భాషా సారస్వతాలకు శాతవాహనులు అపారమైన సేవ చేసినారు. శాతవాహన యుగం ప్రాకృత భాషా చరిత్రలో స్వర్ణయుగమనదగినది. హాలుని 'గాధాసప్తశతి', గుణాఢ్యుని 'బృహత్కథ' ఈ కాలపు గొప్ప గ్రంథాలు. శాతవాహనులు సంస్కృత భాషను కూడా ఆదరించి పోషించారు. సంస్కృతాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి శర్వవర్మ 'కాతంత్ర వ్యాకరణం' రచించాడు. ఆచార్య నాగార్జునుడు వ్రాసిన గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. ప్రాకృత, సంస్కృత భాషలే గాక 'దేశి' అను భాష కూడా ప్రచారంలో ఉంది.

ఆర్యావర్తములోని ఋషులు, మత ప్రచారకుల రాకతో వారి విద్యా విధానం కూడా దక్షిణా పథం చేరింది. అశోకుని కాలం నాటికే బ్రాహ్మీలిపి, ప్రాకృత భాష తెలియని విద్యావంతులు లేరు. కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిపాడులో, రాజుల మందగిరిలో, రాయచూరు జిల్లాలోని మస్కీలో, బళ్ళారి జిల్లాలోని నిట్టూరులో వున్న అశోకుని శిలా శాసనాలే ఇందుకు నిదర్శనం. శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృత భాషలోనే ఉన్నాయి. శాతవాహనుల కాలం నుండే సంస్కృతం ప్రాకృతం స్థానంలో శాసన భాషగా, శిష్ట భాషగా రూపొందుతున్నట్లు క్షాత్రప రాజైన రుద్రదాముని గిర్నార్ శాసనం సూచిస్తుంది. కాని శాతవాహన యుగంలో పరిపాలనా వ్యవహార భాష, లిఖిత భాష, రాజ భాష ప్రాకృతమే. బౌద్ధ భిక్షువులు సంస్కృతంలో గ్రంథ రచన చేశారు. జాతక కథలు, బుద్ధుని జీవిత సన్నివేశాలు, వాడవాడలా, ఇంటింటా చెప్పుకోవటం వల్లనే చిత్రకారులు, శిల్పులు ఆయా గాధలను, సన్నివేశాలను అంత వాస్తవంగా, మనోహరంగా అమరావతి శిల్పాలలో చూపగలిగినారు. కళలలో పరిణతి పొందే స్థితికి కొందరు చేరారనడం, ప్రజల అభ్యున్నతికి మార్గం చూపిన వారు ఉన్నట్లే. 

ప్రాకృత సాహిత్యం

శాతవాహనులు ప్రాకృతాన్ని రాజ భాషగా కొనసాగించినారు. నాటి శాసనాలన్నీ ప్రాకృత భాషలో, బ్రాహ్మీలో ఉన్నాయి. బౌద్ధమత గ్రంథాలు చాలా వరకు ప్రాకృత భాషలోనే వ్రాసుకొన్నారు. ఆంధ్ర బౌద్ధులకు ప్రత్యేకించి వినయ, అభిదమ్మ పీటకాలు, దిఘ మజ్జిమనికాయలు ఉండేవి. 'ధమ్మకధిక' అనే ఉద్యోగి ప్రతి విహారంలోను ఉండేవాడు. కథల ద్వారా ధర్మాన్ని ప్రచారం చేయడం ఇతని విధి. ఆంధ్రదేశంలో జాతక, అవధాన కథలు ప్రచారం పొందినట్లు అమరావతి శిల్పాలు తెలియజేస్తున్నాయి. 

శాతవాహన యుగంలో ప్రాకృత భాషలో అత్యుత్తమ గ్రంథాలు వెలువడినాయి. ఆనాడు పురుషులే గాక స్త్రీలు కూడా ప్రాకృత భాషలో చక్కని కవిత్వం చెప్పేవారని హాలుని 'గాధాసప్తశతి' వల్ల తెలుస్తుంది. హాలుడు స్వయంగా కవి, ఇతడు అనేక మంది కవులను పోషించి 'కవివత్సలుడు' అనే బిరుదాన్ని పొందాడు. ప్రాకృత భాషలో వ్రాయబడిన 'గాధాసప్తశతి' వల్ల బొదిస్వ, చల్లువా, అమర రాజ, కుమారెల, మకరంద సేన, శ్రీరాజ, రేవ, మధవి, ఆంధ్ర లక్ష్మీ మొదలగు ప్రాకృత కవుల, కవయిత్రుల పేర్లు తెలుస్తున్నాయి. గాధా సప్తశతి వల్ల నాటి ఆంధ్రులెంతటి శృంగార ప్రియులో తెలుస్తుంది. అమాయక గ్రామీణ జీవితం, ప్రకృతి తోడి ప్రజలు సాన్నిహిత్యం సప్తశతిలో ప్రతిబింబిస్తున్నాయి.

గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో 'బృహత్కథ' అనే ఉద్రంధాన్ని రచించాడు. ఇది భారతీయ కథా వాజ్మయంలోనే కాక ప్రపంచ కథా వాజ్మయంలోనే ఎన్నదగిన గ్రంథం. ఇదే తరువాత కాలంలో సంస్కృతంలో రచించిన సోమదేవసూరి'కథా సరిత్యాగరాని'కి, క్షేమేంద్రుని 'బృహత్కాథా మంజరి'కి బుద్దస్వామి 'బృహత్కథా శ్లోక సంగ్రహా'నికి మూలాధారమైంది. నరవాహదత్తుని సాహసిక గాధలకు, ఉపగాధలకు జోడించిన బృహత్కథ అట్టిదే. నాటక రచయితలకు రామాయణం ఎట్లాంటిదో బృహత్కథ కూడా అట్లాంటిదేనని 'దశరూప' గ్రంథకర్త పేర్కొన్నాడు. 'లీలావతి పరిణయం' అనే గ్రంథం హాలుని వివాహమే ప్రధాన ఇతివృత్తంగా రచించబడినది. రెండో పులోమావి 19 వ పాలనా సంవత్సరములో వ్రాసిన నాసిక్ శాసనం ప్రాకృత గద్యంలో ఉన్నది. ఆ కాలం నాటికే గద్య రూపంలో వ్రాయడం కూడా అలవాటు పడినారు. 

సంస్కృత సారస్వతం

సంస్కృత భాషలో గ్రంథ రచన శాతవాహన యుగంలోనే ప్రారంభమైంది. ఒక శాతవాహన రాజు కోసం శర్వవర్మ ఆరు నెలలో సంస్కృతం సులభంగా నేర్చుకోవడానికి వీలుగా 'కాతంత్ర వ్యాకరణం' వ్రాశాడు. అంతకు ముందున్న వ్యాకరణ గ్రంథాల కన్నా బాగుండుట వలన 'కాతంత్ర వ్యాకరణమునే నేటికీ బంగాళంలో, కాశ్మీరులో వాడుతున్నారు. శాతవాహన సమకాలీకులైన క్షాత్రవులు సంస్కృత భాషను పోషించారు. భారతదేశములో నేటి వరకు లభించిన ప్రప్రథమ పూర్తి సంస్కృత శాసనం రుద్రదామునిది. 

ఆచార్య నాగార్జునుడు

మహాయాన బౌద్ధులు సంస్కృతంలో గ్రంథ రచన చేసారు. మత, సాహిత్య, తత్త్వరంగాలలో ప్రజ్ఞాశాలియైన నాగార్జునుడు మహాయాన సిద్ధాంత ప్రవక్తే. ఇతని సిద్ధాంత గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఇతని కాలము, జన్మస్థానము, మత ప్రచారాలను గురించి పండితులలో ఏకాభిప్రాయం లేదు. చైనీయుల వ్రాతలలోనే గాక, మన దేశీయుల వ్రాతలలో కూడా అతనిని వైద్యునిగా, జ్యోతిష్కునిగా, తాంత్రికునిగా, మాధ్యమిక శాస్త్రకర్తగా, శూన్యవాది భాష్యకారునిగా చిత్రించారు. తన 'సుహృల్లేఖ'లో నాగార్జునుడే ఒక శాతవాహనుని గురించి చెప్పినాడు. ఈ సమాచారమంతా వలన ఒక శాతవాహన రాజు నాగార్జునుని సమకాలికుడని మనకు తెలుస్తుంది.

యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు ఒక మహా చైత్యాన్ని, మహావిహారాన్ని కట్టించాడు. నాగార్జునుడు శ్రీ పర్వతంలో గొప్ప విశ్వ విద్యాలయం స్థాపించి తన శాస్త్ర విజ్ఞానాన్ని బోధించాడు. చైనా, టిబెట్ మొదలగు విదేశాల నుండి అనేకులు నాగార్జున కొండ విశ్వ విద్యాలయానికి వచ్చి విద్యనభ్యసించేవారు. అతడు స్థాపించిన విశ్వ విద్యాలయం 120 సంవత్సరాలు కొనసాగి ప్రపంచ ప్రఖ్యాతి చెందినది. ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలలో ముఖ్యమైనవి మహాప్రజ్ఞ శాస్త్రం, మాధ్యమి కారకాలు, దశభూమి విభాషా శాస్త్రం, రసరత్నాకరం, అయోఖసారం, ప్రమాణ విభేతన శాస్త్రం, రత్నావళి, శూన్యసప్తాది, వివాద సమాన శాస్త్రం, సుహృల్లేఖ, ఇవిగాక తర్క, రసాయన, వృక్ష, వైద్య మొదలగు 24 గ్రంథాలు వ్రాశాడని టిబెట్ కు చెందిన తారానాధుని రచనల వలన తెలుస్తున్నది. నాగార్జునుడు రచించిన గ్రంథాలలో సుహృల్లేఖ గొప్ప లౌకిక గ్రంథం. సుహృల్లేఖను పండితులు నిత్యం చర్చిస్తుండేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్ వ్రాశాడు.

 RELATED TOPICS 

శాతవాహనులు

శాతవాహన పాలకులు - 1

శాతవాహన పాలకులు - 2

శాతవాహన పాలకులు -  గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహన పాలకులు - 3

శాతవాహనుల పరిపాలనా విధానం

శాతవాహనుల కాలంలో  విద్యా విధానం, వాస్తు - శిల్ప కళలు