గౌతమీపుత్ర శాతకర్ణి 23 వ శాతవాహన రాజు. ఇతని కాలంలో శాతవాహన సామ్రాజ్య విస్తృతి, ఆ వంశ గౌరవ పునరుద్ధరణ జరిగినాయి. గౌతమీపుత్ర శాతకర్ణి అధికారానికి వచ్చే నాటికి శక - పహ్లావ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. కుషాణులు వాయువ్య దిశ నుండి వచ్చి శక - పఫ్లవులను వేధించసాగారు. శక - పహ్లావుల మీద విజయం సాధించడానికి గౌతమీపుత్ర శాతకర్ణికి ఈ పరిస్థితులు అనుకూలించాయి.

శాతవాహనులు పోగొట్టుకున్న రాజ్య భాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి గౌతమీపుత్ర శాతకర్ణి భారీ ఎత్తున ప్రయత్నాలు చేసినాడు. ఈ విషయం అనతి నాసిక్, కార్లే శాసనాల నుంచి గ్రహించవచ్చు. సైన్య సమీకరణ పూర్తి అయిన తరువాత, తన 18వ పాలనా సంవత్సరంలో గౌతమీపుత్రుడు దండయాత్ర ప్రారంభించాడు. ఇతడు మొదట విదర్భ పై దండెత్తి దాని ముఖ్య పట్టణమైన 'కుశవతి'ని ముట్టడించి ఆక్రమించాడు. కుశవతి వైనగంగ పై వున్న నేటి పౌని నగరము. అచట నుండి క్షాత్రపరాజైన నహపాణుని పై దండెత్తి ఘోరముగా పోరాడి నాసిక్ సమీపాన గోవర్థన వద్ద చిత్తుగా ఓడించి తరిమికొట్టాడు. పరాజయం చెందిన నహపాణుడు పర్వత ప్రాంతమైన మాళ్వకు పారిపోయినాడు. విజయోత్సాహములో మునిగిన గౌతమీపుత్రుడు నాసిక్ సమీపమునందలి బౌద్ధ గుహలను దర్శించి, అచటి బౌద్ధ సంఘమునకు భూమి దానం చేశాడు. విదర్భలోని బెనకాటక బౌద్ధ భిక్షువులకు సర్వ రక్షణలు, సదుపాయాలిచ్చి, 'బెనాకాటక స్వామి' అనే బిరుదాన్ని ధరించినట్లు గౌతమీపుత్రుడు 18 వ రాజ్య కాలంలో వేసిన నాసిక్ శాసనంలో చెప్పబడింది. విజయోత్సాహంలో కర్తవ్యాన్ని మరచిపోకుండా శతృ శేషాన్ని ఉంచడం తనకు, తన రాజ్యానికి ప్రమాదమని తలచి సహ్యాద్రి పర్వత శ్రేణులలో తలదాచుకున్న నహపాణుని నిర్జించెను. ఆ తరువాత కార్లే వద్ద మరో యుద్ధం చేసి అతని కుటుంబాన్ని తుదముట్టించెను. ఈ సందర్భంలో గౌతమీపుత్రుని కార్లే శాసనం అతని దాన ధర్మాలను వివరిస్తుంది. మామళ్ళహారం ఉత్తరాన వలూరక గుహల్లో నివసించే మహా సాంఘిక బౌద్ధ భిక్షువులకు ఒక గ్రామాన్ని దానం చేశాడు. నేటి మాళ్వయే మామళ్ళహారము.

నహపాణుని, అతని కుటుంబాన్ని సమూలంగా నిర్మూలించి అతనిచే జారీ చేయబడిన నాణేలను గౌతమీపుత్రుడు సంగ్రహించి వాటి పై తన ముద్రను వేయించాడు. ఇది భారతదేశ నాణేల చరిత్రలో చాలా కీలకమైన ప్రయోగము. నాసిక్ జిల్లాలోని జోగల్ తంబి నిధిలో తిరిగి ముద్ర వేయబడిన నహపాణుని 13,250 నాణేలు ఇందుకు తార్కాణం. వెండి నాణేల వినియోగం ఆనాటి ఆర్థిక సుస్థిరతను, ప్రజల జీవన స్థాయిని తెలియజేయుచున్నది. అమలులో వున్న పరాజితుని నాణేలను రద్దు చేసినచో ప్రజలలో కల్లోలము వచ్చుటయే గాక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమగునని గౌతమీపుత్రుడు గ్రహించాడు. క్రొత్తగా జయించిన రాజ్యంలో దొంగ నాణేలు వ్యాప్తి లోనికి రాకుండా తన ముద్రను వేసి వాటిని ఆమోదించాడు. ఈ ప్రయోగాన్ని బట్టి గౌతమీపుత్రుడు గొప్ప ఆర్థికవేత్త అని తెలుస్తున్నది. గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను, గుణగణాలను, గొప్ప తనాన్ని అతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం తెలియజేస్తుంది. గౌతమీపుత్రుని కుమారుడు, బాలశ్రీ మనుమడు అయిన వాశిషీ పుత్ర పులోమావి 9వ రాజ్య సంవత్సరంలో ఈ శాసనం విడుదల చేయబడింది.

గౌతమీపుత్రుని సామ్రాజ్యం తూర్పున బంగాళా ఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకు, ఉత్తరాన రాజస్థాన్ నుంచి దక్షిణాన కృష్ణానది వరకు విస్తరించి ఉండేది. ఇతనిని త్రిసముద్రతోయ పీతవాహన అని నాసిక్ శాసనం పేర్కొంటుంది. ఇతని రథ అశ్వాలు మూడు సముద్రాల నీరు త్రాగాయని దీని అర్థం.

గౌతమీపుత్రుడు శక, యవన, పఫ్లవులను నాశనం చేసి క్షహరాట వంశాన్ని నిరవశేషంగా నిర్మూలించి 'క్షహరాట వంశ నిరవశేషకర్' అను బిరుదు ధరించాడు. తన దిగ్విజయ యాత్రల ద్వారా గౌతమీపుత్రుడు శాతవాహన సామ్రాజ్యాన్ని పునరుద్ధరించి 'శాతవాహన వంశ ప్రతిష్టాపక' అని కీర్తి గడించాడు. క్షత్రియుల దర్పమణచినాడు. క్షత్రియ రాజ వంశాలపై ఇతడు సాధించిన విజయాకు సూచికంగా ' క్షత్రియ దర్పమాన మర్దన' అను బిరుదు గడించాడు.

ధర్మ శాస్త్ర సమ్మతమైన రాజరికం శాతవాహన రాజ్యంలో కొనసాగింది. నాసిక్ శాసనంలో గౌతమీపుత్రుడు 'కుల పురుష పరంపరాగత విపుల రాజ్యం' పొందాడంటూ బాలశ్రీ వర్ణించింది. అనగా దీనిని బట్టి మాతృస్వామ్యం గాక తండ్రి ద్వారా సింహాసనాన్ని పొందడమే శాతవాహనుల రాజరిక సాంప్రదాయమని చెప్పవచ్చు. వర్ణధర్మాలను పరిరక్షించడం రాజధర్మంగా శాతవాహనులు పరిగణించారు. అందువల్లనే గౌతమీపుత్రుడు వర్ణ సంకరం కాకుండా కాపాడి 'ఏక బ్రాహ్మణ' అని కీర్తి పొందాడు.

విదేశీయులైన యవనులు, క్షహరాటులు, పహ్లావుల చేత హైందవ మతాన్ని స్వీకరింపజేసి హైందవ మత ధర్మాలను ఆచరింపజేసినాడు గౌతమీపుత్రుడు. క్షహరాటులను ఓడించి, క్షహరాట వంశ సర్వంశకర, 'హైందవ వంవ ప్రతిష్టాపకర' అను బిరుదులు ఇతడు స్వీకరించాడు. నాసిక్ శాసనం గౌతమీపుత్రుని 'ఆగమనిలయడు' అంటూ పౌరాణిక వీరులతో పోలుస్తున్నది. అందువల్ల ఈ కాలంలోనే ఆగమ పౌరాణిక సాహిత్యం బహుళ ప్రచారంలో వున్నట్లు చెప్పవచ్చు. తల్లి బాలశ్రీ ప్రభావం వల్ల పరమత సహనం ప్రదర్శించి బౌద్ధులకు సైతం దాన ధర్మాలు చేశాడు. అందువల్లనే బాలశ్రీ ఇతనిని 'అవిపన్న మాతృ శుశ్రూషక' అని పురాణ పురుషులతో పోల్చింది.

గౌతమీపుత్రుడు బలిష్టమైన శరీరంతో, ఆకర్షించే వదనంతో, వీరునిగా, శూరునిగా నాసిక్ శాసనంలో ప్రశంసింపబడినాడు. ఇతడు అపజయం ఎరుగని వీరుడు. అరివీర భయంకరుడు, శత్రువులను కూడ క్షమించగల ఉదార హృదయుడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించిన సహృదయుడు, శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్దరించి తన దేశానికి, వంశానికి, ప్రజలకూ కీర్తి కల్గించిన వీరుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతడు గావించిన సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రాచీన భారతదేశ చరిత్రలో పునాది రాళ్ళుగా భావించవచ్చు.

 RELATED TOPICS 

శాతవాహనులు

శాతవాహన పాలకులు - 1

శాతవాహన పాలకులు - 2

శాతవాహన పాలకులు - 3

శాతవాహనుల పరిపాలనా విధానం

శాతవాహనుల కాలంలో  భాషా సారస్వతాలు

శాతవాహనుల కాలంలో  విద్యా విధానం, వాస్తు - శిల్ప కళలు