విద్యా విధానం

శాతవాహన యుగంలో మత విషయాలే కాక లౌకిక విషయాలలో కూడా బ్రాహ్మణ ఆశ్రయాలలో బౌద్ధ, జైన విహారాలలో విద్యాబోధన జరిగేది. ధ్యానకటక, శ్రీ పర్వతాలలో విశ్వ విద్యాలయాలుండేవని, ధాన్యకటక విశ్వ విద్యాలయం నమూనా లాగానే లాసా లోని విద్యాలయం నిర్మాణమయిందని టిబెట్ లో ప్రచారంలో ఉన్న సంప్రదాయం. గురువుల నోటితో చెప్పిన దానిని విద్యార్థులు నోటితోనే వల్లించేవారు. ఆశ్రమాల, విహారాల పోషణార్థం రాజులు, ధనవంతులు భూదానం చేసేవారు. విద్యార్థులు గురు శుశ్రూష చేసి గురువు ఋణం తీర్చుకొనేవారు.

వృత్తి స్వీకారం సాధారణంగా వంశ పారంపర్యంగా జరిగేది. అందువల్ల వృత్తి విద్యలను పరంపరానుగతంగా తండ్రి నుండి కుమారుడు నేర్చుకొనేవాడు. వృత్తి సంఘాలు, నికాయ శ్రేణులు వృత్తి విద్యలలో విద్యార్థులు తగిన ప్రావీణ్యం సంపాదించడానికి అవకాశం కల్పించేవి. శాతవాహనుల నాటి క్షత్రియోచిత విద్యలను నాటి శాసనాలు పేర్కొంటున్నాయి. ఖారవేలుడు, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రదాముడు మొదలగు రాజులు క్షత్రియోచిత విద్యా సంపన్నులు. వివిధ శాస్త్రాల్లో నిష్ణాతులు. గౌతమీపుత్రునికి 'ఏకధనుర్ధర' అను బిరుదు కలదు. రాజులు శబ్ద, అర్థ, రూప్య, గణక, లేఖక, విధి, వ్యవహార, గాంధర్వ, యుద్ధ విద్యలలో వొణులై ఉండేవారని హతి గుంఫా శాసనం తుల్పుతున్నది. బౌద్ధులు మత విద్యలతో పాటు తర్క శబ్ద, జ్యోతిష, సాముద్రిక శాస్త్రాలలో పరిశ్రమ జరిపేవారు. 'రత్నావళీ రాజపరికథ' అనే గ్రంథంలో నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతం ప్రతిపాదించినాడు. శ్రీ పర్వతంలో నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని సేకరించినాడని ఫాహియాన్ వ్రాసినాడు. శాతవాహన సామ్రాజ్యం గతించినా ఆనాటి సాహిత్యము మనకు వారసత్వంగా మిగిలినది. గుణాఢ్యుడు, హాలుడు, నాగార్జునుడు రచించిన గ్రంథాలు అమూల్యాలు. 

కళ

శాతవాహనుల కాలంలో 30 ప్రాకార వృత నగరాలున్నట్లు మెగస్తనీస్ తన 'ఇండిక' గ్రంథంలో పేర్కొన్నాడు. కాని ఈ ప్రాచీన నగర నిర్మాణాన్ని తెలుసుకోవడానికి తగిన సాక్ష్యాలు లేవు. హాలుని గాధా సప్తశతిలో ఆలయాల ప్రసక్తి ఉన్నది. కాని వాటి రూపు రేఖలు మిగులలేదు. మట్టితోను, దారువుతోను, భవన నిర్మాణాలు జరగడం వల్లనే కాబోలు నిల్చిలేవు. నేడు కనబడుతున్న నిర్మాణ వాస్తు పశ్చిమ భారతదేశంలోని కార్లే, భాజ, కొంధానా, నాసిక్, అజంతాలలోని బౌద్ధ గుహాలయాలు, భట్టిప్రోలు, గుడివాడ, అమరావతి, ఘంటసాల, జగ్గయ్యపేట, నాగార్జున కొండ మొదలగు చోట్ల ఇటుకలతో నిర్మించిన స్తూప విహారాలలో చక్కగా వ్యక్తమైంది. శిల్పంలో శాతవాహనుల నాటి స్తూపాలలో అమరావతి స్తూపం జగత్ప్రసిద్ధమైనది. శిల్పంలో శాతవాహనుల సాంచీ, బార్హుత్ శిల్ప సంప్రదాయానికి మెరుగులు దిద్ది అమరావతి శిల్ప శైలిని రూపొందించారు. ఆనాటి అజంతాలోని వర్ణ చిత్రాలు అమరావతి శిల్పాలను పోలి వున్నాయి.

అమరావతి, భట్టిప్రోలు, కొండాపురం మొదలగు చోట్ల త్రవ్వకాల నుంచి బయటపడిన వస్తువులను బట్టి శాతవాహన యుగంలో చేతి పనులలో నాజూకుతనం ఎంతగా అభివృద్ధి చెందినదో తెలుస్తుంది. కాల్చిన మట్టి బొమ్మలు, రాతి భరిణెలు, బంగారు, రాగి, దంతము, శంఖు పైసలు, ఆభరణాలతో పాటుగా కొండాపురంలో సీసపు, కంచు నాణేలు అనేకం దొరికాయి. మట్టి బొమ్మలలోని తలలు సర్వ లక్షణాలతో తీర్చబడినాయి. శిరోజాలంకరణలోని వైవిద్యం అద్భుతమైనది. భట్టిప్రోలు స్తూపంలో బంగారు పెట్టె దొరికింది. దొరికిన సామాగ్రిని బట్టి ఆనాటి స్వర్ణకారుల పనితనంలోని ఔన్నత్యం ద్యోతకమవుతుంది. ఈ యుగపు నిర్మాణాలలో కన్పించే కళా కౌశలం కొన్ని వేల సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెంది ఉండవలెను. 

వాస్తు కళ

శాతవాహన యుగపు వాస్తుకళకు మతమే ప్రధానమైన ప్రేరకము. నాటి లౌకిక నిర్మాణాల అవశేషాలు లభ్యం కాలేదు. గాధా సప్తశతిలో ఆలయాల ప్రసక్తి ఉంది. కాని వాటి రూపు రేఖలు నేడు మిగుల లేదు. 

స్తూపాలు

బుద్ధునివి గాని, బౌద్ధ మతాచార్యులవి గాని శారీరక అవశేషాల పై నిర్మితమైన స్మారక చిహ్నాలే స్తూపాలు లేక చైత్యాలు. వీనిలో మూడు రకాలు గలవు. అవి ధాతుగర్భాలు (శరీరక స్తూపాలు), పారి భోజస్తూపాలు (వస్తువుల పై నిర్మితమైనవి), ఉద్దేశిక స్తూపాలు (ధాతువుల లేకుండా నిర్మించినవి), భట్టిప్రోలు, అమరావతి, ఘంటసాల, జగ్గయ్యపేట, శాలిహుండం, చందవరం స్తూపాలు ధాతు గర్భ స్తూపాలు. స్తూపంలో నాలుగు భాగాలుంటాయి. అవి వృత్తాకారంలో వుండే వేదిక, దాని పైన అర్థ గోళాకృతిలో వుండే అండము, అండము పైన హర్మికము, హర్మికము పైన ఉండే భత్రము, వేదిక చుట్టూ ప్రదక్షిణ మార్గం, ప్రదక్షిణా మార్గానికి బయట ప్రాకారం ఉంటుంది. 

చైత్య గృహాలు:

నిత్యార్చనకు ఉపయోగించే బుద్ధుని విగ్రహం గానీ, అవశేసాల పెట్టె గాని ఉండే గృహము చైత్య గృహము. ఇది దీర్ఘ చతురస్రాకారముగా ఉండి రెండు వైపుల వర్తులాకారముగా ఉంటుంది. పశ్చిమ దక్కలో కార్లే, నాసిక్, కనేరి, బేడ్స మొదలగు చోట్ల చైత్యాలయాలను కొండలలో తొలిచారు. వీనిలో కార్లే చైత్య గృహం చాలా అందంగా ఉంటుంది. దీనిలో ఉద్దేశిక స్తూపం పూజా వస్తువు. ఆంధ్ర దేశంలో గుంటుపల్లి, సంకరంలో గుహాలయాలు ఉన్నాయి. ఇవి గాక ఇటుకలతో నిర్మించబడిన చైత్యాలయాలు గుంటుపల్లి, నాగార్జున కొండ, రామతీర్ధం, శాలహుండం, అమరావతి, భట్టిప్రోలు మొదలగు చోట్ల బయల్పడినవి. 

విహారాలు:

భిక్షువుల నివాస స్థలాలు విహారాలు. ఒకే ఆవరణలో మూడు, నాల్గు విహారాలుండి అధ్యయన, అధ్యాపకులకు అనుకూలమైనవి సంఘారామాలు. పశ్చిమ దక్కన్లో అనేక గుహ విహారాలున్నాయి. ఆంధ్ర దేశంలో గుంటుపల్లిలో గుహ విహారాలున్నాయి. ఇటుకలతో నిర్మించబడిన విహారాలు అనేక చోట్ల బయల్పడినవి. వీటిలో రామతీర్థం, శాలి - హుండం, నాగార్జున కొండ మొదలగు చోట్ల గలవి సంఘారామాలు. 

శిల్ప కళ:

శాతవాహన సామ్రాజ్య తూర్పు, పశ్చిమ భాగాలలో శిల్పాలనేకం లభించాయి. శిల్పుల కౌశల్యం సాంచీ స్తూప ద్వార తోరణాలలోను, అమరావతి, నాగార్జున కొండ శిల్పాలలోను పరాకాష్టనందిందని పండితుల అభిప్రాయం. నాగార్జున కొండ, రామిరెడ్డి పల్లి, గోలి శిల్పాలతో చాలా భాగం రెండో దశకు చెందినవి. సాంచీ తోరణ శిల్పాలు శాతవాహన యుగానివే. ఇచట బుద్ధుని జీవితంలోని ప్రధాన ఘట్టాలు, యక్షణి శిల్పాలు, జంతు, పక్షి సంబంధమైన శిల్పాలు, వృక్ష సంబంధమైన శిల్పాలు, జాతక కథలు చెక్కబడ్డాయి. ఇచట శిల్పాలు విడివిడిగా సంపూర్ణంగా చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క చిత్ర కూటమిలాగ ఉన్నది. బుద్ధుని అస్థికల కోసం జరిగిన యుద్ధ ఘట్టం ఇందుకు నిదర్శనం. వెస్సంతర జాతక కథ సంక్షిప్త రీతిలో శిల్పాలలో చూపబడి ఉన్నది. సాంచిలో ప్రకృతి సంబంధమైన చిత్రాలు ఉన్నాయి. చద్దంత జాతక కథను అనేక సార్లు చెక్కడం జరిగింది. అంతేగాక బుద్ధుని జీవితంలోని ఘట్టాలను తెలిపే శిల్పాలను చెక్కడంలో శిల్పి శ్రద్ధ కనపరచాడు. బుద్ధుడు గాలి, నీటి మీద నడిచే శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. చారిత్రక అంశాలు కూడా సాంచిలో ఎక్కువగా ఉన్నాయి. కోసల రాజు ప్రసేనజిత్తు బుద్దుని వద్దకు వెళ్ళడం, ప్రసేనజిత్తు శ్రావస్తిలోని మామిడి వృక్షం వద్దకు వెళ్ళడం, బుద్దుని వద్దకు వెళ్తున్న శుధోదన రాజు మొదలైన దృశ్య శిల్పాలు ఈ కోవకు చెందినవి. దర్బారు జీవితం, మానవుని నిత్య జీవితం, గ్రామీణ జీవితం, ఆటవిక మానవ జీవితాలను సాంచి శిల్పి అతి సహజంగా చెక్కాడని సరస్వతి అభిప్రాయపడినారు. 

చిత్ర లేఖనం :

శాతవాహన యుగంలో వాస్తు శిల్పకళతో పాటు చిత్ర లేఖనం కూడా ఉచ్చదశలో ఉండేది. అజంతాలో 9, 10 సంఖ్యల గుహలలోని వర్ణ చిత్రాలు శాతవాహన కాలం నాటివి. ఈ గుహలలో కుడ్యాల పై గల చిత్రాలలో బుద్ధ చిత్రాలు ప్రధానమైనవి. 10వ గుహలోని చద్దాంత జాతక వర్ణచిత్రం ఆ నాటి వర్ణచిత్రాలకు చక్కని ఉదాహరణ. ఈ వర్ణచిత్రం రూపకల్పనలోను, విషయ వివరణలోను పాంచీ స్తూపం దక్షిణ, పశ్చిమ తోరణ ద్వారాల మీద ఉన్న చద్దాంత జాతక శిల్పాలకు చాలా వరకు పోలిక ఉంది. 10 వ గుహ ఎడమ గోడ మీద ఒక వాహిని చిత్రం ఉంది. ఆ నమూనాలోని జనమంతా ఆయుధాలు చేత పట్టుకొని కొందరు అశ్వాల మీద, కొందరు కాలి నడకన వెళ్ళుతున్నట్లున్నారు. అక్కడక్కడ స్త్రీ సమూహం ఉంది. ఇక్కడే ఒక బోధి వృక్షం కూడా ఉంది. మరొకచోట సాంచీ తోరణ ద్వారాలు స్ఫురణకు తెచ్చేటట్లు రెండు సౌధ ద్వారాల చిత్రాలున్నవి. కుడి గోడ మీద ఏనుగులతో నడచి వస్తున్న మానవ సమూహం గోచరిస్తుంది. ఇక్కడి స్త్రీల ఆభరణాల శైలి ప్రాచీనాంధ్రకు చెందినది. ఆనాటి ప్రజలు రామాయణ భాగవతాది పురాణ గాధలను ఇండ్ల గోడల పై చిత్రించుకొనేవారని గాధా సప్తశతి వల్ల తెలుస్తున్నది.

 RELATED TOPICS 

శాతవాహనులు

శాతవాహన పాలకులు - 1

శాతవాహన పాలకులు - 2

శాతవాహన పాలకులు -  గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహన పాలకులు - 3

శాతవాహనుల పరిపాలనా విధానం

శాతవాహనుల కాలంలో  భాషా సారస్వతాలు