వాశిష్ట పుత్ర (రెండో) పులోమావి

గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత రెండో పులోమావి రాజ్యానికి వచ్చాడు. ఇతడు వారసత్వంగా సువిశాల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఇతని పాలనా కాలానికి చెందిన 8 శాసనాలు లభించాయి. వాటిలో 4 నాసిక్ లో, 2 కార్లేలో, 1 అమరావతిలో, మరొకటి ధరణికోటలో దొరికాయి. ఇతని నాణేలు అనేక చోట్ల విస్తారంగా విస్తారంగా లభించాయి. ఉజ్జయినిని పాలించిన చష్టనుడు రెండో పులోమావి సమకాలికుడని టాలమీ పేర్కొన్నాడు. రెండో పులోమావి 19వ పరిపాలనా సంవత్సరమున గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో ఇతనిని 'దక్షిణాపథేశ్వరు’నిగా వర్ణించబడింది. రాజ్యానికి వచ్చిన 20 సంవత్సరాలు రెండో పులోమావి ఎటువంటి కష్టాలు లేకుండా రాజ్యాన్ని పాలించాడు. కాని చివరి రోజులలో శాతవాహన రాజ్యంపై విదేశీ దండయాత్రలు ఎక్కువైనాయి. కుషాణ చక్రవర్తి కనిష్కుడు సింధునది దిగువ ప్రాంతాన్ని ఆక్రమించాడని 'సుయివిహార' శాసనం చెబుతుంది. కనిష్కుని కుమారుడైన హువిష్కుని శాసనాల వలన అతడు మధురకు అధిపతి అని స్పష్టమవుతుంది. కర్థమక వంశానికి చెందిన చష్టనుడు పులోమావి పై దండెత్తి ఉజ్జయినిని ఆక్రమించుకొన్నాడు. చష్టనుని నాణేలకు మధుర నాణేలకు ఉన్న పోలికను బట్టి చష్టనుడు కుషాణుల ప్రోత్సాహంతోనే శాతవాహన సామ్రాజ్యంపై దండయాత్రలు ప్రారంభమైనాయని పండితుల భావం. ఇదే కాలంలో శకులు దండెత్తి వెళ్ళి ఆకర దేశాన్ని ఆక్రమించారు. ఫలితంగా పులోమావి రాజ్యం తూర్పు దక్కన్ కు మాత్రమే పరిమితమయింది. కోల్పోయిన ప్రాంతాలను తిరిగి ఆక్రమించటానికి పులోమావి ప్రయత్నించలేదు. తీరాంధ్ర దేశంలోని ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని పులోమావి పాలించాడు. అమరావతి, ధరణికోటలో లభించిన పులోమావి శాసనాలు, ఆంధ్రాలో విస్తారంగా లభించిన అతని నాణేలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రతిష్టాన పురాన్ని రాజ ప్రతినిధికి అప్పగించినాడు. ఇది ఇతని బలహీనతకు నిదర్శనము.

రెండో పులోమావి తరువాత శివశ్రీ రాజైనాడు. ఇతని తరువాత శివస్కంధుడు రాజ్యానికి వచ్చినాడు. వీరిద్దరు పాలించిన 14 సంవత్సరాలలో చష్టనుని అధికారం బాగా పెరిగి గుజరాత్ సౌరాష్ట్రలకు వ్యాపించింది. అంధే శాసనంలో చష్టనుని, అతని మనుమడైన రుద్రదాముని పేర్లు ఉండటం వల్ల క్రీ.శ. 130 నాటికే సౌరాష్ట్రంలో శాతవాహనుల పాలన అంతరించినట్లు తెలుస్తున్నది. 

యజ్ఞశ్రీ

శివస్కంధుని తరువాత సింహాసనమధిష్టించిన యజ్ఞశ్రీ శాతవాహన వంశంలో చివరి గొప్పరాజు. ఇతడు కర్థమకులను ఓడించడానికి విఫల ప్రయత్నం చేసాడు. చష్టనుని మనుమడైన రుద్రదాముడు యుక్తిపరుడు, ధైర్యశాలి. ఇతడు శాతవాహనులను విభజించి చిత్తు చేయడానికి శివశ్రీ సోదరుడైన వాసిష్టీ పుత్ర శాతకర్ణికి తన కుమార్తె అయిన రుద్రదమనికను ఇచ్చి వివాహం చేశాడు. రాజుని చేస్తానని రుద్రదాముడు తన అల్లునికి మాట ఇచ్చినాడు. శాతవాహనుల సేనలో చీలికలను తెచ్చినాడు. తన అల్లుడిని రాజును చేయటానికి యజ్ఞశ్రీ పై రుద్రదాముడు రెండుసార్లు దండెత్తినాడు. దక్షిణా పథ పాలకుడగు శాతకర్ణిని రెండుమార్లు యుద్ధంలో ఓడించి దూరపు బంధువు కావడం వల్ల కీడు చేయకుండా వదలివేసినట్లు గిర్నార్ శాసనంలో రుద్రదాముడు చెప్పుకున్నాడు. రుద్రదాముని దండయాత్రల వల్ల సౌరాష్ట్ర, కకుర, అపరాంత, అనూష, అకర, అవంతి దేశాలను శాతవాహనులు పోగొట్టుకున్నారు. యజ్ఞశ్రీ నుండి జయించిన శాతవాహన రాజ్య పశ్చిమ ప్రాంతాలకు వాశిష్ట పుత్ర శాతకర్ణిని పాలకునిగా నియమించినట్లు నానాఘాట్ శాసనంలో చెప్పిన 'క్షత్రప' అనే వాశిష్ట పుత్ర శాతకర్ణి బిరుదు సూచిస్తుంది. పశ్చిమ దక్కను కోల్పోయి అసిక, అసక, ములక, విదర్భలతోపాటు దక్కన్ తూర్పు భాగమైన ఆంధ్ర దేశాన్ని పాలించాడు. ఇతని 27వ పాలనా సంవత్సరం నాటి శాసనం మోటుపల్లి సమీపంలోని చిన గంజాంలో లభించింది. నౌకా ముద్ర గల యజ్ఞశ్రీ నాణేలు ఆనాడు జరిగిన విదేశీ నౌకా వ్యాపారాన్ని తెలియజేస్తాయి. బాణ మహాకవి యజ్ఞశ్రీని 'త్రిసముద్రాధీశ్వరుడ'ని స్తుతించాడు.

యజ్ఞశ్రీ తరువాత వరుసగా విజయశ్రీ, చంద్రశ్రీ, మూడో పులోమావి అనే ముగ్గురు రాజులు 17 సంవత్సరాలు పాలించారు. మూడో పులోమావి కాలంలో శాతవాహనీహారాన్ని మహా సేనాధిపతి ఖండనాగుడు పాలిస్తున్నట్లు మ్యాకదోని శాసనం చెబుతుంది. మూడో పులోమావి తరువాత శాతవాహన సామ్రాజ్యం క్షీణించింది. పశ్చిమ జిల్లాలో చుటు కులస్థులు, నాసిక్ ప్రాంతంలో అభిరులు, తూర్పున ఇక్ష్వాకులు విజృంభించారు.

 RELATED TOPICS 

శాతవాహనులు

శాతవాహన పాలకులు - 1

శాతవాహన పాలకులు - 2

శాతవాహన పాలకులు -  గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహనుల పరిపాలనా విధానం

శాతవాహనుల కాలంలో  భాషా సారస్వతాలు

శాతవాహనుల కాలంలో  విద్యా విధానం, వాస్తు - శిల్ప కళలు