శాతవాహనుల పాలనా విధానాన్ని పునర్నిర్మించటానికి అవసరమైన ఆధారాలలో ప్రధానమైనవి ఖారవేలుని హాతి గుంఫా శాసనం, నాగానిక నానేఘాట్ శాసనం, గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనం, నాణేలు, అమరావతి శిల్పాలు, పురాణాలు, గుణాఢ్యుని 'బృహత్కథ' హాలుని 'గాధా సప్తశతి', మెగస్తనీస్ 'ఇండిక' మొదలగునవి. 

రాజు

శాతవాహన యుగానికి రాజు దైవాంశ సంభూతుడు. రాజు నిరంకుశుడు. రాజ శాసనం నీతి శాస్త్రం, ధర్మ శాస్త్ర సమ్మతమై ఉండవలసిందే కాని దీనిని ఉల్లంఘించడాటానికి వీలు లేదు. రాజు వైదిక సంస్కృతిని, వర్ణాశ్రమ ధర్మాలనూ పాటించి పరిరక్షించాలి. అందువల్ల ధర్మశాస్త్ర సమ్మతమైన పన్నులు విధిస్తూ రాజులు ప్రజారంజకముగా పాలించేవారు. రాజరికము వంశ పారంపర్యంగా సంక్రమించేది. రాజరిక బాధ్యతలు నిర్వహించడానికి యువ రాజుగా ఉన్న కాలంలోనే గణక శాస్త్ర, న్యాయ శాస్త్రాలలో శిక్షణ నిచ్చేవారు. రాజునకు సంతతి లేనపుడు అతని సోదరులు సింహాసనమధించుటకు అర్హులు. రాజ కుమారుడు బాలుడైన అతడు యుక్త వయస్కుడగు వరకు రాజు సోదరుడు గాని, రాజకుమారుని తల్లిగాని పరిపాలనా బాధ్యతలు నిర్వహించుచుండిరి. శ్రీముఖుని తరువాత మొదటి శాతకర్ణి పిన్న వయస్కుడగుటచే కృష్ణుడు రాజ్యపాలన బాధ్యత వహించెను. శాతకర్ణి తరువాత పూర్ణోత్సంగుడు బాలుడగుట వలన నాగానిక పాలనా బాధ్యతలు స్వీకరించింది. పాలనా విషయాల్లో గౌతమీపుత్రుడు తన తల్లియగు బాలశ్రీ సలహాలు పొందుచుండెను. రాజకీయ వ్యవహారాలలో స్త్రీలు ప్రధాన పాత్ర వహించేవారని దీనిని బట్టి తెలుస్తుంది. 

రాజోద్యోగులు: 

పాలనలో రాజుకు సహకరించటానికి రాజోద్యోగులుండేవారు. నాటి శాసనాలలో విశ్వాసామాత్య, రాజామాత్య, మహామాత్ర, మహాతరక, భాండాగారిక,హేరణిక, ప్రతీహార, లేఖన, పట్టికా పాలక అనే ఉద్యోగుల పేర్లు కన్పిస్తున్నాయి. రాజమాత్యులు రాజుకు సలహా ఇచ్చేవారు. ఆహారాలకు అధిపతులుగా ఉండి నాటి పరిపాలన నిర్వహించేవారు అమాత్యులు. ప్రత్యేక కార్య నిర్వహణకు మహామాత్యులు నియమింపబడిరి. భాండాగారికుడు వస్తు సంచయ మును భద్రపరిచే అధికారి. హిరణ్యకుడు ద్రవ్య రూపమైన ఆదాయాన్ని భద్రపరిచేవాడు. మహా సేనాపతి సైన్య వ్యవహారాలను చూచేవాడు. రాజ పత్రాలను, రాజ శాసనాలను వ్రాస్తూ రాజుకు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసేవాడు లేఖకుడు. 

స్థానిక పాలన: 

శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృతమైన బలమైన రాజరికం కాదు. అందులో అనేక సామంత రాజ్యాలుండేవి. శాతవాహన రాజులు ఇతర రాజులను జయించి వారిని సామంతులుగా స్వీకరించుచుండిరి. మహారధి, మహాభోజ అను బిరుదులు గల సామంత మండలికులుండిరి. శ్రీముఖుడు మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించి ప్రముఖుడగు 'త్రణయికరో'తో సంబంధ బాంధవ్యము నెరపి వారి సహాయంతో అనేక విజయాలు సాధించి రాజ్యాన్ని విస్తృత పరిచాడు. సామంతరాజ్యాలు తప్ప మిగిలిన శాతవాహన సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజింపబడింది. రాష్ట్రాలను పాలించుటకు రాజ ప్రతినిధులు నియమించబడిరి. రాష్ట్రాలను 'ఆహారాలు' అని పిలిచేవారు. ఆహారాలకు అమాత్యులు పాలనాధికారులు. వీరికి వంశ పారంపర్యపు హక్కులేదు. వీరిని తరచుగా బదిలీ చేసేవారు. ప్రతి ఆహారంలో ఒక ప్రధాన నగరం, అనేక గ్రామాలు ఉండేవి. పరిపాలనా విభాగాలలో అతి చిన్నది గ్రామం. గ్రామానికి 'గ్రామిణి' పాలనాధికారి. శాతవాహన శాసనాలలో బారుకచ్చ, సోపార, కనేరి, కళ్యాణి, పైఠాన్, తగర, జున్నాల్, కార్లే, ధనకటకం ప్రధాన పట్టణాలు, వర్తక కేంద్రాలు, పట్టణాలనే నిగమాలంటారు. నిగమ పాలనా వ్యవహారాలను నిగమ సభలు అనే పౌర సభలు చూచేవి. కుల పెద్దలను 'గహపతులు' అనేవారు. వీరు నిగమ సభలలో సభ్యులుగా ఉండేవారు. భట్టిప్రోలు శాసనాలలో 'నిగమసభ' ప్రస్తావన కన్పిస్తుంది. గ్రామాలు, పట్టణాల పరిపాలన చాలావరకు స్వయంపాలన మీద ఆధారపడి ఉండేది. 

ప్రభుత్వ ఆదాయం 

ప్రభుత్వానికి భూమిశిస్తు ముఖ్యాదాయ మార్గము. రాజ్యంలోని వ్యవసాయ భూమి అంతటికి రాజు సొంతదారు కాదు. 'రాజకంఖేట' అన్న మాటను బట్టి రాజు కొంత పొలానికి మాత్రమే యజమాని. భూదానం చేయవలసి వచ్చినపుడు రాజు భూమిని కొని దానం చేసిన సందర్భాలున్నాయి. రేవుల మీద, బాటల మీద సుంకాలుండేవి. వృత్తి పని వారు వృత్తి పన్నులు చెల్లించే వారు. భాండాగారిక, హేరాణిక అన్న ఉద్యోగులను బట్టి దేశంలో అనేక ప్రాంతాలలో అసంఖ్యాకంగా లభించిన శాతవాహన నాణేలను బట్టి పన్నులు ధన రూపంలో చెల్లించినట్లు గ్రహించవచ్చు. 

సైనిక వ్యవస్థ: 

శాతవాహనులు పెద్ద సైన్యాన్ని పోషించినారు. హాతి గుంఫా శాసనంలో చతురంగ బలాల ప్రసక్తి ఉంది. అమరావతి శిల్పంలో గజ, తురగ, పదాతి సేనలు మాత్రమే కన్పిస్తాయి. కత్తులు, ఈటెలు, గండ్ర గొడ్డళ్ళు సాధారణ ఆయుధాలు. యుద్ధాలలో క్రూరత్వం ప్రదర్శించడం పరిపాటి. గౌతమీపుత్ర శాతకర్ణి క్షహరాట వంశాన్ని నిరవశేషంగా నిర్మూలించినట్లు చెప్పుకొన్నాడు. ఖారవేలుడు పితుండ నగరాన్ని గాడిదల చేత దున్నించాడు. స్కందా వారం అంటే తాత్కాలిక శిబిరం అనీ, కటకం అంటే సైన్యాగారం అని తెలుస్తుంది.

 RELATED TOPICS 

శాతవాహనులు

శాతవాహన పాలకులు - 1

శాతవాహన పాలకులు - 2

శాతవాహన పాలకులు -  గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహన పాలకులు - 3

శాతవాహనుల కాలంలో  భాషా సారస్వతాలు

శాతవాహనుల కాలంలో  విద్యా విధానం, వాస్తు - శిల్ప కళలు