భారత పార్లమెంట్ - లోక్ సభ

భారత పార్లమెంట్ లోని దిగువసభను లోక్ సభ అంటారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఈ సభలో ఉంటారు. అందుకే దీన్ని ప్రజల సభ అని, హౌస్ అఫ్ పీపుల్ అనీ అంటారు.

లోక్ సభ నిర్మాణం 

రాజ్యాంగం అనుమతించిన లోకసభ మొత్తం గరిష్ట సభ్యత్వ సంఖ్య 552. ఇందులో 3 రకాల సభ్యులు ఉంటారు. వారు: 

  • రాష్ట్రాల నుంచి ఎన్నికైన 530 మంది సభ్యులు. 
  • కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన 20 మంది సభ్యులు. 
  • ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యులు  ఇద్దరు.

ఆంగ్లో - ఇండియన్ తెగకు చెందిన సభ్యులెవరూ ఎన్నిక కాలేదని రాష్ట్రపతి భావిస్తే ఆ వర్గానికి చెందిన ఇద్దరు ప్రముఖులను నామినేట్ చేస్తారు.

ప్రస్తుతం లోక్ సభలో సభ్యుల సంఖ్య 545. మొదట 500 లోక్ సభ స్థానాలు ఉండగా, 1973లో 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 545కు పెంచారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2000 సంవత్సరం వరకు లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచకూడదని నిర్ణయించారు. 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2026 సంవత్సరం వరకు లోక్ సభ, విధానసభ స్థానాల సంఖ్య మార్చరాదని మరోసారి నిర్ణయించారు. 

అర్హతలు:

  • భారతీయ పౌరుడై ఉండాలి. 
  • 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. 
  • పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి. 

అనర్హతలు:

  • ఒక వ్యక్తి ఏకకాలంలో ఉభయసభల్లో సభ్యుడిగా కొనసాగలేడు. 
  • ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా రెండింటికీ ఎన్నికైతే, నిర్ణీత గడువులోపల రాష్ట్ర అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయకపోతే గెలుపొందిన పార్లమెంట్ స్థానం ఖాళీ అయినట్లుగా రాష్ట్రపతి ప్రకటిస్తారు. 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయం పొందే పదవి ఉండరాదు. 
  • మతిస్థిమితం లేనివాడని న్యాయస్థానం ధ్రువీకరించడం. 

ఒక వ్యక్తి లోక్ సభ సభ్యుడిగా కొనసాగడానికి అర్హత కోల్పోయాడా లేదా అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. దీనికోసం మొదట ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని తెలుసుకుంటారు.

కాలపరిమితి 

83వ నిబంధన ప్రకారం లోకసభ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఎన్నికల తర్వాత ప్రారంభమై తొలి సమావేశం తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు లోకసభ తన అధికారాలు, విధులు నిర్వహిస్తుంది. కొన్ని అవాంతర పరిస్థితుల్లో మధ్యలోనే రద్దుచేసి లోకసభకు మధ్యంతర ఎన్నికలు జరిపించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినపుడు లోకసభ కాలపరిమితిని 5 నుంచి 6 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 1976లో 5వ లోకసభ కాలపరిమితిని జాతీయ అత్యవసర పరిస్థితి కారణంగా ఒక సంవత్సరం పొడిగించారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోకసభ కాలపరిమితిని 5 నుంచి 6 సంవత్సరాలవరకు పొడిగించారు. తిరిగి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోకసభ కాలపరిమితిని 5 సంవత్సరాలకు తగ్గించారు.


 RELATED TOPICS 

రాజ్యసభ అధికారాలు