భారత పార్లమెంట్ 

భారత రాజ్యాంగంలోని అయిదో భాగంలో పార్లమెంటు నిర్మాణం, అధికారాలు, బాధ్యతల గురించి వివరించడం జరిగింది. 79వ ప్రకరణ ప్రకారం పార్లమెంటు అంటే లోకసభ, రాజ్యసభ, రాష్ట్రపతి, పార్లమెంటరీ తరహా వ్యవస్థ ప్రకారం భారత పార్లమెంటలో రాష్ట్రపతి అంతర్భాగం. పార్లమెంటులో రాష్ట్రపతి సభ్యుడు కాకపోయినా కూడా అతనికి గల శాసనాధికారాలు కారణంగా పార్లమెంటులో అంతర్భాగంగా గుర్తించడం జరిగింది. పార్లమెంటులోని ఉభయ సభలైన రాజ్యసభను ఎగువసభ అని, లోకసభను దిగువ సభ అని వ్యవహరిస్తారు. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తే లోకసభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యసభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గా లోకసభను హౌస్ ఆఫ్ పీపుల్స్ కూడా వ్యవహరిస్తారు.

రాజ్య సభ

రాజ్యసభ నిర్మాణం 

భారత పార్లమెంటులో ఎగువసభ అయిన రాజ్యసభలో 80వ ప్రకరణ ప్రకారం గరిష్ట సభ్యుల పరిమితి 260గా నిర్ణయించారు. 229 మందిని రాష్ట్ర విధానసభలు, 9 మందిని కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. మొత్తంగా 238 సభ్యులకు మించకుండా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు. రాష్ట్రపతితో నామినేట్ అయిన 12 మంది సభ్యులు రాజ్యసభలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం భారత ప్లామెంటులోని రాజ్యసభ సభ్యుల సంఖ్య 245 ఉన్నది. రాష్ట్రపతి నామనిర్దేశనం చేసే సభ్యులలో సాహిత్యం , కళలు, శాస్త్ర విజ్ఞానం, సాంఘిక సేవ మొదలైన రంగాల్లో విశేషానుభవం గల వారు ఉంటారు. సభ్యుల ఎన్నిక విధానం:

రాజ్యసభకు జరిగే ఎన్నికల పద్దతిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర విధానసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఓటు బదిలీ ద్వారా ఎన్నుకుంటారు. రాష్ట్ర అసెంబ్లీలలోని నామినేటెడ్ సభ్యులు కూడా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు. రాజ్యసభ సభ్యుల ఎన్నికను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. దేశంలోని ఏ రాష్ట్రంలో ఓటుహక్కు ఉన్న పౌరుడెవరైనా ఏ రాష్ట్రం నుంచి అయినా రాజ్యసభకు పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 

అర్హతలు:

1. భారతీయ పౌరుడై ఉండాలి.

2. 30 సంవత్సరాల వయసు ఉండాలి. 

అనర్హతలు:

1. లోకసభ సభ్యుడిగా లేదా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగడం. 

2. సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు గైర్హాజరు కావడం.

3. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన పదవుల్లో ఉండటం, కాలపరిమితి:

రాజ్యసభ శాశ్వత సభ. కానీ రాజ్యసభ సభ్యుల పదవీ కాలపరిమితి 6 సంవత్సరాలు. మొత్తం సభ్యుల్లో 1/3 వంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. వీరి స్థానంలో కొత్త సభ్యులు ఎన్నికవుతారు. 

సమావేశాలు:

రాజ్యసభ సంవత్సరానికి కనీసం రెండు సార్లు సమావేశమవ్వాల్సి ఉంటుంది. ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య గరిష్టంగా 6 నెలల వ్యవధి మించకూడదు. లోకసభ రద్దయినా రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో సమావేశాలను నిర్వహిస్తారు. ఆయన లేని పక్షంలో డిప్యూటీ చైర్మన్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే ఛైర్మన్ నియమించిన ప్యానెల్ లోని సభ్యుల్లో ఒకరు సభను నిర్వహిస్తారు. చైర్మన్ ప్యానెల్ లో ఆరుగురిని నియమిస్తారు.

కోరం:

రాజ్యసభ సమావేశాలు నిర్వహించేందుకు మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10 సభ్యులు హాజరుకావాల్సి ఉంటుంది. దీన్నే కోరం అంటారు. ఒకవేళ కోరం లేని పక్షంలో సభను కొంతసేపుగాని, మరుసటి రోజుకుగాని వాయిదా వేసేందుకు ఆ సభా నిర్వాహకుడికీ అధికారం ఉంది.

రాజ్య సభ ఛైర్మన్

ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యత్వం లేకపోయినప్పటికీ భారత రాజ్యాంగంలోని 89వ అధికరణ ప్రకారం భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి తన వేతనాల్ని రాజ్యసభ ఛైర్మన్ హోదాలోనే పొందుతారు. సభ్యులంతా కలిసి సభా కార్యక్రమాల నిర్వహణకు గాను తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. 

రాజ్య సభ చైర్మన్ అధికారాలు: 

  • రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడం. 
  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుపుతాడు. 
  • వివిధ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు, వాటి పై చర్చ జరిపేందుకు అధికార పక్షం, ప్రతిపక్షాల సభ్యులకు అవకాశం ఇవ్వడం. 
  • వివిధ బిల్లులపై ఓటింగ్ జరిపి ఫలితాలు ప్రకటన చేయడం. 
  • ఏదైనా బిల్లుపై ప్రతిష్ఠంభన ఏర్పడితే, బిల్లుపై ఓటింగ్ సమయంలో ఇరు పక్షాలకు సమానమైన ఓట్లు వస్తే తన అంతిమ నిర్ణాయ ఓటును వినియోగించడం ద్వారా బిల్లు ముందుకు కదిలేలా చేయడం. 
  • రాజ్యసభ ఛైర్మన్ హోదాలో పార్లమెంటు సంయుక్త సమావేశాల్లో పాల్గొంటాడు. 
  • సభ నిర్వహణకోసం ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటించడం.

 RELATED TOPICS 

రాజ్యసభ అధికారాలు