లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం 

ప్రతిరోజు పార్లమెంటు ఉభయసభలు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతాయి. మొదటి గంటను ప్రశ్నలు అడగడానికి కేటాయిస్తారు. పౌరుల సమస్యలపై, పరిపాలనా అసమర్ధతపై, అవసరమైనచోట ప్రభుత్వ చొరవ కోసం ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నలను మూడు రకాలుగా విభజించవచ్చు. 1. నక్షత్ర గుర్తు ప్రశ్నలు 2. నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు 3. స్వల్పకాలిక సమాధాన ప్రశ్నలు. ప్రశ్నల ప్రధాన్యాన్ని బట్టి వాటి వర్గీకరణ జరుగుతుంది. 

నక్షత్ర గుర్తు ప్రశ్నలు:

ఈ ప్రశ్నలకు మౌఖికంగా జవాబిస్తారు. వీటిపై అనుబంధ ప్రశ్నలు కూడా వేయవచ్చు. 'నక్షత్ర గుర్తు ప్రశ్నలు' అనడానికి కారణం ప్రశ్నల ముందు 'నక్షత్రం' గుర్తు ఉండటమే. 

నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు:

ఈ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాన్ని ఇస్తారు. ఇందులో అనుబంధ ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. 

స్వల్పకాలిక సమాధాన ప్రశ్నలు:

సాధారణంగా ప్రశ్నలు అడగాలంటే కనీసం పది రోజుల ముందు సభ్యులు నోటీసు ఇవ్వాలి. అలాకాకుండా, అత్యవసరమైన ప్రజాప్రాముఖ్య విషయంపై మౌఖికంగా అడిగే ప్రశ్నలను స్వల్ప వ్యవధి సమాధాన ప్రశ్నలు అంటారు.

జీరో అవర్ (శూన్య సమయం ) 

జీరో అవర్ అనేది భారత పార్లమెంటు సొంతంగా రూపొందించుకున్న పద్ధతి. 1962లో పార్లమెంటులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత జీరో అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం 11 గంటలకు, జీరో అవర్ 12 గంటలకు ప్రారంభమవుతాయి. జీరో అవర్ లో మొందలుకావడంవల్ల దీన్ని జీరో అవర్ అంటారు. ఇందులో సభ్యులు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ప్రసంగం-ప్రభుత్వ విధానాలపై విమర్శ:

లోక్ సభ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని మంత్రిమండలి తయారుచేసి ఆమోదిస్తుంది. ఇందులో గత సంవత్సరం ప్రభుత్వం సాధించిన ఘనకార్యాలు, ప్రస్తు సంవత్సరంలో తలపెట్టిన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ విధానాలను పేర్కొంటారు. రాష్ట్రపతి ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించాలి. ఏదైనా కారణంతో తీర్మానం వీగిపోతే, అంటే మెజారిటీ సభ్యులు ఆమోదించకపోతే, ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయినట్లు భావించి, మంత్రిమండలి రాజీనామా చేస్తుంది.


 RELATED TOPICS 

భారత పార్లమెంట్ - రాజ్య సభ