రాజ్యసభ అధికారాలు

సమాఖ్య వ్యవస్థలో భాగంగా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే, రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే రాజ్యసభకు కొన్ని విశేష అధికారాలు భారత రాజ్యంగం ద్వారా కల్పించారు. శాసనాధికారాలు. కార్యనిర్వాహక అధికారాలు, ఆర్ధిక అధికారాలు, న్యాయ అధికారాలు, ఎన్నికల అధికారాలు, రాజ్యాంగ సవరణ అధికారాలు, ఇతర అధికారాలు రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.
శాసనాధికారాలు:
సాధారణ బిల్లులను రాజ్యసభలోనైనా, లోక్ సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చు సాధారణ బిల్లులు అనేవి కేంద్ర ప్రభుత్వ ఆర్ధికేతర, పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించినవి. ఈ బిల్లులను రాష్ట్రపతి నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశపెడతారు. ఒక సభ ఒక బిల్లును ఆమోదించి రెండో సభకు పంపితే ఆ రెండో సభ 6 నెలల కాలంలోగా బిల్లును ఆమోదించాలి. ఒకవేళ బిల్లుల ఆమోదం విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలుంటే రాష్ట్రపతి ఆ బిల్లు ఆమోదం విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోకసభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. సాధారణంగా లోక్ సభ సభ్యుల సంఖ్య, రాజ్యసభ సభ్యుల కంటే రెండింతలు ఎక్కువ. కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశంలో లోక్ సభదే పైచేయి అవుతుంది. 
కార్యనిర్వాహక అధికారాలు:
కేంద్ర మంత్రిమండలి లోకసభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది. అయినా రాజ్యసభ కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ చేస్తుంది. ప్రశ్నోత్తరాల సమయంలో లిఖితపూర్వక, మౌఖిక ప్రశ్నల ద్వారా, వాయిదా, సావధాన తీర్మానం మొదలైన వాటి ద్వారా నియంత్రణ చేస్తుంది. 
ఆర్థిక అధికారాలు:
రాజ్యసభకు ఆర్థిక అధికారాలు చాలా పరిమితం. ఆర్థిక బిల్లులను మొదట లోక్ సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్ సభ ఆమోదించిన ఒక ఆర్థిక బిల్లును రాజ్యసభ ఆమోదం కోసం పంపితే 14 రోజుల లోపల దాన్ని చర్చించి తన అభిప్రాయాలను సిఫారసుల రూపంలో పంపాలి. ఈ సిఫారసులను లోక్ సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. 
న్యాయ అధికారాలు:
ఈ విషయంలో లోకసభకు, రాజ్యసభకు సమాన అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి పై మహాభియోగ తీర్మానాన్ని రాజ్యసభలో కూడా ప్రవేశ పెట్టవచ్చు. రాష్ట్రపతి ప్రవర్తనపై స్వయంగా న్యాయ విచారణ జరపవచ్చు లేదా తాను ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ ద్వారా చేపట్టవచ్చు. ఇదే విధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైన వారిపై వచ్చిన ఆరోపణల పైనా న్యాయ విచారణ జరుపుతుంది. 
ఎన్నికల అధికారాలు:
రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో రాజ్యసభ ఒక భాగం. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ పాల్గొంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ పాల్గొంటుంది. పార్లమెంటుకు చెందిన వివిధ కమిటీలకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతిలో సభ్యులను ఎన్నుకుంటారు. 
రాజ్యాంగ సవరణ అధికారాలు:
రాజ్యాంగ సవరణ విషయంలో రాజ్యసభకు, లోక్ సభకు సమాన అధికారాలున్నాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలుంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి వీలులేదు. 
ఇతర అధికారాలు:
రాజ్యసభకు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోకసభ రద్దయిన పక్షంలో ఒక నెలలోగా రాజ్యసభ దాన్ని ఆమోదించాలి. అదేవిధంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలనను రెండు నెలల్లోగా రాజ్యసభ ఆమోదించాలి. 
రాజ్యసభ ప్రత్యేకాధికారాలు:
  • 249 నిబంధన ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏ అంశం అయినా జాతీయ ప్రాముఖ్యమున్నదని రాజ్యసభ భావిస్తే, ఆ విషయంపై 2/3 వంతు మెజారిటీతో రాజ్యసభ మొదట తీర్మానం చేస్తుంది. ఇలాంటి తీర్మానం సంవత్సరంపాటు అమల్లో ఉంటుంది. అధికార విభజనకు సంబంధించి రాజ్యాంగంలో మూడు జాబితాలు ఉన్నాయి. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. 
  • 312 అధికరణ ప్రకారం జాబితా ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేకంగా అఖిల భారత సర్వీసులను ఏర్పాటీచేసే అధికారం రాజ్యసభకే ఉంది. ఈ విధంగా ఏర్పాటు చేసినవి ఆలిండియా ఇంజినీరింగ్, ఆలిండియా ఫారెస్టు సర్వీసులు మొదలైనవి. 
  • అధికరణం 67 ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించడానికి తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.