శ్రీముఖుడు

తెలంగాణలోని కొండాపురం, వరంగల్లు సమీపంలో 'సాద్వహన' అను పేరుగల ప్రాచీన నాణేలు లభించినాయి. ఈ సాద్వహనుడే శాతవాహన వంశ మూల పురుషుడని పలువురి చరిత్రికారుల అభిప్రాయం. ఇతని సంతతివాడైన శ్రీముఖుని స్వతంత్ర ఆంధ్ర (తెలంగాణ, ఆంధ్ర) రాజ్య స్థాపకునిగా పురాణాలు వర్ణించాయి. ఇతని పేరు సిముకుడు, శిముకుడు, శిశుకు, సింధుక, సిప్రక, సుద్ర, భీమున్ అనే భిన్న రూపాలలో కన్నిస్తుంది. కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాల గ్రామంలో ఇతని నాణేలు దొరికినవి. నానాఘాట్ శాసనంలో రాయ శ్రీముఖుని ప్రసక్తి వున్నది. ఇతడు వేయించిన శాసనాలు లభ్యము కాలేదు.

మౌర్య సామ్రాజ్యమును స్థాపించిన చంద్రగుప్తుడు ఆర్యావర్తమును మాత్రమే పాలించగలిగాడు. అతని కుమారుడైన బిందుసారుడు ఆర్యావర్తమునే గాక దక్షిణా పథమును కూడా తన ఆధీనం కిందికి తెచ్చుకొన్నాడు. బిందుసారుని మరణానంతరం సింహాసనం కొరకు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఇది అదనుగా తీసుకొని శ్రీముఖుడు బిందుసారుని కాలంలో అణచబడిన ఆంధ్ర నాయకులను ఐక్యపరచి ఉద్యమం నడిపి స్వతంత్రించి వుండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. వారసత్వ యుద్ధంలో విజయం సాధించి మౌర్య సింహాసనమధిష్టించిన అశోకుడు శ్రీముఖునికి రాజ బిరుదాన్ని ప్రసాదించాడు. అందువల్లనే శ్రీముఖుని ఆంధ్ర రాజ్య స్థాపకునిగా వర్ణించినాయి. శ్రీముఖుడు వ్యవహార దక్షుడు. ఇతడు కళింగ పై విజయం సాధించిన మౌర్య అశోకునితో యుద్ధానికి దిగలేదు. అశోకునితో స్నేహ సంబంధాలు కొనసాగించాడు. అందువల్లనే అశోకుడు వేయించిన శాసనంలో ఆంధ్రులను 'హిత రాజుల' పట్టికలో చేర్చినాడు. ఆంధ్రులు అశోక చక్రవర్తి సామంతులుగా ఉన్నట్లు అశోకుని 13వ శిలా శాసనంలో పేర్కొనబడింది.

ఆంధ్ర దేశములో బౌద్ధమత ప్రచార నిమిత్తం అశోకుడు మహాదేవ భిక్షువును పంపాడు. ఇతని కృషి వల్ల ఆంధ్రులు బౌద్ధమును ఆదరించి పోషించిరి. శ్రీముఖుడు జైనమత పోషకుడు. ఇతడు అనేక జైన దేవాలయాలనూ, చైత్యాలను కట్టించినట్లు జైన గాధలు తెల్పుతున్నవి. శ్రీముఖుడు జయించిన దక్షిణా పథమందలి రాజులందరు వైదిక మతాభిమానులు. అందువల్ల శ్రీముఖుడు క్రమంగా వైదిక మతాభిమాని అయ్యాడు. చివరి దశలో శ్రీముఖుడు క్రూరుడైనాడని, సింహాసనభ్రష్టుడై చంపబడినాడని జైన గాధలు తెలుపుచున్నవి. దీనిని బట్టి నాటికే మతపరంగా అలజడులు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మహారాష్ట్ర ప్రాంతంలో బలవంతుడయిన మహారథి త్రణయికరే కుమార్తె దేవీ నాగానికను తన కుమారుడైన శాతకర్ణికిచ్చి పెండ్లి చేయించి బంధుత్వం ఏర్పాటు చేసుకొన్నాడు. ఇతడు పిష్టపురమును రాజధానిగా చేసుకొని 23 సంవత్సరాలు రాజ్యమేలినాడు.

చిన్న చిన్న రాజ్యములుగా ఉన్న ఆంధ్రదేశ భూభాగాలను ఏకం చేసి సువిశాల సామ్రాజ్యం నిర్మించి ఆంధ్ర జాతికొక ప్రత్యేక స్థానము ఏర్పరచి గొప్ప కీర్తి నార్జించాడు శ్రీముఖుడు. ఇతడు ఆంధ్ర సామ్రాజ్యమునకు తొలి రాజు, ప్రతిభావంతుడు. 

కృష్ణుడు

శ్రీముఖుని తరువాత అతని సోదరుడు కృష్ణుడు లేక కన్హ సింహాసనమధిష్టించాడు. ఇతడు 18 సంవత్సరాలు రాజ్యమేలినాడు. ఇతని కాలంలో మౌర్య అశోకునితో మిత్ర భావం మరింత ధృడపడింది. ఈ విషయాన్ని నాసిక్ శాసనము స్పష్టము చేస్తున్నది. ఒక మహా మాత్రుడు నాసిక్ లోని శ్రమణులకు ఒక గుహను తొలిపించాడు. శ్రమణులలో చాలా మంది బౌద్ధులు. అశోకుని బౌద్ధమత ప్రచారం కృష్ణుని ఆకర్షించినట్లు తెలుస్తుంది. ఈ గుహ నిర్మాణానికి అశోకుని ధర్మ భావమే కారణం. ఈ గుహ నిర్మాణం శాతవాహనుల రీతిలో జరిగింది. శాతవాహనుల నాసిక్ గుహలలో ఇది మొదటిది. ఈ గుహ ఉనికిని బట్టి శాతవాహన రాజ్యం కృష్ణుని కాలంలో నాసిక్ వరకు విస్తరించినట్లు భావించవచ్చు. అశోకుని మరణానంతరం మౌర్య సామ్రాజ్యంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను అదునుగా తీసుకొన కృష్ణుడు పూర్తిగా స్వతంత్రించాడు.

మొదటి శాతకర్ణి

కృష్ణుని తరువాత అతని కుమారుడైన మొదటి శాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. శాతకర్ణికి మహారాష్ట్ర ప్రాంతమందున్న మహారధుల సహకారముండటం వలన కృష్ణుడు న్యాయ సమ్మతముగా వారసుడైన శాతకర్ణికి రాజ్యం అప్పగించగలిగాడు. నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంలో శాతకర్ణి వీర, శూశర, అప్రతిహత చక్ర, దక్షిణాపథపతిగా వర్ణించబడినాడు. మహారధికులతో గల సంబంధ బాంధవ్యముల వలన శాతవాహన రాజ్యానికి శత్రువుల దండయాత్రల వలన భయము లేకుండెను. శాతకర్ణి దండెత్తి వెళ్ళి తూర్పు మాళవ ప్రాంతాన్ని జయించాడు. ఉజ్జయిని చిహ్నంగా గల ఇతని నాణేలు ఇతడు మాళవమును జయించాడనుటకు నిదర్శనము. ఇతడు ఎన్నో యాగాలను, క్రతువులను చేసినట్లు నానాఘాట్ శాసనం చెబుతుంది. ఈ సందర్భంలో బ్రాహ్మణులకు వేల సంఖ్యలో ఆవులను, గుర్రాలను, కొన్ని ఏనుగులను దానంగా ఇచ్చినాడు. అంతేగాక గ్రామాలను దానం చేసినాడు. వేల సంఖ్యలో కార్షపణములను ఇచ్చినాడు. తన యుద్ధ విజయానికి చిహ్నంగా శాతకర్ణి రెండు మార్లు అశ్వమేధ యాగం చేసాడు. యజ్ఞ యాగాదుల నిర్వహణలో అతనికి అతని బార్య నాగానిక సహకరించెను. ఇతని కాలంలో శాతవాహన సామ్రాజ్యం విదిశ వరకు విస్తరించింది.

మొదటి శాతకర్ణి తరువాత పూర్ణోత్సంగుడు (క్రీ||పూ|| 220-202), స్కంద స్తంభి (క్రీ||పూ|| 202-184) వరసగా రాజ్య మేలినారు. వీరి కాలంలో శాతవాహన రాజ్య వ్యాప్తి జరగలేదు. చివరి మౌర్య రాజుల బలహీనత కారణంగా శాతవాహన రాజ్య సరిహద్దు ప్రాంతాలకు ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనటంలోనే ఈ ఇద్దరు రాజుల తమ కాలాన్ని గడిపినట్లు తెలుస్తుంది. ఇంతలో గ్రీకులలో చెలరేగిన అంతర్యుద్ధం గ్రీకుల దృష్టిని మరల్చడంతో తాత్కాలికంగా గ్రీకుల బెడద తప్పింది. కాని గ్రీకుల దాడుల ఫలితంగా సౌరాష్ట్రం, శాతవాహన పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు గ్రీకుల స్వాధీనమయ్యాయి.  

 RELATED TOPICS 

శాతవాహనులు

శాతవాహన పాలకులు - 2

శాతవాహన పాలకులు -  గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహన పాలకులు - 3

శాతవాహనుల పరిపాలనా విధానం

శాతవాహనుల కాలంలో  భాషా సారస్వతాలు

శాతవాహనుల కాలంలో  విద్యా విధానం, వాస్తు - శిల్ప కళలు