లోక్ సభ అధికారాలు

పార్లమెంటులో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రజల సభ అయిన లోకసభ (దిగువసభ)కు విశేష అధికారాలున్నాయి. ఆర్ధికాధికారాల్లో, మంత్రి మండలిని తొలగించే విషయంలో లోక్ సభకు ప్రత్యేక అధికారాలున్నాయి. శాసన నిర్మాణాధికారాలు, ఆర్ధిక, న్యాయసంబంధ, రాజ్యాంగ సవరణ, ఎన్నికపరమైన, కార్యనిర్వాహక శాఖ పై నియంత్రణాధికారాలు లోకసభకు ఉంటాయి.

శాసన నిర్మాణాధికారాలు 

ఆర్ధికబిల్లులతోపాటు సాధారణ బిల్లులను కూడా లోక్ సభలో ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్ధికేతర, పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించినవి. ఆర్ధిక బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించినవి. సాధారణ బిల్లులను ఏ సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చు. రాజ్యంగంలోని 7వ షెడ్యూల్ లో పేర్కొన్న అధికారాల జాబితాలోని కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలపై లోకసభ శాసనాలు చేస్తుంది. రాష్ట్ర జాబితా పై కూడా ఇది శాసనాలు చేస్తుంది.

249 నిబంధన ప్రకారం రాష్ట్ర జాబితా అంశాలపై శాసనాలు చేయాలని రాజ్యసభ తీర్మానం చేయడం. దేశంలో అత్యవసర పరిస్థితి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలపై శాసనాలు చేయడం. 252 నిబంధన ప్రకారం 2 లేదా అంతకు మించి రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలోని ఏ అంశం పైనైనా శాసనం చేయాలని తీర్మానించడం. అంతర్జాతీయ ఒడంబడికలను అమలుచేయడం. వంటి సందర్భాలలో రాష్ట్ర జాబితా పై లోకసభ శాసనాలు

ఆర్థికాధికారాలు 

ఆర్ధికాధికారాల విషయంలో రాజ్యసభ కంటే లోకసభకు ఎక్కువ అధికారాలున్నాయి. వార్షికాదాయ, వ్యయ పట్టిక (బడ్జెట్)ను లోకసభలో ప్రవేశపెట్టడం. పన్నుల విధింపు, తొలగింపు, తగ్గింపు. ప్రభుత్వం చేసే రుణాలకు పరిమితి విధించడం మొదలైనవి. ఒక బిల్లు సాధారణ బిల్లు అవుతుందా, ఆర్ధికబిల్లు అవుతుందా అనే విషయాన్ని లోకసభ స్పీకర్ నిర్ణయిస్తారు. లోకసభ స్పీకర్ నిర్ణయిస్తారు. లోకసభ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి వీలులేదు.

స్పీకర్ ఒక బిల్లును 'ఆర్ధిక బిల్లు' అని ధ్రువీకరించిన తరువాత రాష్ట్రపతి అనుమతితోనే మొదట దాన్ని లోక్ సభలో ప్రవేశపెడతారు. లోక్ సభ ఆమోదం పొందిన తరువాత దాన్ని రాజ్యసభ ఆమోదం కోసం పంపుతారు. రాజ్యసభ 14 రోజుల్లోగా దాన్ని ఆమోదించి తిరిగి లోక్ సభకు పంపాలి. ఏ కారణంతోనైనా రాజ్యసభ ఆర్ధిక బిల్లును ఆమోదించక, చేర్పులు, మార్పులను సూచించి పంపితే, లోకసభ ఆ ప్రతిపాదనలను ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. రాజ్యసభ ఆర్ధిక బిల్లును కేవలం 14 రోజులు మాత్రమే తన దగ్గర ఉంచుకోవచ్చు. రాజ్యసభకు ఆర్ధిక బిల్లుపై మార్పులు, చేర్పులు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. ఆర్థిక బిల్లుల విషయంలో లోక్ సభకు సర్వాధికారాలు ఉన్నాయి.

రాష్ట్రపతి పూర్వానుమతితోనే ఆర్ధిక బిల్లును లోక్ సభలో ప్రవేశపెడతారు. ఆర్ధిక బిల్లును ఉభయసభలు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే రాష్ట్రపతి తప్పక ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. సాధారణ బిల్లుల విషయంలో పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి తన ఆమోదం తెలుపవచ్చు. లేదా పునఃపరిశీలనకు పార్లమెంటుకు పంపవచ్చు.

ఆర్ధిక బిల్లుల విషయంలో ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరిగే అవకాశమే లేదు. కారణం ఆర్ధిక బిల్లులను రాజ్యసభ కేవలం 14 రోజుల మాత్రమే తన దగ్గర ఉంచుకొనే అధికారం ఉండటమే. అదే సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే ఉభయసభల ఉమ్మడి సమావేశం ఏర్పాటవుతుంది.

న్యాయసంబంధ అధికారాలు 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూ.పి.ఎస్.సి. చైర్మన్ మొదలైన వారి తొలగింపులో లోక్ సభలో అధికారాలున్నాయి. రాష్ట్రపతిని తొలగించేందుకు ఏ సభలో అయినా మొదట మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మొదట రాజ్యసభలోనే అభియోగ తీర్మానం ప్రవేశపెట్టాలి.

రాజ్యంగ సవరణ అధికారం 

368 నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోకసభకు ఉంది. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును కూడా ఉభయసభలు ఆరు నెలల్లోగా ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోతే, ఆ బిల్లు వీగిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేసే అవకాశం లేదు.

ఎన్నికపరమైన అధికారాలు 

రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం నియోజక గణంలో లోకసభ భాగంగా ఉంటుంది. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇది పాల్గొంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు. లోక్ సభ స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను లోక్ సభ సభ్యులు ఎన్నుకుంటారు. లోక్ సభ వివిధ పార్లమెంటరీ కమిటీలకు సభ్యులను ఎన్నుకుంటుంది. పార్లమెంటు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలు పెరగడం, పార్లమెంటు సమావేశాల కాలవ్యవధి తక్కువగా ఉండటం వల్ల పార్లమెంటు తన విధులు, బాధ్యతలు నెరవేర్చేందుకు పార్లమెంటరీ కమిటీలు సహాయం చేస్తాయి.

కార్యనిర్వాహక శాఖపై నియంత్రణాధికారం 

లోకసభ అధికారాల్లో కార్యనిర్వాహక వర్గం కూడా ఒకటి. అంటే, మంత్రిమండలిని నియంత్రించడం. మన పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి లోకసభకు బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలి సభ్యుల్లో ఎక్కువ మంది లోక్ సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే మంత్రి మండలి అధికారంలో ఉండి, విశ్వాసం కోల్పోయిన వెంటనే వైదొలగాల్సి ఉంటుంది. కార్యనిర్వాహకవర్గంపై నియంత్రణను లోక్ సభ రెండు రకాలుగా చేపడుతుంది ప్రభుత్వ వ్యవహారాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం లేదా విమర్శించడం. వీటి కోసం వివిధ పార్లమెంటరీ ప్రక్రియలను అనుసరిస్తుంది. ఈ ప్రక్రియల్లో ప్రశ్నోత్తరాలు, తీర్మానాలు ఉంటాయి.


 RELATED TOPICS 

భారత పార్లమెంట్ - రాజ్య సభ