. పులోమావి దాడుల ఫలితంగా శాతవాహన సామ్రాజ్యం విస్తరించినది.

మొదటి పులోమావి తరువాత గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చే వరకు శాతవాహన చరిత్రలో అంధయుగం. పులోమావి తరువాత రాజ్యమేలిన గౌర కృష్ణుడు శాతవాహన సామ్రాజ్య విచ్ఛిన్నతకు కారకుడయినాడు. ఇతనిని పురాణాలు రక్తవర్ణుడు, వికృష్ణుడు, అరిష్టకర్ముడు, అనిష్టకర్ముడు అని కించపరిచినాయి. 

హాలుడు

గౌర కృష్ణుని తరువాత హాలుడు శాతవాహన సింహాసన మధిష్టించాడు. ఇతడు పాలించినది ఒక్క సంవత్సరమే అయినా ఇతడు సాధించిన కీర్తి అజరామరమైనది. కవుల ప్రపంచంలో ఇతడు నాటికీ నేటికీ ధృవతారగా నిల్చినాడు. ఇతడు స్వయంగా కవి. అనేక మంది కవులను పోషించి 'కవి వత్సలుడు'గా కీర్తింపబడినాడు. ఇతడు సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే 700 గాధలను ప్రాకృత భాషలో 'గాధా సప్తపతి' అను పేరుతో సంకలనం చేశాడు. ఇతని కాలపు రాజకీయ సంఘటనలు తెలయడం లేదు. 'లీలావతి' అను తరువాత కాలపు ప్రాకృత గ్రంథాన్ని బట్టి హాలుని వివాహం సప్త గోదావరి ప్రాంతంలో జరిగిందని తెలుస్తున్నది.

హాలుని తరువాత మందలకుడు, పులీంద్ర సేనుడు, సుందర శాతకర్ణి, చకోర స్వాతికర్ణ, శివస్వాతి వరసగా రాజ్యమేలినారు. వీరెవ్వరూ సమర్థులు కారు. శకక్షాత్రవులు పశ్చిమ ప్రాంతాలనాక్రమించారు. శాతవాహనుల నౌకాశ్రయాలైన సాపార, కళ్యాన్లను క్షాత్రవులు మూసివేసి తమ ఆధీనంలో బ్రోచ్ నౌకాశ్రయం ద్వారా విదేశాలకు వెళ్ళే సరుకులను పంపుతూ ఉండినారు. ఆర్థికంగా ఇది శాతవాహన రాజ్యానికి పెద్ద దెబ్బ. అయితే ఈ కాలంలోనే విదేశీ తెగలలో కూడా వైషమ్యాలు పెరిగి వారి రాజ్యం కూడా చిన్న రాజ్యాలుగా చీలడం ప్రారంభమయింది. 

రెండో శాతకర్ణి

స్కంధ స్తంభి తరువాత సింహాసన మెక్కిన రెండో శాతకర్ణి 56 సంవత్సరాలు రాజ్యమేలినాడు. ఇతడు గొప్ప విజేత, పరాక్రమశాలి. ఇతని నాణేలు ఉత్తర తెలంగాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాళవలందు లభించినవి. ఇతని కాలంలో కళింగాధిపతియైన ఖారవేలుడు తన సైన్యాన్ని శాతకర్ణి రాజ్యం పైకి పంపాడు. అయితే నేర్పుగా శాతకర్ణి ఖారవేలుని సేనతో ముఖాముఖి తలపడలేదు. పశ్చిమ సరిహద్దుల రక్షణలోనే శాతకర్ణి తన దృష్టిని నిమగ్నం చేశాడు. 

ఖారవేలుని మరణానంతరం అతని వారసులను రెండో శాతకర్ణి జయించి కళింగ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. రెండో శాతకర్ణి తొలి నాణేలను బట్టి అవంతి, ఆకర రాజ్యాలు అతని అధీనంలో గలవని తెలుస్తుంది. శాతకర్ణి తూర్పు మాళవ పై దండెత్తి దానిని ఆక్రమించాడు. ఈ జైత్రయాత్ర అగ్ని మిత్రుని పాలనాకాలంలో జరిగింది. సాంచి ద్వారా పైన ఉన్న శాసనం, శాతకర్ణి నాణేలు అతని తూర్పు మాళ్వ రాజ్య ఆక్రమణను ధృవీకరిస్తున్నది. ఆంధ్ర సేనలు పాటలీపుత్రం పై దాడికి మునుపే శాతకర్ణి మరణించాడు. రెండవ శాతకర్ణి ఆస్థానంలోని ఆనందుడు గొప్ప కళాకారుడు. శిల్ప కళాభిజ్ఞుడు. విదేశీయుల విజృంభణను అణచి శాతవాహన సామ్రాజ్యానికి శత్రువుల భయం లేకుండా చేసిన శాతకర్ణి సుస్థిర పాలనను ఏర్పాటు చేసినాడు. ఇతడు సామ్రాజ్య విస్తరణకు,

దాని కీర్తికి కారకుడయ్యాడు. రెండో శాతకర్ణి తరువాత శాతవాహన సింహాసన మెక్కిన ఎనిమిది మంది రాజుల కాలంలో సామ్రాజ్యం వృద్ధి కావడానికి బదులు తరిగిపోయింది. రెండో శాతకర్ణి తరువాత లంబోదరుడు రాజ్యానికి వచ్చాడు. ఇతని కాలంలో శాతవాహనులు విదర్భను కోల్పోయారు. శుంగరాజైన భాగ భద్రుడు విదర్భను ఆక్రమించినట్లు బేస్ నగర్ శాసనం వల్ల గ్రహించవచ్చు. లంబోదరుని తరువాత అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి శాతకర్ణి, స్కంద స్వాతి, మృగేంద్ర స్వాతికర్ణి, కుంతల శాతకర్ణి, స్వాతికర్ణ వరుసగా రాజ్యమేలినారు. కుంతల శాతకర్ణి ప్రసక్తి వాత్సాయనుని కామసూత్రాలలో గలదు. ఇతని ఆస్థానమున శర్వవర్మ, గుణాఢ్య పండితులున్నట్లు తెలియుచున్నది. మొదటి పులోమావి విజృంభణ కాలం వరకు ఈ 8 మంది రాజులు రాజ్యాన్ని కాపాడగలిగారు. ఈ కాలంలోనే గ్రీకులు అంతర్గత ఘర్షణల్లో మునిగి తేలడంతో, వీరు పాలించిన భారతదేశ ప్రాంతాలను శక పల్లవులు ఆక్రమించారు. మొదటి అజెస్ శక - పల్లవ రాజ్యాన్ని తూర్పున మధుర వరకు విస్తరింపజేశాడు.

 RELATED TOPICS 

శాతవాహనులు

శాతవాహన పాలకులు - 1

శాతవాహన పాలకులు -  గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహన పాలకులు - 3

శాతవాహనుల పరిపాలనా విధానం

శాతవాహనుల కాలంలో  భాషా సారస్వతాలు

శాతవాహనుల కాలంలో  విద్యా విధానం, వాస్తు - శిల్ప కళలు